వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్ ఆ తెగలో ఆఖరి పురుషుడిని కూడా బలి తీసుకుంది...

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అరుకా

బ్రెజిల్‌లోని అమెజాన్ అటవీ ప్రాంతంలో జీవించే జుమా ఆదివాసీ తెగలోని చిట్టచివరి పురుషుడిని కోవిడ్ బలి తీసుకుంది.

20వ శతాబ్దంలో 15 వేలుగా ఉన్న జుమా తెగ జనాభా 1990ల్లోకి వచ్చేసరికి ఆరుకు పడిపోయింది. ఈ తెగలో మిగిలి ఉన్న ఒకే ఒక్క పురుషుడైన అరుకా జుమా గత వారం చనిపోయారు.

అయితే, అరుకా వారసత్వాన్ని కాపాడేందుకు ఆయన మనువళ్లు తమ సంప్రదాయాలకు భిన్నంగా ఓ పని చేశారు. బీబీసీ న్యూస్ బ్రెజిల్ విభాగానికి చెందిన జులియానా గ్రెగ్నానీ అందిస్తున్న కథనం...

అరుకా వయసు ఎంత అన్నది కచ్చితంగా తెలియదు. 86 నుంచి 90 ఏళ్ల మధ్య ఉండొచ్చని అంచనా.

అమెజొనాస్ రాష్ట్ర దక్షిణ ప్రాంతంలో వ్యవసాయం చేస్తూ, వేటాడుతూ, చేపలు పడుతూ జీవించిన జుమా తెగ క్రమంగా పలుచబడిపోవడాన్ని అరుకా తన కళ్లారా చూశారు.

రబ్బరు తీసేవాళ్లు సాగించిన ఊచకోతలు, ప్రాణాంతక వ్యాధులు ప్రబలడం వల్ల జుమా తెగ వారి జనాభా క్రమంగా తగ్గిపోయింది. చివరికి అరుకా కుటుంబం ఒక్కటే మిగిలింది.

జుమా తెగలో తాను ఒక్కడినే మిగిలిపోయానన్న బాధ ఆయన మాట్లాడుతున్నప్పుడు స్పష్టంగా కనిపించేదని జుమా తెగవారి జీవితాన్ని చిత్రించేందుకు కృషి చేసిన ఫొటోగ్రాఫర్ గాబ్రియెల్ ఉచిడా గుర్తుచేసుకున్నారు.

ముగ్గురు కూతుర్లతో అరుకా

అరుకాకు ముగ్గురు కుమార్తెలు. జుమా తెగ‌లో అబ్బాయిలు లేకపోవడంతో ఆ ముగ్గురూ ఉరూ ఈయు వావువావు అనే మరో తెగవారిని పెళ్లి చేసుకున్నారు.

ఇక్కడి తెగల్లో తండ్రి ఏ తెగకు చెందితే, పిల్లలు కూడా అదే తెగ వారవుతారన్న కట్టుబాటు పాటిస్తుంటారు.

అయితే, అరుకా కూతుర్లకు పుట్టిన సంతానం మాత్రం తాము ఉరూ ఈయు వావువావు తెగతోపాటు జుమా తెగవారిగానూ ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

''మా ఆచార సంప్రదాయాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలనుకుంటున్నాం. ఆయన మాతో ఉంటారు. మా మనవళ్లు, మునిమనవళ్ల ద్వారా మాలో ఉంటారు'' అని అరుకా మనవడైన 20 ఏళ్ల బిటాటే ఉరూ ఈయు వావువావు అంటున్నారు.

''మా పూర్వీకుల పోరాటాలు మరుగునపడిపోకూడదు. మా తాత సాగించిన పోరాటాలు, మా తల్లులు చేసిన పోరాటాల పట్ల మేం గర్వంగా ఉన్నాం. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం'' అని కువాయింబు అన్నారు.

తన తాత తెగ పేరును కూడా కలుపుకుని తన పేరును కువాయింబు జుమా ఉరూ ఈయు వావువావుగా ఆయన మార్చుకున్నారు. అధికారికంగా గుర్తింపు కార్డుల్లోనూ తన పేరును మార్చుకుంటానని ఆయన చెప్పారు.

బిటాటే

''నేను ఓ జుమాకు మనవడిని. ఓ జుమాకు కొడుకుని. నా పేరులో జుమా పెట్టుకునే హక్కు నాకు ఉంది'' అని కువాయింబు అన్నారు.

స్థానిక తెగల్లో ఇలా తల్లి వైపు తెగ పేరును పెట్టుకోవడం తాను చూడలేదని, అరుకా మనవలు ఈ నిర్ణయం తీసుకోవడం పెద్ద విషయమేనని ఆదివాసీ హక్కుల కార్యకర్త ఇవనీడ్ బండెయిరా అభిప్రాయపడ్డారు. అసోసియేషన్ ఆఫ్ ఎత్నో-ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కనిండేలో ఆమె పనిచేస్తున్నారు.

జుమా తెగ అంతమైపోతున్నట్లే చాలా ఆదివాసీ తెగలు అంతరించిపోయాయని బండెయిరా అన్నారు.

1940ల నుంచి జుమా తెగ భూముల్లోని సంపదపై కన్నేసిన వాళ్లు వారిని లక్ష్యంగా చేసుకుంటూ వచ్చారని ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ పారా ప్రొఫెసర్ లూసియానా ఫ్రాంకా చెప్పారు.

జుమా తెగవారిని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఊచకోత చివరిగా 1964లో రికార్డుల్లో నమోదైంది. అప్పుడు రబ్బరు సేకరించేవాళ్లు పదుల సంఖ్యలో జుమా తెగవారిని చంపారని లూసియానా చెప్పారు.

వేల మందిని బలితీసుకున్న ఊచకోతలను, వ్యాధులను దాటుకుని ప్రాణాలతో మిగిలిన వ్యక్తి కోవిడ్‌తో మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని బండెయిరా అన్నారు.

అరుకా జుమా

అరుకా గ్రామం వరకూ కోవిడ్ వ్యాపించకుండా చూడటంలో బ్రెజిల్ ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు.

''మేం పట్టణానికి చాలా దూరంలో ఉంటాం. పెద్దగా ప్రయాణాలు కూడా ఉండవు. అసలు ఆ వ్యాధి ఇక్కడి దాకా వచ్చి ఉండకూడదు. ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. బాధ్యతరాహిత్యం కచ్చితంగా ఉంది'' అని బిటాటే అన్నారు.

అరుకా ఒక్కరే కాదు. స్పెషల్ సెక్రటరీ ఆఫ్ ఇండిజీనియస్ హెల్త్ సమాచారం ప్రకారం 8.96 లక్షల ఆదివాసీ ప్రజల్లో 572 మంది కోవిడ్‌తో చనిపోయారు.

అయితే, కోవిడ్‌తో మరణించిన ఆదివాసీల సంఖ్య 970 దాకా ఉండొచ్చని అప్కిబ్ అనే స్వతంత్ర సంస్థ అంచనా వేసింది. మృతుల్లో ఎక్కువ మంది వృద్ధులే.

అరుకా

తమ తాత చనిపోయే ముందు తమ తెగ గురించి ఎంతో నేర్పించారని బిటాటే అన్నారు.

''పాత పద్దతిలో పెద్ద గుడిసె కట్టాలన్న కలను మా తాత రెండేళ్ల క్రితమే తీర్చుకున్నారు. దాని నిర్మాణ శైలి గురించి నాకు ఎంతో నేర్పించారు. ఇప్పుడు మా పద్ధతిలో గుడిసె ఎలా కట్టుకోవాలో నాకు తెలుసు'' అని ఆయన అన్నారు.

చేపలు పట్టడం, వేటాడటం వంటివి కూడా అరుకా తన మనవళ్లకు నేర్పించారు. తమ సంస్కృతి గురించి, తమ తెగవారి చరిత్ర గురించి కూడా వారికి కథలు చెప్పారు.

''అరుకా పోరాట యోధుడు. రబ్బరు సేకరించేవాళ్లతో జరిగిన పోరాటాల గురించి ఆయన చాలా వివరాలు చెప్పేవారు. వాళ్లు దాడి చేసినప్పుడు జుమా తెగవాళ్లు ఎలా పోరాడింది వివరించేవారు'' అని గాబ్రియెల్ ఉచిడా గుర్తు చేసుకున్నారు.

''అరుకా ప్రతిఘటనకు చిహ్నం. ఆయన వారసత్వం ఎప్పటికీ కొనసాగుతుంది'' అని బండెయిరా అన్నారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
The coronavirus killed the last male in the tribe
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X