ఫైనల్ స్టేజ్: 25వ సవరణ ప్రయోగం: బలిపీఠంపై ట్రంప్: యూఎస్ హౌస్‌లో ఆ తీర్మానం ఆమోదం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఉద్వాసన పలకడానికి రంగం సిద్ధమైంది. 25వ సవరణ ద్వారా ఆయనను పదవి నుంచి తొలగించడానికి ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. దీనికి సంబంధించిన తీర్మానాన్ని అమెరికా ఉభయ సభలు ఆమోదించాయి. దీనిపై నిర్వహించిన ఓటింగ్ సందర్భంగా ఈ తీర్మానానికి అనుకూలంగా 223 ఓట్లు పోల్ అయ్యాయి. వ్యతిరేకంగా 205 మంది ఓటు వేశారు. మెజారిటీ సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఉండటంతో ఇక డొనాల్డ్ ట్రంప్‌కు ఉద్వాసన పలకడం ఖాయంగా కనిపిస్తోంది.
ట్రంప్ మెడకు ఉద్వాసన ఉచ్చు: యూఎస్ హౌస్‌లో డిబేట్ షురూ: సొంత పార్టీలోనూ సెగ

మరి కొద్దిరోజుల్లో మాజీ కాబోతోన్న పరిస్థితుల్లో..
గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లు ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో రోండోసారి పోటీచేసిన డొనాల్డ్ ట్రంప్ పరాజయాన్ని చవి చూశారు. కొత్త అధ్యక్షుడిగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ ఎన్నికయ్యారు. ఈ నెల 20వ తేదీన బిడెన్ బాధ్యతలను తీసుకోవాల్సి ఉంది. మరో ఆరు రోజుల్లో అధికార మార్పడి చోటు చేసుకోనున్న పరిస్థితుల్లో.. డొనాల్డ్ ట్రంప్ ఉద్వాసనకు గురి కాబోతోండటం చర్చనీయాంశమౌతోంది. వాషింగ్టన్ అల్లర్లను దృష్టిలో పెట్టుకుని అధికార మార్పిడికి ముందే ట్రంప్‌ను గద్దె దింపడానికి డెమొక్రాట్లు చేస్తోన్న ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నట్టయింది.

25వ సవరణ వైపే కాంగ్రెస్ మొగ్గు..
అభిశంసించడం ద్వారా డొనాల్డ్ ట్రంప్‌ను గద్దె దింపొచ్చంటూ మొదట్లో వార్తలు వెలువడ్డాయి. అభిశంసన కాకుండా.. 25వ సవరణ ద్వారా ఆయనకు ఉద్వాసన పలకాలని యూఎస్ కాంగ్రెస్, సెనెట్.. తాజాగా నిర్ణయించుకున్నాయి. 25వ సవరణకు సంబంధించిన తీర్మానాన్ని రూపొందించాలని, దాన్ని సభలో ప్రవేశపెట్టాలంటూ హౌస్ స్పీకర్ న్యాన్సీ పెలోసీ చేసిన ఆదేశాలను ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ నిరాకరించారు. ఆమె ఆదేశాలను తోసిపుచ్చారు. తాను ఆ సవరణను ప్రవేశపెట్టలేనని తేల్చేశారు. దీనితో ట్రంప్ తొలగింపు కోసం 25వ సవరణను ప్రయోగించాలనే అంశంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. అది 18 ఓట్ల తేడాతో నెగ్గింది.

ఇక ముందేం జరగబోతోంది..
ఈ తీర్మానం ఆమోదం పొందిన నేపథ్యంలో.. ఇక మైక్ పెన్స్ నిరాకరించడానికి అవకాశం లేకపోవచ్చు. 25వ సవరణ ద్వారా డొనాల్డ్ ట్రంప్‌ను గద్దె దింపడానికి అవసరమైన తీర్మానాన్ని తనకు ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా ప్రవేశపెట్టాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇక లేదనడానికి, కాదనడానికీ, స్పీకర్ ఆదేశాలను పాటించకపోవడానికి ఛాన్స్ ఉండదని, యూఎస్ కాంగ్రెస్ ఆమోదం పొందిన తీర్మానానికి అనుగుణంగా 25వ సవరణ వైపు మొగ్గు చూపక తప్పదని అంటున్నారు. ఈ ప్రక్రియ మొత్తం రెండు, మూడు రోజుల్లోనే పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రత్యామ్నాయంగా అభిశంసన..
25వ సవరణపై ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోవడమంటూ జరిగితే.. ప్రత్యామ్నాయంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఏదెలా ఉన్నప్పటికీ.. ఈ నెల 19వ తేదీన ట్రంప్ పదవీకాలం ముగియకముందే.. ఆయనను దింపేయడానికి జోరుగా సన్నాహాలు సాగుతున్నాయి. 25వ సవరణ తనను ఏమీ చేయలేదంటూ ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన టెక్సాస్‌లో పర్యటిస్తోన్నారు. అభిశంసన తీర్మానం ఉత్తిదేనని, పదవీకాలం పూర్తయ్యేంత వరకూ కొనసాగుతానని స్పష్టం చేస్తున్నారు.

అల్లర్ల ఎఫెక్ట్..
వాషింగ్టన్ అల్లర్లు చోటుచేసుకుని ఉండకపోతే.. ట్రంప్ ఈ దుస్థితిని ఎదుర్కొని ఉండకపోవచ్చు. ఎన్నికల ఓట్ల లెక్కింపులో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ వేలాదిమంది ఆయన అభిమానులు చేపట్టిన ఆందోళనల ప్రదర్శనలు.. కేపిటల్ బిల్డింగ్‌పై దండెత్తడం, పోలీసులు కాల్పులు జరపడం.. వారిని మరింత రెచ్చగొట్టేలా ట్రంప్ ప్రసంగించడారంటూ ఆరోపణలు వెల్లువెత్తడం వంటి పరిణామాల నేపథ్యంలో.. అగ్రరాజ్య అధ్యక్షుడిగా అర్ధాంతరంగా తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన తొలగింపు కోసం యూఎస్ కాంగ్రెస్ అంగీకరించడం చివరి ట్విస్ట్.