మిషన్ మార్స్: రెడ్ ప్లానెట్‌పై పరిశోధనలు: గల్ఫ్ కంట్రీ సంచలనం: ఏడు నెలల్లో: అరబ్ దేశాల్లో
అబుధాబి: అంగారక గ్రహంపై పరిశోధనలను సాగించడానికి మరో దేశం ముందడుగు వేసింది. మిషన్ టు మార్స్‌ను ప్రారంభించింది. అంగారకుడిపై పరిశోధనలను చేపట్టిన దేశాల జాబితాల సరసన చేరింది. అదే- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, సంక్లిష్టమైన ఈ ప్రాజెక్టును చేపట్టిన తొలి గల్ఫ్ దేశంగా రికార్డును సృష్టించింది యూఏఈ. పరిశోధనలను కొనసాగిస్తోన్న కొద్దీ అద్భుతాలను అందిస్తోన్న మార్స్‌పై ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. దీనికోసం 200 మిలియన్ డాలర్ల మొత్తాన్ని వ్యయం చేసింది.
జపాన్ స్పేస్ సెంటర్ నుంచి..
జపాన్‌లోని తనెగాషిమా స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత 1:58 నిమిషాలకు యూఏఈ శాస్త్రవేత్తలు ప్రోబ్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఈ మిషన్ ద్వారా ప్రోబ్ మిషన్‌ను అంగారకుడిపైకి పంపించనున్నారు. దీనికి హోప్ అని నామకరణం చేశారు. తాము ప్రయోగించిన అంతరిక్ష వాహక నౌక నిర్దేశిత మార్గంలోనే ప్రయాణిస్తోందని వెల్లడించారు. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు తెలిపారు. ప్రయోగించిన తేదీ నుంచి సరిగ్గా ఏడు నెలల కాలంలో ఈ ప్రోబ్ అంగారక కక్షలోకి ప్రవేశిస్తుందని, డేటాను కంట్రోల్ సెంటర్‌కు పంపించడం ఆరంభమౌతుందని అన్నారు.

గంటకు 1,21,000 కిలోమీటర్ల స్పీడ్..
గంటకు 1,21,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా దీన్ని రూపొందించినట్లు చెప్పారు. నిజానికి ఈ ప్రాజెక్టును ఈ నెల 14వ తేదీ నాడే ప్రయోగించాల్సి ఉన్నప్పటికీ.. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల వాయిదా వేశారు. మిషన్ మార్స్‌ను ప్రయోగించడానికి 56 గంటల ముందే కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం.. యుఏఈ కాలమానం ప్రకారం.. అర్ధరాత్రి దాటిన తరువాత 1:58 నిమిషాలు, జపాన్ కాలమానం ప్రకారం.. తెల్లవారు జామున 6:58 నిమిషాలకు తనెగాషిమా స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు.
గల్ప్ నుంచి తొలి దేశంగా..
గల్ప్ కంట్రీస్ నుంచి అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టిన మొట్టమొదటి దేశంగా అరబ్ ఎమిరేట్స్ రికార్డు సృష్టించింది. అంగారకుడిపై పరిశోధనలకు పూనుకొన్న తొలి గల్ప్ దేశం ఇదే. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది దేశాలు ప్రస్తుతం అంగారక గ్రహంపై పరిశోధనలను కొనసాగిస్తున్నాయి. కొన్ని ప్రోబ్ మిషన్లు అంగారక గ్రహ కక్షలో పరిభ్రమిస్తుండగా.. మరి కొన్ని మార్స్‌పై దిగాయి. అక్కడి నుంచి డేటాను విశ్లేషిస్తున్నాయి.

200 మిలియన్ డాలర్లు..
ఈ మిషన్ కోసం 200 మిలియన్ డాలర్లను ఖర్చు చేసినట్లు అరబ్ ఎమిరేట్స్ అడ్వాన్స్డ్ సైన్సెస్ మంత్రి సారా అమిరి తెలిపారు. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి అమెరికా సహకరించినట్లు చెప్పారు. దుబాయ్‌లోని మహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ నిపుణులకు అమెరికా అంతరిక్ష పరిశోధకులు తమ సహాయ, సహకారాలను అందించినట్లు తెలిపారు. ఈ మిషన్‌ను ప్రారంభించడానికి జపాన్ సహకారించిందని అన్నారు. 2014లో తాము మిషన్ మార్స్ ప్రాజెక్టును ప్రకటించామని గుర్తు చేశారు. 2017 వరకు దీనికి అవసరమైన పరిజ్ఙానాన్ని అభివృద్ధి చేసుకున్నామని సారా అమిరి తెలిపారు.