రామాయణ, మహాభారతాలు వింటూ పెరిగా- తాజా పుస్తకంలో బరాక్ ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తాను అధికారంలో ఉన్న కాలంలో భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగించారు. ఆ తర్వాత కూడా భారత్ విషయంలో ఒబామా సానుకూల వైఖరే ప్రదర్శించారు. తన తాజా పుస్తకం 'ఎ ప్రామిస్డ్ ల్యాండ్' లోనూ ఒబామా భారత్‌తో తనకు ఉన్న పరోక్ష అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దీంతో అమెరికాతో పాటు భారత్‌లో ఉన్న కోట్లాది మంది భారతీయులకు దగ్గరయ్యేందుకు మరోసారి ప్రయత్నించారు.
ఒబామా రాసిన 'ఎ ప్రామిస్డ్ ల్యాండ్' పుస్తకంలో ఆయన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. దీంతో ఈ పుస్తకం ఆవిష్కరణకు ముందే ఎంతో ఆదరణ దక్కించుకుంది. ఈ పుస్తకంలో ఉన్న మరో విషయం భారతీయులకు ఆసక్తికరంగా మారింది. బరాక్ ఒబామా తాను బాల్యంలో భారతీయ ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం విన్నట్లు పేర్కొన్నారు
తాను బాల్యంలో ఇండోనేషియాలో ఉంటున్న సమయంలో రామాయణం, మహాభారతంలోని కథలను విన్నానని తెలిపారు. ఫలితంగా తనకు భారత్‌పై ప్రత్యేక గౌరవం ఏర్పడిందని పేర్కొన్నారు.

మరోవైపు ఒబామా భారతదేశ గొప్పదనాన్ని తన మాటల్లో అభివర్ణించారు. భారత దేశ భౌగోళిక ఆకారం తనను ఎంతగానో ఆకర్షించిందని, ప్రపంచ జనాభాలో అత్యధికులు భారత్‌లో ఉంటారని. అలాగే విభిన్న జనజాతుల సముదాయం ఉంటుందన్నారు. భారత్‌లో 700కు మించిన భాషలున్నాయని అన్నారు. 2010లో అమెరికా అధ్యక్షునిగా తాను భారత్ సందర్శించానని, దానికి ముందు ఎప్పుడూ భారత్ రాలేదని పేర్కొన్నారు. తాను ఇండోనేషియాలో చదువుకుంటున్న రోజుల్లో పాకిస్తాన్, భారతదేశానికి చెందిన స్నేహితులు ఉండేవారన్నారు. అదే సమయంలో బాలీవుడ్ సినిమాలు కూడా చూశానని తెలిపారు.