కొత్త ముప్పు స్టెల్త్ ఓమిక్రాన్- మరో ఉప రకం-40 దేశాల్లో ప్రభావం -ఆర్టీపీసీఆర్ టెస్టుకూ దొరక్కుండా
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. ఇందులోనూ ఓమిక్రాన్ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ప్రపంచ దేశాల్ని కుదిపేస్తున్న ఓమిక్రాన్ వైరస్ వ్యాప్తి తగ్గకముందే అందులో మరో కొత్త రకం వెలుగుచూస్తోంది. స్టెల్త్ ఓమిక్రాన్ గా పేర్కొంటున్న ఈ కొత్త వైరస్ ఉప రకం ఆర్టీ పీసీఆర్ టెస్టుకూ దొరకడం లేదని బ్రిటన్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. దీంతో ఓమిక్రాన్ లో ఈ కొత్త ముప్పుపై భయాలు పెరుగుతున్నాయి.

ఓమిక్రాన్ లో మరో ముప్పు
ప్రస్తుతం భారత్ తో పాటు ప్రపంచదేశాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్న ఓమిక్రాన్ వైరస్ ముప్పు అంతకంతకూ పెరుగుతోంది. ఒక్క భారత్ లోనే ప్రస్తుతం కరోనా, ఓమిక్రాన్ కలిపి దాదాపు 22 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. విదేశాల్లోనూ ఓమిక్రాన్ ముప్పు ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. అలాంటిసమయంలో ఓమిక్రాన్ వైరస్ కు సంబంధించిన మరో ఉప రకం బయటపడింది. దీన్ని స్తెల్త్ ఓమిక్రాన్ గా పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వివరాను బ్రిటన్ ప్రభుత్వం తాజాగా బయటపెట్టింది. ఈ నేపథ్యంలో స్టెల్త్ ఓమిక్రాన్ పై భయాలు మొదలయ్యాయి.

బ్రిటన్ ప్రభుత్వం ప్రకటన
40కి పైగా దేశాల్లో ఓమిక్రాన్ వేరియంట్ కరోనావైరస్ యొక్క కొత్త ఉప-జాతి కనుగొన్నట్లు యూకే ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. BA.2 ఉప-జాతి, సాధారణంగా "స్టీల్త్ ఓమిక్రాన్" అని దీన్ని పిలుస్తారని వెల్లడించింది. ఇది ఐరోపా అంతటా బలమైన వ్యాప్తి భయాన్ని కలిగించినట్లు బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం, ఓమిక్రాన్ వేరియంట్లో మూడు ఉప జాతులు ఉన్నాయి -- BA.1, BA.2, BA.3. ప్రపంచవ్యాప్తంగా బయటపడిన ఓమిక్రాన్ ఇన్ఫెక్షన్లలో BA.1 ఉప జాతి ప్రబలంగా ఉండగా, BA.2 ఉప జాతి వైరస్ కూడా త్వరగా వ్యాపిస్తోంది. డెన్మార్క్ లో జనవరి 20న నమోదైన యాక్టివ్ కేసుల్లో దాదాపు సగం వరకు BA.2 ఉప జాతి లక్షణాలు కలిగి ఉందని తేలింది.

ఆర్టీ పీసీఆర్ టెస్టుకూ లొంగకుండా
ఇప్పటివరకూ బయటపడిన కరోనా వైరస్ రకాలన్నీ ఆర్టీ పీసీఆర్ పరీక్షద్వారా నిర్దారణ అవుతున్నాయి. దీంతో రోగుల్ని సులువుగా గుర్తించి తగిన చికిత్స అందిస్తున్నారు. కానీ తాజాగా బయటపడిన బీఏ3 రకం స్టెల్త్ ఓమిక్రాన్ వైరస్ రకం మాత్రం ఆర్టీ-పీసీఆర్ టెస్టుకూ దొరకడం లేదని చెప్తున్నారు. దీంతో ఈ వైరస్ ను గుర్తించడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ వంటి లోతైన పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్ధితి ఉంది.
ఆర్టీ పీసీఆర్ టెస్టుల్లో వైరస్ గుర్తింపు సాధ్యంకాకపోతే ఈ వైరస్ నిర్ధారణకే భారీగా ఖర్చుపెట్టాల్సిన పరిస్ధితి ఏర్పడవచ్చని చెప్తున్నారు. యూకే తో పాటు డెన్మార్క్, స్వీడన్, నార్వే, భారతదేశంలో బీఏ2 ఉప రకం కేసులు కనుగొన్నారు. భారత్, ఫ్రాన్స్‌లోని శాస్త్రవేత్తలు కూడా ఈ ఓమిక్రాన్ ఉపజాతి గురించి హెచ్చరిస్తున్నారు,