వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు.. టై అయితే ఏం జరుగుతుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బైడెన్, ట్రంప్

అమెరికా అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల ఫలితాలను ఎలా సవాలు చేస్తాడు? మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, కొన్ని రాష్ట్రాల్లో ఓట్లు అంత కీలకం ఎందుకు అవుతాయి?

అమెరికా ఎన్నికలకు సంబంధించి కొందరు పాఠకులు బీబీసీకి ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సంధించారు. వాటిలో ఎక్కువ మంది అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాం.

Section divider

1. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఎవరు, వారిని ఎలా ఎన్నుకుంటారు? వారు ఆ పదవిలో ఎంత కాలం ఉంటారు?

రిపబ్లికన్, డెమాక్రటిక్ పార్టీలు ఎలక్టోరల్ కాలేజీ సభ్యులను సాధారణంగా ప్రతి ఎన్నికలకూ నామినేట్ చేస్తాయి.

ప్రతి రాష్ట్రంలో వారిని నామినేట్ చేయడానికి రకరకాల నియమాలు ఉంటాయి. ఎన్నికల రోజున వారిని అధికారికంగా ఎన్నుకుంటారు.

కాలేజీ సభ్యులను ఎలక్టర్స్ అంటారు. వారికి చాలావరకూ అమెరికా రాజకీయ పార్టీలతో సంబంధం ఉంటుంది. అంటే వారంతా ఆ పార్టీ కార్యకర్తలో, మాజీ నేతలో అయి ఉంటారు.

కానీ 2016లో క్లింటన్ డెమాక్రాట్ ఎలక్టర్‌గా, డోనాల్డ్ ట్రంప్ జూనియర్ రిపబ్లికన్ల ఎలక్టర్‌గా ఉన్నారు.

Section divider

2. డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ఫలితాలను సవాలు చేయడానికి ప్రయత్నించగలరా?

అలా జరగచ్చు. ఎన్నికల తర్వాత చట్టపరమైన వివాదాలకు తాము సన్నద్ధంగా ఉన్నామని అభ్యర్థులు ఇద్దరూ ఇప్పటికే ప్రకటించారు.

చాలా రాష్ట్రాల్లో, ముఖ్యంగా చెప్పాలంటే, హోరాహోరీ పోటీ ఉన్న రాష్ట్రాల్లో రీకౌంటింగ్ కోసం డిమాండ్ చేసే హక్కు వారికి ఉంటుంది.

ఈసారీ పోస్టల్ ఓట్లు భారీగా వచ్చాయి. ఈ ఓట్ల చెల్లుబాటు గురించి కోర్టులో సవాలు చేసే అవకాశం కూడా ఉంది.

ఈ కేసులు అమెరికా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకూ వెళ్లచ్చు. 2000లో ఇలాగే జరిగినపుడు, ఫ్లోరిడాలో రీకౌటింగ్ నిలిపివేసిన సుప్రీంకోర్టు అధ్యక్షుడు, రిపబ్లికన్ జార్జ్ డబ్ల్యు బుష్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

Section divider

3. ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల వల్ల దేశవ్యాప్తంగా జరిగిన ఓటింగుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

అమెరికా అధ్యక్షులను దేశ ప్రజల ఓట్లను బట్టి నిర్ణయించరు. కానీ, ప్రతి విజేతా ఆయా రాష్ట్రాల జనాభా ఆధారంగా తగిన సంఖ్యలో ఎలక్టర్ల మద్దతు పొందుతాడు.

ఎన్నికలు జరిగిన కొన్ని వారాల తర్వాత ఎలక్టర్స్ సమావేశం అవుతారు. అధ్యక్షుడిని అధికారికంగా నామినేట్ చేసేలా ఓట్లు వేయడానికి ఒక ఎలక్టోరల్ కాలేజీ ఏర్పాటు చేస్తారు.

అధ్యక్షుడు కావడానికి అభ్యర్థులకు 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు అవసరం.

Section divider

4. ప్రపంచంలో చాలా మంది ఈ ఎలక్టోరల్ కాలేజీ విధానాన్ని చూసి విసిగిపోయారు. అమెరికా ఎన్నికలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, ఈ కాలేజీని పక్కనపెట్టడం కష్టమా?

అమెరికా రాజ్యాంగంలో ఎలక్టోరల్ వ్యవస్థను పొందుపరిచారు. కాబట్టి, దానిని మార్చాలంటే రాజ్యాంగ సవరణ అవసరం.

ఆ సవరణను సెనేట్, ప్రతినిధుల సభలో మూడింట రెండొంతుల మంది ఆమోదించాలి. లేదా రాష్ట్ర శాసనసభల్లో అదే నిష్పత్తిలో ఉండాలి. తర్వాత, దీనిని అమెరికాలో మూడోవంతు రాష్ట్రాలు ఆమోదించాలి.

గతంలో ఈ వ్యవస్థను మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానీ, అది విజయవంతం అయ్యే అవకాశాలు తక్కువే.

ఎవరు గెలిచినా, జనం ఎక్కువ ఎవరికి ఓటు వేశారో, వారికే తమ ఎలక్టోరల్ ఓటు ఇవ్వాలని కొన్ని రాష్ట్రాల్లో ప్రయత్నం జరుగుతోంది. అదంత సులభం కాదు, కానీ, అలా జరిగితే అది, ఎలక్టోరల్ కాలేజీని నిర్వీర్యం చేయగలదు.

అమెరికా ఎలక్టరల్ కాలేజీ
Section divider

5. ఎన్నికల ఫలితాలు టై అయితే పరిస్థితి ఏంటి?

అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. రాష్ట్ర జనాభాను బట్టి ఒక్కో రాష్ట్రానికీ నిర్ధారిత సంఖ్యలో ఎలక్టర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అభ్యర్థులు ఇద్దరికీ చెరి 269 ఓట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే, అలా జరిగే అవకాశాలు చాలా తక్కువ.

ఏ అభ్యర్థికీ మెజారిటీ ఎలక్టోరల్ ఓట్లు రాకపోతే, అప్పుడు నిర్ణయం అమెరికా కాంగ్రెస్ దగ్గరికి చేరుతుంది. ఆ బాధ్యత 2020 ఎన్నికల్లో ఎన్నికైన కాంగ్రెస్ సభ్యులకు మాత్రమే ఉంటుంది.

అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ ఓటు వేస్తారు. ఒక్కో రాష్ట్ర ప్రతినిధి బృందానికి ఒక్కో ఓటు మాత్రమే ఉంటుంది. అంటే, 50 ఓట్లలో సగానికి పైగా, 26 ఓట్లు సాధించిన అభ్యర్థి దేశాధ్యక్షుడు అవుతాడు.

మొత్తం వంద మంది సెనేటర్లు ఓటు వేసి ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు.

Section divider

6. ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల ద్వారా ఎవరూ విజేత కాలేకపోతే, కాబోయే అధ్యక్షుడిని ఎవరు నిర్ణయిస్తారు?

ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల ద్వారా విజేతను తేల్చలేకపోయారంటే, టై అయ్యిందని, లేదంటే వివాదాస్పద రాష్ట్రాల్లో న్యాయపరమైన సవాళ్లు ఒక కొలిక్కిరాలేదని అర్థం. అలా జరిగినపుడు ఆయా రాష్ట్రాల ఎలక్టర్లు తమ విజేతను ఎన్నుకోలేరు.

అమెరికాకు కాబోయే అధ్యక్షుడిని నామినేట్ చేసే ఎలక్టోరల్ కాలేజీ ఈ ఏడాది డిసెంబర్ 14న సమావేశం కానుంది. అప్పటికల్లా, గెలిచిన అభ్యర్థి కోసం ప్రతి రాష్ట్రం తమ ఎలక్టర్లను ముందుంచాలి.

ఆ తర్వాత కూడా ఎన్నికల ఫలితాలపై వివాదాలు కొనసాగుతుంటే, ఆయా రాష్ట్రాల ఎలక్టర్స్ తమ ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో, అధ్యక్షుడిని నిర్ణయించేందుకు కాంగ్రెస్ ముందుకొస్తుంది.

అమెరికా రాజ్యాంగం తుది గడువును విధిస్తుంది. ప్రస్తుత అధ్యక్షుడి(ఉపాధ్యక్షుడి) పదవీకాలం జనవరి 20 మధ్యాహ్నంతో ముగుస్తుంది.

అప్పటికి కూడా దేశాధ్యక్షుడు ఎవరో కాంగ్రెస్ నిర్ణయించలేకపోతే, అలాంటి పరిస్థితుల్లో వారసులు ఎవరు అనేది కూడా చట్టంలో పేర్కొన్నారు.

హస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ లో మొదటి స్థానంలో ఉన్న ప్రతినిధుల సభ స్పీకర్... అంటే ప్రస్తుతం నాన్సీ పెలోసీ, సెనేట్‌లో రెండో అత్యున్నత ర్యాంక్‌లో ఉన్న...ప్రస్తుతం చార్లెస్ గ్లాస్లీ వారసులు అవుతారు.

Section divider

7. కొన్ని రాష్ట్రాల్లో ఓట్లు మిగతా వాటి కంటే చాలా కీలకం ఎందుకు?

ఫలితాలు అనిశ్చితిలో పడవచ్చని భావించిన రాష్ట్రాల్లో అధ్యక్ష అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తారు.

కాబట్టే, ఆయా రాష్ట్రాల్లో ఓట్లు చాలా కీలకమని భావిస్తారు. అలాంటి రాష్ట్రాలను బాటిల్ గ్రౌండ్ స్టేట్స్ లేదా స్వింగ్ స్టేట్స్ అంటారు.

అమెరికా ఎలక్టోరల్ వ్యవస్థలో రెండు రాష్ట్రాల్లో తప్ప మిగతా అన్నిటిలో ఇలాగే హోరాహోరీ పోటీ ఉంటుంది.

ఏ స్థాయిలో విజయం సాధించారనే దానితో పనిలేకుండా, ఆ రాష్ట్రంలో ఎలక్టోరల్ ఓట్లు ఎవరు ఎక్కువగా గెలుచుకుంటారో, ఆ రాష్ట్రం వారిదే అవుతుంది.

ఓటర్లు ఒక పార్టీవైపే మొగ్గు చూపుతారనే గ్యారంటీ ఉన్న.. అంటే, డెమాక్రట్లకు కాలిఫోర్నియా, రిపబ్లికన్లకు అలబామా లాంటి రాష్ట్రాల్లో ప్రచారం చేయడానికి అభ్యర్థులు పెద్దగా ఉత్సాహం చూపించరు.

అభ్యర్థులు ఎక్కువగా హోరాహోరీ పోరు ఉండే, అంటే ఫ్లోరిడా, పెన్సిల్వేనియా లాంటి కొన్ని రాష్ట్రాల మీదే దృష్టి పెడతారు. ఓటర్లను ఎలాగైనా తమవైపు తిప్పుకోవాలనుకుంటారు.

Section divider

8. ఎన్నికల తర్వాత పోస్టల్ ఓట్లు లెక్కించడానికి చాలా రోజులు పడితే, రాష్ట్రాల్లో ట్రంప్, బైడెన్ చివరి టాలీ మారిపోతుందా? అప్పుడు విజేతను ప్రకటించే ప్రొటోకాల్ ఎలా ఉంటుంది?

ఎన్నికలు జరిగిన రాత్రే విజేతను ప్రకటించాల్సిన అవసరం చట్టపరంగా ఏమాత్రం లేదు. మీడియా సంస్థలు ప్రొజెక్షన్ ద్వారా ఆ పని చేస్తాయి.

రాత్రికి రాత్రే మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తి కావడం జరగదు. కానీ, సాధారణంగా విజేతను నిర్ధారించడానికి తగినన్ని ఓట్లు పోలవుతాయి.

ఈ అనధికారిక ఫలితాలను కొన్ని వారాల తర్వాత, రాష్ట్ర అధికారులు ధ్రువీకరించిన తర్వాతే ప్రకటిస్తారు.

ఈ ఏడాది పోస్టల్ ఓట్లు ఎక్కువగా ఉండడం, వాటిని లెక్కించడానికి చాలా సమయం పడుతుండడంతో విజేతను ప్రకటించడంలో అమెరికా మీడియా ఆచితూచి వ్యవహరిస్తోంది.

అంటే, ఎన్నికలు జరిగిన రోజు రాత్రి కొన్ని రాష్ట్రాల్లో గెలిచిన అభ్యర్థి, పోస్టల్ బాలెట్లతోపాటూ మొత్తం ఓట్లన్నీ లెక్కించిన తర్వాత ఓటమి మూటగట్టుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
US presidential election results:What happens if there is a tie?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X