ఇన్సైడర్ ఎటాక్..? నివురు గప్పిన నిప్పులా వాషింగ్టన్... బైడెన్‌కు పొంచి వున్న ముప్పు?
అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి ఇంకా కొద్ది గంటల సమయమే ఉంది. టైమ్ దగ్గరపడుతున్న కొద్ది వాషింగ్టన్లో క్షణ క్షణం ఉత్కంఠ పెరుగుతోంది. ఈ నెల 6న క్యాపిటల్ భవనంపై దాడి దృష్ట్యా బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవ సమయంలోనూ అనూహ్య దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు ఇప్పటికే రక్షణ శాఖను అప్రమత్తం చేశాయి. అంతేకాదు,భద్రతా సిబ్బంది నుంచే దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు ఇంటలిజెన్స్ పసిగట్టడంతో... వాషింగ్టన్లో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

నివురు గప్పిన నిప్పులా వాషింగ్టన్...
ఒక రకంగా వాషింగ్టన్ ఇప్పుడు నివురు గప్పిన నిప్పులా ఉంది. ఏవైపు నుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న ఆందోళనలో అధికారులు ఉన్నారు. ఇప్పటికే దాదాపు 25వేల మంది జాతీయ భద్రతా బలగాలను రక్షణ శాఖ వాషింగ్టన్లో మోహరించింది. ఆర్మీ సెక్రటరీ రియాన్ మెక్‌కార్తీ మాట్లాడుతూ.. బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఉన్న ముప్పు పట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఎక్కడ ఏ సమస్య తలెత్తినా వెంటనే స్పందించేలా కమాండర్లు వ్యవహరించాలని సూచించారు. ఇప్పటికైతే ఏ నాయకుడికీ ఎటువంటి బెదిరింపులు రాలేదన్నారు. అధికారుల దర్యాప్తు లోనూ ఏ సమస్యనూ గుర్తించలేదన్నారు.

తనిఖీలు ముమ్మరం...
'మేము నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం. ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు,రక్షణ తదితర బాధ్యతల్లో ఉన్న ప్రతీ ఒక్కరినీ రెండు,మూడుసార్లు తనిఖీ చేస్తున్నాం. అంతర్గత దాడులకు పాల్పడేవారిని ఎలా గుర్తించాలన్న దానిపై నేషనల్ గార్డ్స్‌కు కూడా శిక్షణ ఇస్తున్నాం. గార్డ్స్‌లో ఎవరైనా తీవ్రవాద భావజాలం కలిగినవారి గురించి తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నాం. మరోవైపు ఎఫ్‌బీఐ కూడా తన నిఘాను కొనసాగిస్తోంది.' అని రియాన్ మెక్‌కార్తీ తెలిపారు.

ట్రంప్ మద్దతుదారుల నుంచి ముప్పు?
సెప్టెంబర్ 11, 2001లో అమెరికా ట్రేడ్ సెంటర్‌పై దాడుల తరువాత అంతర్గత దాడులపై అమెరికా ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతోంది. చాలా సందర్భాల్లో అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ లేదా వాటి ప్రేరేపిత వ్యక్తుల నుంచే అంతర్గత దాడులు జరిగాయి. కానీ అందుకు విరుద్ధంగా స్వదేశీయులైన శ్వేత జాతి ఆధిపత్యవాదులు,సాయుధులైన ట్రంప్ మద్దతుదారుల నుంచే ఈసారి ప్రమాదం పొంచి ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకల వల్లే తాను ఓడిపోయానని ట్రంప్ చెప్తున్న మాటలను వీళ్లలో చాలామంది విశ్వసిస్తున్నారు. మితవాద,తీవ్రవాద భావజాలంతో ఉన్న వీరు బైడెన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో అల్లర్లు సృష్టించవచ్చునన్న అనుమానాలు బలంగా ఉన్నాయి.

సైనికులతో మాట్లాడుతున్న నేషనల్ గార్డ్స్ జనరల్...
వాషింగ్టన్లో జాతీయ భద్రతా బలగాల మోహరింపు తర్వాత నేషనల్ గార్డ్స్ జనరల్ డేనియల్ ఆర్.హోకాన్సన్ నేరుగా రంగంలోకి దిగారు. అంతర్గత దాడులకు అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో సైనికులతో ఆయన స్వయంగా మాట్లాడుతున్నారు. 'మన సైనికులు లేదా వాయుసేన దళ సభ్యుల్లో ఎవరైనా తీవ్రవాద భావజాలంతో కనిపిస్తే వెంటనే వారిని లా ఎన్ఫోర్స్మెంట్కు అప్పగిస్తాం. లేదా చైన్ ఆఫ్ కమాండ్ ద్వారా తక్షణ చర్యలు తీసుకుంటాం.' అని ఆర్మీ సెక్రటరీ రియాన్ మెక్‌కార్తీ సైనికులతో చెప్పారు.