ప్రీమియం వీసాలు: భారత టెక్కీలకు ట్రంప్ ఊరట, లేదంటే ఫీజు వాపస్
వాషింగ్టన్: హెచ్1బి ప్రీమియం వీసాల ప్రక్రియలో ఊరట లభించింది. ప్రీమియం హెచ్1బి వీసాల పునరుద్ధరణకు అమెరికాలోని ట్రంప్ సర్కారు ఓకే చెప్పింది. దీంతో ఎంతో మందికి ఊరట లభించనుంది.

సోమవారం నుంచి మళ్లీ పరిశీలన
అన్ని విభాగాల్లో నిలిపివేసిన హెచ్1బి ప్రీమియం వీసాల స్వీకరణ ప్రక్రియను అమెరికా పునరుద్ధరించింది. లెక్కకు మించి దరఖాస్తులు రావడంతో అయిదు నెలల కిత్రం ఈ ప్రక్రియను నిలిపివేసిన అధికారులు సోమవారం నుంచి మళ్లీ దరఖాస్తులను పరిశీలిస్తున్నారు.

అప్పుడు అందుకు నిలిపివేత
వివిధ కంపెనీల్లో పని చేసేందుకు ఈ వీసాలను అమెరికా మంజూరు చేస్తుంది. దీని కింద విదేశీ ఉద్యోగులను తమ కంపెనీల్లో పనిచేసేందుకు అనుమతిస్తారు.ఈ వీసా కోరుతూ ఏప్రిల్ నెలలో భారీగా దరఖాస్తులు రావడంతో ఆ ప్రక్రియను నిలిపివేశారు.

65 వేల మందికి వీసాలు మంజురు చేస్తామని
2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ వరకూ వచ్చిన ఈ వీసాలను పునః పరిశీలిస్తున్నామని అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 65వేల వీసాలను మంజూరు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

పదిహేను రోజుల్లో పూర్తి చేయకుంటే ప్రాసెసింగ్ ఫీజు వాపస్
దీంతో పాటు అమెరికా ఉన్నత విద్యా డిగ్రీ కలిగిన ఉద్యోగులను తీసుకునేందుకు వచ్చిన 20 వేల దరఖాస్తులను పరిశీలించనున్నట్లు తెలిపారు. వీసాల మంజూరు ప్రక్రియను పదిహేను రోజుల్లోగా పూర్తి చేయకపోతే దరఖాస్తుదారుడు చెల్లించిన ప్రాసెసింగ్ ఫీజును తిరిగి చెల్లిస్తామని వెల్లడించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!