వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్షిణ కొరియా: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి విడుదలపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం..

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పోలీసుల రక్షణలో చో

దక్షిణ కొరియాలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి విధించిన శిక్షను తగ్గించి జైలు నుంచి విడుదల చేయడం పట్ల ఆ దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

12 ఏళ్ల క్రితం 8 సంవత్సరాల బాలిక దక్షిణ కొరియా రాజధాని సోల్‌లోని అన్సాన్ ప్రాంతంలో స్కూలుకి వెళుతుండగా 56 ఏళ్ల చో డూ సూన్ అపహరించాడు. సమీపంలోని ఓ చర్చిలో ఉన్న టాయిలెట్‌లోకి ఆ చిన్నారిని తీసుకుకెళ్లి అత్యంత క్రూరంగా హింసించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతకు ముందే నేర చరిత్ర ఉన్న వ్యక్తి అతడు.

బాలిక నా యంగ్ ( పేరు మార్చాం) ప్రాణాలతో బయటపడింది. కానీ, ఆ రోజు జరిగిన దాడి వలన ఏర్పడిన శారీరక గాయాలు, మానసిక వేదన నుంచి ఆమె ఇంకా తేరుకోలేదు.

ఇప్పుడు అతడికి విధించిన జైలు శిక్షను తగ్గించిన కోర్టు విడుదల చేసింది. అతని నివాసం నుంచి నా యంగ్ ఉండే చోటు కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది.

"మాకు ఇక్కడ నుంచి పారిపోవాలని లేదు. కానీ, మాకు మరో అవకాశం కూడా లేదు. ఈ విషయంలో ప్రభుత్వం మాకేం సహాయం చేయకపోగా బాధితురాలు అజ్ఞాతంలోకి వెళ్లేలా చేస్తోంది" అని ఆ పాప తండ్రి చెప్పారు.

దక్షిణ కొరియాలో 2018లో జరిగిన మీటూ నిరసన ప్రదర్శనలు

నా యంగ్ కూడా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. ఆమె స్నేహితులంతా ఆ చుట్టు పక్కలే ఉన్నారు. అక్కడ నుంచి కదలడం వలన ఆ కుటుంబం ఆచూకీ కూడా బయట పెట్టడం వారికిష్టం లేదు. కానీ, ఇప్పుడు వారి ముందున్న అవకాశం అదొక్కటే అని భావిస్తున్నారు.

"చాలా సంవత్సరాలు గడిచాయి. కానీ, ఏమి మార్పు లేదు. ఇప్పటికీ బాధితురాలి పైనే భారం అంతా పడుతోంది" అని అన్నారు.

అత్యాచార నేరస్థుల విషయంలో తేలికపాటి చట్టాలు ఉన్నాయంటూ చాలా మంది విమర్శించడం మొదలుపెట్టారు.

చోకు మొదట 15 సంవత్సరాల జైలు శిక్ష పడింది. కానీ, మరొక అప్పీలు కోర్టు ఆ శిక్షను 12 ఏళ్లకు తగ్గించింది.

అందులో ఆ పాప పై అత్యాచారం జరిపినప్పుడు అతను మద్యం మత్తులో ఉన్నారని పేర్కొన్నారు. దక్షిణ కొరియాలో మద్యం మత్తులో చేసిన నేరాలకు చాలా తక్కువ స్థాయిలో శిక్ష పడుతుంది.

అలాగే మతి స్థిమితం లేని వ్యక్తులు నేరాలకు పాల్పడినా కూడా ఆ దేశ క్రిమినల్ కోడ్ ని అనుసరించి కోర్టులు శిక్షను తగ్గిస్తాయి.

ప్రతీకాత్మక చిత్రం

కానీ, చో విషయంలో శిక్షను తగ్గించినప్పుడు ప్రజలు చాలా గగ్గోలు పెట్టారు. ఈ కేసు జాతీయ స్థాయిలో చర్చను లేవనెత్తింది అని కొరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీకి చెందిన యూన్ జంగ్ సూక్ చెప్పారు.

"అతని కేసు కొరియా చట్టాన్ని, నేరాలలో మద్యం సేవించడాన్ని పరిగణించే విధానాన్ని మార్చింది అని యూన్ చెప్పారు.

చో కేసు తర్వాత నిందితులు మద్యం మత్తును రక్షణగా వాడుకోవడాన్ని కష్టతరం చేస్తూ జాతీయ చట్ట సభ చట్టాన్ని సవరించింది.

ఆ అవకాశాన్ని పూర్తిగా తొలగించాలని డిమాండు చేస్తున్నప్పటికీ ఈ విషయంలో కోర్టు నిర్ణయాధికారం కొనసాగుతూనే వస్తోంది.

అక్టోబరు 2019లో ఒక 26 సంవత్సరాల పురుషుడు ఒక కాలేజీ విద్యార్థిని అత్యాచారం చేసిన కేసులో మూడేళ్ళ జైలు శిక్ష ను 4 ఏళ్ల ప్రొబేషన్ గా మార్చారు. ఆ సమయంలో అతను మద్యం సేవించి ఉన్నారని అతని తరుపు న్యాయవాదులు వాదించారు.

ఈ సంవత్సరం మొదట్లో కూడా సోన్ జోంగ్ వూ అనే 24 ఏళ్ల వ్యక్తి ప్రపంచంలోనే అతి పెద్ద చైల్డ్ పోర్నోగ్రఫీ వెబ్ సైటు నిర్వహిస్తున్నందుకు గాను 18 నెలల జైలు శిక్ష తర్వాత విడుదల అయ్యారు.

అతనిని తమకు అప్పగించాలని అమెరికా చేసిన అభ్యర్ధనను స్థానిక కోర్టు కొట్టివేసింది. లైంగిక నేరాలకు పాల్పడిన వారిని అప్పగించకపోవడం దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థకు అద్దం పడుతోందని మహిళా హక్కుల ఉద్యమకారులు అంటున్నారు.

స్పైకామ్ పోర్న్ నేరాలను నిరసిస్తూ దక్షిణ కొరియాలో ప్రజా ప్రదర్శనలు

ప్రజాగ్రహం

చోను విడుదల చేయడం పట్ల ప్రజల్లో భయాందోళనలు వెల్లువెత్తాయి.

ఈ విడుదలకు వ్యతిరేకంగా లేవనెత్తిన పిటిషన్ పై 600,000 మంది ప్రజలు ప్రెసిడెన్షియల్ బ్లూ హౌస్ వెబ్ సైటు పై సంతకం చేశారు.

అయితే, ప్రభుత్వం ఈ విషయం పై స్పందించలేదు.

చోకి ఇప్పుడు 68 సంవత్సరాలు. అతను ఇంటికి తిరిగి వచ్చిన రోజు అతనిని ఉరి తీయాలంటూ గుంపుల కొలదీ ప్రజలు అతని ఇంటి ముందు గుమి గూడారు.

అతనిని తీసుకుని వచ్చిన పోలీసు వాహనం పై కొంత మంది నిరసనకారులు గుడ్లు కూడా విసిరారు.

అయితే, ప్రజల కోపాన్ని చల్లార్చేందుకు ప్రభుత్వం 24 గంటల పర్యవేక్షణ పెడతామని హామీ ఇచ్చి అతని ఇంటి చుట్టూ 35 నిఘా కెమెరాలను అమర్చింది. ఆయన నివాసం ఉండే ప్రాంతంలో కొత్తగా పోలీసు బూత్ లను ఏర్పాటు చేసింది.

ఇవే కాకుండా మరో 7 ఏళ్ల పాటు చో ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని కూడా అమర్చుకుని ఉండాలి.

వాళ్ళు నా యంగ్ కుటుంబానికి కూడా ఒక స్మార్ట్ వాచ్ ని ఇచ్చారు. ఒక వేళ దోషి వారికి దగ్గరగా వెళితే ఈ వాచి కనిపెడుతుంది.

కానీ, అది వారిని మరింత భయపెడుతుందని నా యంగ్ తండ్రి అంటున్నారు.

ఆ కుటుంబం ఆ వాచీని ఉపయోగించడానికి నిరాకరించింది.

"ఈ వాచీ మా అమ్మాయికి అలెర్ట్ పంపినప్పుడల్లా ఆమె భయానికి గురవుతుంది" అని ఆయన అన్నారు.

బాధితురాలి గొంతెక్కడ?

న్యాయ వ్యవస్థ మారుతోందని న్యాయ నిపుణులు అంటున్నారు. కానీ, ఇది సరిపోదు.

విడుదల చేసిన నేరస్థులను చట్టబద్ధంగా పర్యవేక్షించి, మరో సారి శిక్ష పడే విచారం లేకుండా వారికి విధించే శిక్ష, విడుదల విధానాలలో మార్పులు రావాలని పూసన్ నేషనల్ యూనివర్సిటీలో న్యాయశాస్త్ర ప్రొఫెసర్ జుంగ్ సీయన్గ్ యూన్ అన్నారు.

ప్రస్తుత న్యాయ వ్యవస్థ బాధితుల పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడానికి పెద్దగా ప్రయత్నించటం లేదని జంగ్ అభిప్రాయపడ్డారు.

చో విడుదల తర్వాత చట్ట రూపకర్తలు అత్యాచార దోషులను జైలు నుంచి విడుదల చేసినప్పుడు అమలు చేయవలసిన నిబంధనల గురించి ప్రతిపాదించారు.

పిల్లలను అత్యాచారం చేసిన వారికి జీవిత ఖైదు విధించాలనే చట్టాన్ని తేవాలంటూ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి బిల్లును ప్రతిపాదించారు.

2016లో 13 ఏళ్ల లోపు పిల్లల పై జరిగిన 1083 అత్యాచార కేసులు నమోదు కాగా, 2019 నాటికి వాటి సంఖ్య 1374 కి పెరిగిందని పోలీసులు చెప్పారు.

చో కేసు తర్వాత జాతీయ శాసన సభ "చో డూ సూన్ " అనే పేరుతో కొత్త బిల్లును తయారు చేసింది. దీని ప్రకారం మైనర్ల పై అత్యాచారం చేసిన వారు రాత్రి పూట, స్కూలు పిల్లలు స్కూలుకు వెళుతూ వస్తూ ఉండే సమయాల్లో ఇంటి నుంచి బయటకు రావడాన్ని నిషేధించింది.

"ఈ నేరస్థులను సమాజం నుంచి వేరు చేయడం కష్టం కాబట్టి వారు జైలు నుంచి తిరిగి వచ్చేటప్పటికి వారిలో మార్పు కలిగేలా నేర నియంత్రణ వ్యవస్థ చూడాలి" అని కొరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ కి చెందిన యూన్ జంగ్ సూక్ అన్నారు.

"కేవలం శిక్ష మాత్రమే వారిలో మార్పు తేలేదు. వారు సమాజంలో భాగమయ్యేలా ఈ కరెక్షనల్ కేంద్రాలు కూడా చూడాలి" అని ఆమె అన్నారు.

"అందరూ అత్యాచారం చేసిన వారిని ద్వేషిస్తారు. మనందరికీ అది తెలుసు. ప్రపంచమంతా వారిని ద్వేషిస్తుంది. అలా అని వారు శిక్ష పూర్తయ్యాక తిరిగి రావడం తప్పదు" అని ఆమె అన్నారు.

బాధితులకు కూడా తగినంత మద్దతు అందాలి అని నా యంగ్ తండ్రి అన్నారు.

"చో విడుదల అయిన వెంటనే వచ్చిన ఈ స్పందన మరి కొన్ని రోజుల్లోనే తగ్గిపోతుందని ఆయన భయపడుతున్నారు.

ఇప్పుడు తమ పై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

"ఎవరైనా ప్రభుత్వ అధికారి కానీ, సామాజిక కార్యకర్త కానీ బాధితురాలికి అందుబాటులో ఉండటం అవసరం. కనీసం నెలకు ఒకసారో, రెండు నెలలకు ఒకసారో మాకు కాల్ చేసి, మేమెలా ఉన్నామో కనుక్కుంటే మాకు బాగుంటుంది. అది మేము సురక్షితంగా ఉన్నామనే భావనను కలుగ చేస్తుంది" అని ఆయన అన్నారు.

"నువ్వు ఒంటరి కాదు. నీకు మా పూర్తి సహకారం ఉంటుంది" లాంటి భరోసా ఇచ్చే మాటలనే బాధితుల కుటుంబాలు వినాలని అనుకుంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Public outcry over release of man who raped minor girl in south Korea
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X