అలస్కా తీరంలో భారీ భూకంపం: సునామీ హెచ్చరికలు, సురక్షిత ప్రాంతాలకు ప్రజలు
లాస్ఏంజెల్స్: అమెరికాలోని అలస్కా తీరంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.5గా రిక్టారు స్కేలుపై నమోదైంది. దీంతో సముద్ర తీరంలో సునామీ అలలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని అక్కడి అధికారులు తెలిపారు

సునామీ హెచ్చరికలు.. జనం తరలింపు
సునామీ హెచ్చరికల నేపథ్యంలో తీరప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సునామీ ప్రభావం ఉండటంతో అలస్కా పెనిసులా లాంటి భారీ జనసాంద్రత కలిగిన ప్రాంతాల నుంచి కూడా జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ది నేషనల్ ఓసియానిక్, ఆట్మస్పెరిక్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.
అలస్కా నగరంలోని సముద్ర తీరం వద్ద రెండు అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి.

భూకంప, సునామీ ప్రభావం వందల కిలోమీటర్లు కానీ..
అలస్కాకు 100 కిలోమీటర్ల దూరంలో.. 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంప, సునామీ ప్రభావం వందల కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలోని అంకోరేజ్ నగరం వద్ద ఈ భూకంప, సునామీ ప్రభావం ఆగిపోతోందని తెలిపారు. కాగా, సునామీ ప్రభావం అంత పెద్దగా ఉండబోదని ఎన్ఓఏఏ స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల వరకే దీని ప్రభావం కొంత మేర ఉంటుందని తెలిపింది.

భూకంప తీవ్రత ఎక్కువే కానీ.. భారీ నష్టం లేదు
అలస్కా పెనిసులా కమ్యూనిటీ కింగ్ కోవ్ సమీపంలో ఈ భూకంపం సంభవించిందని, అయితే, నగరంపై పెద్దగా ప్రభావం చూపలేదని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని సిటీ పాలనాధికారి గ్యారీ హెన్నింగ్ అక్కడి మీడియా సంస్థలకు తెలిపారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో భవనాల్లోని వస్తువులు అటూ ఇటూ కదిలాయని వెల్లడించారు. ఈ భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రాణ, ఆస్తి నష్టం అత్యంత తక్కువగానే సంభవించి ఉంటుందని యూనైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

భూకంప ప్రభావిత ప్రాంతంలోనే అలస్కా
సుమారు మూడు నెలల క్రితం 7.8 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించిందని, అంతకుముందు 5.0 తీవ్రతతో కూడిన భూకంపాలు సంభవించాయని పేర్కొన్నారు.
కాగా, అలస్కా.. భూకంప క్రియాశీల పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉండటం గమనార్హం. 1964, మార్చిలో ఈ రాష్ట్రంలో అత్యంత భయంకరమైన భూకంపం 9.2 తీవ్రతతో సంభవించింది. ఈ భూకంపం, సునామీ కారణంగా సుమారు 250 మంది ప్రజలు బలయ్యారు.