సైడ్ ఎఫెక్ట్స్: కరోనా వ్యాక్సిన్‌పై అనుమానాలు..అపోహలు: జో బిడెన్, ఆయన భార్యకు ఇంజెక్ట్
వాషింగ్టన్: కరోనా వైరస్ కోరల్లో చిక్కుకున్న ప్రపంచ దేశాలు ఒక్కొటొక్కటికిగా బయటపడుతున్నాయి. కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకోవడానికి తమవంతు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. తొలుత బ్రిటన్, ఆ తరువాత అమెరికా కరోనా వ్యాక్సిన్‌ను తమ దేశ ప్రజలకు అందిస్తున్నాయి. దీనికోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలను చేపట్టాయి. కరోనా వ్యాక్సిన్‌ను సాధారణ ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకుని వస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది.
వ్యాక్సిన్ పనితీరుపై అపోహలు..
అమెరికాలో కరోనా వ్యాక్సిన్ ప్రభావం.. పనితీరుపై అపోహలు వ్యక్తమౌతున్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ సంభవిస్తున్నాయనే భయంతో చాలామంది వ్యాక్సిన్‌కు దూరంగా ఉంటున్నారు. ఆరోగ్యంగా ఉన్న వారు వ్యాక్సిన్ ఇంజెక్షన్‌ను వేయించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ఈ పరిణామాల మధ్య వ్యాక్సిన్‌పై అపోహలను పోగొట్టడానికి అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ దంపతులు బరిలో దిగారు. తాను స్వయంగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. వారికి ఫైజర్-బయోఎన్‌టెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ వేశారు.

ఇంజెక్షన్ ఇచ్చిన నర్స్ ఎవరంటే..
జో బిడెన్ స్వస్థలం డెలావర్‌లోని విల్మింగ్టన్లో క్రిస్టియానా కేర్ ఆసుపత్రిలో తొలుత జో బిడెన్‌కు వ్యాక్సిన్ ఇచ్చారు. నల్లజాతీయురాలైన నర్స్ టబె మసా.. ఆయనకు ఇంజెక్షన్ వేశారు. బిడెన్ ఎడమ చేతికి వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేశారు. క్రిస్టియానా కేర్ ఆసుపత్రిలో ఆమె సీనియర్ నర్సుగా పనిచేస్తున్నారు. తనకు కరోనా సోక లేదని, ఆ లక్షణాలు కూడా లేవని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌పై నెలకొన్న అపోహలను తొలగించుకోవాలని సూచించారు. ఆయన భార్య డాక్టర్ జిల్ బిడెన్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.

ట్రంప్ ప్రభుత్వంపై ప్రశంసలు..
అనంతరం బిడెన్ కొద్దిసేపు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని, తాను ఆరోగ్యంగా ఉన్నానని పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ రాప్ స్పీడ్‌కు సహకరించాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను దేశ ప్రజలకు చేరవేయడంలో ట్రంప్ ప్రభుత్వం బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. కరోనా వ్యాక్సిన్‌ను అన్ని రాష్ట్రాలకు సకాలంలో సరఫరా చేయడంలో ప్రభుత్వాధికారులు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఇదివరకే అమెరికా ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, స్పీకర్ న్యాన్సీ పెలోసీ సహా పలువురు సెనెటర్లు వ్యాక్సిన్ వేయించుకున్నారు.

ఫైజర్ వ్యాక్సిన్‌పైనే
కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ప్రపంచంలో మొట్టమొదటి సారిగా వ్యాక్సిన్‌ను ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనతను సాధించింది ఫైజర్. బ్రిటన్, అమెరికా, కెనడా, సౌదీ అరేబియా వంటి దేశాలు ఫైజర్ వ్యాక్సిన్‌కు సాధారణ వినియోగానికి అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఫైజర్-బయోఎన్‌టెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ వినియోగానికి ఇదివరకే అనుమతులు ఇచ్చింది. ఇక- దాన్ని సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మోడెర్నా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌కు కూడా త్వరలోనే అనుమతలు లభించనున్నాయి.