• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టోంగా: అగ్నిపర్వతం బద్దలవడంతో బూడిదమయమైన ద్వీప దేశం - అమెరికా తీరాన్ని తాకిన సునామీ అలలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

దక్షిణ పసిఫిక్ సముద్రంలోని దీవుల దేశం టోంగా సమీపంలో సముద్రగర్భంలో ఓ భారీ అగ్నిపర్వతం శనివారం బద్దలైంది. దీంతో ఆకాశంలోకి భారీ ఎత్తున బూడిత మేఘాలు ఆవరించాయి. సముద్రంలో సునామీ పోటెత్తింది.

పసిఫిక్ దీవులను బూడిద కమ్మేసింది. విద్యుత్ సరఫరా, టెలిఫోన్ కమ్యూనికేషన్లు తెగిపోయాయి. అమెరికా, న్యూజిలాండ్, జపాన్ సహా పలు దక్షిణ పసిఫిక్ సముద్ర తీర దేశాలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. అమెరికాలోని కాలిఫోర్నియా, అలాస్కా రాష్ట్రాల్లో కొన్ని తీర ప్రాంతాలను సునామీ అలలు తాకాయి.

హంగా-టోంగా హంగా-హాఆపాయ్ అగ్నిపర్వతం పేలుడు శబ్దం టోంగా నుంచి సుదూరంలో ఉన్న అమెరికాతో పాటు.. 2,383 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూజిలాండ్ వరకూ వినిపించింది.

టోంగా రాజధాని నుకుఅలోఫాలోకి కేవలం 65 కిలోమీటర్ల దూరంలోనే ఈ అగ్నిపర్వతం పేలుడు సంభవించింది. టోంగా తీరాన్ని సునామీ ముంచెత్తడంతో మీటరుపైగా ఎత్తున నీరు చేరింది.

టోంగా జనాభా లక్షా ఐదు వేల మంది కాగా.. దాదాపు 80,000 మంది ఈ ఉత్పాతానికి ప్రభావితులై ఉంటారని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీస్ (ఐఎఫ్ఆర్‌సీ) బీబీసీతో చెప్పింది. ఇప్పటివరకూ ఎలాంటి మరణాలూ సంభవించినట్లు వార్తలు రాలేదు.

ఈ సునామీ వల్ల గణనీయ నష్టం సంభవించిందని న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెన్ చెప్పారు. సునామీ నష్టాన్ని అంచనా వేయడానికి న్యూజిలాండ్ ఓ ప్రత్యేక విమానాన్ని టోంగా పంపించింది.

''ఆ ప్రాంతంలో, లోతట్టు ప్రాంతాల్లోని దీవుల మీద ప్రభావాన్ని ప్రాథమికంగా అంచనా వేయటానికి సహాయం చేయటం కోసం విమానం బయలుదేరింది’’ అని న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ ట్వీట్ చేసింది.

ప్రభావిత ప్రాంతాలకు అత్యవసర సాయం కావాలని ఫిజీలోని ఐఎఫ్ఆర్‌సీ ప్రతినిధి కేటీ గ్రీన్‌వుడ్ చెప్పారు.

''అగ్నిపర్వత పేలుడు, అనంతరం సునామీ అలల ముంపు కారణంగా టోంగా వ్యాప్తంగా 80,000 మంది వరకూ ప్రభావితులై ఉంటారని మేం అంచనా వేస్తున్నాం’’ అని ఆమె తెలిపారు.

అగ్నిపర్వతం పేలుడులో పైకెగసిన బూడిద నేలపై పడడంతో టోంగా ప్రాంతమంతా.. ''చంద్రుడి ఉపరితలంలా కనిపిస్తోంది’’ అని టోంగాలో న్యూజిలాండ్ తాత్కాలిక హైకమిషనర్ పీటర్ లాండ్ అభివర్ణించారు.

ఈ బూడిద వల్ల తాగునీటి వనరులు కలుషితమవుతున్నాయని, తాగునీటికి కొరత ఏర్పడుతోందని సమాచారం అందినట్లు జసిండా ఆర్డెన్ ఆదివారం నాడు పేర్కొన్నారు.

వాతావరణంలో బూడిద కలుస్తుండటంతో జనం బాటిళ్లలోని నీరు తాగాలని, ఊపిరితిత్తులకు రక్షణగా ఫేస్ మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు.

https://twitter.com/JTuisinu/status/1482243845614374915

ఆకాశం మొత్తం బూడిద కమ్మేసి నల్లగా మారగా.. లోతట్టు ప్రాంతాల జనం సునామీని తప్పించుకోవటానికి కార్లలో బయలుదేరటంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లు అయిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టయ్యాయి.

కొన్ని గంటల తర్వాత టోంగాలో ఇంటర్నెట్, ఫోన్ లైన్లు పనిచేయటం ఆగిపోయింది. దీంతో ఆ దీవిలో నివసిస్తున్న లక్ష మందికి పైగా జనానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

శనివారం నాడు భారీస్థాయిలో బద్దలవటానికి ముందు.. ఈ అగ్నిపర్వతంలో కొన్ని రోజులుగా పేలుళ్లు సంభవిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సల్ఫర్, అమ్మోనియా వాసనలు వస్తున్నాయని టోంగా మెటియొరొలాజికల్ ఏజెన్సీ హెచ్చరించింది.

దీవిలోని కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతోందని, మొబైల్ ఫోన్లు నెమ్మదిగా పనిచేయటం మొదలవుతోందని జసిండా ఆర్డెన్ తెలిపారు. కానీ కొన్ని తీర ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటన్నది ఇంకా తెలియటం లేదు.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఉన్న చాలా మంది టోంగా వాసులు.. తమ వారిని సంప్రదించే దారి లేక, వారి క్షేమం గురించి ఆందోళన చెందుతున్నారు.

అగ్నిపర్వతం బద్ధలవడానికి ముందు ఆ తరువాత

టోంగా రాజధాని నుకుఅలోఫాలో సముద్ర తీరం వద్ద రెస్టారెంట్ నిర్వహిస్తున్న తన కొలీగ్ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని ఫాతిమా చెప్పారు.

''వాళ్లంతా క్షేమంగా ఉంటారని ఆశిస్తున్నా. కానీ వాళ్లు చాలా కాలంగా లాక్‌డౌన్‌లో ఉన్నారు. పర్యాటకులెవరూ రావటం లేదు. ఇప్పుడు ఈ విపత్తు ముంచుకొచ్చింది. ఇది వారిని తీవ్రంగా దెబ్బకొడుతుంది’’ అని ఆమె బీబీసీతో పేర్కొన్నారు.

టోంగా పరిసరాల్లోని కొన్ని దీవులు పూర్తిగా సముద్రం నీటిలో మునిగిపోయినట్లు శాటిలైట్ ఫొటోలు సూచిస్తున్నాయి.

సమీపంలోని దీవులనే కాకుండా పసిఫిక్ సముద్రం చుట్టూ తీరాలను తాకిన సునామీ అలలకు కారణాలను అర్థం చేసుకోవటానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.

సముద్రగర్భంలోని అగ్నిపర్వతం కొంత భాగం కుప్పకూలటం వల్ల ఈ స్థాయి సునామీ వచ్చిందా అనేది తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.

సముద్ర ఉపరితలంలో కనిపించే ఈ అగ్నిపర్వత పైభాగం చాలావరకూ ధ్వంసమైనట్లు యూరోపియన్ యూనియన్ శాటిలైట్ సెంటినెల్ 1ఎ తీసిన చిత్రాలు స్పష్టంగా చూపుతున్నాయి. ఆ పేలుడు ఎంత తీవ్రంగా ఉందో ఇవి పట్టిచెప్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Tonga: Volcanic ash island - Tsunami waves hit the US coast
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X