ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా దాడులు: కాల్పుల్లో అమెరికా జర్నలిస్టు మృతి
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడుల్లో అమెరికాకు చెందిన వీడియో జర్నలిస్ట్ ఒకరు చనిపోయారు. ఈ విషయాన్ని కీవ్‌లోని పోలీసు అధికారి ఆండ్రియా కోబిటోవ్ వెల్లిడించారు. రష్యా దళాలు ఇర్పిన్ నగరంలో జరిపిన కాల్పుల్లో జర్నలిస్ట్ చనిపోయినట్లు తెలిపారు. మృతుడిని బ్రెంట్ రెనాడ్‌గా గుర్తించారు.
ఈ మేరకు అతని మృతదేహాంతో పాటు సంస్థ గుర్తింపు కార్డు, అమెరికా పాస్‌పోర్ట్‌ను మీడియాకు చూపించారు. అయితే, మొదట అతను అమెరికాలోని ప్రతిష్ఠాత్మక వార్త సంస్థ అయిన న్యూయార్క్ టైమ్స్ ఉద్యోగిగా భావించారు. కానీ, ప్రస్తుతం బ్రెంట్ తమ సంస్థలో పని చేయడం లేదని న్యూయార్క్ టైమ్స్ యాజమాన్యం ప్రకటించింది.
ఘటనాస్థలంలో దొరికిన ఐడీ కార్డు చాలా ఏళ్ల క్రితం జారీ చేసిందని స్పష్టం చేసింది. చనిపోయిన వ్యక్తి ఇప్పటికే పాత్రికేయ రంగంలో పలు గొప్ప అవార్డులు అందుకున్నారు. సుమారు రెండు దశాబ్దాలుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగారు. జర్నలిస్ట్ మృతిపై పలు పాత్రికేయ సంఘాలు సంతాపం తెలిపాయి. రష్యాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

పోలాండ్ సరిహద్దులోనూ రష్యా దాడులు 35 మంది మృతి
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులను కొనసాగిస్తోంది. ఇప్పుడు అన్ని వైపుల నుంచి దాడులు చేయడం ప్రారంభించింది. తాజాగా పశ్చిమ ఉక్రెయిన్‌లోని సైనిక శిక్షణ స్థావరంపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో 35 మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌కు సాయంగా ఆయుధాలు సరఫరా చేస్తే.. ఆ వాహనాలు తమకు లక్ష్యాలుగా మారుతాయని రష్యా హెచ్చరించింది.
రష్యా సేనల తాజా దాడిలో అక్కడ ఉన్న లుట్స్క్ ఎయిర్ పోర్టు బాగా దెబ్బతింది. ఇది పొలాండ్ సరిహద్దులకు సమీపంలో ఉంది. ఇక్కడ ఇవనోవ్ ఫ్రాంకోవిస్క్ మిలటరీ ఎయిర్‌బేస్‌పై క్షిపణులతో దాడులు చేశారు. ఉక్రెయిన్‌లోనే అతిపెద్ద సైనిక శిక్షణ కేంద్రాల్లో ఒకటి ల్వీవ్‌లో ఉంది. రష్యా దండయాత్ర నుంచి ఇప్పటివరకు సురక్షితంగా ఉన్న ల్వీవ్‌లో.. 26 లక్షల మంది శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు. అయితే తాజా దాడితో శరణార్థులు అక్కడ్నుంచి మరో చోటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.