ఆందోళనకారుల చేతుల్లో మారణాయుధాలు: సెనెటర్లపై దాడులకు కుట్ర: వాషింగ్టన్లో ఎమర్జెన్సీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిపోతోన్న రాజధాని వాషింగ్టన్లో అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి. ఆ దేశ పార్లమెంట్.. కేపిటల్ బిల్డంగ్‌ను ముట్టడించిన తరువాత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఎంత ఉద్రిక్తంగా మారిపోయాయంటే.. ఏకంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సి వచ్చింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ నిర్ణయాన్ని ప్రకటించింది స్థానిక ప్రభుత్వం.
ట్రంప్ చుట్టూ ఉచ్చు: మెలానియాను తాకిన వాషింగ్టన్ అల్లర్ల సెగ: ఖాళీ అవుతోన్న వైట్‌హౌస్
విధ్వంసానికి కుట్ర..
ఆందోళనకారులు పెద్దఎత్తున విధ్వంసానికి పాల్పడే అవకాశాలు ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో అప్పటికప్పుడు ఎమర్జెన్నీని విధించింది. ఈ మేరకు వాషింగ్టన్ మేయర్ మురీల్ బోసర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చాయి. వాషింగ్టన్ డిస్ట్రిక్ట్‌లో 15 రోజుల పాటు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుంది. దీనికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ మేయర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆందోళనకారులు విధ్వంసాలకు పాల్పడటానికి ముందే ప్లాన్ చేసుకున్నారని, దీనికి అనుగుణంగా వారు తమ వెంట మారణాయుధాలను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

కెమికల్స్.. గన్స్..బ్రిక్స్..
పార్లమెంట్ భవనాన్ని ముట్టడించిన ఆందోళనకారుల చేతుల్లో కెమికల్స్, తుపాకులు, ఇటుక పెళ్లలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారని మురీల్ పేర్కొన్నారు. సాయుధులుగా వారు నిరసన ప్రదరశనల్లో పాల్గొన్నారని చెప్పారు. వాషింగ్టన్ సిటీ నుంచి మరిన్ని ప్రాంతాలకు అల్లర్లను విస్తరించేలా పథకం పన్నినట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందినట్లు స్పష్టం చేశారు. ఉద్దేశపూరకంగానే ఆందోళనకారులు ఈ నిరసన ప్రదర్శనలకు పాల్పడినట్లు ధృవీకరించామని, అందుకే వారిని అడ్డుకోవడానికి, ఎలాంటి దాడులు, ప్రతిదాడుల ఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి ముందు జాగ్రత్త చర్యగా ఎమర్జెన్సీని విధించినట్లు వివరించారు.

సెనెట్‌లో దూసుకెళ్లడం అందులో భాగమే..
ఆందోళనకారులు సెనెట్లోకి దూసుకెళ్లడం కూడా వారి కుట్రలో భగంగా గుర్తించినట్లు పోలీసుల నుంచి మేయర్ కార్యాలయానికి సమాచారం వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియో క్లిప్పింగులను అందించారని, వాటిని పరిశీలించిన తరువాతే.. మేయర్ ఎమర్జెన్సీని విధించినట్లు తెలుస్తోంది. 15 రోజులపాటు వాషింగ్టన్లో అత్యవసర పరిస్థితులను కొనసాగించాల్సి రావడం వల్ల అధికార మార్పడి సజావుగా సాగుతుందని మేయర్ కార్యాలయం భావిస్తోందని అంటున్నారు.

పార్లమెంట్ భవనంపై దాడికి
అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ ఎన్నికైనట్లు ఆ దేశ పార్లమెంట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో.. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు ఏకంగా ముట్టడికి దిగిన అనంతరం అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అత్యున్నత చట్టసభ భేటీని అడ్డుకోవడం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఓటమి, జో బిడెన్ విజయాన్ని అధికారికంగా ఆమోదించలేకపోతోన్నందున అమెరికా కేబినెట్.. కొన్ని కీలక, కఠిన నిర్ణయాలను తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది.