మాల్యా, నీరవ్ మోడీ సహా 31 మంది ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోయారు
న్యూఢిల్లీ: విజయ్ మాల్యా, నీరవ్ మోడీ సహా దేశం నుంచి 31 మంది ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోయారని విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయమంత్రి ఎంజే అక్బర్ లోకసభలో వెల్లడించారు. విచారణ నుంచి తప్పించుకునేందుకు పారిపోయారన్నారు.
పెద్ద ఎత్తున కుంభకోణాలకు పాల్పడి విచారణను ఎదుర్కోకుండా భారత్ విడిచి విదేశాలకు వెళ్లినట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా రాతపూర్వకంగా తెలిపారు.
ఇందులో విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ ఛోక్సీ, లలిత్ మోడ, సంజయ్ భండారిల పేర్లు ఉన్నాయి. అయితే వాళ్లు ఎప్పుడు దేశం విడిచి వెళ్లారనే దానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రం ఆయన ఇవ్వలేదు.
విదేశాల్లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, ఆశిష్ జోబన్పుత్ర, పుష్పేష్కుమార్, సంజయ్కల్ర తదితరులను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇకమీదట ఆర్థిక నేరగాళ్లను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్ 2018ను తీసుకొచ్చినట్లు వెల్లడించారు.