కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోందోచ్: ఆ దేశంలో 7 నుంచి వినియోగం: వారికి ప్రాధాన్యత: రష్యా తరువాత
లండన్: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించే దిశగా ఒక్కో అడుగు పడుతోంది. ఇదివరకు చేపట్టిన కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు.. ఇప్పుడిప్పుడే ఫలిస్తున్నాయి. అందుబాటులోకి వస్తున్నాయి. మరో దేశం కరోనా వ్యాక్సిన్‌ను తీసుకుని రానుంది. దీనిపై కీలక ఉత్తర్వులను జారీ చేసింది. బ్రిటన్‌లో ఈ నెల 7వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ సాధారణ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రాధాన్యత క్రమంలో వాటిని పంపిణీ చేస్తారు.
బాలీవుడ్ స్టార్ హీరోకు సోకిన కరోనా వైరస్: ఫామ్‌హౌస్‌లో రెస్ట్: బీజేపీ నేతల పరామర్శ

ఫైజర్-బయో ఎన్‌టెక్..
రష్యా, చైనా తరువాత కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఇచ్చిన మూడో దేశం.. బ్రిటన్. ఫైజర్ రూపొందించిన వ్యాక్సిన్‌కు బ్రిటన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ దేశ హెల్త్ రెగ్యులేటరీ మిషన్ కొద్దిసేపటి కిందట ఆదేశాలను ఇచ్చింది. అమెరికాకు చెందిన ఫార్మాసూటికల్స్ జెయింట్ ఫైజర్, బయో ఎన్‌టెక్ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. బయో ఎన్‌టెక్ జర్మనీకి చెందిన కంపెనీ.

గడువుకు ముందే..
అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్దేశిత గడువు కంటే ముందే.. ఈ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఇచ్చింది బ్రిటన్ రెగ్యులేటరీ. నిజానికి- క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25వ తేదీన ప్రారంభించాలని ప్రణాళికలను రూపొందించుకుంది. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వెంటనే అందుబాటులోకి తీసుకుని రావాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. 95 శాతం మేర తమ వ్యాక్సిన్ ప్రభావం చూపుతుందని ఇదివరకే ఫైజర్ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే.

60 వేల వరకు కరోనా మరణాలు..
బ్రిటన్‌లో కరోనా వైరస్ తీవ్రత భారీగా ఉంటోంది. ఆ దేశ ప్రధాని సైతం స్వయంగా కరోనా బారిన పడి, కోలుకున్నారు. ప్రస్తుతం బ్రిటన్‌లో 16,43,086 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. 59,051 మంది ఈ మహమ్మారికి బలి అయ్యారు. రోజూ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జాప్యం చేయకూడదని నిర్ణయించుకున్న బ్రిటన్ ప్రభుత్వం.. ఫైజర్-బయో ఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చింది.

7 నుంచి వినియోగం
ఈ నెల 7వ తేదీ నుంచి వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ప్రాధాన్యత క్రమంలో వాటిని పంపిణీ చేస్తారు. 70 సంవత్సరాలకు పైబడిన వయోధిక వృద్ధులకు తొలిదశలో వ్యాక్సిన్‌ను ఇంజెక్ట్ చేస్తారు. అనంతరం దశలవారీగా వ్యాక్సిన్‌ను ఇతరులకు విస్తరింపజేస్తారు. వృద్ధులతో పాటు పిల్లలు, మహిళలకు వ్యాక్సిన్ ఇస్తారు. అనంతరం ఫ్రంట్‌లైన్ వారియర్లను దీని పరిధిలోకి తీసుకొస్తారు. వ్యాక్సిన్ రవాణాకు సంబంధించిన ఇబ్బందులను అధిగమించడానికి బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే రూట్‌మ్యాప్‌ను కూడా సిద్ధం చేసింది.

రష్యా, చైనా తరువాత..
ఇదివరకు రష్యా తొలిసారిగా వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. రష్యా దేశీయంగా తయారు చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ ప్రస్తుతం అక్కడ వినియోగంలో ఉంది. తొలిదశలో వయోధిక వృద్ధులకు దీన్ని అందిస్తున్నారు. రష్యా ప్రధానమంత్రి వ్లాదిమిర్ పుతిన్ కుమార్తె స్వయంగా స్పుత్నిక్ వ్యాక్సిన్ చేయించుకున్నారు. అనంతరం- చైనా ఆ జాబితాలో చేరింది. ఆ దేశం కూడా సొంతంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.