• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మీరు కోరుకున్న ఎమోజీ లేకపోతే ఏం చేస్తారు? కావాల్సిన ఎమోజీ పొందడం ఎలా

By BBC News తెలుగు
|
ఎమోజీలు

మీకు ఏదైనా ఎమోజీ అంటే బాగా ఇష్టమా? కన్ను కొట్టే ఎమోజీ.. కంట్లోంచి నీరొచ్చేంతగా పడిపడి నవ్వే ఎమోజీ.. ఏదైనా కావొచ్చు.

ఇలా 3 వేలకు పైగా ఉన్న ఎమోజీల నుంచి ఎంచుకోవడానికి చాలా ఉన్నాయి.

అయినా, మీకు కావాల్సింది అందులో లేకపోతే ఏం జరుగుతుంది?

రాచెల్ మర్ఫీ అమెరికాలోని వర్జీనియా బీచ్‌లోని డ్రోన్ సర్వీసెస్ సంస్థ డ్రోన్అప్‌లో పనిచేస్తున్నారు.

''రోజూ నేను ట్వీట్‌లు చేస్తుంటాను, సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుంటాను. వాటిలో ఎమోజీలను చేర్చి ఫాలోవర్లను ఉత్తేజపరుస్తాను'' అన్నారు రాచెల్.

3 వేలకుపైగా ఎమోజీలు ఉన్నా అందులో డ్రోన్ చిహ్నం లేకపోవడంతో ఆమె తన ట్వీట్‌లలో డ్రోన్‌కు బదులుగా హెలికాప్టర్, ఫ్లయింగ్ సాసర్ వంటివి వాడాల్సి వస్తోందని చెబుతున్నారు.

అవి డ్రోన్‌కు సరైన ప్రత్యామ్నాయం కానప్పటికీ వాడక తప్పడం లేదు అంటారామె.

దీంతో ఈ ఎమోజీల వ్యవహారం ఎవరు చూస్తారు? అందులో కొత్తగా డ్రోన్ ఎమోజీ చేర్చాలంటే ఎవరిని సంప్రదించాలనే విషయంపై పరిశోధన ప్రారంభించారు.

ఎమోజీ

ఎవరు ఆమోదిస్తారు?

కొత్తగా చేర్చాలంటూ ప్రతిపాదించే ఎమోజీలను యూనికోడ్ కన్సార్టియానికి చెందిన 'ఎమోజీ సబ్ కమిటీ' అనే ఒక బృందం పరిశీలిస్తుంది. యూనికోడ్ కన్సార్టియం లాభాపేక్ష లేని ఓ సంస్థ. ఇందులో గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, హ్యువాయ్ వంటి దిగ్గజ టెక్ సంస్థల నుంచీ ప్రతినిధులు ఉంటారు.

వారు కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో తరచూ సమావేశమై కొత్త ఎమోజీలపై నిర్ణయం తీసుకుంటారు.

అయితే, వీరి పరిశీలనకు ఎమోజీలను ఎవరు పంపించాలనేది అనుమానం రావొచ్చు. వ్యక్తులు కానీ, సంస్థలు కానీ, ప్రభుత్వాలు కానీ ఎవరైనా ఎమోజీలను ప్రతిపాదించొచ్చు.

యూనికోడ్ వెబ్‌సైట్ ద్వారా ప్రతిపాదించొచ్చు. దీనికి సంబంధించిన విధివిధానాలు అన్నీ ఈ వెబ్‌సైట్‌లో ఉంటాయి.

ఇలా వచ్చే ప్రతిపాదనలను కమిటీ సభ్యులు పరిశీలించి వాటిపై నిర్ణయం తీసుకుంటారు.

ఆమోదం లభించిన ప్రతిపాదనలు ఎమోజీ రూపంలో అందుబాటులోకి వస్తాయి. మిగతావి తిరస్కరణకు గురవుతాయి.

అయితే, ఈ కమిటీలో ఎక్కువ మంది పురుషులు, శ్వేతజాతీయలు, వయసు మళ్లినవారేనని ఎమోజీ నేషన్ అనే సంస్థ సహ వ్యవస్థాపకురాలు జెన్నిఫర్ లీ అన్నారు. ఎమోజీలను ప్రతిపాదించడంలో ప్రజలకు ఈ సంస్థ సహాయపడుతుంది.

ఈ ఎమోజీ సబ్ కమిటీ సమావేశాలను మతపరమైన సమావేశాలతో పోల్చారు జెన్నిఫర్.

''చర్చి సమావేశంలా ఉంటుంది. అంతా శ్వేతజాతీయులే, చాలామంది ముసలివాళ్లు'' అంటూ ఈ కమిటీ భేటీలపై తన అభిప్రాయం చెప్పారామె.

ఇక రాచెల్ మర్ఫీ విషయానికొస్తే ఆమె తన సహోద్యోగి అమీ వీగాండ్‌తో కలిసి తమ డ్రోన్ ఎమోజీ ప్రతిపాదనకు సబ్మిట్ చేశారు. డ్రోన్‌కు సంబంధించి ఆన్‌లైన్ సెర్చ్ ఎంత ఉంది వంటి వివరాలతో పాటు ఒక నమూనా ఎమోజీ, అభ్యర్థన పత్రం జోడించి సబ్మిట్ చేశారు.

''ప్రజల ప్రాణాలు కాపడడానికి, గల్లంతైనవారి కోసం గాలింపు, సహాయ చర్యలలో డ్రోన్లువాడుతార''ని వీగాండ్ అన్నారు.

అయితే, వారి ప్రతిపాదనను యూనికోడ్ ఎమోజీ సబ్ కమిటీ తిరస్కరించింది.

''డ్రోన్లు అనేవి కొత్త టెక్నాలజీ, అవి ఎంతకాలం మనుగడలో ఉంటాయో తెలియదు కాబట్టి దీన్ని ఆమోదించలేం'' అని సబ్ కమిటీ చెప్పింది.

తమ ప్రతిపాదన తిరస్కరణకు గురైందని తెలిసి షాకయ్యామని రాచెల్ చెప్పారు.

ఎమోజీలు

అయితే, ఇప్పుడున్న ఎమోజీలను చూస్తే అందులో పేజర్, ఫాక్స్ మెషిన్, ఫ్లాపీ డిస్క్ వంటి ఎన్నో కాలగర్భంలో కలిసిపోయిన డివైస్‌లు కనిపిస్తాయి.

అవన్నీ ఉండగా డ్రోన్‌కు ఎందుకు అవకాశం కల్పించరు అని రాచెల్ ప్రశ్నిస్తున్నారు.

1980 తరువాత తాను ఫ్లాపీ చూడలేదని, కానీ ఎమోజీలలో అది ఇంకా కనిపిస్తోందని వీగాండ్ ఆగ్రహిస్తున్నారు.

అయితే, ఎమోజీల జాబితాలో ఒకసారి చేర్చిన తరువాత మళ్లీ వాటిని తొలగించడమనేది లేకపోవడం వల్లే ఇప్పుడు ఆచితూచి ఎంపిక చేస్తున్నట్లు యూనికోడ్ చెబుతోంది.

జపాన్ మార్కెట్ కోసం

యూనికోడ్ వెనుక ఉన్నది మార్క్ డేవిస్. యూనికోడ్ కన్సార్టియం సహవ్యవస్థాపకుడు , అధ్యక్షుడు ఆయనే.

1990లో ఈ కన్సార్టియంను ఆయన ఏర్పాటు చేసినప్పుడు ప్రపంచంలోని అన్ని భాషలను ఎన్‌కోడ్ చేసేలా యూనివర్సల్ సిస్టమ్ ఒకటి ఉండాలని, ఏ భాషకు చెందిన డిజిటల్ టెక్స్ట్‌ను అయినా డౌన్‌లోడ్, అప్‌లోడ్ చేసుకునేలా అది అనుకూలంగా ఉండాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్కడికి సుమారు 20 ఏళ్లకు యాపిల్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు తమ ప్రొడక్స్ అయిన ఐఫోన్, జీమెయిల్‌ను జపాన్ మార్కెట్‌కు పరిచయం చేశాయి.

ఆ సమయంలో జపాన్ బిలియనీర్ మసయోషీ కుమారుడు కాలిఫోర్నియాలోని టెక్ సంస్థలకు ఒక సూచన చేశారు.

జపాన్ మార్కట్లో మనుగడ సాధించాలంటే ఎమోజీలను అందించాలని ఆయన సూచించారు. అప్పటికే జపాన్‌లో పిక్చర్ కారెక్టర్స్, ఎమోజీ తరహా వాడకం ఉండడమే.

మొదట 760

యూనికోడ్ ఈ సూచనలను తీసుకుని 2010లో తొలిసారి 760 ఎమోజీలను ప్రపంచవ్యాప్తంగా అందరు స్మార్ట్ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.

'అక్కడితో ఎమోజీల వ్యవహారం పూర్తయిపోయింది అనుకున్నాం'' అన్నారు మార్క్ డేవిస్.

కానీ, యూజర్ల నుంచి విపరీతమైన ఆదరణ రావడంతో కొత్త ఎమోజీల కోసం ప్రతిపాదనలూ వెల్లువెత్తడం మొదలైందని చెప్పారు.

కీత్ వీన్‌స్టన్

ఎమోజీలను యూనికోడ్ కన్సార్టియం నియంత్రించడం కాకుండా ఎమోజీలను తయారుచేసుకునే వెసులుబాటు ప్రజలకు, యాప్ డెవలపర్లకు బదలాయించాలని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కీత్ వీన్‌స్టన్ అంటున్నారు.

దీనిపై యూనికోడ్ కన్సార్టియానికి లేఖ రాయగా రెండేళ్ల తరువాత వారు బదులిస్తూ అది సాధ్యం కాదని తేల్చేశారని వీన్‌స్టన్‌ చెప్పారు.

ప్రస్తుతం ఎమోజీ సబ్‌కమిటీకి గూగుల్‌కు చెందిన జెన్నిఫర్ డేనియల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

కొత్త ఎమోజీలకు వచ్చే ప్రతిపాదనలను ఆమోదించడంపై ఆమె మాట్లాడుతూ అది క్లిష్టమైన వ్యవహారమన్నారు. డ్రోన్‌ను అనుమతిస్తే ఇంకొకరు ''నేను నర్సును నా నర్సింగ్ పరికరాలకు ఎందుకు చేర్చరు అని ప్రశ్నిస్తారు'' అంటారామె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What do you do if you do not have the desired emoji? How to get the desired emoji
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X