• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టోక్యో ఒలింపిక్స్: గత 100ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా స్వర్ణ పతకాన్ని పంచుకున్న అథ్లెట్లు

By BBC News తెలుగు
|
జియాన్‌మార్కో టామ్‌బెరీ (ఎడమ), ఎసా బార్‌షిమ్ (కుడి)

ఒలింపిక్స్‌లో పసిడి పతకాన్ని పంచుకోవడం అనేది గత శతాబ్ద కాలంలో ఎప్పుడూ జరగనే లేదు.

కానీ టోక్యో ఒలింపిక్స్‌ ఇందుకు వేదికైంది. హై జంప్ ఈవెంట్ ఫైనల్స్‌లో 30 ఏళ్ల ముతాజ్ ఎసా బార్‌షిమ్ (ఖతర్), 29 ఏళ్ల జియాన్‌మార్కో టామ్‌బెరీ (ఇటలీ) ఇద్దరూ పసిడి పతకాన్ని గెలుచుకున్నారు.

రెండు గంటల పాటు సాగిన కఠినమైన ఫైనల్స్ పోరులో వీరిద్దరూ సమంగా నిలిచారు. ఆ తర్వాత తొలి స్థానాన్ని ఇద్దరూ పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లే ఇద్దరూ విజయ వేడుకలు చేసుకున్నారు.

హైజంప్ ఫైనల్లో బార్‌షిమ్, టామ్‌బెరీ ఇద్దరూ 2.37మీ. దూరాన్ని విజయవంతంగా జంప్ చేశారు. ఆ తర్వాత 2.39 మీటర్ల దూరాన్ని దూకడంలో మూడు ప్రయత్నాల్లోనూ వీరిద్దరూ విఫలమయ్యారు.

దీంతో విజేతను నిర్ణయించడానికి ఒలింపిక్ అధికారి టైబ్రేక్ రూపంలో వారికి మరో అవకాశం ఇచ్చారు. కానీ దాన్ని తిరస్కరించిన బార్‌షిమ్ 'మేం ఇద్దరం పసిడి పతకాలు పొందవచ్చా?’ అని అడిగారు.

అతని ప్రతిపాదనకు అధికారి అంగీకరించడంతో ఇద్దరు అథ్లెట్లు ఆనందంగా కరచాలనం చేసుకొని నవ్వారు.

బెలారస్‌కు చెందిన మాక్సిమ్ నెడసెకావు కాంస్య పతకాన్ని అందుకున్నారు.

'నేను టామ్‌బెరీని చూశాను. అతను నన్నే చూస్తున్నాడు. మేమిద్దరం ఒకరినొకరు చూసుకున్నాం. అంతే ఏం చేయాలో మాకు అర్థమైంది’ అని బార్‌షిమ్ చెప్పారు.

'టామ్‌బెరీ నాకు ట్రాక్‌లోనే కాకుండా బయట కూడా మంచి మిత్రుడు. మేమిద్దరం కలిసి శ్రమిస్తాం. ఒలింపిక్స్ స్వర్ణం మా ఇద్దరి కల. ఇప్పుడు అది నిజమైంది. క్రీడా స్ఫూర్తికి అతను నిదర్శనం. మేమిద్దరం ఆ స్ఫూర్తిని ఇక్కడ నుంచి చాటుతున్నాం’ అని చెప్పారు.

జియాన్‌మార్కో టామ్‌బెరీ, ఎసా బార్‌షిమ్

చరిత్రాత్మకం

బార్‌షిమ్, టామ్‌బెరీ చరిత్ర సృష్టించారు. అథ్లెటిక్స్‌లో 1912 తర్వాత ఒలింపిక్ పోడియాన్ని ఇద్దరు అథ్లెట్లు పంచుకోవడం ఇదే తొలిసారి.

స్వర్ణాన్ని పంచుకోవాలనే అసాధారణ నిర్ణయం తీసుకున్నాక వీరిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకొని, తర్వాత వారి కోచ్‌లు, సహచరులతో సంబరాలు జరుపుకున్నారు. తమ తమ జాతీయ జెండాలతో పరిగెడుతూ గెలుపు వేడుకలు చేసుకున్నారు.

వరుసగా రెండు ప్రపంచ అథ్లెటిక్స్ టైటిళ్లను గెలుపొందిన బార్‌షిమ్ ఖాతాలో ఇప్పుడు ఒలింపిక్స్ స్వర్ణం కూడా చేరింది. ఖతర్‌కు రెండో స్వర్ణం అందించిన క్రీడాకారుడిగా బార్‌షిమ్‌ నిలిచారు. అతని కంటే ముందు శనివారం పవర్ లిఫ్టర్ ఫరేస్ ఎల్బా 96 కేజీల విభాగంలో ఛాంపియన్‌గా నిలిచారు.

మరోవైపు ఒలింపిక్స్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పురుషుల 100మీ. పరుగులో... ఆశ్చర్యకర ప్రదర్శనతో విజేతగా నిలిచిన లామోంట్ మార్సెల్ జాకబ్స్ (ఇటలీ)తో కలిసి టామ్‌బెరీ తన సంబరాలు చేసుకున్నారు.

జియాన్‌మార్కో టామ్‌బెరీ, ఎసా బార్‌షిమ్

తమ అథ్లెటిక్స్ కెరీర్‌లో టామ్‌బెరీ, బార్‌షిమ్ ఎన్నోసార్లు తీవ్ర గాయాల బారిన పడ్డారు. కానీ ఆ త్యాగాలకు ఇప్పుడు ప్రతిఫలం లభించిందని చెప్పుకొచ్చారు.

'చాలా అద్భుతంగా అనిపిస్తోంది. ఇది నేను మేల్కోవడానికి ఇష్టపడని కల. కెరీర్‌లో చాలా ఎత్తుపల్లాలు చూశాను. అనేక గాయాలు, అడ్డంకులు ఎదురైనప్పటికీ, ఈ ఫలితం కోసం ఐదేళ్లుగా వేచి చూస్తున్నా. ఈరోజు మేం చేసిన త్యాగాలతో పాటు, ఈ అద్భుత క్షణాలను పంచుకున్నాం. ఈ క్షణం ఎంతో విలువైనది’ అని టామ్‌బెరీ వివరించారు.

తీవ్ర గాయం కారణంగా టామ్‌బెరీ 2016 రియో ఒలింపిక్స్‌కు దూరం కావాల్సి వచ్చింది. తన అథ్లెటిక్స్ కెరీర్‌కే ముప్పుగా మారిన ఆ గాయం నుంచి కోలుకునేందుకు ఆయనకు సుదీర్ఘ కాలం పట్టింది.

'గాయాల నుంచి కోలుకున్నాక మళ్లీ ట్రాక్‌లో అడుగుపెట్టాలని అనుకున్నా. కానీ ఇప్పుడు స్వర్ణాన్ని సాధించా. ఇది నమ్మలేనిదిగా అనిపిస్తోంది. ఈ పతకం గురించి చాలాసార్లు కలలు కన్నాను. రియో ఒలింపిక్స్‌కు ముందర నా కెరీర్ ప్రమాదంలో పడింది. గాయం కారణంగా ఇక నేను పోటీల్లో పాల్గొనే అవకాశం లేదని చెప్పారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఇదో అద్భుత ప్రయాణం’ అని తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను టామ్‌బెరీ గుర్తుచేసుకున్నారు.

జియాన్‌మార్కో టామ్‌బెరీ, ఎసా బార్‌షిమ్

గతంలో ఎప్పడు ఇలా జరిగిందంటే...

1912 స్టాక్‌హోమ్ ఒలింపిక్స్ గేమ్స్‌లో చివరిసారిగా ఇలా జరిగింది. అప్పుడు డెకాథ్లాన్, పెంటాథ్లాన్ ఈవెంట్‌లలో అథ్లెట్లు పతకాన్ని పంచుకున్నారు.

ఈ రెండు ఈవెంట్‌లలోనూ అమెరికా అథ్లెట్ జిమ్ థోర్ప్ విజేతగా నిలిచారు.

జిమ్ థోర్ప్ అథ్లెటిక్స్ నైపుణ్యాలు చాలా విశిష్టమైనవి. జిమ్ ప్రపంచంలోనే అత్యుత్తమ అథ్లెట్ అని స్వీడన్ రాజు గుస్తవ్ కీర్తించారు.

కానీ ఒకానొక దశలో అతని కీర్తి మసకబారింది. యవ్వనంలో ఉన్నప్పుడు బేస్‌బాల్ ఆడేందుకు జిమ్ థోర్ప్ డబ్బులు తీసుకున్నట్లు తేలడంతో కెరీర్‌పై అది మచ్చగా మిగిలిపోయింది.

దీంతో అతను ఒలింపిక్స్ నిబంధనలు ఉల్లంఘినట్లు పరిగణించిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) థోర్ప్ పతకాలను వెనక్కి తీసుకుంది. ఈ ఉదంతంతో ఒలింపిక్స్‌ నుంచి అనర్హత పొందిన తొలి ప్రొఫెషనల్ అథ్లెట్‌గా జిమ్ థోర్ప్ మిగిలిపోయారు.

https://www.youtube.com/watch?v=V_gielXNpqQ

ఫలితంగా పెంటథ్లాన్‌లో రజతం సాధించిన ఫెర్డినాండ్ బీ (నార్వే), డెకాథ్లాన్‌లో రెండో స్థానంలో నిలిచిన హ్యుగో విస్‌లాండర్ (స్వీడన్)లకు ఆయా ఈవెంట్‌లలో స్వర్ణ పతకాలు లభించాయి.

స్టాక్‌హోమ్ క్రీడలు ముగిసిన 70 ఏళ్ల తర్వాత జిమ్ థోర్ప్‌ను ఐఓసీ క్షమించింది.

ఆయన మరణించిన 29 ఏళ్ల తర్వాత, అంటే 1982లో ఆయన నుంచి తీసుకున్న పతకాలను ఐఓసీ తిరిగి ఆయనకు చేర్చింది.

దీంతో జిమ్ థోర్ప్... 1912 క్రీడలకు సంబంధించి పెంటాథ్లాన్‌లో ఫెర్డినాండ్‌తో, డెకాథ్లాన్ ఈవెంట్‌లో విస్‌లాండర్‌తో ఒలింపిక్స్ పసిడి పతకాలు పంచుకున్నట్లయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Tokyo Olympics: Athletes share gold medals like never before in 100 years
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X