• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అఫ్గానిస్తాన్‌కు అమెరికా లేఖ: 90 రోజుల్లో హింసను అదుపు చేసి, తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి

By BBC News తెలుగు
|

అఫ్గానిస్తాన్ సంక్షోభం

అఫ్గానిస్తాన్‌లో శాంతి నెలకొల్పేందుకు ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో జరుగుతున్న ప్రయత్నాలను మరింత వేగవంతం చేయాలని అమెరికా ఒత్తిడి పెంచుతోంది.

రానున్న 90 రోజుల్లో హింసను పూర్తిగా తగ్గించాలని, తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇరువైపుల నుంచి ప్రయత్నాలు చేయాలని అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీకి అమెరిక విదేశాంగ మంత్రి ఆంథొనీ బ్లింకెన్ లేఖ రాశారు.

అయితే, మే 1 నాటికి తమ దళాలను ఉపసంహరించుకోవాలన్న నిర్ణయాన్ని అమలు చేయాలా వద్దా అనే వియయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బ్లింకన్ చెప్పారు.

ఈ విషయంలో అఫ్గానిస్తాన్ నాయకత్వం వేగంగా చర్యలు ప్రారంభించాలని ఆయన సూచించారు. ఈ మేరకు బ్లింకన్ రాసిన లేఖ ప్రతి బీబీసీ చేతికి అందింది.

అఫ్గానిస్తాన్‌లో తమ 2500 మంది దళ సభ్యులను ఉపసంహరించుకోవాలా వద్ద అన్నదానిపై అమెరికా అంతర్మథనంలో ఉందన్న విషయాన్ని ఈ లేఖ స్పష్టం చేస్తోంది.

2021 మే 1నాటికి అఫ్గానిస్తాన్‌లో తమ దళాలను పూర్తిగా ఉపసంహరించుకుంటామని నాటి ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించింది.

అయితే, అమెరికా వెళ్లిపోతే ఇక్కడ పరిస్థితులు మళ్లీ గతం మాదిరిగా మారతాయని అఫ్గాన్ అధికారులు భయపడుతున్నారు.

తాలిబన్లు మూకుమ్మడి దాడులకు దిగవచ్చని, కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకునే అవకాశం ఉందని కూడా బ్లింకెన్ తన లేఖలో హెచ్చరించారు.

దేశంలో ఎన్నికలు, అలాగే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో టర్కీలో రష్యా, చైనా,పాకిస్తాన్, ఇరాన్, భారత్, అమెరికా విదేశాంగ మంత్రులు, రాయబారులు పాల్గొనే శాంతి సమావేశానికి ముందే ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడటం మంచిదని బ్లింకెన్ సూచించారు.

బ్లింకెన్ రాసిన లేఖ కఠిన స్వరంతో, తాలిబన్, అఫ్గాన్ వర్గాలపై ఒత్తిడి పెంచేలా ఉందని బీబీసీ ఇంటర్నేషనల్ కరస్పాండెంట్ లైస్ డౌసెట్ అన్నారు.

https://twitter.com/bbclysedoucet/status/1368545539642494979

ఆందోళనలో అఫ్గానీలు

అయితే ఇరుపక్షాల మధ్య నెలకొన్న ప్రస్తుత వాతావరణం గతంలో హడావుడిగా చేసుకున్న ఒప్పందం విచ్ఛిన్నానికి కారణమవుతుందేమోనని అఫ్గానీలు భయపడుతున్నారని బీబీసీ ప్రతినిధి అభిప్రాయపడ్డారు.

2001లో సెప్టంబర్ 11 దాడులు జరిగిన కొంతకాలానికే, అమెరికా నేతృత్వంలోని దళాలు అఫ్గానిస్తాన్‌లో అధికారంలో ఉన్న తాలిబన్లను గద్దె దించాయి.

దేశంలో హింస ఇంకా తీవ్రంగానే ఉంది. గత ఏడాది నుంచి జర్నలిస్టులు, కార్యకర్తలు, న్యాయమూర్తులు, ఇతర పౌర ప్రముఖులే లక్ష్యంగా దాడులు పెరగడం కనిపించింది. ఈ హత్యలకు ఎక్కువగా తాలిబన్లే కారణమని ఆరోపణలు వచ్చాయి.

అమెరికా, నాటో దళాలు అక్కడి నుంచి ఉపసంహరించాలని నిర్ణయించడం ఈ ప్రాంతంలో ఆందోళనకు దారితీసింది. ముఖ్యంగా మహిళా హక్కుల కార్యకర్తలు భయాందోళనకు గురవుతున్నారు.

తాలిబన్లు మళ్లీ అధికారంలోకి వస్తే గత రెండు దశాబ్దాలుగా సాధించిన పురోగతి మళ్లీ మొదటికొస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు.

అఫ్గానిస్తాన్‌లో శాంతి ప్రక్రియకు నేతృత్వం వహిస్తున్న అమెరికా దౌత్యవేత్త జల్మయ్ ఖలీల్జాద్ సోమవారం పాకిస్తాన్ అధికారులను కలవనున్నారు. తాలిబన్లపై పాకిస్తాన్‌కు మంచి పలుకుబడి ఉన్నట్టు భావిస్తున్నారు.


అమెరికా మనసులో ఏముంది ?

బీబీసీ చీఫ్ ఇంటర్నేషనల్ కరస్పాండెంట్లైస్ డౌసెట్ విశ్లేషణ

అఫ్గానిస్తాన్ విషయంలో అధ్యక్షుడు బైడెన్ ఎజెండా ఏంటనే దానిపై నెలలపాటు కొనసాగిన అనుమానాలకు బ్లింకెన్ రాసిన లేఖతో సమాధానం దొరికింది.

అధ్యక్షుడు ట్రంప్ కాలంలో కంటే అమెరికా ఇప్పుడు అఫ్గాన్ అధ్యక్షుడు ఘనీతో ఎక్కువగా టచ్‌లో ఉంటున్న విషయం ఇది నొక్కి చెప్పింది.

బ్లింకెన్ లేఖ స్నేహపూర్వకంగానే కనిపించినా, అది కాస్త కఠినంగా కూడా ఉంది. శాంతి ప్రక్రియను వేగవంతం చేయాలనడమే కాక, మేం వెళ్లిపోయాక తాలిబన్లు కొన్ని ప్రాంతాలను అదుపులోకి తీసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

అఫ్గానిస్తాన్‌లో శాంతి ప్రక్రియను వేగంగా ముగించాలన్న పట్టుదల అమెరికా మంత్రి మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

అమెరికా తరఫున శాంతి చర్చల్లో పాల్గొంటున్న ఖలీల్జాద్ ఇప్పటికే కొన్నివారాలపాటు అమెరికాలో ఉండి వచ్చారు. అమెరికా నాయకత్వంతో చర్చలు జరిపారు. వీలయినంత త్వరగా ఈ యుద్ధ క్షేత్రం నుంచి బైటపడాలన్నది అమెరికా ఆలోచనగా కనిపిస్తోంది.

తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శాంతి చర్చల డ్రాఫ్టులో స్పష్టంగా పేర్కొంది. ఈ డ్రాఫ్ట్‌ను బీబీసీ సంపాదించింది.

కొత్త శాంతి ప్రణాళిక కొంత రిస్క్‌తో కూడుకున్నదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇరు వర్గాల నుంచి వ్యతిరేకత కూడా వినిపించింది. అయితే, ఈ శాంతి ప్రక్రియ పూర్తిగా నిలిచిపోతే అసలుకే ప్రమాదమని అఫ్గానిస్తాన్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.


అఫ్గానిస్తాన్ శాంతి చర్చలు

అమెరికా-తాలిబన్ శాంతి ఒప్పందం ఏంటి ?

అఫ్గానిస్తాన్ నుంచి వైదొలగాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. 2020 ఫిబ్రవరిలో కుదిరిన ఒప్పందం ప్రకారం తాలిబన్లు తమ హామీలను నిలబెట్టుకుంటే 14 నెలల్లో అక్కడి నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకుంటామని అమెరికా తెలిపింది.

శాంతి చర్చలు కొనసాగించాలని, అలాగే అల్ ఖైదా సహా ఇతర ఉగ్రవాద గ్రూపులను ఈ ప్రాంతంలోకి రానివ్వరాదని తాలిబన్లకు షరతు పెట్టింది అమెరికా. అయితే అంతర్జాతీయ సైన్యాలపై దాడులు ఆపినా, అఫ్గానిస్తాన్ ప్రభుత్వంపై తాలిబన్లు దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు.

చర్చలకు రావాలంటే జైళ్లలో ఉన్న వందలమంది తమ అనుచరులను విడిచిపెట్టాలని తాలిబన్లు షరతులు పెట్టారు. 2020 సెప్టెంబర్ నుంచి ఖతార్ రాజధాని దోహలో అఫ్గానిస్తాన్,తాలిబన్ల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నా వాటిలో ఎలాంటి పురోగతి కనిపించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
US letter to Afghanistan: Violence must be stopped within 90 days and an interim government must be formed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X