
Texas School Shooting: ఎలిమెంట్రీ స్కూల్లో రక్తపాతం: విద్యార్థులను కాల్చి చంపిన టీనేజర్
వాషింగ్టన్: అమెరికాలో గన్ కల్చర్ మరోసారి పేట్రేగింది. ఓ టీనేజర్.. తన తోటి విద్యార్థులపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించాడు. విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 21 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులకు బుల్లెట్ గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఫలితంగా- మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదని తెలుస్తోంది.
టెక్సాస్‌లోని ఉవాల్డే ప్రాంతంలో గల రాబ్ ఎలిమెంట్రీ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మెక్సికో సరిహద్దుల్లో ఉంటుందీ ప్రాంతం. ఎక్కువగా మెక్సికన్లు ఈ స్కూల్లో చదువుకుంటున్నారని సమాచారం. అదే ప్రాంతానికి చెందిన 18 సంవత్సరాల టీనేజర్ కుర్రాడు- ఈ కాల్పులు జరిపాడు. అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 12:17 నిమిషాలకు ఈ ఘటన సంభవించింది.

తొలుత హ్యాండ్‌గన్‌తో ఓ వాహనంలో అతను రాబ్ ఎలిమెంట్రీ స్కూల్ వద్దకు చేరుకున్నారు. ఆ వెంటనే స్కూల్లోకి దూసుకెళ్లాడు. ఆ సమయంలో స్కూల్లో 600 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు చెబుతున్నారు. స్కూల్లోకి ప్రవేశించిన వెంటనే కనిపించిన వారిపై కనిపించినట్టే కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తొలుత 14 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మరణించారు. ఆ కొద్దిసేపటికే మృతుల సంఖ్య పెరిగింది. 18కి చేరుకుంది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురు మరణించారు.
కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు జరిపిన కాల్పుల్లో షూటర్ కూడా మరణించాడు. ఈ దిగ్భ్రాంతికర ఘటన పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. ఈ ఘటనకు సంతాప సూచకంగా అమెరికా జాతీయ పతాకాన్ని అవనతం చేశారు.
టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్‌తో ఫోన్లో మాటాడారు. అక్కడి పరిస్థితుల గురించి ఆరా తీశారు. ఈ దిగ్భ్రాంతికర ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన.. జో బైడెన్‌కు వివరించారు. అనంతరం జో బైడెన్- ఈ ఘటనపై ఓ ప్రకటన విడుదల చేశారు. గన్ లాబీయింగ్ ఈ ఘటన వెనుక ఉందని జో బైడెన్ చెప్పారు. గన్ కల్చర్‌ను నియంత్రించడానికి ప్రత్యేక చట్టాలను తీసుకుని రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కాల్పులు జరిగిన వెంటనే స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని పాఠశాలకు అప్పటికప్పుడు సెలవును ప్రకటించింది. విద్యార్థులను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చినట్లు ఉవాల్డే కన్సాలిడేటెడ్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ అధికారి వెల్లడించారు. 2018 తరువాత అమెరికాలో చోటు చేసుకున్నఅతిపెద్ద రక్తపాతంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇదివరకు ఫ్లోరిడాలోని మార్జరీ స్టోన్‌మేన్ డగ్లస్ హైస్కూల్లో ఇదే తరహాలో కాల్పుల ఉదంతం చోటు చేసుకుంది. అప్పట్లో 17 మంది మరణించారు.