వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీనేజి వయసులో నెల తప్పుతున్నారు.. గర్భవతులైన బాలికలను స్కూలుకు రావొద్దంటున్న ప్రభుత్వం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
13 ఏళ్లకే గర్భం దాల్చిన చిన్నారి. కానీ, స్కూలుకు మాత్రం వెళుతోంది.

టాంజానియాలో గర్భం దాల్చిన యుక్త వయస్సు పిల్లలు కానీ, చిన్న పిల్లలు కానీ స్కూలుకు హాజరు కావడంపై నిషేధం అమలులో ఉంది. ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని స్వచ్చంద సంస్థలు ప్రభుత్వం పై కోర్టులో కేసు వేశారు.

గర్భం దాల్చిన పిల్లలు విద్యాసంస్థలకు హాజరు కావడాన్ని నిషేధించిన దేశాలలో టాంజానియా ఒకటి.

ఇలాంటి నిషేధాన్ని రద్దు చేయమని గత సంవత్సరం డిసెంబరులో సియర్రా లియోన్ ప్రభుత్వాన్ని ఆ దేశపు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ పశ్చిమ ఆఫ్రికా దేశంలో పరిస్థితులు ఎలా మారాయి?

ఫాటు (పేరు మార్చాం)కు 13 సంవత్సరాలు. ఆ పాప ఇప్పుడు నాలుగు నెలల గర్భవతి. ఆ చిన్నారి లైంగిక వేధింపులకు గురైంది.

ఆ పాప చదువుకుని నర్సు కావాలని కలలు కంటోంది.

సియర్రా లియోన్ గర్భిణీ పిల్లలు స్కూలుకు హాజరు కావడం పై ఉన్న నిషేధాన్ని సడలించడంతో ఫాటు స్కూలుకు వెళ్లేందుకు వీలయింది.

ఈ నిషేధం వివక్షాపూరితంగా ఉందని అంటూ ఇలా చేయడం పిల్లల విద్యా హక్కును ఉల్లంఘించటమే అని కోర్ట్ ఆఫ్ ది ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ పేర్కొంది.

ఈ దేశంలో టీనేజ్ పిల్లలు గర్భం దాల్చడం ఎప్పటి నుంచో సమస్యగా ఉంది. 2013లో 18 ఏళ్ళ లోపు ఉన్న అమ్మాయిలలో 35 శాతం మంది పిల్లలకు జన్మనిచ్చారు. 2014 -15 సంవత్సరాలలో ఎబోలా వైరస్ తీవ్ర రూపం దాల్చినప్పుడు కొన్ని ప్రాంతాలలో ఇది 65 శాతానికి కూడా పెరిగింది. ఆ సమయంలో స్కూళ్లను కూడా మూసేసారు.

ఇలాంటి గర్భిణీ పిల్లలు స్కూళ్లకు వెళితే, మిగిలిన పిల్లలు వారిని చూసి ప్రభావితమవుతారనే భయాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వీరు స్కూలుకు హాజరు కావడం పై నిషేధం విధించింది.

గర్భం దాల్చిన పిల్లలు విద్యాసంస్థలకు హాజరు కావడాన్ని నిషేధించిన దేశాలలో టాంజానియా ఒకటి.

ఈ నిషేధం వలన సుమారు 3000 మంది పిల్లలు ప్రభావితమైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఈ సంఖ్య మరింత ఎక్కువ కూడా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి వారి కోసం ప్రత్యామ్న్యాయ విద్యా సంస్థలను నెలకొల్పినప్పటికీ వాళ్ళు కేవలం వారానికి మూడు రోజులు మాత్రమే హాజరై నాలుగు తరగతులు మాత్రమే చెప్పేవారు. ఇలా చేయడం కూడా వివక్ష కిందకే వస్తుందని, వాటిని వెంటనే నిషేధించాలని కోర్టు తీర్పునిచ్చింది.

గర్భం దాల్చిన పిల్లలు స్కూళ్లకు హాజరు కావడాన్ని నిషేధించడం వలన వీరంతా బేసిక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ పరీక్షకు హాజరు కాలేరు. ఈ పరీక్ష రాస్తే గాని, వారు సెకండరీ స్కూలుకు కానీ, ఆ పై చదువులకు కానీ వెళ్ళలేరు.

"ఈ పిల్లలందరినీ మేము ఫెయిల్ చేసాం" అని సియర్రా లియోన్ లో విమెన్ ఎగైనెస్ట్ వయలెన్స్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ (వేవ్స్) సంస్థకు చెందిన హన్నా ఫట్మటా అన్నారు. నిషేధానికి వ్యతిరేకంగా ఈ సంస్థ కోర్టుకు వెళ్ళింది.

"అందరూ ఎబోలా మీద దృష్టి పెట్టిన సమయంలో పిల్లల మీద జరుగుతున్న హింస గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, దీని నుంచి మేము పాఠం నేర్చుకున్నాం. కరోనా వైరస్ సమయంలో మేము వారిని వదిలేయమని చెప్పాం" అని హన్నా అన్నారు .

ఈ సారి ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించడంతో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. దేశాధ్యక్షుడు జూలియస్ మాడాబయో గత సంవత్సరం అత్యాచారాన్ని జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించి వీటి పై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

పిల్లల సార్వత్రిక విద్యా హక్కును గుర్తించి వివక్ష లేకుండా పిల్లలందరినీ చదువుకునే దిశగా ప్రోత్సహిస్తామని విద్యా శాఖ మంత్రి డేవిడ్ మోయినినా సింగ్ కూడా తెలిపారు.

దేశంలో మొదటి సారి గర్భం దాల్చిన 1000 మంది పిల్లలు పరీక్షలకు హాజరయ్యారు.

కానీ, ప్రభుత్వపు వైఖరి, ధోరణి మారడంతో మాత్రమే వేవ్స్ లాంటి సంస్థలు చేస్తున్న పోరాటం అంతమవ్వదు. సమాజంలో కూడా వీరిని చూసే ధోరణి పట్ల మార్పు రావాలి.

గర్భం దాల్చిన పిల్లలు విద్యాసంస్థలకు హాజరు కావడాన్ని నిషేధించిన దేశాలలో టాంజానియా ఒకటి.

"మా అమ్మాయిని పక్కనే గర్భం దాల్చిన అమ్మాయితో కలిసి కూర్చుని పరీక్ష రాయనివ్వను. అది మా అమ్మాయి పై చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది" అని సియర్రా లియోన్ లో గర్భిణీ పిల్లలు స్కూలుకు హాజరు కావడం పై నిషేధాన్ని ఎత్తివేయగానే ఒక మహిళ బీబీసీతో అన్నారు.

కానీ, ఫాటు స్కూలుకు హాజరయ్యేందుకు వీలు కావడంతో ఆ పాప తల్లితండ్రులు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు.

ఇలా జరిగి ఉండకపోతే ఆ అమ్మాయికి పెళ్లి చేసేసి ఉండేవారిమని చెప్పారు. కానీ, ఈ అంశం పై స్థానికుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

"మా అమ్మాయి పై జరిగిన లైంగిక వేధింపుల గురించి మేము వేవ్స్ సంస్థ, పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్లడం పట్ల కొందరు సానుకూలంగా స్పందిస్తే మరికొంత మంది మాత్రం ఈ పరిస్థితుల్లో మా అమ్మాయి స్కూలుకు హాజరు కావడం పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు" అని బీబీసీ తో చెప్పారు.

కానీ, ఫాటుకి స్కూలులో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.

"ఆమె తొందరగా అలిసిపోతోంది. ఎక్కువ సేపు తరగతి గదిలో కూర్చుని ఉండలేకపోతోంది. దాంతో, చదువు పై దృష్టి పెట్టలేకపోతోంది" అని చెప్పారు.

"స్నేహితులు నన్ను ఆడుకోవడానికి పిలవడం లేదు" అని ఫాటు చెప్పారు.

"నాకు భవిష్యత్తులో చదువుకుని నర్సు ఉద్యోగం చేయాలని ఉంది. నాకు చాలా మంది పిల్లలకు మార్గదర్శకత్వం చేయాలని ఉంది" అని అన్నారు.

ఈ నిషేధాన్ని సడలించడంతో మానసికంగా, ఆచరణాత్మకంగా చాలా మార్పులు చేయవలసి వచ్చిందని స్కూలు యాజమాన్యం చెబుతోంది.

కొంత మంది పిల్లలు కూడా ఫాటు పట్ల వివక్ష చూపారని స్కూలు హెడ్ మాస్టర్ చెప్పారు. ఫాటు పట్ల కొంత మంది టీచర్లు కూడా సహించరాని వైఖరిని అవలంబించారని చెప్పారు.

అలాగే, కొంత మంది టీనేజ్ పిల్లలు టీచర్ల పై మర్యాద లేకుండా ప్రవర్తించినట్లు కూడా చెప్పారు.

పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి స్కూలుతో పాటు ఒక ఆరోగ్య కేంద్రం ఉండాలని, ఫాటు తల్లి తండ్రులు, స్కూలు యాజమాన్యం కూడా అభిప్రాయ పడింది.

టీనేజ్ ప్రెగ్నెన్సీ

టాంజానియా కఠిన వైఖరి

సియర్రా లియోన్ కి వ్యతిరేకంగా కేసు వేసేందుకు సహకరించిన ఈక్వాలిటీ నౌ ఈ పోరాటాన్ని టాంజానియాకు కూడా తీసుకుని వెళ్ళింది. ఈ సంస్థ ఆఫ్రికా కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేసింది.

సియర్రా లియోన్ కంటే టాంజానియా భిన్నమైనదని అక్కడ వెలువడిన తీర్పు లాంటిదే ఇక్కడ కూడా వెలువడుతుందని ఆశించడానికి లేదని ఈక్వాలిటీ నౌ కి చెందిన జూడీ గిటావ్ అంటారు.

ఇతర దేశాల్లో ఇలాంటి నిషేధాన్ని సడలిస్తున్న సమయంలో టాంజానియాలో నాయకులు ఇలాంటి నిషేధాన్ని ఇటీవల కాలంలో ప్రత్యేకంగా విధించారు.

2017లో దేశాధ్యక్షుడు జాన్ మగుఫిల్ చేసిన హెచ్చరికను ఆమె గుర్తు చేసుకున్నారు.

"నేను ఈ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నంత వరకు గర్భం దాల్చిన ఏ ఒక్క అమ్మాయిని స్కూలుకు వెళ్లేందుకు అనుమతించను. ఒక్క సారి గర్భం దాలిస్తే మీ పని అయిపోయినట్లే" అని వ్యాఖ్యానించారు.

"ఇలాంటి పిల్లలను నేను స్కూలుకు వెళ్లడాన్ని అనుమతిస్తే ఒకటవ తరగతి చదువుతున్న పిల్లలు కూడా తమ పిల్లలను చూసుకుంటూ కనిపిస్తారు".

అలాగే, చిన్న పిల్లలకు గర్భం దాల్చేలా చేసిన పురుషులకు 30 సంవత్సరాల జైలు శిక్షను కూడా వేస్తామని బెదిరించారు.

స్కూలులో గర్భవతి బాలిక

ప్రపంచంలోనే టాంజానియాలో టీనేజ్లో గర్భం దాల్చిన వారి సంఖ్య అధికంగా ఉంది. 2016లో 15- 19 సంవత్సరాలు ఉన్న ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు గర్భం దాల్చడం కానీ, పిల్లలకు జన్మనివ్వడం కానీ జరిగిందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ తెలిపింది. అదే సంవత్సరం 36 శాతం మంది మహిళలు 18 సంవత్సరాలు రాక ముందే వివాహం చేసుకున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

స్కూలు మధ్యలోనే మానేస్తున్న 60,000 మంది పిల్లల్లో సగం మంది అమ్మాయిలే ఉన్నారని అందులో 5,500 మంది గర్భం దాల్చడం వల్లే మానేస్తున్నారని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. టాంజానియాకి ప్రపంచ బ్యాంకు 50 కోట్ల డాలర్ల లోను ఇచ్చింది.

ఈ సమస్యను టాంజానియా గుర్తించి విద్యాసంస్థల్లో లైంగిక పునరుత్పత్తి ఆరోగ్యం గురించి అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రపంచ బ్యాంకు రుణం ద్వారా ఎక్కువ మంది పిల్లలకు సెకండరీ విద్యను అందించేందుకు సంకల్పించింది.

అయితే, దీని వలన అమ్మాయిలందరికీ విద్య లభిస్తుందని చెప్పలేం అని గిటావ్ అంటారు.

గర్భం దాల్చిన పిల్లలను స్కూలుకు పంపిస్తే మిగిలిన అమ్మాయిలు ప్రభావితమవుతారనే వాదనను ఆమె వ్యతిరేకిస్తారు.

"పిల్లలను స్కూలుకు పంపడం వలన చిన్న వయసులో గర్భం దాల్చడం వలన కలిగే భారం ఇతరులకు అర్ధమయ్యే అవకాశం ఉంటుంది, అలాగే పునరుత్పత్తి హక్కుల గురించి తెలుసుకునేందుకు వీలవుతుంది" అని ఆమె అంటారు.

1993 -2015 మధ్యలో స్కూళ్లకు గర్భిణులు వెళ్లడం పై నిషేధం ఎత్తివేసిన 9 ఆఫ్రికా దేశాలలో సమాచారాన్ని బ్రిటిష్ మెడికల్ జర్నల్ లాన్సెట్ పరిశీలించింది. దీని వలన గత రెండేళ్లలో 14-20 సంవత్సరాల మధ్య వయస్సులో గర్భం దాల్చే పిల్లల సంఖ్య తగ్గినట్లు లాన్సెట్ అధ్యయనం పేర్కొంది.

అమ్మాయిలు చదువుకోకపోవడం వలన ఆమె విద్యకే కాకుండా ఆమె కుటుంబానికి కూడా ఆర్ధిక పరమైన నష్టాన్ని చేకూరుస్తుందని కొందరు విశ్లేషకులు అంటారు.

టీనేజ్లో ఉన్న పిల్లలు స్కూలు మానేయడం వలన టాంజానియా కనీసం ఏటా 5. 22 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూస్తోందని యుఎన్ ఎఫ్ పిఎ నివేదిక చెబుతోంది.

గత మూడేళ్ళుగా ఈ నిషేధాన్ని ఎత్తి వేయాలని ఈక్వాలిటీ నౌ పోరాడుతోంది. దీంతో లాభం లేక ఇప్పుడు ఆఖరి అస్త్రంగా కోర్టు వరకు వెళ్లారు.

ఈ కేసు తేలేందుకు కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు అని గిటావ్ చెబుతున్నారు. "అమ్మాయిల మంచి కోసం ఇది ఎక్కువ రోజులు పట్టదని ఆశిస్తున్నాం" అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
The Govt asks pregnant girls not to come to school
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X