• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మిల్లీమీటరు పురుగు ఒక దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడింది

By BBC News తెలుగు
|

మిల్లీమీటరు పొడవున్న కందిరీగ కసావా మీలీబగ్ మీద మాత్రమే ఆధారపడి గుడ్లు పెడుతుంది

రసాయన పురుగు మందుల ఆవిష్కరణకు ముందు పంటలను నాశనం చేసే తెగుళ్లను నివారించడానికి రైతులు స్థానిక పరాన్నజీవులపై ఆధారపడేవారు. ఈ విధానం కొన్నాళ్లుగా కనుమెరుగై మళ్లీ ఇప్పుడు వెలుగులోకి వస్తోంది.

ఆగ్నేయ (సౌత్ ఈస్ట్) ఆసియా దేశాల్లో జీవవైరుధ్యం అధికంగా ఉన్న అడవుల్లో లక్షలమంది రైతులు కసావా సాగుబడిపై ఆధారపడతారు. ఈ పంటను ఒకటి రెండు హెక్టార్ల భూమి ఉన్న సన్నకారు రైతుల దగ్గరనుంచీ వేల హెక్టార్ల భూమి ఉన్న పెద్ద రైతులవరకూ అందరూ సాగు చేస్తారు.

కసావా పిండి పదార్థాన్ని ప్లాస్టిక్, జిగురు తయారీల్లో వాడతారు.

కసావాను మొట్టమొదట దక్షిణ అమెరికానుంచీ ఆగ్నేయ ఆసియాకు తీసుకొచ్చినప్పుడు, ఏ రకమైన పురుగు మందుల అవసరం లేకుండా సాగు చేసేవారు.

కానీ 2008నుంచీ 'కసావా మీలీబగ్’ (పిండి నల్లి) అనే తెల్ల పురుగు పంటను నాశనం చెయ్యడం ప్రారంభించింది. ఇది పంట మొదళ్లనుంచీ తినేస్తూ రైతులకు అపార నష్టాన్ని కొనితెచ్చింది. ఈ నష్టాన్ని పుడ్చేందుకు రైతులు తమ వ్యవసాయ భూములను విస్తరిస్తూ చుట్టుపక్కల ఉన్న అడవులను ఆక్రమించడం ప్రారంభించారు.

"కొన్ని ప్రాంతాల్లో అటవీ భూముల ఆక్రమణ చాలా వేగంగా, అధిక స్థాయిలో జరిగింది. కంబోడియాలో అత్యధిక స్థాయిలో అటవీ భూముల ఆక్రమణ జరిగింది" అని బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాంట్ ప్రొటెక్షన్‌లో బయోకంట్రోల్ స్పెషలిస్ట్ క్రిస్ వైఖూయీస్ తెలిపారు.

ఈ మీలీబగ్ కీటకాలు కసావా రైతుల జీవనోపాధితో పాటు ఆ ప్రాంతాంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేశాయి.

కసావా ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న థాయ్‌ల్యాండ్‌లో కసావా స్టార్చ్ ధరలు మూడు రెట్లు పెరిగాయి. అలాగే, కసావా స్టార్చ్‌కు ప్రత్యామ్నాయాలైన బంగాళదుంపలు, మొక్కజొన్న ధరలు కూడా ఆకాశాన్నంటాయి.

"ఒక పురుగు వలన పంట దిగుబడి 60-80% తగ్గిపోతే రైతులకు అది పెద్ద విఘాతమే" అని వైఖూయీస్ అన్నారు.

ఈ సమస్యకు పరిష్కారం ఒక మిల్లీమీటరు పొడవున్న పరాన్నజీవి ద్వారా లభించింది. దక్షిణ అమెరికాలో పుట్టిన ఒక కందిరీగ (అనాగైరస్ లోపెజీ) మీలీబగ్‌కు సహజ శత్రువు అని కనుగొన్నారు.

ఈ చిన్న కందిరీగ కసావా మీలీబగ్ మీద మాత్రమే ఆధారపడి గుడ్లు పెడుతుంది. దీని లార్వాకోసం మీలీబగ్ అవసరమవుతుంది.

2009 చివరికల్లా ఈ కందిరీగని తీసుకొచ్చి థాయ్‌ల్యాండ్‌లోని కసావా పంట పొలాల్లోకి వదిలారు. వెంటనే ఈ కందిరీగ తన పని ప్రారంభించింది.

ఈ కందిరీగ మీలీబగ్ జనాభాను ఎంత వేగంగా తగ్గించిందనే దానిపై విస్తృత సమాచారం లేదు. కానీ “2010లో సగం ఏడాది గడిచేటప్పటికి కోట్లకొద్దీ కందిరీగలను విమానాల్లో తీసుకొచ్చి థాయ్‌ల్యాండ్‌లో విడిచిపెట్టారు. మీలీబగ్‌పై దీని ప్రభావం చాలా తొందరగానే కనిపించింది” అని వైఖూయీస్ తెలిపారు.

బయోకంట్రోల్ విధానం తెగుళ్ల మూలాల్లోకి వెళ్లగలిగే అవకాశాన్ని ఇస్తుంది

ప్రపంచ సమస్యను పరిష్కరించిన ఒక మిల్లీమీటరుపురుగు

1980లలో ఈ మిల్లీమీటరు పొడవు కందిరీగను పశ్చిమ ఆఫ్రికాలో ప్రవేశపెట్టినప్పుడు ఒక్కొక్క కసావా మొక్క ఉపరితలంపై 100కు పైగా ఉన్న మీలీబగ్‌లను 10-20 కన్నా తక్కువకు కుదించింది.

మరో మూడేళ్లలోపే నైరుతి నైజీరియాలో సుమారు 2,00,000 చదరపు అడుగుల కసవా సాగు భూమిలో ఈ కందిరీగలను ప్రవేశపెట్టారు. ఇవి ఆ ప్రాంతంలో ఉన్న మిగతా కసావా సాగుభూములకు కూడా విస్తరించాయి.

ఈ రకమైన జోక్యాన్ని "బయోలాజికల్ కంట్రోల్" (జీవసంబంధ నియంత్రణ) అంటారు. ఈ ప్రక్రియలో ప్రకృతి సహజ పరన్నజీవులను కనుగొని క్రిమినాశకాలుగా ప్రవేశపెడతారు.

దీనివలన ఆసియా-పసిఫిక్ ప్రాంతంల్లోని 26 దేశాల్లో రైతులు ఏటా 14.6 బిలియన్ డాలర్లనుంచీ 19.5 బిలియన్ డాలర్లవరకూ లబ్ధి పొందారు.

"ఒక మిల్లీమీటరు కందిరీగ ప్రపంచవ్యాప్తంగా పిండి పదార్థానికి సంబంధించిన సమస్యను పరిష్కరించింది" అని వైఖూయీస్ తెలిపారు.

పరానజీవుల ప్రాముఖ్యత శతాబ్దాలుగా మానవులకు తెలిసినప్పటికీ ఆధునిక కాలంలో వ్యవసాయంలో బయోకంట్రోల్ పాత్ర చాలావరకూ తగ్గిపోయింది.

"శతాబ్దాలుగా బయోకంట్రోల్ పద్ధతి ఉన్నప్పటికీ ఇప్పుడు ఇదేదో కొత్త విషయం అన్నట్లు భావించడం హాస్యాస్పదంగా ఉంది" అని కెనడాలోని అంటారియోలో వైన్‌ల్యాండ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్త రోజ్ బుటెన్‌హస్ అభిప్రాయపడ్డారు.

మరి బయోకంట్రోల్ ఇంత విజయవంతమైన ప్రక్రియ అయితే ఇప్పుడు ఎందుకు ఈ పద్ధతిని పాటించట్లేదు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒకవేళ ఈ ప్రక్రియ విఫలమైతే ఏమవుతుంది? దీన్ని మార్చాలని పరిశోధకులు ఎందుకు అనుకుంటున్నారు?

పంటలను కాపాడుతూ జీవితాలను నిలబెడుతుంది అనే అర్థంలో కేన్ టోడ్స్‌ను కళాకృతుల్లో చెక్కేవారు

ఇది పరిష్కారమా లేక సమస్యా?

కొలంబస్ అమెరికాను కనుగొనకముందు ఉన్న మెసోఅమెరికాలో కేన్ టోడ్ (చిరుకప్ప) అని పిలిచే ఒక జీవి ఉండేది. ఈ ఉభయచరజీవి ఒక ప్రత్యేకమైన విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. అది తాగితే చిత్తభ్రాంతి కలుగుతుంది. ఆ కాలంలో..మరణించిన తమ పూర్వీకులతో మాట్లాడడానికి జరిపే ఆచారాల్లో పూజారులు ఈ ద్రవాన్ని వాడేవారు.

'మాయా ప్రజలు’ అంటే స్థానిక మెసోఅమేరికన్లు పాములను, పక్షులను ఆరాధించేవారు. వారి కళాకృతుల్లో వీటిని చెక్కేవారు. అదే విధంగా ఈ కేన్ టోడ్ బొమ్మలను కూడా కళాకృతుల్లో పొందుపరిచేవారు.

పంటలను కాపాడే ఈ చిరుకప్పలు వర్షాలు వచ్చే సూచనలను అందజేసేవి. వీటిని నీటికి పర్యాయపదంగా భావించేవారు. నీరు అంటే జీవం. పంటలను కాపాడుతూ జీవితాలను నిలబెడుతుంది అనే అర్థంలో వీటిని కళాకృతుల్లో చెక్కేవారు.

ఈ చిరుకప్పలు పంటలను ఆక్రమించే తెగుళ్లను నివారించే క్రిమినాశకాలుగా ఉపయోగపడేవి. ముఖ్యంగా మొక్కజొన్నలాంటి పంటలను, ధాన్యం నిల్వలను పురుగులనుంచీ, తెగుళ్లనుంచీ ఈ చిరుకప్పలు కాపాడేవి. ఇవి ఉత్పత్తి చేసే విషం వాటికి రక్షణగా ఉండేది. ఈ విషం డోసు ఎక్కువైతే మనుషుల ప్రాణాలకు కూడా అపాయమే. ఈ కారణాల వలన వీటిని జీవన్మరణాలకు ప్రతీకగా భావించేవారు.

1935లో ఈ చిరుకప్పలను బయోకంట్రోల్‌గా ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టారు. ఆ దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లోని చెరుకుపంటల్లో ఇవి అభివృద్ధి చెందాయి. వీటికి అత్యంత ఇష్టమైన కేన్ బీటల్స్ అనే పురుగులను, ఇతర స్థానిక క్రిమికీటకాలని నాశనం చేసి పంటను రక్షించేవి. ఈ ప్రక్రియలో వీటి జాతి విస్తృతంగా అభివృద్ధి చెందింది. అంతే కాకుండా కేన్ టోడ్స్‌ను అహారంగా తీసుకునే జీవులు తక్కువ సంఖ్యలో ఉండడంతో వీటి సంతతి భారీగా పెరిగిపోయింది.

2007 గణాంకాల ప్రకారం ఆస్ట్రేలియాలో కేన్ టోడ్‌ల సంఖ్య 1.5 బిలియన్ ఉండవచ్చని అంచనా వేసారు. ఇవి 1.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆవరించి ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. వాతావరణ మార్పులతో వీటి పరిధి పెరిగే అవకాశం ఉంది.

ఫలితంగా ఘోరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటి వలన ఇతర పరాన్నజీవుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కూల్స్ అనే క్షీరదాలు, గోన్నాస్ అనే పెద్ద బల్లులు కేన్ టోడ్ విషం వల్ల మరణించేవి.

కేన్ టోడ్స్‌ సంఖ్యను నియంత్రించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం, స్థానిక ప్రచారకులు ప్రతీ ఏటా పెద్ద ఎత్తున కేన్ టోడ్స్ వేట సాగిస్తారు. కోట్లకొద్దీ కేన్ టోడ్స్‌ను చంపుతారు. వీటి సమస్య ఎంత ప్రాముఖ్యత సంపాదించిందంటే చిన్న పిల్లల కథల పుస్తకాల్లో కూడా కేన్ టోడ్స్ వేటకు సంబంధించిన కథలు వచ్చి చేరాయి.

తప్పు ఎక్కడ జరిగింది?

"శాస్త్రీయపరమైన సూచనకు విరుద్ధంగా కేన్ టోడ్స్‌ను ఆస్ట్రేలియాలో వదిలిపెట్టారు. ఇది అస్సలు చేయకూడదు. ఆధునిక బయోకంట్రోల్‌లో ఇది సాధ్యం కాదు. అనేక రకాల కీటకాలను భుజించే జీవులను, వెన్నెముక ఉన్న జీవులను ఇలా విడిచిపెట్టకూడదు" అని వైఖూయీస్ తెలిపారు.

కేన్ టోడ్స్ మాత్రమే కాదు. చరిత్రలో ఇలాంటివి కనీసం 10 ఉదాహరణలు చెప్పొచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో మలేరియాను నియంత్రించే ప్రక్రియలో భాగంగా జపాన్, మరికొన్ని మిత్ర దేశాలు దోమల సంఖ్యను తగ్గించేందుకు మస్కిటోఫిష్ అనే చిరుచేపలను పసిఫిక్ దీవులలో వదిలి పెట్టాయి. ఇవి ఆ ప్రాంతాల్లో విస్తృతంగా పెరిగిపోయి ఇతర పరాన్నజీవులకు చోటు లేకుండా చేసాయి. ఐరోపాలో ఆసియా లేడీబగ్‌ను ప్రవేశపెట్టినప్పుడూ ఇదే విధంగా జరిగింది.

ఇలాంటి భారీ వైఫల్యాల కారణంగానే 20వ శతాబ్దం మొదట్లో రసాయన పురుగు మందులవైపు దృష్టి మరలించారు.

అయితే, ఇలాంటి కొన్ని సంఘటనలను మినహాయిస్తే బయోకంట్రోల్ వైఫల్యాలకన్నా విజయాలు కనీసం 25 రెట్లు ఎక్కువగా ఉంటాయి.

అందుకే ఇప్పుడు మళ్లీ బయోకంట్రోల్ దిశగా ప్రపంచం దృష్టి మళ్లించడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.

మిల్లీ మీటర్ పురుగు

అయితే, పెస్టిసైడ్స్ అంతమైపోతాయా?

"1930, 40, 50లలో రసాయన పురుగు మందులు రైతుల అనేక సమస్యలను పరిష్కరించాయి. పంటను నాశనం చేసే తెగుళ్ల గురించి ఎక్కువ విచారించకుండా, శ్రమ పడకుండా సమస్యను సులువుగా పరిష్కరించే మార్గం దొరికింది. కావలసిన మందును ఎన్నుకుని, పంటపై పిచికారీ చేస్తే చాలు...తెగుళ్లన్నీ మాయం" అని బుటెన్‌హస్ తెలిపారు.

అయితే, ఇక్కడ సమస్య ఏమిటంటే పెస్టిసైడ్ల ద్వారా అంతమైపోయే క్రిమికీటకాలు చాలా త్వరగా మళ్లీ జీవం పోసుకుంటాయి. ఈసారి ఆ పెస్టిసైడ్ పనిచేయని విధంగా రూపాంతరం చెంది ప్రాణం పోసుకుంటాయి. ఈ కొత్త రకం క్రిములను చంపడానికి మరో రకమైన పెస్టిసైడ్ ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. లేదా ఉన్నదానికే మార్పులు చేసి మరింత శక్తివంతమైన మందుగా తయారు చేయాల్సి వస్తుంది.

కాలక్రమేణా రైతులకు ఉపయోగపడగలిగే పెస్టిసైడ్ల రకాలు తగ్గిపోతున్నాయి. పెస్టిసైడ్ల వల్ల సమస్యలూ పెరుగుతున్నాయి. ఉదాహరణకు నియోనికోటినాయిడ్ కలిగి ఉన్న మూడు రకాల పురుగుల మందులను 2018లో యూరోపియన్ యూనియన్ నిషేధించింది. ఈ మందులు తెగుళ్లను నాశనం చేస్తున్నప్పటికీ..మొక్కలు పెరుగుతున్నప్పుడు నికోటిన్ క్రమేపీ మొక్కల్లోని ఇతర భాగాలకూ, పువ్వుల్లోకి చొచ్చుకుపోతుంది. పువ్వులు వీటిని పీల్చుకోవడంవలన పరాగసంపర్క జీవులు కూడా ఈ రసాయనాలను పీల్చుకుంటున్నాయి.

"ఇలా పెస్టిసైడ్లతో అనేక రకాల సాంఘిక, పర్యావరణ ప్రతికూల అంశాలు ముడిపడి ఉన్నాయి. వీటి ప్రభావం పంటపైనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా గాలి, నీటి వాహకాల ద్వారా విస్తరిస్తుంది" అని వైఖూయీస్ తెలిపారు.

కోస్టా రికాలోని క్లౌడ్ ఫారెస్ట్, ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్‌లో కూడా పురుగు మందుల అవశేషాలు కనుగొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో పెస్టిసైడ్లు ప్రాణాంతకంగా కూడా పరిణామం చెందే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయభూముల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వ్యాపించడం వలన పర్యావరణ వ్యవస్థ దెబ్బ తింటుంది.

బయోకంట్రోల్స్‌తో సత్ఫలితాలను పొందాలంటే స్పష్టమైన, నిర్దిష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి అని వైఖూయీస్‌లాంటి శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయడం వలన రసాయన పురుగు మందుల వాడకాన్ని తగ్గించొచ్చు. పర్యావరణంపై వీటి ప్రభావాన్ని నియంత్రించవచ్చు. అందుకే ఇప్పుడు అనేకమంది శాస్త్రవేత్తలు బయోకంట్రోల్స్‌వైపు మొగ్గు చూపుతున్నారు.

మిల్లీ మీటర్ పురుగు

బయోలాజికల్ కంట్రోల్స్

బయోకంట్రోల్స్‌లో మూడు రకాలున్నాయి...మాంసాహారులు, పరాన్నజీవులు, వ్యాధికారకాలు. కేన్ టోడ్స్ మాంసాహారులకు ఉదాహరణ. కందిరీగలు పరాన్నజీవులకు ఉదాహరణ. ఇవి క్రిమికీటకాల లార్వాలోకి చొరబడి వాటిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తాయి. వ్యాధికారకాలు తెగుళ్లకు కారణమయ్యే క్రిములకు రోగాలు కలిగించడం ద్వారా నాశనం చేస్తాయి.

సత్ఫలితాలనిచ్చే బయోకంట్రోల్స్ అధిక పునరుత్పత్తి రేటును కలిగి ఉంటాయి. కాబట్టి అవి ఒక తెగులును గుర్తించిన వెంటనే అధిక సంఖ్యలో వృద్ధి చెందుతాయి.

బయోకంట్రోల్స్‌ను మూడు పద్ధతుల్లో ఉపయోగించవచ్చు...సాంప్రదాయ విధానం, పరిరక్షణ విధానం, వృద్ధి విధానం.

కేన్ టోడ్స్ సాంప్రదాయ బయోకంట్రోల్స్‌కు ఉదాహరణ. ఈ పద్ధతిలో పరాన్నజీవులను కొత్త వాతావరణంలోకి ప్రవేశపెడతారు.

బయోకంట్రోల్ విధానం తెగుళ్ల మూలాల్లోకి వెళ్లగలిగే అవకాశాన్ని ఇస్తుంది. మూలాల్లోకి వెళ్లి పంటను ప్రభావితం చేస్తున్న ఇతర అంశాలను కూడా పరిశీలించి అప్పుడు క్రిములను నాశనం చేసే వ్యవస్థను రూపొందించుకుంటుంది.

"అనేక రకాల ఇతర జీవులపై కూడా దాడి చేసే జీవులను ప్రవేశపెట్టకూడదు. నిర్దిష్టంగా..నష్టాన్ని చేకూరుస్తున్న జీవులను మాత్రమే నాశనం చేయగలిగే రీతిలో బయోకంట్రోల్స్‌ను ప్రవేశపెట్టాలి" అని వైఖూయీస్ అన్నారు.

బయోకంట్రోల్ వ్యవస్థ పర్యావరణానికి హాని చేయదు. వృద్ధి విధానం యూరోప్ గ్రీన్‌హౌస్ సెక్టర్‌లో బాగా ప్రాచుర్యం పొందింది అని వైఖూయీస్ తెలిపారు.

"కెనడాలో 2017/18లో మేము ఒక సర్వే చేసాం. పూల మొక్కలు పెంచేవాళ్లు ప్రధాన తెగులు నియంత్రణ విధానంగా బయోకంట్రోల్స్ ఉపయోగించారు. ఈ పద్ధతి వారికి అద్భుతమైన ఫలితాలను అందించింది. కెనడాలో పెస్టిసైడ్స్ నిషేధం కారణంగా వారు బయోకంట్రోల్ విధానాన్ని అవలంబించారు" అని బుటెన్‌హస్ తెలిపారు.

“పెద్ద ఎత్తున చేసే తృణధాన్యాల వ్యవసాయానికి బయోకంట్రోల్స్ ఉపయోగిస్తే ఈ విధానం మరింత వెలుగులోకి వస్తుందని" కరోలిన్ రీడ్ అంటున్నారు. బ్రిటన్‌కుచెందిన బయోకంట్రోల్ ఉత్పత్తిదారు బయోలైన్ ఆగ్రోసైన్సెస్‌లోని సీనియర్ టెక్నికల్ లీడ్‌గా రీడ్ పని చేస్తున్నారు.

కొలంబియా, ఈక్విడార్, కెన్యాలాంటి ఇతర దేశాల్లో కూడా బయోకంట్రోల్ విధానాన్ని విరివిగా ఉపయోగించాలని, రసాయన పురుగు మందులు తెగుళ్లకు శాశ్వత పరిష్కారాన్ని అందించవని బుటెన్‌హస్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
The millimeter worm has saved a country’s economy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X