వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐన్‌స్టీన్‌కు ధీటైన హాకింగ్: సంజ్ఞలతోనే సర్వస్వం

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

లండన్: ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (76).. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు ధీటైన శాస్త్రవేత్త. హాకింగ్ ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో 1942, జనవరి ఎనిమిదో తేదీన జన్మించారు. అదే రోజు ప్రముఖ ఖగోళ, భౌతిక శాస్త్రవేత్త గెలీలియో 300వ వర్థంతి కూడా. హాకింగ్ మరణం రోజు (మార్చి 14) కూడా ప్రత్యేకమైనదే. సరిగ్గా 140 ఏళ్ల క్రితం 1879లో మార్చి 14న ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జన్మ దినోత్సవం.

హాకింగ్ తన 21వ ఏట ఎమియోట్రోఫిక్ లాటరల్ స్కెలిరోసిస్ (ఏఎల్‌ఎస్) అనే నరాల వ్యాధికి గురయ్యారు. ఈ వ్యాధికి గురైన వారు కొన్నేండ్లలోనే మరణిస్తారు. ఆయన రెండేండ్లు మాత్రమే జీవిస్తారని వైద్యులు చెప్పినా.. హాకింగ్ కుంగిపోకుండా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో తన అధ్యయనాలను కొనసాగించి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తరువాత అంతటి అద్భుతమైన సైద్ధాంతిక శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు.

Recommended Video

Stephen Hawking Lost Life చక్రాల కుర్చీకే అతుక్కుపోయినా ఆత్మస్థైర్యంతో పరిశోధనలు
చక్రాల కుర్చీకే పరిమితమైనా.. చేతి వేళ్ల సంజ్ఞలతో ఉద్వేగ భరిత వాతావరణం

చక్రాల కుర్చీకే పరిమితమైనా.. చేతి వేళ్ల సంజ్ఞలతో ఉద్వేగ భరిత వాతావరణం

మానవ సంకల్పానికి, ఉత్సుకతకు ఒక చిహ్నంగా హాకింగ్
తనకు సోకిన వ్యాధి వల్ల ఆయన జీవితాంతం చక్రాల కుర్చీకే పరిమితమైనా ఒక్క చేతి వేళ్లలో కొన్ని మాత్రమే పనిచేసినా.. నోటి మాటా పడిపోయినా.. ఆ వేళ్ల సాయంతోనే సంజ్ఞలు చేసేవారు. తానే స్వయంగా రూపొందించిన ఒక కమ్యూనికేషన్ పరికరం ఆయన సంజ్ఞలను అక్షర రూపంలోకి మార్చేది. ఆ చేయి కూడా పూర్తిగా పక్షవాతానికి గురి కావడంతో 2005 నుంచి తన చెంప కండరాలతోనే కమ్యూనికేషన్ పరికరానికి సంజ్ఞలు చేస్తూ వచ్చారు హాకింగ్. చక్రాల కుర్చీలో జీవిస్తూ, ప్రత్యేకమైన రీతిలో తన భావాలను వ్యక్తీకరించే హాకింగ్ మానవ సంకల్పానికి ఉత్సుకతకు ఒక చిహ్నంగా మారారు.

50 ఏళ్ల జీవితంలో సంతృప్తి పొందానని హాకింగ్ వ్యాఖ్య

50 ఏళ్ల జీవితంలో సంతృప్తి పొందానని హాకింగ్ వ్యాఖ్య

హాకింగ్ 2013లో ఆయన తన జ్ఞాపకాలకు అక్షర రూపం ఇస్తూ, తనకు 1963లో మోటర్ న్యూరాన్ వ్యాధి ఉన్నట్టు తెలిసినప్పుడు ఇది చాలా అన్యాయం అనిపించింది. ‘ఈ వ్యాధి నాకెందుకు రావాలి. నా జీవితం ముగిసిపోయిందని అప్పుడు అనుకున్నాను. నాకున్న శక్తి సామర్థ్యాలను ఇక వినియోగించలేను' అని అనుకున్నాను. కానీ ఇప్పుడు 50 ఏళ్లు గడిచిన తరువాత నా జీవితంలో ఎంతో సంతృప్తి పొందాను' అని పేర్కొన్నారు.

 మేసన్ అనే నర్సుతో వైవాహిక జీవితానికి 2006లో ముగింపు

మేసన్ అనే నర్సుతో వైవాహిక జీవితానికి 2006లో ముగింపు

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే హాకింగ్‌కు జేన్ విల్డే అనే యువతితో పరిచయం ఏర్పడింది. 1962 నుంచే ఆయనను ప్రేమించినట్టు జేన్ తన ఆత్మకథలో రాసుకున్నారు. వీరికి 1965లో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. 1985లో సెర్న్ వెళ్లినప్పుడు హాకింగ్‌కు ఇన్‌ఫెక్షన్ సోకిందని, అప్పుడు ఆయన బతకడం కష్టమని, ప్రాణాధార వ్యవస్థను తొలిగిస్తామని వైద్యులు చెప్పినప్పుడు జేన్ నిరాకరించారు. ఆయనను తిరిగి కేంబ్రిడ్జ్ తీసుకొచి ట్రెకియోటమీ (ప్రాణం నిలబెట్టడానికి వాయు నాళంలో గంటు పెట్టడం) చేశారు. ఆ శస్త్రచికిత్సతో ఆయన ప్రాణం నిలిచినా, స్వరం పోయింది. తన అనారోగ్యాన్ని చెప్పుకోవడానికి ఆయన నిరాకరించేవారని, తన నుండి అధికంగా ఆశించడంతో భార్యాభర్తల బంధం యజమాని - బానిస సంబంధంలా మారిపోయిందని దీంతో తాము 1995లో విడిపోయామని జేన్ తెలిపారు. ఆ తరువాత హాకింగ్ ఎలైన్ మేసన్ అనే నర్సును పెండ్లి చేసుకున్నారు. అనారోగ్యంతో ఉన్న సమయంలో మేసన్ 24 గంటలూ నర్సుగా పనిచేశారు. ఈ క్రమంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. 2006లో ఆయన మేసన్‌తో కూడా విడిపోయారు.

40 బాషల్లో ప్రచురితమైనత ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్'

40 బాషల్లో ప్రచురితమైనత ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్'

స్టీఫెన్ హాకింగ్ రాసిన ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ పుస్తకం విక్రయాల్లో ప్రపంచ వ్యాప్త సంచలనం సృష్టించింది. దాదాపు 40 భాషల్లో ఆ పుస్తకం వెలువడింది. తెలుగులో సైతం కాలం కథ పేరుతో వెలువడింది. బెస్ట్ సెల్లర్‌గా ఆ పుస్తకం సాధించిన రికార్డు వల్ల 1998లో గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. ఈ పుస్తకాన్ని హాకింగ్ 1984లో రాయడం ప్రారంభిస్తే, 1988లో అది ప్రచురితమైంది. ఆ సమయంలోనే హాకింగ్ కంప్యూటర్ సాయంతో మాట్లాడగలిగే యంత్రాన్ని తయారు చేసుకున్నాడు. ఆ పుస్తకం ఆయనకు విశేష ప్రచారాన్ని కల్పించింది. ఆయన సోషల్ మీడియాలో చేరిన కొద్ది క్షణాల్లోనే 10 లక్షల మందికి పైగా అభిమానులను పొందారు.

యంత్రాలు, రోబోలు నియంత్రణలో ఉండాలని సూచనలు

యంత్రాలు, రోబోలు నియంత్రణలో ఉండాలని సూచనలు

కృత్రిమ మేధస్సుతో మానవాళికి లాభాలతోపాటు ముప్పు కూడా పొంచి ఉందని స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. రోబోలను సరిగా వినియోగించుకోకుంటే దుష్పరిణామాలు తప్పవన్నారు. సొంతంగా ఆలోచించి, తమకు తామే నిర్ణయాలు తీసుకోగల రోబోలు ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్నాయి. కృత్రిమ మేధస్సు ఎంతపెరిగినా అంతిమంగా యంత్రాలు, రోబోలన్నీ మనిషి నియంత్రణలో ఉంటేనే సురక్షితమని హాకింగ్ సూచించారు. తన ఉద్దేశంలో ప్రస్తుతం మానవ మెదడుకు, కంప్యూటర్‌కు మధ్య వేగం, సామర్థ్యంలో పెద్దగా తేడా లేదన్నారు. భవిష్యత్తులో అవి మనుషుల మేధస్సును మించిపోతాయని, యంత్రాలు మనిషి ఆలోచనలను ముందుగానే పసిగట్టగలవని చెప్పారు. అదే జరిగితే యంత్రాలతో మనుషులకు చిక్కులు ఎదురవుతాయని హెచ్చరించారు.

 గ్రహాలు, నక్షత్రాల మధ్య గురుత్వాకర్షణ శక్తిని వివరించిన హాకింగ్

గ్రహాలు, నక్షత్రాల మధ్య గురుత్వాకర్షణ శక్తిని వివరించిన హాకింగ్

హాకింగ్ తన పరిశోధనల్లో 1970లో గొప్ప విజయాన్ని పొందారు. ఆయన రోజర్ పెన్‌రోజ్‌తో క్వాంటం సిద్ధాంతాన్ని, సాధారణ సాపేక్ష సిద్ధాంతాన్ని ఉపయోగించి కృష్ణబిలాలు కూడా రేడియోధార్మికతను వెలువరిస్తాయని కనుగొన్నారు. 1971 నుంచి బిగ్‌బ్యాంగ్ (మహా విస్ఫోటనం)పై పరిశోధనలు మొదలుపెట్టిన హాకింగ్ కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించారు. ఈ విశ్వంలో గ్రహాలు ఆయా నక్షత్రాల చుట్టూ ఎలా కదులుతున్నాయో, వాటిల్లో గురుత్వాకర్షణ ఎలా పనిచేస్తుందో హాకింగ్ వివరించారు. కాంతి వేగం గురించి హాకింగ్ అనేక థియరీలను ప్రతిపాదించారు. ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని కూడా ఆయన విశ్లేషించారు. రోజు రోజుకూ ఈ విశ్వం మరింత విస్తరిస్తున్నదన్న వాదనను బలపరిచారు. డాప్లర్ ఎఫెక్ట్‌గా దీన్ని పిలుస్తారు. మహావిస్ఫోటనం(బిగ్ బ్యాంగ్) వల్లే ఈ విశ్వం పుట్టిందన్న సిద్ధాంతాన్ని హాకింగ్ ధ్రువపరిచారు. కృష్ణబిలాలు అంటే నక్షత్రాలేనని, అయితే వాటి మధ్యలో గురుత్వాకర్షణ ఎక్కువగా ఉంటుందని, అవి ఏ వస్తువునైనా తమ మధ్యభాగంలోకి లాగేస్తాయని ఆయన వివరించారు. అతిపెద్ద నక్షత్రాలు మాత్రమే కృష్ణబిలాలుగా మారుతాయన్నారు. క్వాంటంలో హెచ్చుతగ్గులు పదార్థం పంపిణీలో చిన్న చిన్న వైరుధ్యాలు గాలితో ఉబ్బటం వంటి ప్రక్రియలు విశ్వంలో గెలాక్సీల వ్యాప్తికి దోహదపడి ఉండవచ్చని 1982లో మొదటిసారి పేర్కొన్నారు.

భారత్‌లో 2001లో 16 రోజులపాటు హాకింగ్ పర్యటన

భారత్‌లో 2001లో 16 రోజులపాటు హాకింగ్ పర్యటన

భారతీయులు ఎంతో ప్రజ్ఞావంతులని, ముఖ్యంగా గణితం, భౌతిక శాస్ర్తాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని స్టీఫెన్ హాకింగ్ అభినందించారు. 2001లో ఆయన తొలిసారి భారత్‌లో పర్యటించారు. ముంబై, ఢిల్లీల్లో నిర్వహించిన సదస్సుల్లో ప్రసంగించారు. ద యూనివర్స్ ఇన్ ఏ నట్స్ షెల్ అనే అంశంపై ఉపన్యసించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను మొట్టమొదటి సరోజిని దామోదరన్ ఫెలోషిప్‌తో సత్కరించారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రపతి భవన్‌లో అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా భారతీయులు గణితం, భౌతిక శాస్త్రంలో అద్భుతంగా రాణిస్తున్నారని హాకింగ్ పేర్కొన్నారు.

 కేంబ్రిడ్జి వర్సిటీలో గణిత శాస్త్రవేత్తగా సేవలు

కేంబ్రిడ్జి వర్సిటీలో గణిత శాస్త్రవేత్తగా సేవలు

స్టీఫెన్ హాకింగ్ తల్లి బ్రిటిష్ కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు. అందువల్లనే స్టీఫెన్‌కు చిన్ననాటి నుండి ప్రగతిశీల భావాలతో హేతువాదిగా మారిపోయారు. ఆయన తండ్రి మెడికల్ డాక్టర్, పరిశోధకుడు. హాకింగ్ లండన్‌లోని సెయింట్ ఆల్బన్స్ పాఠశాలలో తన విద్యార్థి జీవితాన్ని ప్రారంభించారు. స్టీఫెన్ తన 17వ యేట, 1959 అక్టోబర్‌లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చేరి పీహెచ్డీ చేశారు. 1974లో తన 32వ యేట బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్తల సంస్థ రాయల్ సొసైటీలో సభ్యుడుయ్యారు. ఆ సొసైటీలో చేరిన అతి పిన్న వయస్కుడు స్టీఫెన్ హాకింగ్. 1979లో ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో గణితశాస్త్ర ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. అప్పుడు ఆయన సైద్ధాంతిక ఖగోళశాస్త్రం, విశ్వోద్భవ శాస్త్రం చదవడానికి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వచ్చారు.

 కృష్ణబిలాల నాశనంపై దొరకని రుజువులు

కృష్ణబిలాల నాశనంపై దొరకని రుజువులు

ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌కు ఎన్నో పురస్కారాలు లభించినా ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి మాత్రం దక్కలేదు. దీనికి ప్రధాన కారణం ఆయన ప్రతిపాదించిన పలు సిద్ధాంతాలకు రుజువులు లేకపోవడమే. ఆయన సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు అంగీకరించినా.. వాటిని నిరూపించడానికి తగిన ఆధారాలు లేవు. ముఖ్యంగా కృష్ణబిలాలు శాశ్వతం కాదని, అవి నశిస్తాయని ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతానికి నోబెల్ బహుమతి దక్కుతుందని అందరూ అంచనా వేశారు. అయితే కృష్ణబిలాల నాశనాన్ని నిరూపించడానికి తగిన ఆధారాలు లేకపోవడంతో నోబెల్ దక్కలేదు. వయసు పెరుగుతున్న కొద్దీ కృష్ణబిలాల సామర్థ్యం తగ్గుతుందని, అవి కుచించుకుపోతాయని, క్రమంగా ద్రవ్యరాశిని కోల్పోయి పేలిపోతాయని స్టీఫెన్ హాకింగ్ 1970ల్లో ప్రతిపాదించారు.

 ది గ్రాండ్ డిజైన్ నుంచి ది లార్జి స్కేల్ స్ట్రక్చర్ ఆఫ్ స్పేస్ టైమ్ వరకు..

ది గ్రాండ్ డిజైన్ నుంచి ది లార్జి స్కేల్ స్ట్రక్చర్ ఆఫ్ స్పేస్ టైమ్ వరకు..

స్టీఫెన్ హాకింగ్ ఎన్నో పుస్తకాలు రాశారు. అందులో తన జీవిత చరిత్రతోపాటు, అంతరిక్ష విజ్ఞానం, ఖగోళ రహస్యాలకు సంబంధించి ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు, పరిశోధన పత్రాలు, ఉపన్యాసాలతో కూడిన గొప్ప రచనలు, సైన్స్ ఫిక్షన్ నవలలు కూడా ఉన్నాయి.
మై బ్రీఫ్ హిస్టరీ: హాకింగ్ ఇందులో తన బాల్య విశేషాల నుంచి మొదలుకుని ప్రముఖ ఖగోళవిజ్ఞాన శాస్త్రవేత్తగా అంతర్జాతీయస్థాయికి చేరేంత వరకు తన జీవనయాత్ర గురించి రాశారు. ‘ది గ్రాండ్ డిజైన్' అనే పుస్తకంలో ఈ విశ్వం పుట్టుక ఎప్పుడు, ఎలా జరిగింది? మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం? ప్రకృతి వాస్తవిక స్వభావం ఏమిటి? విశ్వాంతరాళ రహస్యం ఏమిటి? వంటి ఆసక్తికరమైన అంశాలపై చర్చ లేవనెత్తింది. ‘ది లార్జ్ స్కేల్ స్ట్రక్చర్ ఆఫ్ స్పేస్ టైమ్' అనే పుస్తకంలో ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం, గురుత్వాకర్షణ అంతం, కృష్ణబిలాల గురించి 1973లో రాసిన ఈ పుస్తకం భౌతిక శాస్త్రవేత్తలకు పాఠ్యపుస్తకంగా మారింది.

 శక్తి సామర్థ్యాలతో అత్యున్నత విధులు నిర్వర్తించాలి

శక్తి సామర్థ్యాలతో అత్యున్నత విధులు నిర్వర్తించాలి

‘నా వంటి వికలాంగులకు నేను చెప్పేది ఒక్కటే. మీ వైకల్యం అడ్డురాని పనులపై దృష్టి పెట్టండి. విజయం సాధించండి. అంతేతప్ప చేయలేని పనుల గురించి చింతిస్తూ కూర్చోకండి. శరీరానికి వైకల్యం ఉంటుందేమో గానీ.. మీ మనసుకు ఎప్పుడూ ఆ వైకల్యాన్ని ఆపాదించకండి. చావు అంటే భయపడే వాళ్లకే స్వర్గం, నరకం. కన్ను మూసేలోపే మనకున్నశక్తి సామర్ధ్యాలను పూర్తిస్థాయిలో వినియోగించి మంచి జీవితం గడపాలి. మనం చేసే పనులు అత్యున్నతంగా ఉండాలి. మరణం నా ముంగిట నిలిచినా వెరువలేదు. కన్నుమూసేలోపు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి' అని స్టీఫెన్ హాకింగ్ వ్యాఖ్యానించారు.

English summary
Stephen Hawking, a pioneering theoretical physicist, author of a Brief History of Time, and one of the most brilliant thinkers to ever live and breathe on planet Earth, died early on Wednesday morning at his home in Cambridge, England. He was 76. Being that Hawking's intellect cast a towering presence throughout the world, despite his struggles with a debilitating muscular condition that confined him to a wheelchair for most of his life, it's rather fitting that the specific time of his death is rife with symbolism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X