
అసాంజే అప్పగింతకు నిర్ణయం - ఫలించిన అమెరికా కృషి : వికీలీక్స్ సంచలనం..!!
వికీలీక్స్ వ్యవస్థాపకుు జూలియన్ అసాంజే. పదేళ్ల క్రితం ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అమెరికా సైనిక, దౌత్య కార్యకలాపాలకు సంబంధించి వికీలీక్స్ సంస్థ బయటపెట్టిన రహస్యాలు కలకలం రేపాయి. అసాంజేను రప్పించేందుకు ఏళ్లుగా అమెరికా కృషి చేస్తోంది. ఇప్పుడు ఇది ఫలించింది. అసాంజేను అమెరికాకు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిపై అప్పీలు చేసేందుకు అసాంజేకు 14 రోజుల గడువు ఇస్తున్నట్లు యూకే హోంశాఖ ప్రతినిధి పేర్కొన్నారు.
అసాంజేను అమెరికాకు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది. అసాంజేను యూఎస్‌కు అప్పగించే అన్ని రకాల ప్రక్రియలకు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు యూకే హోంశాఖ వెల్లడించింది. అసాంజేపై గూఢచర్యానికి సంబంధించి 17 అభియోగాలు ఉన్నాయి. వికీలీక్స్ సంస్థపై కంప్యూటర్ దుర్వినియోగం కేసు ఉందని అమెరికా తొలి నుంచి వాదిస్తోంది. ఈ అభియోగాల్లో ఆయనకు దాదాపుగా 175 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ గూఢచర్యం కేసులో అసాంజేను తమ దేశానికి తీసుకొచ్చేందుకు అమెరికా ప్రయత్నం చేస్తూనే ఉంది. గతంలో చేసిన అప్పీల్ తిరస్కరించారు. అసాంజే అమెరికా జైళ్ల గురించి పలు అంశాలను తెర మీదకు తీసుకొచ్చి ఉపశమనం పొందుతూ వచ్చారు. కానీ, అమెరికా మాత్రం తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఫలితంగా ఇప్పుడు అసాంజేను యూఎస్‌కు అప్పగించేందుకు బ్రిటన్ నిర్ణయించింది. అసాంజే అప్పీల్ కు సమయం ఇవ్వటంతో దీని పైన నిర్ణయం ఏ రకంగా ఉంటుందనేది చూడాల్సి ఉంది.