రష్యా కీలక ప్రకటన- సమీప భవిష్యత్తులో మోడీ, జిన్ పింగ్, పుతిన్ త్రైపాక్షిక భేటీ
తాజాగా భారత్ లో పర్యటించిన రష్యా అధినేత వ్లాదిమీర్ పుతిన్ .. ఇప్పుడు చైనాను మన దేశానికి దగ్గరచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలో భారత్-చైనా-రష్యా అధినేతలైన ప్రధాని మోడీ, జిని పింగ్, పుతిన్ మధ్య త్రైపాక్షిక భేటీ జరగబోతోందని రష్యా సంకేతాలు ఇచ్చింది.
భారతదేశం, చైనా, రష్యా నాయకుల త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం సమీప భవిష్యత్తులో జరుగుతుందని మాస్కోలో అధ్యక్షుడు పుతిన్ ఉన్నత సలహాదారు తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధినేత జిన్‌పింగ్ మధ్య ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌పై మీడియాకు ఆయన వివరాలు వెల్లడించారు. ఇందులో అధ్యక్షుడు పుతిన్ సహాయకుడు యూరీ ఉషాకోవ్, ఇద్దరు నాయకులు భారతదేశంపై త్రైపాక్షిక చర్చలు జరగనున్నట్లు చెప్పారు.
ఇరువురు నేతలూ "ఈ విషయంలో అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకోవడం కొనసాగించాలని, RIC [రష్యా-ఇండియా-చైనా] ఫ్రేమ్‌వర్క్‌లో తదుపరి శిఖరాగ్ర సమావేశాన్ని సమీప భవిష్యత్తులో నిర్వహించడానికి ప్రయత్నించాలని అంగీకరించారని ఉషకోవ్ రష్యన్ వార్తా సంస్థ టాస్ కు వెల్లడించారు.

పుతిన్ డిసెంబరు 6న ఢిల్లీని సందర్శించారు, ఆ సమయంలో ఆయన ప్రధాని మోడీతో వన్ టూ వన్ భేటీ అయ్యారు. మాస్కోకు తిరిగి వచ్చిన తర్వాత ఆయన.. చైనా అధినేత జిన్ పింగ్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతేడాది కాలంగా వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సమావేశం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రాంతీయ, గ్లోబల్ 'హాట్స్పాట్లపై చర్చిస్తూ పుతిన్ పర్యటన సందర్భంగా చైనా అంశం చర్చకు వచ్చిందో లేదో భారతదేశం ఇంకా దృవీకరించలేదు.
వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో నేతల స్ధాయిలో ఇంకా సమావేశం జరగనప్పటికీ, త్రైపాక్షిక స్ధాయిలో అధికారుల స్ధాయి భేటీ మాత్రం జరిగింది. 2019లో జి20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా పుతిన్, మోదీ, జిన్ పింగ్ సమావేశమయ్యారు. ఇది గల్వాన్ ఘర్షణలకు ముందు జరిగింది. ఆ తర్వాత భారత్, చైనా ఘర్షణలు మరింత పెరిగాయి.
ఈ నేపథ్యంలో పుతిన్ భారత్ పర్యటనకు ముందు రష్యా, భారత్, చైనా విదేశాంగ మంత్రులు నవంబర్ 26న సమావేశమయ్యారు. ఆ సమావేశంలో, మూడు దేశాలూ ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవడానికి అంగీకరించాయి, అయితే ఇండో-పసిఫిక్ గ్రూపింగ్ 'క్వాడ్'పై చైనా ఆందోళనకు రష్యా మద్దతు ఇవ్వడంతో ఇండో-పసిఫిక్‌లో విభేదాలు కనిపించాయి.