యుక్రెయిన్: నాటో అంటే ఏంటి, రష్యా ఎందుకు భయపడుతోంది

యుక్రెయిన్‌లో యుద్ధ ఛాయలు కమ్ముకుంటున్నాయి. మరి నాటో దేశాలు యుక్రెయిన్‌కు అందించే సహాయం విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నాయా? నాటో దేశాలతో రష్యాకు ఉన్న అభ్యంతరాలేంటి ?
యుక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తుందన్న అనుమానాల నేపథ్యంలో యుక్రెయిన్‌కు ఎంత మేరకు సహాయం చేయాలనే విషయాన్ని నాటో ఆచితూచి చూస్తోంది.
నాటో కూటమిలోని యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీలు యుక్రెయిన్ కు సహాయం అందించేందుకు సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాయి.
నాటో అంటే ఏంటి?
నాటో - నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ - ప్రచ్ఛన్న యుద్ధం తొలి దశలో 1949లో 12 సభ్య దేశాల కూటమితో ఉమ్మడి రక్షణకు ఒక రాజకీయ, సైనిక కూటమిగా నెలకొల్పారు. ఇందులో యూఎస్, కెనడా, యూకే, ఫ్రాన్స్ ఉన్నాయి.
సభ్య దేశాలపై ఎవరైనా సైనిక దాడి చేసినప్పుడు ఒకరి కోసం ఒకరు సహాయం చేసుకునేందుకు ఇవి అంగీకారం కుదుర్చుకున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత యూరప్‌లో రష్యా నుంచి విస్తరణ ముప్పును ఎదుర్కొవడమే లక్ష్యంగా ఈ సైనిక కూటమిని ఏర్పాటు చేశారు.
1955లో తూర్పు యూరప్ దేశాలతో కలిసి రష్యా ఒక సైనిక కూటమి ఏర్పాటుకు ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీనినే వార్సా ఒప్పందం అని పిలుస్తారు.
1991లో సోవియెట్ కుప్పకూలడంతో, వార్సా ఒప్పందంలో సభ్య దేశాలు కూడా నాటోలో చేరాయి. దీంతో ఆ కూటమి సభ్యత్వం 30కి పెరిగింది.
- పాశ్చాత్య దేశాలతో యుద్ధానికి రష్యా, చైనా రిహార్సల్స్ .. భవిష్యత్ యుద్ధాలు, ఆయుధాలు ఎలా ఉంటాయి?
- భవిష్యత్తులో అన్నీ రసాయన యుద్ధాలేనా?

యుక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తుందా?
రష్యా, యూరోపియన్ యూనియన్ సరిహద్దులుగా ఉన్న యుక్రెయిన్ గతంలో సోవియెట్ రిపబ్లిక్ దేశాల్లో ఒకటి. ఇది నాటో సభ్య దేశం కాదు, కానీ, భాగస్వామ్య దేశం. భవిష్యత్తులో ఈ దేశాన్ని నాటో దేశాలు తమ కూటమిలో చేర్చుకునే అవకాశం ఉంది.
అయితే, యుక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోబోమని హామీ ఇవ్వాలంటూ రష్యా డిమాండ్ చేస్తోంది. అయితే, ఆ హామీ ఇచ్చేందుకు పశ్చిమ దేశాలు సిద్ధంగా లేవు.
యుక్రెయిన్‌లో రష్యన్ మాట్లాడే జనాభా అధికంగా ఉంది. వీరికి రష్యాతో చాలా దగ్గరగా సాంస్కృతిక, సాంఘిక సంబంధాలున్నాయి. రష్యా వ్యూహాత్మకంగా యుక్రెయిన్‌ను తనలో భాగమే అన్నట్లు భావిస్తుంది.
రష్యాకున్న ఆందోళనలేంటి?
పశ్చిమ దేశాలు రష్యాను చుట్టుముట్టేందుకు ఈ నాటో భాగస్వామ్యాన్ని వాడుకుంటున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ వాదిస్తారు. నాటో తూర్పు యూరప్‌లో తన సైనిక చర్యలను నిలిపివేయాలని ఆయన కోరుతున్నారు.
తూర్పుదేశాల వైపు నాటో విస్తరించబోదని 1990లలో మాట ఇచ్చిన అమెరికా దానిని తప్పిందని పుతిన్ వాదిస్తున్నారు. అయితే, రష్యా వాదనను నాటో ఖండిస్తోంది. నాటో సభ్య దేశాల్లో కొన్ని మాత్రమే రష్యాతో సరిహద్దును పంచుకుంటున్నాయని, అది భద్రత కోసం ఏర్పడిన కూటమి అని అంటుంది.
రష్యా చేస్తున్న భద్రతా డిమాండ్లను పశ్చిమ దేశాలు సీరియస్‌గా తీసుకునేలా చేసేందుకే యుక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా సేనలను మోహరించిందని చాలా మంది భావిస్తున్నారు.
- రష్యా వర్సెస్ పశ్చిమ దేశాలు.. 'ఇది నూతన ప్రచ్ఛన్న యుద్ధం’
- బెర్లిన్ వాల్ కూలిపోయి 30 ఏళ్లయ్యాక.. యూరప్ దేశాలు ఇప్పుడు అడ్డుగోడలు ఎందుకు నెలకొల్పుతున్నాయి?

రష్యా - యుక్రెయిన్ విషయంలో నాటో గతంలో ఏం చేసింది?
2014లో రష్యాకు అనుకూలంగా ఉన్న యుక్రెయిన్ అధ్యక్షుణ్ని పదవీచ్యుతున్ని చేసిన తర్వాత రష్యా యుక్రెయిన్‌లో దక్షిణ క్రిమియా భూభాగాన్ని ఆక్రమించింది. దాంతో పాటు, తనకు అనుకూలంగా ఉంటూ, తూర్పు యుక్రెయిన్ ను ఆక్రమించిన తిరుగుబాటుదారులకు రష్యా మద్దతుగా నిలిచింది.
అప్పుడు నాటో జోక్యం చేసుకోలేదు. కానీ, కొన్ని తూర్పు యూరోప్ దేశాల్లో సైన్యాన్ని మోహరించి పరోక్షంగా హెచ్చరించింది. అలా మొదటిసారి నాటో స్పందించింది.
నాటోకు ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియా, పోలాండ్‌లో నాలుగు బెటాలియన్లున్నాయి. రొమేనియాలో ఒక దళం ఉంది.
బాల్టిక్ దేశాల్లో, తూర్పు యూరోప్ దేశాల్లో కూడా సభ్య దేశాల సరిహద్దులను ఉల్లంఘించే రష్యా విమానాలను అడ్డుకునేందుకు నాటో వాయు మార్గంలో పర్యవేక్షణను పెంచింది.
ఈ దళాలు వైదొలగాలని రష్యా డిమాండ్ చేస్తోంది.
- అమెరికా గూఢచర్యం: ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పావురాలు సీక్రెట్ ఏజెంట్స్‌గా ఎలా పని చేశాయి... గుట్టు విప్పిన సిఐఏ
- 9/11 దాడులకు 18 ఏళ్లు: తీవ్రవాదంపై పోరాటంలో అమెరికా విఫలం - అభిప్రాయం

యుక్రెయిన్‌కు నాటో హామీ ఏంటి ?
రష్యా యుక్రెయిన్‌ను ఆక్రమించిన పక్షంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించారు.
ఇప్పటికే అమెరికా 8500 మంది సైనికులను సన్నద్ధంగా ఉంచింది. కానీ, రాపిడ్ రియాక్షన్ సేనలను పంపించాలని నాటో నిర్ణయించిన తర్వాతే వారిని పంపిస్తామని పెంటగాన్ తెలిపింది.
ప్రస్తుతానికి సేనలను యుక్రెయిన్‌కు పంపే ప్రణాళికలు లేవని చెబుతోంది. సైనికపరంగా తీసుకునే చర్యలేవైనా సరే రష్యా పాలకులకు ఆర్ధికంగా, రాజకీయంగా, వ్యూహాత్మకంగా తీవ్రమైన మూల్యం చెల్లించే పరిస్థితి ఏర్పడుతుందని జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలెనా బేర్ బాక్ హెచ్చరించారు.
నాటో మిత్రదేశాలు సత్వరమే స్పందించి ఆంక్షలు విధించడం లాంటి చర్యలను వేగంగా తీసుకోవాలని యూకే అంటోంది.
- అమెరికా వర్సెస్ రష్యా: 'అణు యుద్ధ నివారణ ఒప్పందం రద్దు నిర్ణయం’పై ఆందోళనలు
- రష్యా: ప్రచ్ఛన్న యుద్ధం అనంతరం అత్యంత భారీ యుద్ధ విన్యాసాలకు సన్నాహాలు

యుక్రెయిన్ విషయంలో నాటో ఐక్యంగా ఉందా?
యుక్రెయిన్ విషయంలో యూరోపియన్ నాయకుల మధ్య ఏకాభిప్రాయం ఉందని బైడెన్ అంటున్నారు. కానీ, వివిధ దేశాలు యుక్రెయిన్ కు ప్రకటించిన మద్దతు వేర్వేరుగా ఉంది.
యుక్రెయిన్‌కు పరిస్థితులు ఇబ్బందిగా మారితే, ఫ్రంట్ లైన్ రక్షకులకు అవసరమైన ఆయుధాలు, సామగ్రిని కూడా అందించినట్లు అమెరికా చెబుతోంది. యూకే షార్ట్ రేంజ్ యాంటీ ట్యాంక్ క్షిపణులను పంపిస్తోంది.
భద్రతను పెంచేందుకు డెన్మార్క్, స్పెయిన్, నెదర్లాండ్స్ లాంటి కొన్ని సభ్య దేశాలు ఫైటర్ జెట్లు, యుద్ధ నౌకలను తూర్పు యూరప్ పంపిస్తున్నాయి.
అయితే, జర్మనీ మాత్రం సంక్షోభంలో ఉన్న ప్రాంతాలకు ఆయుధాలను పంపకూడదనే విధానానికి అనుగుణంగా రక్షణాత్మక ఆయుధాల కోసం యుక్రెయిన్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. దీనికి బదులుగా వైద్య సహాయాన్ని అందిస్తామని చెప్పింది.
మరో వైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ మాత్రం ప్రస్తుత పరిస్థితిని నివారించేందుకు రష్యాను చర్చలకు రమ్మని ఆహ్వానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- బ్యాక్టీరియాలు మందులకు లొంగట్లేదు.. చిన్నచిన్న ఇన్ఫెక్షన్లకూ యాంటిబయోటిక్స్ వాడటమే కారణమా?
- వృద్ధుడి మృతదేహంతో పోస్టాఫీసుకు వచ్చారు.. పెన్షన్ ఇవ్వమని అడిగారు.. ఆ తర్వాత..
- 10 కోట్ల మంది ఆకలి తీర్చే ఆఫ్రికా అరటి చెట్టు.. దీని పండ్లు మాత్రం తినడానికి పనికిరావు
- భర్తతో సెక్స్‌కు నో చెప్పే హక్కు భార్యకు లేదా? మ్యారిటల్ రేప్‌పై ఎందుకు చర్చ జరుగుతోంది
- ఈ పండ్లను బంగారంలా చూస్తారు.. వీటి కోసం దొంగల ముఠాలు కాపు కాస్తుంటాయి
- ఒమిక్రాన్ సోకిన వారిలో కనిపించే లక్షణాలు ఏంటి... ఈ లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)