ఓటమికి సిద్ధమైపోతున్న ట్రంప్- ఫలితాలు ధిక్కరిస్తానని ప్రతిన- ఊహించిందేనన్న బిడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మరో 24 గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ముందస్తు పోలింగ్ నిర్వహించడం అందులో రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ కంటే డెమోక్రాట్ అభ్యర్ధి బిడెన్ ముందంజలో ఉన్నారన్న సంకేతాలు రావడం సంచలనం రేపుతోంది. ఇప్పుడు ఇదే అంశం ట్రంప్‌ను కలవరపెడుతోంది. ఈహించినట్లుగానే ఆయన ఈ ఎన్నికల ఫలితాలను తాను అంగీకరించబోనని బహిరంగంగానే ప్రచారంలో చెప్పేశారు. దీనిపై స్పందించిన డెమోక్రాట్ అభ్యర్ధి జో బిడెన్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు సిద్ధం కావాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. దీంతో ఎన్నికల పోలింగ్ అనంతరం అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ముందంజలోనే బిడెన్..
ఇప్పటికే దాదాపు 10 మిలియన్ ఓటర్లకు పైగా ఓట వేసిన ముందస్తు పోలింగ్‌లో డెమోక్రాట్ అభ్యర్ధి జో బిడెన్ తన ప్రత్యర్ధి, రిపబ్లికన్ అభ్యర్ధి ట్రంప్ కంటే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఐదు స్వింగ్ రాష్ట్రాలకు వచ్చే సరికి బొటాబొటీ మెజారిటీని సైతం ఆయన కొనసాగిస్తున్నారు. స్వింగ్ రాష్ట్రాల్లో ఒకటైన పెన్సిల్వేనియాలోనూ కీలకమైన నాలుగు పాయింట్ల ఆధిక్యాన్ని బిడెన్ అందుకున్నారు. ఫ్లోరిడాలోనూ ఆయనకు అనుకూలంగా ఫలితం ఉండొచ్చని తెలుస్తోంది. దీంతో సహజంగానే ఆయన ప్రత్యర్ధి ట్రంప్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి. స్వింగ్ రాష్ట్రాల్లోనూ ఆధిక్యం కొనసాగించలేకపోతే ఇక ఓటమి ఒప్పుకోక తప్పని పరిస్ధితులు ట్రంప్‌కు ఎదురవుతున్నాయి. దీంతో ట్రంప్‌లో అసహనం కట్టలు తెంచుకుంటోంది.

ఫలితాలు ధిక్కరిస్తామన్న ట్రంప్...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాగైనా అధికారం నిలబెట్టుకునేందుకు ఇన్నిరోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేసిన రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ పోలింగ్‌కు మరికొన్ని గంటలే మిగిలున్న నేపథ్యంలో సహనం కోల్పోయారు. ఫలితాలు తనకు ఎలాగూ అనుకూలంగా రావడం లేదని నిఘా నివేదికలతో తేలిపోవడంతో ఆయన ప్రచారంలో అసహనంగా కనిపించారు. ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయన్న అంచనా ఉన్న ఐదు స్వింగ్ రాష్ట్రాల్లో ఆదివారం ప్రచారం నిర్వహించిన ట్రంప్ తాను అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరించించే ప్రశ్నే లేదని మరోమారు స్పష్టం చేశారు. దీంతో ఎన్నికల్లో తీవ్ర కలకలం రేగుతోంది.

ట్రంప్ మేకపోతు గాంభీర్యం...
కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించిన ట్రంప్ ఎన్నికల ఫలితాలను అంగీకరించబోనంటూనే మరోవైపు పోలింగ్‌లో తాను ముందంజలో ఉన్నట్లు మద్దతుదారులకు చెప్పారు. మిచిగాన్‌లో వాషింగ్టన్ టౌన్షిప్లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొ్న్న ట్రంప్.. తాను ఫ్లోరిడా, జార్జియాలో ముందంజలో ఉన్నానని, టెక్సాస్‌లో గట్టి పోటీ ఉందని ప్రత్యర్ధులు చెబుతున్నారని, నాలుగేళ్ల క్రితం కూడా ఇలాంటి ప్రచారాలే చేశారని, చివరికి తాను భారీ మెజారిటీతో నెగ్గానని ట్రంప్ వ్యాఖ్యానించారు. తద్వారా తాను నెగ్గుతున్నట్లు మద్దతుదారులను ఉత్సాహపరిచేందుకు ట్రంప్ ప్రయత్నించారు.

ప్రజాస్వామ్యం కాపాడుకోవాలని బిడెన్ పిలుపు..
ఈ ఎన్నికల ఫలితాలను తాను ఎట్టిపరిస్దితుల్లోనూ అంగీకరించబోనని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రత్యర్ధి బిడెన్ స్పందించారు. ఇదంతా తాము ముందునుంచీ ఊహించిందే అన్నారు. ఈ దేశాన్ని విభజించిన అధ్యక్ష పాలనకు త్వరలోనే శుభంకార్డు పడుతుందని బిడెన్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ముందుకు రావాలని ఓటర్లను బిడెన్ అభ్యర్ధించారు. ఈ ఎన్నికల్లో ఓటమిని ఒప్పుకోకుండా ట్రంప్ చేస్తున్న విఫల ప్రయత్నాలను తిప్పికొట్టాలని తన మద్దతుదారులకు, ఓటర్లకు బిడెన్ పిలుపునిచ్చారు.
కరోనాపై పోరులో విఫలమై లక్షలాది అమెరికన్ల ప్రాణాలు బలిగొన్న ట్రంప్ దాదాపు నేరస్తుడే అని బిడెన్ వ్యాఖ్యానించారు.