ఐదేళ్ల చిన్నారి చివరి కోరిక: పెళ్లి చేసుకోవాలని.. తల్లిదండ్రులు చేసేశారు
స్కాట్లాండ్ కు చెందిన ఐదేళ్ల చిన్నారి ఇలేదె పాటర్సన్ తల్లిదండ్రుల సాయంతో తనకంటే వయసులో ఏడాది పెద్దవాడైన తన బెస్ట్ ఫ్రెండ్ హారిసన్ గ్రియర్ ను పెళ్లాడి తన చివరి కోరికను తీర్చేసుకుంది.
స్కాట్లాండ్: ఆ చిన్నారి వయసు జస్ట్ ఐదేళ్లు. పేరు.. ఇలేదె పాటర్సన్. చూడటానికి చాలా ముద్దుగా ఉంటుంది. కానీ.. ఏం చేస్తాం.. విధి వెక్కిరించింది. ఆ చిన్నారి ఈ లోకంలో ఉండడం దేవుడి కి ఇష్టం లేదు కాబోలు.. ఓ మాయ రోగాన్ని ఆ చిన్నారికి అంటించాడు.
ఐదేళ్ల ప్రాయంలోనే ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధితో పోరాడుతోంది ఇలేదె పాటర్సన్. న్యూరోబ్లాస్టొమా అనే మెదడుకు సంబంధించిన క్యాన్సర్ అది. ఎంత ట్రీట్ మెంట్ ఇచ్చినా బతకడం కష్టం అని డాక్టర్లు చెప్పారు.
ఆ చిన్నారికి ఏమైనా కోరికలు ఉంటే తీర్చేయమని కూడా సూచించారు. కొండంత బాధను గుండెల్లోనే దిగమింగుకున్న ఆ తల్లిదండ్రులు కోరికలేమిటో చెప్పమని తమ చిన్నారిని అడిగారు.
తీరుస్తామని హామీ తీసుకున్న తరువాతే తన కోరికల చిట్టా విప్పిందా ఐదేళ్ల చిన్నారి. తన మొదటి కోరిక.. తన బెస్ట్ ఫ్రెండ్ హారిసన్ గ్రియర్ ను పెళ్లి చేసుకోవడం. వినగానే ముందు నిర్ఘాంతపోయినా.. కొన్ని రోజుల్లో ఈ లోకాన్ని విడిచివెళ్లే తమ చిన్నారి కోరిక తీర్చేయాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు.
ఆ అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్లను ఈ పెళ్లికి ఒప్పించారు. దీంతో ఆరేళ్ల తన బెస్ట్ ఫ్రెండ్ ను పెళ్లాడింది పాటర్సన్. తన మిగిలిన కోరికల్లో.. డాల్ఫిన్స్ తో స్విమ్మింగ్ చేయడం, వాటర్ పార్క్ కు వెళ్లడం, నిజమైన మంచును చూడటం, విమానంలో ప్రయాణించడం లాంటివి ఓ పది ఉన్నాయి. ప్రస్తుతం ఆ కోరికలను తీర్చుకునే పనిలో బిజీగా ఉందా చిన్నారి.