వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా: జో బైడెన్, కమలా హారిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎలా జరుగుతుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బైడెన్, హారిస్

అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హారిస్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

కోవిడ్-19 నిబంధనలు, భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఈసారి ప్రమాణస్వీకార కార్యక్రమం ఇదివరకటి కన్నా భిన్నంగా ఉండబోతోంది.

అమెరికాలో అధ్యక్ష ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని చేపట్టే కార్యక్రమాన్ని 'ఇనాగ్యురేషన్’ అంటారు. వాషింగ్టన్ డీసీలో ఇది జరుగుతుంది.

ఈ ప్రమాణ స్వీకారం పూర్తవ్వగానే బైడెన్ అధికారికంగా అమెరికాకు 46వ అధ్యక్షుడు అవుతారు. దీనితో ఇనాగ్యురేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత సంబరాలు మొదలవుతాయి.

సాధారణంగా అధ్యక్ష పదవి కన్నా ముందే ఉపాధ్యక్ష పదవికి ప్రమాణస్వీకారం జరుగుతుంది.

ఎప్పుడు?

చట్ట ప్రకారం ఈ కార్యక్రమం జరగాల్సిన తేదీ జనవరి 20.

స్థానిక కాలమానం ప్రకారం 11.30 (భారత్‌లో రాత్రి 10 గంటల)కు ఈ కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం జరుగుతుంది.

మధ్యాహ్నం జో బైడెన్, కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేస్తారు.

ఆ తర్వాత బైడెన్ వైట్ హౌజ్‌కు వెళ్తారు. తదుపరి నాలుగు ఏళ్లపాటు అదే ఆయన నివాసం, కార్యాలయం.

అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం

భద్రత ఎలా ఉండబోతోంది?

అధ్యక్ష ప్రమాణస్వీకార కార్యక్రమాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అయితే, ఇటీవల అమెరికా కాపిటల్ భవనంలోకి ట్రంప్ మద్దతుదారులు చొరబడిన నేపథ్యంలో భద్రతా చర్యలను మరింత తీవ్రం చేస్తున్నారు.

అధ్యక్ష ప్రమాణ స్వీకారం జరగనున్న నేపథ్యంలో అమెరికాలో, మరీ ముఖ్యంగా వాషింగ్టన్ డీసీలో సాయుధ నిరసనలు కూడా జరిగే అవకాశం ఉందని ఇటీవల ఎఫ్‌బీఐ హెచ్చరించింది. దీంతో అధికారులు భద్రతా చర్యలను పెంచడంపై దృష్టి పెట్టారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రిహార్సల్స్ ఆదివారం జరగాల్సి ఉన్నా, భద్రతాపరమైన ఆందోళనలతో వాయిదా వేశారని... సోమవారం వీటిని నిర్వహించనున్నారని పొలిటికో వార్తా పత్రిక కథనం రాసింది.

డెలవేర్‌లోని తన కార్యాలయం నుంచి సోమవారం బైడెన్, తన బృందంతో కలిసి గంటన్నర రైలు ప్రయాణం చేసి వాషింగ్టన్ రావాలనుకున్నారు. అయితే, భద్రతా కారణాల రీత్యా దీన్ని విరమించుకున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ తెలిపింది.

ఒబామా హయాంలో 'ఉగ్రవాద నిరోధక’ సలహాదారుగా పనిచేసిన లీసా మోనాకోను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాత్కాలిక భద్రతా సలహాదారుగా పనిచేయాలని బైడెన్ కోరారు. డిప్యుటీ అటార్నీ జనరల్ పదవికి కూడా ఆమెనే బైడెన్ నామినీగా ఎంచుకున్నారు.

కాపిటల్ భవనం అల్లర్ల కారణంగా వాషింగ్టన్ డీసీలో ఇప్పటికే అత్యవసర పరిస్థితి విధించారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం పూర్తయ్యేదాకా ఇది కొనసాగనుంది.

అధ్యక్షుడి భద్రత వ్యవహారాలు చూసుకునే సీక్రెట్ సర్వీస్ విభాగమే ఈ కార్యక్రమ భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. నేషనల్ గార్డ్‌కు చెందిన 15 వేల మంది సిబ్బంది, వేల మంది పోలీసు అధికారుల సేవలను కూడా ఇందుకోసం వినియోగించుకుంటున్నారు.

సంప్రదాయం ప్రకారం బహిరంగంగానే తాను ప్రమాణ స్వీకారం చేస్తానని బైడెన్ పట్టుపట్టారు. అయితే, ఈ సారి ఈ కార్యక్రమానికి తక్కువ సంఖ్యలోనే జనాన్ని అనుమతించనున్నారు.

కాపిటల్ బిల్డింగ్

ట్రంప్ వస్తారా?

అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పదవి దిగిపోతున్న అధ్యక్షుడు రావడం సంప్రదాయం.

అయితే, బైడెన్ ప్రమాణ స్వీకారానికి తాను వెళ్లనని ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించేశారు.

అయితే, అంతకుముందే కొత్త ప్రభుత్వానికి 'పద్ధతి ప్రకారం’ అధికార బదిలీ చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. ట్రంప్ బహిరంగంగా ఇంతవరకూ తన ఓటమిని అంగీకరించని సంగతి తెలిసిందే.

కొంతమంది ట్రంప్ మద్దతుదారులు మాత్రం ట్రంప్ 'రెండో సారి ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమాన్ని’ వర్చవల్‌గా నిర్వహించి, తమ మద్దతు తెలియజేయాలని ప్రణాళికలు వేస్తున్నారు. దీనికి హాజరవుతామని 68 వేలకుపైగా మంది ఫేస్‌బుక్‌లో ప్రకటించారు.

ఇక బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను వెళ్తానని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రకటించారు.

ఇప్పటివరకూ అమెరికా చరిత్రలో ముగ్గురు అధ్యక్షులు మాత్రమే తదుపరి అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి రాకుండా ఉండిపోయారు. అయితే, గత శతాబ్దంలో ఇలా ఎప్పుడూ జరగలేదు.

ట్రంప్, ఒబామా

కోవిడ్-19తో ఏ మార్పులు ఉండబోతున్నాయి?

సాధారణంగా అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు హాజరయ్యేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో జనం వస్తుంటారు.

2009లో ఒబామా మొదటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సుమారు 20 లక్షల మంది హాజరయ్యారు.

కానీ, ఈ సారి 'చాలా పరిమిత సంఖ్య’లోనే జనాన్ని అనుమతించనున్నట్లు బైడెన్ బృందం తెలిపింది. ఇతర ప్రాంతాల నుంచి జనం ఇక్కడకు రావొద్దని విజ్ఞప్తి చేసింది.

కాపిటల్ భవనం ముందు ఏర్పాటు చేసిన వేదికపై బైడెన్, హారిస్‌ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. 1981లో రోనల్డ్ రీగన్‌తో మొదలు అందరు అధ్యక్షులూ ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

ఇక కాపిటల్ భవనం ముందున్న నేషనల్ మాల్ పార్క్‌లో వీక్షకుల కోసం ఇదివరకు ఏర్పాటు చేసిన స్టాండ్లను అధికారులు తొలగిస్తున్నారు.

2009లో ఒబామా ప్రమాణ స్వీకార కార్యక్రమం

ఇదివరకు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రెండు లక్షల టికెట్లు అందుబాటులో ఉంచేవారు. అయితే, కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఈసారి వెయ్యి టికెట్లు మాత్రమే పెట్టారు.

అధికార బదిలీ సంప్రదాయంలో భాగంగా 'పాస్ ఇన్ రివ్యూ’ కార్యక్రమం కూడా ఈ సారి జరగనుంది. ఈ కార్యక్రమంలో కమాండర్ ఇన్ చీఫ్ హోదాలో కొత్త అధ్యక్షుడు సైన్యాన్ని పరిశీలిస్తారు.

సాధారణంగా పెన్సిల్వేనియా అవెన్యూ నుంచి వైట్ హౌజ్ వరకూ ఈ కవాతు జరుగుతుంది. అయితే, ఈసారి అమెరికా వ్యాప్తంగా 'వర్చువల్ కవాతు’ ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు.

గత కొన్నేళ్లుగా ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో దేశంలోని ప్రముఖ గాయనీ గాయకుల ప్రదర్శనలు ఇవ్వడం పెరిగింది. ఈసారి కూడా అలాగే జరగనుంది.

ప్రముఖ పాప్ స్టార్ లేడీ గాగా బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా అమెరికా జాతీయ గీతం పాడనున్నారు. ఆ తర్వాత సంగీత ప్రదర్శనలో మరో పాప్ స్టార్ జెన్నీఫర్ లోపెజ్ పాట పాడనున్నారు.

బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సాయంత్రం గంటన్నర పాటు ప్రత్యేక టీవీ కార్యక్రమం జరగనుంది. జాన్ బోన్ జోవి, డెమీ లొవాటో, జస్టిన్ టింబర్లేక్ లాంటి స్టార్లు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రముఖ నటుడు టామ్ హాంక్స్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇదివరకు ఈ సంబరాలు జనం ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాటు చేసేవారు.

ఈ కార్యక్రమాన్ని ఫాక్స్ న్యూస్ మినహా అమెరికా ప్రధాన టీవీ నెట్‌వర్క్‌లు, స్ట్రీమింగ్ వెబ్‌సైట్లు ప్రసారం చేయనున్నాయి. ట్రంప్ పాలన సమయంలో ఫాక్స్ న్యూస్ చాలావరకు ఆయనకు మద్దతుగా వ్యవహరించింది.

బియాన్సే

ఒబామా మొదటి సారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బియాన్సే, అరెథా ఫ్రాంక్లిన్ ప్రదర్శనలు ఇచ్చారు. రెండో సారి కెల్లీ క్లార్క్సన్, జెన్నీఫర్ హుడ్సన్ ప్రదర్శనలు ఇవ్వగా... బియాన్సే జాతీయ గీతం పాడారు.

ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాడే అవకాశాన్ని అప్పట్లో చాలా మంది పాప్ స్టార్లు తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి.

జనవరిలోనే ఎందుకు?

మొదట్లో అమెరికా రాజ్యాంగంలో మార్చి 4ను అధ్యక్ష ప్రమాణ స్వీకార తేదీగా ఉండేది.

నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఓట్ల లెక్కింపుకు సరిపడా సమయం ఉండాలని అప్పట్లో అలా పెట్టారు.

అయితే, ఎన్నికల్లో ఆధునిక సాంకేతిక పద్ధతులు వచ్చాక ఫలితం తేలడానికి పట్టే సమయం తగ్గిపోయింది.

దీంతో 1933లో రాజ్యాంగ సవరణ ద్వారా తేదీని జనవరి 20కి మార్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
This is how Joe Biden swearing ceremony will take place
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X