వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ అభిశంసన: బైడెన్‌ మీద, అమెరికా మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
జో బిడెన్, కమలా హారిస్

ఆగ్రహంతో దండెత్తి వచ్చిన అల్లరిమూకల నుంచి ప్రతినిధుల సభను సాయుధ భద్రతా బలగాలు రక్షించిన సరిగ్గా వారం రోజుల తర్వాత.. ఆ అల్లరి మూక మద్దతిస్తున్న దేశాధ్యక్షుడిని అభిశంసించటానికి అదే సభలో ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు.

అమెరికా ప్రజాస్వామ్యంలో 231 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో అధికారంలో ఉన్న అధ్యక్షుడిని రెండు సార్లు అభిశంసించటం ఇదే మొదటిసారి. అధ్యక్షుడిగా తన పాలన చరిత్రాత్మక విజయమని గొప్పగా చెప్పుకునే డోనల్డ్ ట్రంప్ అధికారానికి ఇది చాలా అవమానకరమైన ముగింపు.

అధ్యక్షభవనం శ్వేతసౌథం సమీపంలో గత బుధవారం ఉదయం వేలాది మంది తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించిన దేశాధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.. అమెరికా పార్లమెంటు భవనమైన కాపిటల్ మీద అల్లరి మూక దాడి చేసేలా రెచ్చగొట్టారని అభిశంసన తీర్మానం ఆరోపించింది. దీనిని ఇప్పుడు అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు)లో ఎగువ సభ అయిన సెనేట్‌కు పంపిస్తారు. మొత్తం 100 మంది సభ్యులు గల ఈ సభ.. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన మరోసారి జ్యూరీగా సమావేశామవుతుంది.

జో బైడెన్ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే వరకూ ఈ విచారణ మొదలుకాదు. ఈ విచారణ ఫలితం కూడా అనుమానమే. ఇప్పటికైతే.. ప్రతినిధుల సభ చర్య పర్యవసానాలను అంచనా వేయటం మొదలుపెట్టొచ్చు.

రిపబ్లిక్ నాయకురాలు లిజ్ చెనీ

అధ్యక్షుడితో విభేదించిన రిపబ్లికన్లు

కేవలం ఏడాది కిందట ప్రతినిధుల సభ రిపబ్లికన్ ఓటు ఒక్కటి కూడా లేకుండా ట్రంప్‌ను అభిశంసించింది. ఈసారి ట్రంప్ సొంత పార్టీ సభ్యులు పది మంది ఆయనకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానానికి మద్దతిచ్చారు. మరికొంత మంది రిపబ్లికన్ సభ్యులు.. కాపిటల్ మీద దాడి జరిగిన రోజు ట్రంప్ మాటలు, చర్యలను ఖండించారు.

అలా విభేదించిన వారిలో మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చెనీ కుమార్తె, చాంబర్‌లో రిపబ్లికన్ పార్టీ నాయకత్వంలో మూడో స్థానంలో ఉన్న లిజ్ చెనీ అత్యంత ప్రముఖులు.

''అమెరికా అధ్యక్షుడు ఒకరు తన పదవికి, రాజ్యాంగానికి చేసిన ప్రతిజ్ఞకు ఇంత దారుణంగా నమ్మకద్రోహం చేయటం ఎన్నడూ జరగలేదు’’ అని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మాటను అభిశంసన చర్చలో డెమోక్రాట్లు తరచుగా ఉటంకించారు.

అలాగే సెనేట్‌లో సైతం కొందరు రిపబ్లికన్ సభ్యులు అధ్యక్షుడిని ఈ అభియోగాలపై దోషిగా నిర్ధారించటానికి అనుకూలంగా ఓటు వేయటానికి సంసిద్ధంగా ఉన్నారని వినిపిస్తోంది.

మెజారిటీ నాయకుడు మిచ్ మెక్‌కానెల్ సైతం ట్రంప్ అభిశంసనకు గురికాబోతుండటం పట్ల మంగళవారం రాత్రి 'హర్షం’ వ్యక్తం చేశారని.. ఈ ప్రక్రియ వల్ల అధ్యక్షుడి నుంచి తమ పార్టీ స్వచ్ఛంగా వేరుపడగలదని ఆశాభావం వ్యక్తంచేశారని న్యూయార్క్ టైమ్స్ ఒక కథనంలో తెలిపింది.

అయితే.. విచారణ పూర్తయ్యేవరకూ తన తీర్పును ఆపివేస్తానని ఆయన ఆ తర్వాత పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రిపబ్లికన్ పార్టీ అంతర్గతంగా కూడా విభేదాలు స్పష్టమవుతున్నాయి.

ప్రతినిధుల సభలో బుధవారం కనిపించిన విభజన.. రాబోయే రోజుల్లో రిపబ్లికన్లు ఎటువైపు ఉంటారనేది నిర్ణయిస్తుంది - ఒకవైపు ట్రంప్ తరహా రాజకీయాలకు మద్దతు కొనసాగించటం, మరోవైపు అనిశ్చిత భవిష్యత్తు - అయినా ట్రంప్ దుందుడుకు మాటల నుంచి విముక్తి.

అమెరికా కాంగ్రెస్

ట్రంప్, ట్రంపిజాన్ని అభిశంసించిన డెమోక్రాట్లు

గత వారం అల్లర్ల జరిగిన కొన్ని గంటల్లోనే డెమోక్రాట్లు సమావేశమై.. ఈ దాడిని ప్రేరేపించిన అధ్యక్షుడి విషయంలో ఎలా ప్రతిస్పందించాలి, ఎలా శిక్షించాలి అనే అంశంపై మల్లగుల్లాలు పడ్డారు. ఇది అమెరికా ప్రజాస్వామ్యంపై దాడిగా, తమ ప్రాణాలను సైతం ప్రమాదంలో పడేసిన దాడిగా వారు భావిస్తున్నారు.

చివరికి.. ట్రంప్‌ తన పదవీ కాలం చరమాంకానికి వచ్చినా కానీ.. ఆయనను రెండుసార్లు అభిశంసనకు గురైన అధ్యక్షుడిగా చేయాలని వారు నిర్ణయించారు.

అయితే.. డెమోక్రాట్లు బుధవారం నాడు అభిశంసించింది ఒక్క డోనాల్డ్ ట్రంప్‌ను మాత్రమే కాదు. మొత్తం ట్రంపిజాన్నే వారు బోనులో నిలబెట్టి అభిశంసించారు. నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికలపై ట్రంప్ నెలల తరబడి చేస్తున్న దాడిని కూడా వారు అభిశంసన తీర్మానంలో నిర్దిష్టంగా ప్రస్తావించారు. ప్రతినిధుల సభలో చర్చ సందర్భంగా.. ట్రంప్ తన పదవీ కాలంలో ప్రవర్తించిన తీరుపైనా, ఆయన దుందుడుకు మాటలకు వంతపాడిన కాంగ్రెస్‌లోని రిపబ్లికన్ సభ్యుల మీదా తీవ్ర విమర్శలు గుప్పించారు.

ట్రంప్, ట్రంపిజాన్ని విడనాడి ముందుకు సాగాలని భావించే రిపబ్లికన్లు ఉండి ఉండొచ్చు. అయితే.. ట్రంప్‌ను, గత వారం జరిగిన దాడిని రిపబ్లికన్ పార్టీ మెడకు చుట్టాలని డెమొక్రాట్ కాంగ్రెస్ సభ్యులు కొందరు ప్రయత్నిస్తానేది స్పష్టం.

డోనల్డ్ ట్రంప్

ట్రంప్ పతనమయ్యారు.. కానీ పదవిలోనే ఉన్నారు...

ఒక్క నిమిషం పాటు.. గత కొద్ది నెలల్లో చరిత్ర వేరేలా సాగిందని ఊహించండి.

నవంబర్ ఎన్నికల్లో తన ఓటమిని అత్యంత తీవ్రంగా సవాల్ చేయటానికి బదులుగా.. మౌనంగా అంగీకరించారనుకోండి. రిపబ్లికన్లు జార్జియా ఎన్నికల్లో గెలిచి, సెనేట్ మీద తమ పట్టును నిలబెట్టుకుని ఉండేవారు. అప్పుడు ట్రంప్ రిపబ్లికన్ల నుంచి ముప్పు ఎదుర్కోవటానికి బదులుగా తమ పార్టీలో కింగ్ మేకర్ అయ్యేవారు.

ఆయన 2024లో మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటం నిజంగా సాధ్యమై ఉండేది.

కానీ.. ట్రంప్ పరిస్థితి తలకిందులైంది. ఆయన ఎంతో ఇష్టపడే ట్విటర్ సహా సోషల్ మీడియాలో ఆయన గళాన్ని మూసేశారు. సెనేట్‌లో ఆయన దోషిగా నిర్ధారించినా.. మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటంపై నిషేధం ఉండదు. కానీ రిపబ్లికన్ పార్టీలో ఆయన బలం, ప్రభావం దెబ్బతిన్నాయి.

అయితే.. ప్రజాభిప్రాయ పోలింగ్‌, బుధవారం నాడు ప్రతినిధుల సభలో కొందరు ఆయనను బలంగా సమర్థించటం.. సొంత పార్టీలో ట్రంప్‌కు ఇంకా గణనీయమైన మద్దతు ఉందని సూచిస్తోంది. కానీ గడచిన వారాలు ట్రంప్ వ్యతిరేకులకు ధైర్యం తెచ్చిపెడతాయి. ఆయన పతనమై ఉండగానే మళ్లీ లేవకుండా దెబ్బతీసే అవకాశం తమకు లభించిందని వారు భావిస్తున్నారు.

ట్రంప్ మునుపెన్నటికన్నా ఇప్పుడు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు.

ఐదేళ్లుగా ట్రంప్ రాజకీయ పర్వం ముగిసిందని చరమగీతాలు పాడిన తన విమర్శకుల అంచనాలు తప్పని ట్రంప్ నిరూపిస్తూ వచ్చారు. చాలా మంది రాజకీయ నాయకులను కూల్చివేయగల కుంభకోణాలు, కరోనావైరస్‌లను తట్టుకుని నిలిచారు.

కానీ ఈసారి మాత్రం వేరేలా జరగొచ్చు.

జో బిడెన్

సెనేట్ విచారణ.. బైడెన్‌కు ఇబ్బందికర పరిస్థితి

అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఆ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే.. రోజుకు 4000 మంది అమెరికన్లను బలితీసుకుంటున్న కరోనావైరస్‌ తోను, అంతకంతకూ దిగజారుతున్న ఆర్థికవ్యవస్థ తోను పోరాడాల్సి ఉంటుంది. ఇప్పుడు.. తన ముందటి అధ్యక్షుడిని సెనేట్ అభిశసంన విచారణతోనూ ఆయన వ్యవహరించాల్సి ఉంటుంది.

అధ్యక్ష ఎన్నికల తీరుతో నిట్టనిలువుగా చీలిన దేశానికి అయిన గాయాలను మాన్పాల్సిన అవసరమున్న ప్రస్తుత తరణంలో ట్రంప్‌ను అభిశంసించటం వల్ల అమెరికన్లలో చీలికను ఇంకా పెంచుతుందని, మరింత రెచ్చగొడుతుందని రిపబ్లికన్లు బుధవారం నాడు హెచ్చరించారు. దానివల్ల.. దేశాన్ని పునరైక్యం చేస్తానన్న బైడెన్ హామీని అమలుచేయటం మరింత కష్టమవుతుందని వారు అంటున్నారు.

బైడెన్ ఎన్నిక చట్టబద్ధతను వక్రీకరించటానికి సుదీర్ఘ ప్రచారం నడిపిన రిపబ్లికన్లు ఇప్పుడు గాయాల మానాలనే మాటలు మాట్లాడటం అసంబద్ధంగా ఉందని డెమోక్రాట్లు వెనువెంటనే ప్రతిస్పందించినా కానీ.. చివరికి రిపబ్లికన్లు అంటున్నట్లుగానే జరగొచ్చేమో.

ఏదేమైనా.. ఈ అభిశంసన విచారణ బైడెన్‌ ముందుకు అధ్యక్షుడిగా తొలి రోజుల్లోనే చాలా సవాళ్లను తీసుకురానుంది. ట్రంప్ మీద తీర్పు చెప్పే ప్రక్రియలో సెనేట్ తలమునకలై ఉండటం వల్ల.. బైడెన్ ఎంతగానో ఆకాంక్షిస్తున్న మొదటి 100 రోజుల అజెండా అమలు మీద దృష్టి కేంద్రీకరించటం సాధ్యం కాకపోవచ్చు.

అలాగే.. బైడెన్ చేపట్టిన పరిపాలనా నియామకాలను కూడా వేగంగా నిర్ధారించలేకపోవచ్చు. దానివల్ల సమాఖ్య ప్రభుత్వాన్ని విజయవంతంగా నిర్వహించటంలో బైడెన్ సామర్థ్యాలు పరిమితమవుతాయి.

సెనేట్ చట్టాలు చేయటం, నియామకాలను నిర్ధారించటం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఆ పనులు లేని సమయంలో ట్రంప్ అభిశంసన విచారణను సెనేట్ 'పార్ట్-టైమ్’ విధానంలో నిర్వహించగలదా అని కూడా బైడెన్ అడిగారు.

అయితే.. ఈ ప్రణాళికతో రిపబ్లికన్లు కలిసివస్తారనే హామీ లేదు.

ఏ కొత్త అధ్యక్షుడికైనా మొదటి 100 రోజుల సమయం చాలా కీలకమైన కాలం. ఆ కాలంలో సదరు అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలి రాజకీయ ప్రభావం అత్యంత అధిక స్థాయిలో ఉంటుంది. అయితే.. ఇప్పుడు జరుగుతున్న ఈ పోరాటం వల్ల బైడెన్ అధికారం కొంత మేరకైనా కరిగిపోతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Trump impeachment on US and Biden
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X