• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సూపర్‌సోనిక్ జెట్: 2029లో ధ్వని కంటే 1.7 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణికుల విమానాలు

By BBC News తెలుగు
|

సూపర్‌సోనిక్ వేగంతో దూసుకెళ్లే 15 కొత్త విమానాలను కొనుగోలు చేయబోతున్నట్లు అమెరికా విమానయాన సంస్థ ''యునైటెడ్’’ తెలిపింది. 2029లో మళ్లీ సూపర్‌సోనిక్ వేగాన్ని ప్రజలకు పరిచయం చేస్తామని వెల్లడించింది.

చివరిసారిగా 2003లో సూపర్‌సోనిక్ ప్రయాణికుల విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. 1970ల నుంచి 2003 వరకు ఎయిర్ ఫ్రాన్స్, బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లకు చెందిన కాంకార్డ్ విమానాలు సేవలు అందించాయి.

ప్రస్తుతం డెన్వర్‌కు చెందిన ''బూమ్’’ సంస్థ ''ఓవర్‌ట్యూర్’’ పేరుతో కొత్త విమానాలను అభివృద్ధి చేస్తోంది. సూపర్‌సోనిక్ విమానాలను సంస్థ తయారుచేయడం ఇదే తొలిసారి.

భద్రతా ప్రమాణాల విషయంలో విమానయాన నిబంధనలను పాటిస్తూ ఓవర్‌ట్యూర్‌ను తయారు చేస్తామని యునైటెడ్, బూమ్‌ల మధ్య ఒప్పందం కుదిరింది.

కాంకార్డ్

సూపర్‌సోనిక్ విమానం అంటే?

ధ్వని కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే విమానాలను సూపర్‌సోనిక్ విమానాలు అంటారు.

అంటే 60,000 అడుగుల ఎత్తులో ఇవి గంటకు 1,060 కి.మీ.ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. సాధారణ విమానాల వేగం గంటకు 900 కి.మీ. వరకు ఉంటుంది.

ఓవర్‌ట్యూర్ గంటకు 1,805 కి.మీ.ల వేగంతో ప్రయాణిస్తుందని బూమ్ చెబుతోంది. అంటే దీని వేగం ధ్వని కంటే 1.7 రెట్లు ఎక్కువ. దీన్ని మాక్ 1.7 అంటారు.

ఈ వేగంతో ప్రయాణిస్తే న్యూయార్క్, లండన్‌ల మధ్య ప్రయాణ సమయాన్ని సగానికి కుదించొచ్చు.

ఈ రెండు మహా నగరాల మధ్య సేవల్ని 3.5 గంటలకు కుదిస్తామని బూమ్ అంటోంది. అంటే మూడు గంటలు ఆదా అయినట్లే.

1976ల్లో ప్రస్థానం మొదలుపెట్టిన కాంకార్డ్ గరిష్ఠంగా గంటకు 2,180 కి.మీ.ల వేగంతో సేవలు అందించింది. అంటే మాక్ 2.04 వేగంతో పరుగులు తీసింది.

అవే ప్రధాన సమస్యలు..

సూపర్‌సోనిక్ విమానాల రాకపోకలకు రెండు ప్రధాన అడ్డంకులు ఉన్నాయి. వీటిలో మొదటిది ధ్వని. రెండోది కాలుష్యం.

ధ్వని కంటే వేగంగా ప్రయాణించేటప్పుడు భారీ శబ్దాలు వస్తాయి. పిడుగులు పడినట్లు, పేలుడు జరిగినట్లు వచ్చే ఈ ధ్వనులు నేలపై ఉండేవారికి కూడా వినిపిస్తాయి.

బూమ్ మంటూ వచ్చే శబ్దాలతో చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ ధ్వని తగ్గాలంటే, వేగాన్ని తగ్గించాలి. లేదంటే నేలపై ఉండే ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది.

అయితే, తమ ఓవర్‌ట్యూర్.. ఆధునిక విమానాల్లానే ధ్వని చేస్తుందని, అంతకుమించి అసలు ధ్వని ఉండదని బూమ్ అంటోంది. కాంకార్డ్ తర్వాత అందుబాటులోకి వచ్చిన కొత్త డిజైన్లతో ఈ శబ్దాన్ని చాలావరకు తగ్గించొచ్చని అంటోంది.

ఇక రెండో అతిపెద్ద అంశం ఇంధన వినియోగం.

''సూపర్‌సోనిక్ వేగంతో నడిపించాలంటే, మరింత శక్తి, మరింత ఇంధనం అవసరం’’అని బూమ్ చీఫ్ కమర్సియల్ ఆఫీసర్ కేటీ సవిట్ బీబీసీతో చెప్పారు.

''నెట్ జీరో కార్బన్ ఎయిర్‌క్రాఫ్ట్’’గా తమ ఓవర్‌ట్యూర్‌ను నడిపిస్తామని ఆమె వివరించారు. అంటే ఉద్గారాలకు సరిపడే స్థాయిలో ఉద్గారాల నియంత్రణకు చర్యలు తీసుకుంటారన్నమాట.

సుస్థిర ఇంధనంతో..

ఓవర్‌ట్యూర్‌ను పూర్తిగా సుస్థిర విమాన ఇంధనం (ఎస్‌ఏఎఫ్)తో నడపాలని బూమ్ భావిస్తోంది.

అంటే జంతువుల కొవ్వు నుంచి ప్రత్యేక పంటల వరకు.. బయో వనరుల నుంచి సేకరించిన బయోడీజిల్‌ను ఓవర్‌ట్యూర్ వినియోగించాల్సి ఉంటుందని క్రాన్‌ఫీల్డ్ యూనివర్సిటీలోని ఏవియేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గయ్ గ్రేటన్ వివరించారు.

అయితే, మొత్తం విమానయాన రంగానికి సరిపడే స్థాయిలో ప్రస్తుతం ఈ బయోడీజిల్‌ను ఉత్పత్తిచేసే వ్యవస్థలు అందుబాటులోలేవని ఆయన చెప్పారు.

ఈ అంతరాన్ని పూరించేందుకు, పవన విద్యుత్ నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ''పవర్ టు లిక్విడ్’’ విధానాలను ఉపయోగించుకోవాలని బూమ్ భావిస్తోంది.

''అయితే, దాన్ని వాణిజ్య అవసరాలకు సరిపడేలా తీర్చిదిద్దాల్సి ఉంటుంది’’అని బూమ్‌ చీఫ్ కమర్సియల్ ఆఫీసర్ రేమండ్ రషెల్ చెప్పారు.

డిమాండ్ ఉందా?

కాంకార్డ్ అభివృద్ధికి 50 ఏళ్లపాటు పెద్దమొత్తంలో ఖర్చు అయ్యింది. అయితే, కేవలం చివరి దశల్లో మాత్రమే ఇది బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు లాభాలు తెచ్చిపెట్టింది.

సాధారణ విమానాల్లో ఫస్ట్ క్లాస్ టికెట్ కంటే కాంకార్డ్‌లో ప్రయాణానికే ఎక్కువ ఖర్చు అయ్యేది.

నేడు, ధనిక వ్యాపారవేత్తలు ప్రైవేట్ బిజినెస్ జెట్లవైపు మొగ్గుచూపుతున్నారని డాక్టర్ గ్రేటన్ అన్నారు.

''ఫస్ట్ క్లాస్ కంటే ఎక్కువ డబ్బులు చెల్లించి అందరితో కలిసి వెళ్లేకంటే, ప్రైవేట్ జెట్లే మేలు. ఎక్కడకు కావాలంటే అక్కడకు వెళ్లొచ్చు. చెక్‌ఇన్, లగేజీ చెకప్‌ల బెడద ఉండదు’’.

అయితే, ప్రయాణీకులు వేగంగా ప్రయాణించే విమానాలను కోరుకుంటున్నారని సవిట్ అన్నారు. ఇలాంటి సేవలతో వ్యాపార, ప్రజా సంబంధాలు మెరుగు అవుతాయని చెప్పారు.

సాధారణ బిజినెస్ క్లాస్ ధరకే టికెట్లు అమ్మినప్పటికీ, ఓవర్‌ట్యూర్‌తో లాభాలు వస్తాయని బూమ్ చెబుతోంది. అయితే, టికెట్ ధరలు ఎంత ఉండాలో నిర్ణయించాలో యునైటెడ్ ఇష్టం. ఎందుకంటే 200 మిలియన్ డాలర్లను సంస్థ ప్రస్తుతం పెట్టుబడిగా పెడుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Supersonic jet: Passenger aircraft 1.7 times faster than sound in 2029
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X