వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తర కొరియా బొగ్గు గనుల్లో బానిసలుగా మగ్గిపోతున్న దక్షిణ కొరియా యుద్ధ ఖైదీలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మాజీ ఖైదీ కిమ్ హై-సుక్

"బానిసలకు సంకెళ్లు వేసి లాగడాన్ని నేను టీవీలో చూసినప్పుడు ఆ స్థితిలో నన్ను నేను చూసుకుంటాను" అని చోయ్ కి సున్ (పేరు మార్చాం) చెప్పారు. ఆయన 1953లో కొరియా యుద్ధం ముగిసిన తర్వాత ఉత్తర కొరియా చేతుల్లో బందీ అయిన 50 వేల మంది ఖైదీలలో ఒకరు.

"మా తల మీద తుపాకి గురి పెట్టి మమ్మల్ని ఆ కార్మికుల క్యాంపులలోకి బలవంతంగా నెట్టేశారు. మా చుట్టూ సాయుధ బలగాలు కాపలాగా ఉండేవారు. ఇది బానిస బతుకు కాకపోతే మరేంటి?"

అయన మరో 670 మంది యుద్ధ ఖైదీలతో కలిసి ఉత్తర హాంగ్యోన్గ్ ప్రావిన్స్ దగ్గరలో ఉన్న ఒక గనిలో పని చేసినట్లు చెప్పారు. ఆయన 40 సంవత్సరాల తర్వాత అక్కడ నుంచి తప్పించుకుని బయటపడ్డారు.

ఆ గనుల్లో ఏమి జరిగిందో తెలుసుకోవడం అంత సులభమైన పనేమీ కాదు. చోయ్ వలె బ్రతికి బయట పడిన వారు అక్కడ జరిగిన ప్రమాదకరమైన పేలుళ్లు, మూక ఉరితీతల గురించి చెబుతారు. అతి తక్కువ సరుకులతో అక్కడ ఎలా బ్రతికారో బయట పెడతారు. వాళ్ళని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనమని ప్రోత్సహించినప్పటికీ వారి బ్రతుకు కూడా ఆ గనుల్లోకే దారి తీయడం తప్ప మరో మార్గం ఉండదు.

"ఈ గనులున్న ప్రాంతాలలో కొన్ని తరాల ప్రజలు పుట్టి, జీవించి అత్యంత హేయమైన హింసను, వివక్షను జీవితాంతం భరిస్తూ మరణించారు కూడా అని బ్లడ్ కోల్ ఎక్స్పోర్ట్ ఫ్రొం నార్త్ కొరియా నివేదికను తయారు చేసిన వారిలో ఒకరైన జోవానా హోసానియాక్ చెప్పారు. ఆమె సిటిజన్స్ అలియన్స్ ఫర్ నార్త్ కొరియా హ్యూమన్ రైట్స్ (ఎన్ కె ఎచ్ ఆర్)సభ్యులు.

జొన్న కంకులు దొంగతనం చేశారని ఒక ఖైదీని తీవ్రంగా కొట్టారు

దేశంలో బొగ్గు గనుల లోపల నెలకొన్న పరిస్థితుల గురించి ఈ నివేదిక తెలియచేస్తోంది. ఉత్తర కొరియా దేశం బయటకు ఉత్పత్తులను అక్రమ రవాణా చేయడానికి జపాన్ లోని యకుజా లాంటి నేర ముఠాలు కూడా సహకరించి ఆ దేశానికి కొన్ని వందల మిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించుకునేందుకు సహాయం చేసిందని ఈ నివేదిక ఆరోపిస్తోంది. అలా సంపాదించిన డబ్బును ఆ దేశ రహస్య అణ్వాయుధ కార్యక్రమానికి వాడినట్లు భావిస్తోంది.

ఉత్తర కొరియా బొగ్గు గనుల గురించి ప్రాధమిక సమాచారం తెలిసిన 15 మంది చెప్పిన వివరాలతో ఈ నివేదికను తయారు చేశారు. అందులో ఒకరితో బీబీసీ మాట్లాడటం మాత్రమే కాకుండా అక్కడ బాధలు పడి పారిపోయినట్లు చెప్పిన మరో నలుగురు స్వతంత్ర వ్యక్తులతో కూడా బీబీసీ మాట్లాడింది. అందులో ఒక్క వ్యక్తి మాత్రం ఆయన వివరాలను బయట పెట్టవద్దని కోరారు. ఆయన కుటుంబ సభ్యులు ఇంకా కొంత మంది ఉత్తర కొరియాలోనే ఉన్నారు.

ఉత్తర కొరియాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న విషయాన్ని ఆ దేశం ఎప్పటికప్పుడు ఖండిస్తూ దానిపై వ్యాఖ్యానం చేయడాన్ని తిరస్కరిస్తూనే వస్తోంది. యుద్ధ ఖైదీలనందరినీ యుద్ధ ఒప్పందంలో భాగంగా వెనుతిరిగి వెళ్లిపోయినట్లు గతంలో ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. అయితే, ఆ దేశంలో ఉండిపోవాలని అనుకున్నవారు అక్కడే ఉండిపోయారని చెప్పారు.

కానీ, అది నిజం కాదని చోయ్ అంటారు. ఆయన సాయుధ దళాల కాపలా మధ్య ఒక కంచెతో కూడిన శిబిరంలో నివసించినట్లు చెప్పారు.

ఆయన కష్టపడి పని చేస్తే ఆయనను త్వరగా ఇంటికి పంపిస్తామని చెప్పినప్పటికీ, వారి ఆశ మాత్రం క్రమేణా మరుగున పడిపోయినట్లు చెప్పారు.

ఏడేళ్ల పిల్లలు కూడా

ప్రస్తుతం ఉత్తర కొరియా బొగ్గు గనుల్లో పాటిస్తున్న విధానాలు కొరియా యుద్ధం తర్వాత మొదలుపెట్టి ఉంటారు. దానిని 'వారసత్వపు బానిసత్వం' అని ఈ నివేదిక పేర్కొంది.

దక్షిణ కొరియా ఖైదీలను పెద్ద పెద్ద బొగ్గు, మాగ్నెసైట్, జింక్, లెడ్ గనుల దగ్గరకు తీసుకుని వెళ్లే వారని మానవ హక్కుల సంస్థ పరిశోధన పేర్కొంది.

కానీ, ఆ గనుల్లో పని చేసేవారంతా యుద్ధ ఖైదీలు కాదు .

యుద్ధం జరుగుతున్న సమయంలో కిమ్ హై సూక్ తాతగారు దక్షిణ కొరియా వైపు వెళ్లడం వలన ఆమెను ఇక్కడ గనుల్లో పెట్టినట్లు అక్కడ సాయుధ బలగాలు చెప్పినట్లు చెప్పారు.

ఆమె విధిని ఆ దేశ పాలకుల పట్ల ఆమె కుటుంబం ప్రదర్శించిన వినయ విధేయతలు నిర్ణయించాయి.

దక్షిణ కొరియాతో సంబంధం ఉన్న ఏ వ్యక్తినైనా అల్పవర్గంలోకి తోసేస్తారు.

ఆమె గనుల్లో పని చేయడం మొదలుపెట్టే నాటికి ఆమె వయసు 16 సంవత్సరాలు. కానీ, ఆ గనుల్లో ఏడేళ్ల నుంచే పని మొదలుపెట్టామని చెప్పిన వారి కథలు కూడా నివేదికలో ఉన్నాయి.

ఉత్తర కొరియా బొగ్గు గనులు

"నేనిక్కడ పని మొదలుపెట్టినప్పుడు నేను పని చేసే యూనిట్ లో మొత్తం 23 మందిమి ఉండేవారం. కానీ, గనులు ఒక్కొక్కసారి కూలిపోయి అందులో పని చేసే వారు మరణిస్తూ ఉంటారు".

"ఒక్కొక్కసారి గనులు పేలడం వలన, లేదా వాటిని తవ్వే క్రమంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. గనుల్లో వివిధ పొరలు ఉంటాయి. కొన్ని సార్లు నీటి పొర పేలిపోయి కార్మికులు అందులో మునిగిపోవచ్చు. ఆఖరికి మేము ఆరుగురిమి మిగిలాం" అని ఆమె చెప్పారు.

"కానీ, ఆ దేశ పాలకులకు వత్తాసు పలకడం కేవలం ఆ గనుల్లో పని చేసే వారి విధిని మాత్రమే కాదు, అది వారి చావు బ్రతుకులను కూడా నిర్ణయిస్తుంది" అని ఈ పరిశోధనలో పేర్కొన్న ఒక దేశ రక్షణ మంత్రిత్వ శాఖ మాజీ సభ్యుడు అన్నారు.

"విశ్వాసం చూపించిన వారిని బ్రతకనిస్తారు. అల్పవర్గాల వారిని చంపేయడానికి చూస్తారు" అని ఆయన అన్నారు.

కానీ, దక్షిణ కొరియా గూఢచారుల ఉరి శిక్షలు మాత్రం ఉత్తర కొరియా చట్టాలను అనుసరించి జరుగుతాయని చెప్పారు.

"ఎవరినైనా ఉరి తీయడానికి వారి దగ్గర ఆ పనిని సమర్ధించేంత సమాచారం ఉండాలి. వారు ఒకే రకమైన నేరాన్ని చేసినా కూడా వారు విశ్వాస పాత్రుల జాబితాలో గనక ఉంటే వారిని బతకనిస్తారు. అటువంటి వారిని రాజకీయ ఖైదీల శిబిరాలకు పంపరు. అలాంటి వారిని సాధారణ జైలుకు కానీ, కరెక్షనల్ లేబర్ క్యాంపులకు కానీ పంపిస్తారు."

"మరణం మాత్రమే మంచి ముగింపు కాబట్టి వారిని చంపరు. వారు చావలేరు. కానీ, చనిపోయేవరకు వారి ఆదేశాలు పాటిస్తూ వారి కింద పని చేయాలి" అని చెప్పారు.

ఎంఎస్ఎస్ విచారణ గది వెనకే ఉన్న షూటింగ్ గ్యాలరీలో కొంత మంది ఖైదీలను చంపేవారని బీబీసీ ఇంటర్వ్యూ చేసిన ఒక వ్యక్తి చెప్పారు. కొంత మందిని బహిరంగంగా ఉరి తీస్తే కొంత మందిని నిశ్శబ్దంగా అంతం చేసేసేవారని చెప్పారు.

అయితే, ఈ విషయాన్ని బీబీసీ స్వతంత్రంగా నిర్ధరించలేకపోయింది. కానీ, లీ తండ్రిని, సోదరుని ఉరి తీసిన క్షణాలను మాత్రం ఆమె మర్చిపోలేదు.

"దేశ ద్రోహులు, గూఢచారులు, విప్లవకారులనే ముద్ర వేసి, వాళ్ళను కర్రలకు కట్టేసారు" అని బీబీసీ కొరియా సిబ్బందికి ఆమె చెప్పారు.

ఆమె తండ్రి దక్షిణ కొరియా మాజీ యుద్ధ ఖైదీ. ఈ కారణం చేత ఆమె కూడా గనుల్లో పని చేయవలసి వచ్చింది.

లీ తండ్రి దక్షిణ కొరియాలో ఉన్న స్వస్థలాన్ని ప్రశంసించారు. అదే విషయాన్ని ఆమె సోదరుడు కూడా గనుల్లో పని చేసిన వారి దగ్గర అన్నారు. ఆ ఒక్క విషయానికి మూడు ఉరి తీసే బృందాలు కలిసి వారిద్దరినీ చంపేశాయని చెప్పారు.

మేమెప్పుడూ ఆకలితో ఉండేవాళ్ళం

యుద్ధ ఖైదీలు సాధారణ జీవితం జీవించేందుకు ఒక్కొక్కసారి ఉత్తర కొరియా అధికారులు అనుమతించే వారు. వారు గనులు తవ్వే సిబ్బందికి 1956 లో పౌరసత్వాన్ని ఇచ్చారు. అప్పుడే వారిక తిరిగి స్వదేశానికి వెళ్లడం కష్టం అనే విషయం చాలా మందికి అర్ధం అయింది.

మేము ఇంటర్వ్యూ చేసిన వారంతా పెళ్లిళ్లు చేసుకోవడానికి పిల్లల్ని కనడానికి ప్రోత్సాహం దొరికినట్లు చెప్పారు. కానీ, దీని వెనక కూడా ఏదో ఉద్దేశ్యం ఉండి ఉంటుందని కిమ్ చెప్పారు.

"మమ్మల్ని ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్పేవారు. వాళ్ళు గనులను కాపాడుకోవాలి, కానీ అక్కడ పని చేసే వారు ప్రతి రోజూ మరణిస్తూ ఉండేవారు. అక్కడ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉండేది. అందుకే మమ్మల్ని ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్పేవారు".

"కానీ, అక్కడ తగినంత ఆహారం, డైపర్లు ఉండేవి కావు. అందుకే పిల్లల్ని కన్నా కూడా వారిని పెంచడం చాలా కష్టమైపోయేది" అని ఆమె అన్నారు.

దేశ వ్యాప్త క్షమా భిక్షలో భాగంగా కిమ్ 2001లో జైలు నుంచి విడుదల అయ్యారు. ఆమె అక్కడ నుంచి చైనా సరిహద్దులో ఉన్న నదిని దాటి అక్కడ నుంచి తప్పించుకున్నారు.

ఆమె గనుల్లో గడిపినప్పటి జ్ఞాపకాలను 28 చిత్రాలుగా చిత్రీకరించాలని అనుకున్నారు. అలా చేయడం వలన ఆమె పీడ కలలను కొంత వరకు కట్టడి చేసి, ఆమె పడిన కష్టాలను ఇతరులకు చూపించాలని అనుకున్నారు.

ఉత్తర కొరియా బొగ్గు గనులు

మేము ఇంటర్వ్యూ చేసిన అందరూ ఆకలి ఒక నిరంతర సమస్య అని చెప్పారు. ఇదే విషయం నివేదికలో కూడా ఉంది.

"ఆకలిగా లేకుండా ఒక్క రోజు కూడా గడవలేదు. మేమెప్పుడూ ఆకలితోనే ఉండేవాళ్ళం. రోజుకొకసారి మాత్రమే భోజనం దొరికేది.

మిగిలిన వారు మరి మూడు పూటలా తిన్నారో లేదో మాకు తెలియదు. మాకు నీటిలో నానబెడితే ఉబ్బిపోయి పొడవుగా ఉండే బియ్యంతో చేసిన అన్నం ఇచ్చేవారు" అని కిమ్ చెప్పారు.

కొంత మంది అనారోగ్యానికి కూడా గురయ్యేవారని మరో మాజీ యుద్ధ ఖైదీ చెప్పారు.

వారు చెప్పినంత పని పూర్తి చేయలేకపోతే వారి భోజనం తగ్గిపోయేదని చెప్పారు.

ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమానికి నిధులను అరికట్టాలనే ఉద్దేశ్యంతో ఆ దేశపు బొగ్గు ఎగుమతులను యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ నిషేధించింది.

కానీ, ఉత్తర కొరియా సముద్ర మార్గం ద్వారా బొగ్గు, ఇసక లాంటివి ఎగుమతి చేసి కొన్ని వందల మిలియన్ డాలర్లను ఆర్జించినట్లు రెండేళ్ల తర్వాత ఇండిపెండెంట్ సాంక్షన్స్ మానిటర్స్ కమిటీ నివేదిక చెప్పింది.

ఉత్తర కొరియా బొగ్గు గనులు

ఐక్యరాజ్యసమితి నిషేధించిన బొగ్గు ఎగుమతులను ఉత్తర కొరియా అతిక్రమించిందని డిసెంబరులో అమెరికా తెలిపింది.

ఈ బొగ్గు గనులు మరింత విస్తరిస్తున్నాయని నివేదిక కూడా పేర్కొంది.

ఉత్తర కొరియా బానిస కార్మికుల పై ఆధారపడటం గురించి, అక్రమంగా బొగ్గు ఇతర ఉత్పత్తులను ఎగుమతి చేయడం గురించి ఐక్య రాజ్య సమితి విచారించాలని జొవానా అన్నారు.

ఈ ఆంక్షలను వ్యాపారాలకు, వినియోగదారులకు కూడా స్పష్టమైన హెచ్చరికలు చేసి అమలు చేయాలని ఆమె అన్నారు.

దక్షిణ కొరియాలో పాలకులు ఉత్తర కొరియాతో సంబంధాలు ఏర్పర్చుకుని వారితో శాంతియుతమైన ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించేందుకు దృష్టి పెట్టింది. మానవ హక్కుల విషయంలో కఠినమైన వైఖరి అవలంబించడం వలన ఉత్తర కొరియా చర్చల నుంచి కూడా ఎగిరిపోతుందని దక్షిణ కొరియా వాదిస్తోంది. ఈ పరిస్థితి మరింత ఉద్రిక్తతలకు దారి తీస్తుందని అంటోంది.

అయితే, శాంతి, అణ్వాయుధ నిరాకరణ చర్చల్లో మానవ హక్కులను చేర్చడం అవసరమని సియోల్ లో ఉన్న యుఎన్ హై కమీషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ నివేదిక తెలిపింది.

ఈ గనుల్లో బలవంతంగా పని చేయవలసి వచ్చిన ఇద్దరు మాజీ యుద్ధ ఖైదీలకు కాస్త ఆశ ఉంది. వారిని బలవంతంగా ఆ దేశంలో ఉంచి గనుల్లో పని చేయించినందుకు సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఉత్తర్ కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ ని 17,600 డాలర్ల నష్ట పరిహారాన్ని చెల్లించమని ఆదేశించడంతో వారు న్యాయపరంగా విజయం సాధించారు.

దక్షిణ కొరియాలో కోర్టు ఉత్తర కొరియాలో ఖైదీల బాధలను గుర్తించడం ఇదే మొదటిసారి. ఈ ఇద్దరిలో చోయ్ ఒకరు.

నేను చనిపోయే లోపు ఆ డబ్బును చూస్తానో లేదో నాకు తెలియదు. కానీ, డబ్బు కంటే కూడా గెలవడం ముఖ్యం. అని ఆయన చెప్పారు.

కానీ, ఆ గనుల్లో పడి మగ్గుతున్న వారి గురించే ఆయనెప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ఉత్తర కొరియాలో ఉన్న ఆయన కుటుంబానికి కొంత డబ్బును పంపడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

"నేనిప్పుడు ఆనందంగా ఉంటే వారక్కడ ఎంత బాధపడుతున్నారోనని ఆలోచిస్తూ ఉంటాను" అని ఆయన నిట్టూర్పు విడిచారు.

చిత్రాలు: కిమ్ హై-సూక్

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
South Korean prisoners of war languishing as slaves in North Korean coal mines
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X