టాంజానైట్ రాళ్లు రెండు దొరికాయి.. రాత్రికి రాత్రే 2,500 కోట్ల కుబేరుడయ్యాడు

టాంజానియాలో గనులు తవ్వే ఓ చిన్నపాటి మైనర్ జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది. తన జీవితంలోనే కాదు.. తన దేశంలోనే అత్యంత విలువైన గని అతడికి దొరికింది.
సానినీ లేజర్‌కు రెండు పెద్ద ముడి టాంజానైట్ శిలలు దొరికాయి. రెండూ కలిపి 15 కిలోల బరువు ఉన్నాయి.
ఈ విలువైన శిల భూమి మీద అత్యంత అరుదైన ఖనిజాల్లో ఒకటి. వీటిద్వారా అతడికి 34 కోట్ల డాలర్ల (సుమారు 2,566 కోట్ల రూపాయలు) ఆదాయం లభించింది.
టాంజానియా గనుల మంత్రిత్వశాఖ అతడికి ఈ సొమ్ము అందించటంతో రాత్రికి రాత్రి అతడు కుబేరుడయ్యాడు. దీనిపై అతడి స్పందన ఎలా ఉంది?
''పెద్ద పార్టీ ఇస్తాను’’ అని లేజర్ బీబీసీతో చెప్పారు. అతడికి 30 మంది కన్నా ఎక్కువ మందే సంతానం ఉన్నారు.
- 'కేజీఎఫ్ గనుల్లో బంగారం కన్నా విలువైన లోహం.. వెలికితీతపై త్వరలో నిర్ణయం’
- మీ ఇంట్లోనే మీకు తెలియని బంగారం వంటి లోహాలను కనిపెట్టడం ఎలా

టాంజానైట్‌కి ఇంత విలువ ఎందుకు?
టాంజానైట్ ఖనిజం కేవలం ఉత్తర టాంజానియాలో మాత్రమే దొరుకుతుంది. ఉంగరాలు, నెక్లెస్‌లు, బ్రేస్లెట్లు వంటి నగలలో ఉపయోగించే రత్నాలలో దీనికి చాలా ప్రజాదరణ ఉంది.
భూమి మీద అత్యంత అరుదుగా లభించే రత్నాలలో ఇదొకటి. రాబోయే 20 ఏళ్లలో ఈ రత్నాల సరఫరా పూర్తిగా అంతరించిపోతుందని స్థానిక భౌగోళిక శాస్త్రవేత్త ఒకరు చెప్తున్నారు.
ఈ విలువైన శిల ఆకర్షణ దీనిలోని ఆకుపచ్చ, ఎరుపు, ఊదా రంగులు సహా విభిన్న వర్ణాల్లో ఉంటుంది.
ఎంత అరుదైన శిల అనేదానిని బట్టి దీని విలువను నిర్ధారిస్తారు. శిల రంగు ఎంత స్వచ్ఛంగా, స్పష్టంగా ఉంటే అంత ఎక్కువ ధర పలుకుతుంది.
లేజర్‌కు గత వారంలో రెండు టాంజానైట్ శిలలు దొరికాయి. ఒక దాని బరువు 9.2 కిలోలు ఉంటే, మరొకటి 5.8 కిలోల బరువు ఉంది. వాటిని బుధవారం నాడు మాన్యారా ప్రాంతంలో వాణిజ్య కార్యక్రమం సందర్భంగా విక్రయించారు.
దీనికి ముందు వరకూ దొరికిన టాంజానైట్ శిలల్లో అతి పెద్ద శిల బరువు 3.3 కిలోలు మాత్రమే.
దేశాధ్యక్షుడు జాన్ మగుఫులి స్వయంగా లేజర్‌కు ఫోన్ చేసి అభినందించారు.
''చిన్నతరహా మైనర్లతో కలిగే ప్రయోజనం ఇది. టాంజానియా సంపన్నమైన దేశమని ఇది నిరూపిస్తోంది’’ అని అధ్యక్షుడు పేర్కొన్నారు.
గనుల తవ్వక రంగంలో టాంజానియా ప్రయోజనాలను పరిరక్షిస్తానని, దానిపై ప్రభుత్వ ఆదాయం పెంపొందిస్తాననే హామీలతో 2015లో అధికారంలోకి వచ్చారు మగుఫులి.

లేజర్ తన డబ్బును ఎలా ఖర్చు పెడతారు?
లేజర్ వయసు ఇప్పుడు 52 సవత్సరాలు. ఆయనకు నలుగురు భార్యలు, 30 మందికి పైగా పిల్లలు ఉన్నారు. తన ఆవుల్లో ఒక దానిని కోసి సంబరాలు చేసుకుంటామని ఆయన చెప్పారు.
ఈ ఆదాయాన్ని మాన్యారా ప్రాంతంలోని సిమాంజిరో జిల్లాలో తమ సమాజం కోసం వెచ్చించాలన్నది తన ఆలోచనగా తెలిపారు.
''ఒక స్కూల్, ఒక షాపింగ్ మాల్ కట్టాలనుకుంటున్నాను. నా ఇంటి దగ్గర్లోనే స్కూలు కట్టాలని ఉంది. ఇక్కడ తమ పిల్లలను బడికి పంపించలేని పేద కుటుంబాలు చాలా ఉన్నాయి’’ అని ఆయన వివరించారు.
''నేను చదువుకోలేదు. కానీ పనులు ప్రొఫెషనల్‌గా జరగటమంటే నాకు ఇష్టం. నా పిల్లలను ప్రొఫెషనల్‌గా వ్యాపారం నిర్వహించాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారాయన.
టాంజానియాలో టాంజానైట్ తవ్వకాల ద్వారా ఆదాయం సంపాదించటం కోసం లేజర్ వంటి చిన్నతరహా మైనర్లు ప్రభుత్వం నుంచి లైసెన్సులు పొందుతారు. అయితే.. పెద్ద కంపెనీల యాజమాన్యంలోని గనుల దగ్గర అక్రమ మైనింగ్ కూడా విస్తారంగా జరుగుతుంటుంది.
మన్యారాలోని మెరిలాని గని ప్రాంతం చుట్టూ 24 కిలోమీటర్ల మేర గోడ కట్టాలని 2017లో అధ్యక్షుడు మాగుఫులి సైన్యాన్ని ఆదేశించారు. ప్రపంచంలో టాంజానైట్ లభించే ఏకైక ప్రాంతం ఇదేనని భావిస్తారు.
ఆ గోడ కట్టిన ఏడాది తర్వాత గనుల తవ్వకాల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరిగిందని సర్కారు చెప్పినట్లు దారె సలామ్‌లోని బీబీసీ ప్రతినిధి సామీ అవామీ పేర్కొన్నారు.
- బంగారం ధరలకు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఏమిటి సంబంధం...
- శాన్ జోస్ యుద్ధ నౌక: సాగర గర్భంలోని నౌకలో లక్షల కోట్ల సంపద... దక్కేది ఎవరికి?

ఈ ఆకస్మిక సంపద అతడి జీవితాన్ని మార్చేస్తుందా?
కొత్తగా భారీ సంపద లభించినప్పటికీ తాను ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమేమీ లేదని లేజర్ అంటున్నారు.
''ఇక్కడ భద్రత సరిపోతుంది. సమస్య ఏమీ ఉండదు. రాత్రిళ్లు కూడా నేను తిరగగలను’’ అని చెప్పారు.
ఇంత సంపద, కీర్తి లభించినా కూడా తన 2,000 ఆవుల సంరక్షణను తాను కొనసాగిస్తానని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- రూ.50,000కి చేరిన బంగారం ధర.. ఇప్పుడు కొంటే లాభమా.. అమ్మితే మంచిదా
- కరోనావైరస్ 'జీరో' అని ప్రకటించుకోవడానికి ఆ దేశాలకు ఎందుకంత తొందర?
- వయసు 100.. సంతానం 1600కిపైగా.. 50 ఏళ్లుగా సంతానోత్పత్తిలోనే.. ఇప్పుడు విశ్రాంతి
- డెక్సామెథాసోన్: కరోనావైరస్కు మంచి మందు దొరికినట్లేనా?
- కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి.. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది
- మీకు మీరే కరోనావైరస్ టెస్ట్ చేసుకోవచ్చు.. గంటలోనే ఫలితం తెలిసిపోతుంది
- గల్వాన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? 'పది మందిని విడుదల చేసిన చైనా’
- 'భారత సైనికులను ఎవరినీ నిర్బంధంలోకి తీసుకోలేదు' - చైనా
- అమెరికా వీసా: హెచ్1బి సహా ఉద్యోగ వీసాలన్నీ 2020 చివరివరకూ బంద్ - ట్రంప్
- టిబెట్‌ను చైనా ఎప్పుడు, ఎలా తన ఆధీనంలోకి తీసుకుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)