• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హిరోషిమా, నాగసాకి: ‘ఎటుచూసినా శవాలే.. అంత్యక్రియలు చేసేటప్పటికే కుళ్లిపోతుండేవి.. ఇలాంటి పరిస్థితి ఇంకెప్పుడూ రాకూడదు’

By BBC News తెలుగు
|

హిరోషిమా, నాగసాకీ

జపాన్‌లో 1945 ఆగస్ట్‌లో జరిగిన అణు బాంబు పేలుళ్లతో హిరోషిమాలో 1,40,000 మంది, నాగసాకిలో 74,000 మంది మరణించారని చెబుతారు.

ఈ పేలుళ్లతో 1945 ఆగస్ట్ 14న జపాన్ శత్రు దేశాలకు లొంగిపోవడంతో ఆసియాలో యుద్ధం ముగిసింది.

ఈ బాంబు పేలుళ్లలో బతికి బయటపడిన వారిని హిబాకుషా అంటారు. పేలుళ్ల ప్రభావంతో ఏర్పడిన రేడియేషన్, విషవాయువులు, మానసిక వేదనతో వీరు ఆ తర్వాత ఎన్నో బాధలుపడ్డారు.

చరిత్రలో ముఖ్యమైన ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిన మహిళల కథలు చెప్పడంలో బ్రిటిష్ ఫోటో జర్నలిస్ట్ లీ కరెన్ స్టో నిష్ణాతురాలు. ఆమె 75 ఏళ్ల క్రితం ఈ పేలుళ్లను చూసిన ముగ్గురు మహిళలను ఇంటర్వ్యూ చేశారు.

గమనిక: ఇందులో కలచి వేసే సమాచారం ఉంటుంది.

టెరుకో యూనో

1945, ఆగస్ట్ 6న హిరోషిమాలో బాంబు దాడి జరిగినప్పుడు టెరుకో వయసు 15ఏళ్లు. ఆమె అప్పుడు హిరోషిమా రెడ్ క్రాస్ హాస్పిటల్లో నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతున్నారు.

టెరుకో యూనో

బాంబు దాడి జరగ్గానే ఆసుపత్రిలోని విద్యార్థుల డార్మిటరీకి నిప్పు అంటుకుంది. ఆ మంటలను ఆర్పేందుకు సహాయం చేయడానికి టెరుకో కూడా ప్రయత్నించారు. కానీ చాలా మంది విద్యార్థులు ఆ మంటల్లో కాలి మరణించారు.

పేలుళ్లు జరిగిన వారం అంతా రాత్రీపగలూ తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స చేయడం మాత్రం ఆమెకు బాగా గుర్తుండిపోయింది. ఆ సమయంలో తినడానికి తిండి, నీరు కూడా దొరకలేదు.

టెరుకో చదువు పూర్తైన తర్వాత కూడా అదే ఆసుపత్రిలో పని చేయడం మొదలు పెట్టారు. ఆ సమయంలో గ్రాఫ్టింగ్ (రోగి తొడ నుంచి చర్మాన్ని తీసి కాలిన గాయాలైన ప్రదేశంలో చర్మాన్ని అతికించే ప్రక్రియ) శస్త్ర చికిత్సలు చేసేవారికి సహకరించే వారు.

బాంబు పేలుళ్ల నుంచి బయట పడిన తత్సుయికిని ఆమె పెళ్లి చేసుకున్నారు.

టెరుకో తర్వాత గర్భం దాల్చినప్పుడు ఆ బిడ్డ ఆరోగ్యంగా పుడతాడో, లేదో, అసలు బతుకుతాడో లేదోనని చాలా చింతించారు.

ఆమె కూతురు టొమోకో ఆరోగ్యంగానే పుట్టారు. దీంతో తేరుకోకి ధైర్యం వచ్చింది.

టెరుకో పాపను పరీక్షిస్తున్న డాక్టర్

"నేను నరకానికి వెళ్లలేదు. అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ, నేను అనుభవించింది నరకమే. అలాంటి పరిస్థితి మరెప్పుడూ రాకూడదని కోరుకుంటున్నాను”అని ఆమె అన్నారు.

"అణ్వాయుధాలను లేకుండా చేయాలని కొందరు చాలా బలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రచారం స్థానిక ప్రభుత్వ నాయకుల నుంచి మొదలుకావాలి. ఇది జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలి”.

కుతురు టొమోకోతో టెరుకో, టొమోకోతో తత్సుయికి

"ఇక్కడ 75ఏళ్ల వరకు మళ్లీ చెట్లు, గడ్డి మొలకెత్తవని చాలా మంది చెప్పారు. కానీ, హిరోషిమా మళ్లీ పచ్చదనంతో కళకళ లాడుతూ నదులతో నిండిన ఒక నగరంగా రూపుదిద్దుకుంది”అని టెముకో చెప్పారు.

కానీ, ఈ బాంబు పేలుళ్ల తర్వాత ఇక్కడి ప్రజలు చాలా మంది రేడియేషన్ ప్రభావానికి గురయ్యారు.

"హిరోషిమా, నాగసాకి మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ప్రజల మనసుల లోంచి నెమ్మదిగా చెరిగిపోతున్నప్పటికీ మేం ఒక సంధి దశలో ఉన్నాం”.

కుమార్తె టొమోకో, మనవరాలు కునికోతో టెరుకో

"మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. ఇతరుల గురించి ఆలోచించడం, దుష్ప్రభావాల గురించి ఊహించడం, మనమేం చేయగలమో చూడటం, చర్యలు తీసుకోవడం, శాంతిని నెలకొల్పడానికి అవిశ్రామంగా కృషి చేయడం వలనే శాంతి స్థాపన సాధ్యమవుతుంది".

"నేను అణ్వాయుధాల దాడి జరిగినప్పుడు యుద్ధాన్ని చూడలేదు. నాకు యుద్ధం తర్వాత పునర్నిర్మించిన హిరోషిమా మాత్రమే తెలుసు. నేను కేవలం అప్పుడేమి జరిగి ఉంటుందో ఊహించగలను. నేను హిబాకుష చెప్పిన విషయాలను వింటాను. ఆధారాల ద్వారా అణ్వాయుధ పేలుళ్ల గురించి నిజాలు తెలుసుకుంటాను”అని టెరుకో మనుమరాలు కునికో చెప్పారు.

"ఆ రోజు నగరం అంతా కాలిపోయింది. ప్రజలు, పక్షులు, కీటకాలు, గడ్డి, వృక్షాలు - అన్నీ నాశనమై పోయాయి. “

అణు బాంబు దాడి తర్వాత హిరోషిమా

“బాంబు పేలుళ్ల తర్వాత ప్రజలను రక్షించడానికి నగరానికి వచ్చిన వారు, తమ కుటుంబాలను, స్నేహితులను వెతుక్కోవడానికి వచ్చిన చాలా మంది మరణించారు. బ్రతికి బయట పడిన వారు కూడా అనేక రకాల రోగాలతో సతమతమవుతున్నారు”.

"నేను హిరోషిమా, నాగసాకిలో మాత్రమే కాకుండా యురేనియం గనుల్లో పని చేసే కార్మికులు, ఆ గనులకు దగ్గరగా నివసించే ప్రజలు, అణ్వాయుధాలను తయారు చేసి పరీక్ష చేసేవారు, అణ్వాయుధ పరీక్షల వలన రోగాల బారిన పడిన వారితో కూడా మాట్లాడాను’’.

ఎమికో ఒకాడ

హిరోషిమాలో బాంబు పేలుళ్లు జరిగినప్పుడు ఎమికోకి ఎనిమిదేళ్లు. ఆమె పెద్ద అక్క మీకోతో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులు ఆ పేలుళ్లలో మరణించారు.

కుటుంబంతో ఎమికో తీసుకున్న చాలా ఫోటోలు కూడా ఆ పేలుళ్లలో పోయాయి. అయితే, ఆమె బంధువుల దగ్గర కొన్ని ఫోటోలు మిగిలాయి.

"ఆ రోజు నేను నిన్ను తర్వాత కలుస్తాను అని చెప్పి మా అక్క ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అప్పుడు తనకి 12ఏళ్లు. ఆమె చాలా చలాకీగా, జీవితం పట్ల ఉత్సాహంతో ఉండేవాది”అని ఎమికో చెప్పారు.

తల్లి ఫుకు నకాసకో చేతిలో ఎమికో, పక్కన సోదరి మీకో

"కానీ, ఆమె తిరిగి రాలేదు. ఆమెకి ఏమైందో కూడా ఎవరికీ తెలియదు. తన కోసం మా అమ్మ నాన్నలు విపరీతంగా వెతికారు. కానీ, తన శవం కూడా దొరకలేదు. ఎక్కడో ఒక చోట బ్రతికే ఉంటుందనే అనుకోవడం మొదలు పెట్టాం“.

"అప్పుడు మా అమ్మ గర్భంతో ఉన్నారు. కానీ, తనకి గర్భస్రావం జరిగింది.”

“మాకు తినడానికి కూడా ఏమి లేదు. మాకు రేడియేషన్ గురించి ఏమి తెలియదు. దాంతో ఏది దొరికితే అది తీసుకుని, విషపూరితమో కాదో కూడా చూసుకోకుండా తినేసే వాళ్లం”.

“తిండి దొరక్క పోవడంతో కొందరు దొంగతనాలు చేసేవారు. ఆహారం చాలా పెద్ద సమస్యగా ఉండేది. నీరు చాలా రుచిగా అనిపించేది. అలా బ్రతకడం మొదలు పెట్టాం కానీ, ఆ సంగతి మర్చిపోయాం”.

“నెమ్మదిగా నా జుట్టు రాలడం ప్రారంభమైంది . దంతాల చిగుళ్ల నుంచి రక్తం కారడం మొదలైంది.. బాగా అలిసిపోయేదాన్ని. ఎప్పుడూ పడుకునే ఉండాలని అనిపించేది”.

"రేడియేషన్ అంటే మాకెవరికీ అప్పటికి తెలియదు. 12ఏళ్ల తర్వాత నాకు అప్లాస్టిక్ అనీమియా ఉన్నట్లు గుర్తించారు”.

"ప్రతి ఏటా కొన్ని సార్లు సూర్యాస్తమయం అయ్యేటప్పుడు ఆకాశం ముదురు ఎరుపు వర్ణంలోకి మారిపోతూ ఉండేది. ఆ ఎరుపు ఎంత ఎక్కువగా ఉండేదంటే, ఆ సమయంలో ప్రజల ముఖాలు కూడా ఎర్రగా మారిపోతుండేవి”.

“అలాంటి సమయాల్లో నేనేమి చేయలేకపోయే దాన్ని. కానీ అణ్వాయుధ దాడి జరిగినప్పుడు ఆకాశం ఎలా ఉండి ఉంటుందో మాత్రం ఊహించగలిగే దాన్ని. నగరం మూడు రోజులు, మూడు రాత్రుళ్లు మండుతూనే ఉంది”.

హిరోషిమా నగరం

"ఈ దాడిని ప్రత్యక్షంగా చూసిన చాలా మంది ఇప్పటికే మరణించారు. వారి తరుపున నేను మాట్లాడుతున్నాను’’.

"చాలా మంది ప్రపంచ శాంతి గురించి మాట్లాడతారు. కానీ, ప్రజలు దాని గురించి చర్యలు తీసుకుంటే బాగుంటుందని భావిస్తాను. ఈ భూమి మీద ప్రతి వ్యక్తి ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలి”.

రీకో హడా

ఆగష్టు 1945, 09న నాగసాకిలో బాంబు దాడి జరిగినప్పుడు రీకో హడాకి తొమ్మిదేళ్లు.

రీకో ఐదేళ్లున్నప్పటి ఫోటో, 79ఏళ్ల వయసులో ఫోటో

ఆ రోజు వైమానిక దాడులు జరగొచ్చనే హెచ్చరిక రావడంతో రీకో ఇంటి దగ్గరే ఉండిపోయారు.

అంతా బాగానే ఉందని అనిపించి ఆమె ఇంటి దగ్గరలో ఉన్న ఒక మందిరానికి చదువుకోవడానికి వెళ్లారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తరచుగా వైమానిక దాడులు జరగడంతో చాలా మంది పిల్లలు ఒక మందిరానికి వెళ్లి అక్కడ చదువుకుంటూ ఉండే వారు. 40 నిమిషాల తర్వాత మందిరం దగ్గర దాడి జరగొచ్చనే హెచ్చరిక రావడంతో, టీచర్లు పిల్లలను ఇంటికి పంపేశారు.

"నేను ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్లేసరికి, గాలిలోకి మెరుస్తున్న వెలుగు వ్యాపించింది. అది నా కళ్ల ముందు కనిపించింది. పసుపు, నారింజ కలిపిన రంగులతో మంటలు కమ్మేశాయి”.

“అది తృటిలో జరిగింది. అదేమిటో ఆలోచించుకునే సమయం కూడా లేదు. అంతలోనే అంతా శ్వేత వర్ణం కమ్మేసింది”.

“నాకెందుకో నేను ఒంటరిగా మిగిలిపోయానని అనిపించింది. ఆ మరు క్షణమే ఒక భీకరమైన శబ్దం వినిపించింది. ఇక అంతా చీకటి మయంగా అయింది”.

నాగసాకీలో అణుబాంబు విధ్వంసం

"కొంత సేపటికి ఏమి జరుగుతుందో అర్ధం అయింది. వైమానిక దాడులు జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్ రైడ్ స్థావరాలకు వెళ్లమని మా టీచర్ నేర్పించారు. నేను వెంటనే మా అమ్మ కోసం ఇంటి లోపల వెతికి దగ్గరలో ఉన్న రక్షణ శిబిరానికి వెళ్లాను”.

"నాకేమి గాయాలు అవ్వలేదు. కొన్పిర పర్వతం ఉండటంతో బాంబు దాడి ప్రభావం మా పై తక్కువగా ఉంది. కానీ పర్వతానికి అవతల భాగంలో నివసించే వారి పరిస్థితి బాగా దారుణంగా మారింది”.

తండ్రి, అక్కలతో రీకో

"చాలా మంది అక్కడ నుంచి మేముండే ప్రాంతానికి వచ్చేశారు. కొంత మంది కళ్లు బయటకు వచ్చేసి, జుత్తు అస్తవ్యస్తంగా మారింది. కొంత మంది నగ్నంగా వచ్చారు. మరి కొంత మంది కాలిన చర్మం వేళాడుతుండగా చూశాను”.

"మా అమ్మ ఇంటిలోని తువాళ్ళు, దుప్పట్లు , చుట్టు పక్కల ఉండే వారి దగ్గర నుంచి సేకరించి అక్కడే ఉన్న ఆడిటోరియానికి, దగ్గర్లోని కాలేజీకి తీసుకుని వెళ్లి, వారికి విశ్రమించే ఏర్పాట్లు చేశారు”.

"వారు మంచి నీళ్లు అడిగారు. నేను ఒక గిన్నెతో దగ్గరలోని నదికి వెళ్లి నీళ్లు తెచ్చి ఇచ్చాను”.

రీకో

“కొంత మంది ఒక గుటక నీరు తాగి మరణించడం చూశాను. అలా ఒకరి తర్వాత ఒకరు చాలా మంది మరణించారు”.

"అది వేసవి కాలం. శవాల నుంచి వచ్చే వాసనతో వాటిని తక్షణమే అంత్యక్రియలు చేయాల్సి వచ్చేది. కాలేజీలో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర మూకుమ్మడి దహన సంస్కారాలు నిర్వహించారు’’.

“ఇలాంటి పరిస్థితిని భావి తరాల వారెవరూ అనుభవించకూడదని ఆశిస్తున్నాను. అణ్వాయుధాలను వాడేందుకు మనం అనుమతించకూడదు”.

"శాంతిని ప్రజలే సృష్టించగలరు. మనం విభిన్న దేశాలలో నివసిస్తూ, భిన్న భాషలను మాట్లాడినప్పటికీ అందరూ శాంతిని కోరుకోవాలి”.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
US had dropped two nuclear bombs in Japan's Hiroshima and Nagaski which killed several people and the effect is felt till today
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X