వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడే బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికలు: ప్రధాన అస్త్రాల్లో వలసలకు చోటు

ఒకనాడు భూగోళంపై నలువైపులా వలస రాజ్యాలు స్థాపించి రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరొందిన బ్రిటన్‌.. ఈనాడు తన దేశంలోకి విదేశీ నిపుణుల వలసలపై గుర్రుమంటోంది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

లండన్: ఒకనాడు భూగోళంపై నలువైపులా వలస రాజ్యాలు స్థాపించి రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరొందిన బ్రిటన్‌.. ఈనాడు తన దేశంలోకి విదేశీ నిపుణుల వలసలపై గుర్రుమంటోంది. స్థానికులకు ఉపాధి కల్పించడంతోపాటు ప్రజాసేవల వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు వీటికి భారీగా కోత పెట్టడమే మార్గమని వాదిస్తోంది.

బ్రిటన్ పార్లమెంట్‌కు గురువారం ఎన్నికలు జరుగుతున్న వేళ 'విదేశీ వలసల' అంశం కూడా ప్రధాన అస్త్రంగా మారింది. పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికి అధికార కన్జర్వేటివ్ పార్టీ లబ్ధి పొందనున్నదన్న సంకేతాలు లభించాయి. ఎన్నికల్లో తాము మళ్లీ గెలిస్తే ప్రతి ఏడాది నికర వలసలను లక్ష మందికి లోపే పరిమితం చేస్తామని అధికార కన్జర్వేటివ్‌ పార్టీ నాయకురాలు, ప్రధాని థెరిసా మే చెబుతున్నారు. కానీ నికర వలసల నివారణ సమస్య కాదని, దేశ ప్రగతి అన్ని ప్రాంతాల్లో ఒక విధంగా లేదని ముందు దానిపై ద్రుష్టి సారించాలని విపక్ష లేబర్ పార్టీ వాదిస్తున్నది.

ప్రజాభిమతానికి అనుగుణంగా అధికార కన్జర్వేటివ్ పార్టీ ప్రచార వ్యూహాలు రచిస్తుండగా, విపక్ష లేబర్ పార్టీ సంప్రదాయ విధానాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు పరిణామాలు చెప్తున్నాయి. తాజాగా నిర్వహించిన సర్వేలో లేబర్ పార్టీ నేత జెరిమే కార్బైన్‌కు రికార్డు స్థాయిలో మూడు పాయింట్లు తగ్గిపోవడం, అధికార కన్జర్వేటివ్ పార్టీకి మేలు కలిగించేదేనని అంటున్నారు. కన్జర్వేటివ్ పార్టీకి 43 శాతం ప్రజల మద్దతు లభిస్తుండగా, ప్రతిపక్ష లేబర్ పార్టీ 36.5 శాతం, లిబరల్ డెమొక్రాట్లు 8, యూకేఐపీ కేవలం 4.3 శాతం ఓట్లు పొందుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, గత నెల రోజుల్లోనే మాంఛెస్టర్, లండన్‌లో ఉగ్రవాద పేలుళ్లు జరిగినా పోలింగ్‌పై ఇసుమంత ప్రభావం చూపదని చెప్తున్నారు.

కన్జర్వేటివ్ పార్టీకే మొగ్గు

కన్జర్వేటివ్ పార్టీకే మొగ్గు

నికర వలసలపై ఆంక్షలు అమలులోకి వస్తే ఈయూ (ఐరోపా యూనియన్) వెలుపలి దేశాలతోపాటు ఈయూపైనా ప్రభావం ఉంటుంది. అయితే బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీకే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికే కఠిన నిబంధనలతో అవకాశాలు కోల్పోతున్న భారత్‌ లాంటి దేశాలకు బ్రిటన్ ప్రధాని థెరిసా మే వైఖరి ఆందోళనకరమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అల్పాదాయ వర్గాలు ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఒత్తిడిని తగ్గించేందుకు వలసలకు సత్వరం భారీ కోత విధించక తప్పదని ఆమె వాదన. ఈయూ నుంచి వైదొలగే ప్రక్రియ పూర్తయ్యాక అక్కడి నుంచి కూడా వలసలను నియంత్రిస్తామని, నికర వలసల లెక్కింపులో విదేశీ విద్యార్థులను మినహాయించబోమని బ్రిటన్ ప్రధాని థెరిసా మే తేల్చి చెప్పారు.

బ్రిటన్‌లో తగ్గుతున్న నికర వలసలు

బ్రిటన్‌లో తగ్గుతున్న నికర వలసలు

విద్యాభ్యాసం కోసం వచ్చే విదేశీయుల్లో అత్యధికులు చైనా, భారత్‌ లాంటి ఆసియా దేశాల విద్యార్థులే. 2010-11లో 39,090 మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసానికి బ్రిటన్‌కు వెళితే 2014-15 నాటికి 18,320 మందికి పడిపోయింది. ప్రస్తుతం 18-19 వేల మంది అక్కడ అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పీజీ కోర్సులు చేస్తున్నారు. కనీసం ఏడాది కాలానికి దేశంలోకి వలస వచ్చే, దేశం నుంచి వలస వెళ్లే వారి సంఖ్య మధ్య తేడాను ‘నికర వలసలు (నెట్‌ ఇమ్మిగ్రేషన్‌)'గా పిలుస్తారు. 1997 తర్వాత ఇప్పటివరకు ఎన్నడూ ఇవి లక్షకు లోపు పరిమితం కాలేదు. 2015 - 16లో మొత్తం 5.96 లక్షల మంది వలసలు వెళితే వారిలో నికర వలస వెళ్లిన వారు 2.73 లక్షలని తేలింది. ఇక భారత్, ఈయూయేతర దేశాల నుంచి వలస వెళ్లిన నిపుణులు, విద్యార్థుల సంఖ్య రమారమీ 1.64 లక్షల మంది ఉంటారు. భారీ సంఖ్యలో విదేశీయులు వలస రావడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న. తమకు ఉపాధి అవకాశాలు, వేతనాలు తక్కువగా ఉండటానికి విదేశీయుల వలసలే కారణమన్న ప్రచారం, కొత్తగా పుట్టుకొచ్చే ఉద్యోగాలను గరిష్ఠ స్థాయిలో బ్రిటన్‌ జాతీయులు పొందలేకపోతుండటమే ఇందుకు ప్రధాన కారణాలని వారు భావిస్తున్నారు.

ప్రగతిపై ద్రుష్టి సారించాలంటున్న లేబర్ పార్టీ

ప్రగతిపై ద్రుష్టి సారించాలంటున్న లేబర్ పార్టీ

ఈయూ వెలుపలి దేశాల నుంచి వలస వచ్చే వారిని ఉద్యోగిగా నియమించుకునే సంస్థ ప్రభుత్వానికి ఏటా చెల్లించాల్సిన నైపుణ్య ఛార్జీని ప్రస్తుతం ఉన్న వెయ్యి పౌండ్ల (దాదాపు రూ.84,167) నుంచి రెండు వేల పౌండ్ల (రూ.1,68,334)కు పెంచుతామని కన్జర్వేటివ్ పార్టీ హామీ ఇస్తున్నది. జాతీయ ఆరోగ్య సేవ కింద ఈయూయేతర దేశాల పౌరులు వైద్యసేవలను పొందడానికి మరింత చెల్లించేలా చేస్తామని, విద్యార్థి వీసా నిబంధనలను కూడా ఇంకా కఠినతరం చేస్తామని థెరిసా మే సారథ్యంలోని కన్జర్వేటివ్‌లు హామీ ఇస్తున్నారు. యూకేఐపీ పార్టీ మాత్రం నికర వలసలే ఉండరాదని ప్రచారం చేస్తున్నది. గమ్మత్తేమిటంటే విపక్షంలో ఉన్న లేబర్‌ పార్టీ మాత్రం ఉపాధి కల్పనకు, ఆర్థిక వృద్ధికి వలసలు దోహదం చేస్తున్నాయని వాదిస్తున్నది. ఉపాధి, వృద్ధి దేశమంతటా సమానంగా లేవన్న అంశంపై దృష్టి పెడితే సరిపోతుందని లేబర్ పార్టీ సూచిస్తున్నది. ఈయూ నుంచి బ్రిటన్‌ బయటకొస్తే భారత్‌, ఇతర కామన్వెల్త్‌ దేశాల పౌరులకు వీసా నిబంధనలను సరళతరం చేస్తామని ‘బ్రెగ్జిట్‌'కు మద్దతిచ్చిన కన్జర్వేటివ్‌ పార్టీ నేతలు చెప్పారని లిబరల్‌ డెమొక్రాట్లు గుర్తు చేస్తున్నారు. కానీ కన్జర్వేటివ్‌లు ఇప్పుడు మాట తప్పుతున్నారని, ప్రధాని థెరిసా వైఖరి భారత్‌ లాంటి కీలక భాగస్వాములతో ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.

వలసల ఆంక్షలపై కన్జర్వేటివ్‌ల్లో సందేహాలు

వలసల ఆంక్షలపై కన్జర్వేటివ్‌ల్లో సందేహాలు

ఏడేళ్లుగా నికర వలసలను లక్ష మంది లోపునకు కన్జర్వేటివ్‌ పార్టీ చెబుతున్నా ఈ లక్ష్య సాధనపై ఆ పార్టీ నేతల్లోనే సందేహాలు ఉన్నాయి. మరోవైపు ఈయూయేతర దేశాల విద్యార్థులు, నిపుణుల వలసలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. దీని ప్రకారం 2012లో టైర్‌-1 పోస్ట్‌-స్టడీ వర్క్‌ వీసా రూపంలో విద్యాభ్యాసానంతరం రెండేళ్ల వరకు బ్రిటన్‌లో ఉద్యోగం చేసేందుకున్న వెసులుబాటును తొలగిస్తామని చెప్పింది. టైర్‌-2 వీసాపై ఉన్న ఈయూ వెలుపలి దేశాల ఉద్యోగులకు చెల్లించాల్సిన కనీస వార్షిక వేతనాన్ని దాదాపు 21 వేల పౌండ్ల(రూ.17.68 లక్షల) నుంచి 35 వేల పౌండ్లకు (రూ.29.46 లక్షలకు) పెంచి, వెయ్యి పౌండ్ల నైపుణ్య ఛార్జీని విధిస్తామని కన్జర్వేటివ్ పార్టీ హామీ ఇచ్చింది.

ఇక భారతీయ నిపుణులకు కష్టకాలమేనా?

ఇక భారతీయ నిపుణులకు కష్టకాలమేనా?

2016లో ఐరోపా ఆర్థిక ప్రాంతేతర (ఈఈఏ) నిపుణులకు నైపుణ్య వృత్తి విభాగంలో ఇచ్చిన వీసాల్లో అత్యధికంగా 42 శాతం ఐటీ నిపుణులకే లభించాయి. మొత్తం ఈయూయేతరులు నిపుణుల వాటాలో 93,244 మంది వీసాలు పొందితే 53,575 మంది భారతీయులు ఉన్నారు. దీని ప్రకారం భారతీయుల వాటా 57%గా నమోదైంది. బ్రిటన్‌ విద్యాసంస్థల్లో భారతీయుల ప్రవేశాలు తగ్గిన సమయంలోనే ఆస్ట్రేలియా, అమెరికాల్లో బాగా పెరిగాయి. ఇప్పుడు ఆ రెండు దేశాలూ వీసా నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులు ప్రత్యామ్నాయాలు అన్వేషించక తప్పడం లేదు. వారు న్యూజిలాండ్‌, జర్మనీ లాంటి దేశాల వైపు చూస్తున్నారు.

English summary
London: Following the Second World War, Britain raised a call for “immigrants of good stock” to aid in the rebuilding efforts in the country. The demand, however, was aimed at white immigrants from areas in Eastern Europe that had been equally devastated by the war, such as Poland and the Baltic states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X