హెచ్4 వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చట్టసభలో బిల్లు...
కాలిఫోర్నియా : హెచ్4 వీసాలను రద్దు చేయాలన్న అమెరికా నిర్ణయం విదేశీయుల పాలిట శాపంగా మారింది. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారికి రక్షణగా కాలిఫోర్నియాకు చెందిన సెనెటర్లు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. దీంతో హెచ్ 4 వీసాదారులకు కాస్త ఊరట లభించినట్లైంది. అమెరికా చట్టసభ ప్రతినిధులైన అన్నా జి ఎషో, జో లాఫ్‌గ్రెన్‌లు వీసాదారుల రక్షణ కోసం హెచ్4 ఎంప్లాయిమెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టారు.
టెక్కీలకు షాక్ : హెచ్4 వీసా రద్దు ప్రక్రియలో పెరిగిన స్పీడ్
ఒబామా హయాంలో హెచ్4 వీసాలు
అమెరికాలో హెచ్ 1బీ వీసాలపై పనిచేస్తున్న వ్యక్తుల జీవిత భాగస్వాములు, వారి 21ఏళ్ల లోపు వయసున్న పిల్లలకు హెచ్ 4 వీసా ఇస్తారు. ఈ వీసా ద్వారా వారు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి లభిస్తుంది. 2015లో అప్పటి ఒబామా సర్కారు హెచ్ 4 వీసాలు ప్రవేశపెట్టింది. అమెరికాలో సాంకేతిక నిపుణుల కొరత ఉండటంతో ఆ లోటు భర్తీ చేసుకునేందుకు ఒబామా ప్రభుత్వం హెచ్ 4వీసాలను తెరపైకి తెచ్చింది. దీంతో పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో హెచ్ 1బీ వీసాదారుల భార్య లేదా భర్తలు కూడా ఉద్యోగం చేసే అవకాశం దొరికింది.
వీసా రద్దుకు ట్రంప్ మొగ్గు
హెచ్ 4వీసాల వల్ల చైనా, భారత్ తదితర దేశాలకు చెందిన వారు లాభపడుతున్నారని, స్థానికులు ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారన్న వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2017లో అధికారం చేపట్టిన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒబామా సర్కారు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గతేడాది ఫిబ్రవరిలో హెచ్ 4 వీసా రద్దు ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. 2018 అక్టోబర్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ కూడా ఈ ప్రతిపానకు ఓకే చెప్పడంతో హెచ్ 4 వీసాదారుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది.
లక్షల మందిపై ప్రభావం
ఒబామా ప్రవేశపెట్టిన హెచ్ 4 వీసాలతో భారత్‌కు చెందిన మహిళలు ఎక్కువగా లబ్ది పొందారు. ఇప్పటి వరకు దాదాపు లక్ష మంది వర్క్ పర్మిట్ పొంది ఉద్యోగాలు చేస్తున్నారు. ట్రంప్ నిర్ణయంతో వీరందరి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలో సెనెటర్లు వారందరికీ భరోసా ఇస్తూ చట్టసభలో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయంతో ట్రంప్ సర్కారు హెచ్ 4 వీసాల రద్దు విషయంలో పునరాలోచించే అవకాశం ఉంది.