టెక్సాస్‌లో మహా విపత్తు: బ్రెయిన్ తినే అమీబా దాడి, ఆరేళ్ల బాలుడు మృతి, అన్ని ఇళ్లల్లోకి..?
హూస్టన్: అమెరికాలోని టెక్సాస్‌లో బ్రెయిన్ తినే అమీబా కల్లోలం సృష్టిస్తోంది. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్.. విపత్తు ప్రకటన చేశారు. కమ్యూనిటీ వాటర్ సప్లై ద్వారా ఓ ఇంట్లోకి సరఫరా అయిన నీళ్లలో బ్రెయిన్ తినే అమీబా దూరింది. అంతేగాక, ఓ ఆరేళ్ల బాలుడిపై దాడి చేయడంతో అతడు ప్రాణాలు వదిలాడు.

అమీబా బాలుడి శరీరంలోకి వెళ్లడంతోనే..
అమీబా నాగ్లేరియా ఫౌలేరి అనే సూక్ష్మ జీవి ఉన్న నీటిని తాగడం వల్ల ఆరేళ్ల బాలుడు సెప్టెంబర్ 8న మరణించాడు. ఆ అమీబా బాలుడి శరీరంలోకి వెళ్లిన తర్వాత లోపల మొత్తం ఇన్ఫెక్షన్ చేసింది. దీంతో అతడు ప్రాణాలు వదలాడు. ఈ ఘటన స్థానికంగానే గాక, రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.

మెదడుపైనే అమీబా దాడి...
కాగా, ఆ అమీబా మొదట నాసిక పొరల ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఆ తర్వాత మెదడులోకి ప్రవేశిస్తోంది. అనంతరం అమీబా మానవ మెదడుపై దాడి చేయడం మొదలుపెడుతుంది. దీంతో తీవ్రమైన తలనొప్పి, హైపర్థెర్మియా, మెడ నొప్పి, వాంతులు, తర్వాత మైకము, విపరీతమైన అలసట, గందరగోళం, భ్రాంతులు లాంటివి మొదలవుతాయి.

అమీబా జాడలు..
బాలుడి ఇంటి వద్ద తోట గొట్టం యొక్క కుళాయిలో అమీబా యొక్క జాడలు పరీక్షలో వెల్లడయ్యాయని స్థానిక మీడియా ఉటంకిస్తూ లేక్ జాక్సన్ పట్టణ ప్రతినిధి ఒకరు తెలిపారు. పట్టణ కేంద్రంలోని ఒక ఫౌంటెన్‌లో, ప్రధాన నగరమైన హ్యూస్టన్‌కు కేవలం ఒక గంట దూరంలో ఉన్న ఒక పట్టణంలో ఫైర్ హైడ్రాంట్లో కూడా ఈ అమీబా జాడలు కనుగొనబడ్డాయని నగర అధికారి మోడెస్టో ముండో చెప్పారు.

ట్యాప్ వాటర్ తాగొద్దు.. వాడోద్దు..
మృతి చెందిన బాలుడు జోషియో మైక్‌ఇంటైర్.. స్ప్లాష్ పార్క్ డౌన్‌టౌన్ కలుషిత నీటిలో ఆడుకున్న తర్వాతే అతడు అస్వస్థకు గురయ్యాడని అతని నానమ్మ, తాత తెలిపారు. స్ప్లాష్ పార్క్ గత కొంత కాలం క్రితం క్లోజ్ చేసినట్లు, జాక్సన్ సరస్సు ఉన్న బ్రెజోరియా కౌంటీలోని పలు పట్టణాల ప్రజలు ట్యాప్ వాటర్‌ను స్నానం చేయడానికి, తాగడానికి, వంటకు ఉపయోగించవద్దని అధికారులు సూచించారు.

విపత్తుగా ప్రకటించిన గవర్నర్..
అయితే, ఆ ఆదేశాలను ఇప్పుడు ఎత్తేసినప్పటికీ.. నీటిని వేడి చేసుకుని తాగాలని, ఇతర అవసరాలకు ఉపయోగించుకోవాలని అధికారులు ప్రజలను కోరారు. అయితే, తాజా ఘటనతో లేక్ జాక్సన్ తోపాటు బ్రజోరియా కౌంటీలో టెక్సాస్ గవర్నర్ గ్రేగ్ అబ్బోట్ ఆదివారం విపత్తు ప్రకటన చేశారు. ఈ ప్రకటన అత్యవసర పరిస్థితుల కారణంగా అదనపు రాష్ట్ర వనరులను అధికారులు ఉపయోగించుకునే వీలు కల్పిస్తుంది. కాగా, అమీబా నాగ్లేరియా ఫౌలేరి.కారణంగా 1983, 2010 మధ్య కాలంలో 28 మంది మరణించారని టెక్సాన్ హెల్త్ అధికారులు తెలిపారు.