• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైలెట్ గిబ్సన్: బెరిటో ముస్సోలినీపై పాయింట్ బ్లాంక్‌ రేంజిలో కాల్పులు జరిపిన ఐరిష్ మహిళ

By BBC News తెలుగు
|

1926లో గిబ్సన్ జరిపిన కాల్పుల్లో బుల్లెట్ ముస్సోలినీ ముక్కును రాసుకుంటూ వెళ్లింది
Click here to see the BBC interactive

అది 1926 ఏప్రిల్ 7. ఇటలీ రాజధాని రోమ్‌లో జనంలోంచి హఠాత్తుగా బయటకొచ్చిన ఒక ఐరిష్ మహిళ, 20వ శతాబ్దంలో అత్యంత క్రూర నియంతల్లో ఒకరైన బెనిటో ముస్సోలినీపై కాల్పులు జరిపారు.

ఆ హత్యాయత్నం నుంచి ఇటలీ నేత తప్పించుకోగలిగారు. కానీ, ఒక బుల్లెట్ ముస్సోలినీ ముక్కును రాసుకుంటూ వెళ్లింది.

ఆ కాల్పులు జరిపిన మహిళ పేరు వైలెట్ గిబ్సన్.

20వ శతాబ్దంలో ఐరోపాలో ఫాసిజానికి వ్యతిరేకంగా ఎంతోమంది ఎన్నో పోరాటాలు చేశారు. కానీ, ఆ చరిత్ర పుటల్లో వైలెట్ గిబ్సన్‌కు చోటు దక్కలేదు.

ఇప్పుడు, దాదాపు ఒక శతాబ్దం తర్వాత డబ్లిన్‌లో ఆమె పేరిట ఒక శిలాఫలకం వేయడానికి పనులు జోరందుకున్నాయి.

ముస్సోలినీని చంపడానికి ప్రయత్నించిన నలుగురిలో ఆయనకు అంత దగ్గరగా వచ్చింది గిబ్సన్ మాత్రమే.

ముస్సోలినీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత ఆమె ఆయనపై హత్యాయత్నం చేశారు. ఒక సభలో ప్రసంగిస్తున్న సమయంలో గిబ్సన్ ఆయనపై కాల్పులు జరిపారు.

వెంటవెంటనే మూడు రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత, ఆమె తుపాకీ జామ్ అయ్యింది. దాంతో, ముస్సోలినీ మద్దతుదారులు ఆమెను పట్టుకున్నారు. తీవ్రంగా కొట్టారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, వాళ్ల నుంచి కాపాడారు.

ఇటలీలోని ఒక జైలులో కొంతకాలం గడిపిన తర్వాత ఆమెను ఇంగ్లండ్‌ తీసుకొచ్చారు. ఇటలీలో జరిగే బహిరంగ విచారణలో ఆమె అవమానాలు ఎదుర్కోకుండా ఉండాలనే గిబ్సన్‌ను ఇంగ్లండ్ తీసుకొచ్చారని చెబుతుంటారు.

1956లో చనిపోయే వరకూ గిబ్సన్‌ను నార్తంప్టన్‌లోని సెయింట్ ఆండ్రూస్ హాస్పిటల్‌ ఉంచారు. అది ఒక మెంటల్ హాస్పిటల్.

గిబ్సన్ హత్యాయత్నం నుంచి ముస్సోలినీ ప్రాణాలతో బయటపడటంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఐరిష్ ఫ్రీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధ్యక్షుడు డబ్ల్యుటి.కోస్‌గ్రేవ్ అప్పట్లో ఒక లేఖ కూడా రాశారు.

వైలెట్ గిబ్సన్ ఒక సంపన్న కుటుంబంలో పుట్టారు.

ఆమె ఆంగ్లో-ఐరిష్ సంపన్నుడు, బారోన్ ఆష్‌బోర్న్ ఎడ్వర్డ్ గిబ్సన్ కూతురు. ఆ సమయంలో ఆయన ఐర్లాండ్ లార్డ్ చాన్సలర్‌గా ఉన్నారు. బారోన్ ఆష్‌బోర్న్ బిరుదు పొందిన తొలి వ్యక్తి ఆయనే. ఐర్లాండ్ లార్డ్ చాన్సలర్ కార్యాలయం ఆ సమయంలో దేశంలోని అతిపెద్ద న్యాయస్థానంగా ఉండేది.

డబ్లిన్ సిటీ కౌన్సిల్ తాజాగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. నగరంలో ఆమెకు స్మారకంగా ఒక శిలాఫలకం ఏర్పాటు చేయడానికి ప్రాథమికంగా అనుమతి ఇచ్చింది.

ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడిన వారి గురించి ప్రజలకు తెలియజేయాలని, ఐరిష్ చరిత్రలో గిబ్సన్‌కు ఏ స్థానం దక్కాలో దానిని ఆమెకు అదించాలని ఆ తీర్మానంలో ప్రతిపాదించారు.

ముస్సోలినీ ఇటలీని 1922 నుంచి 1943 వరకూ పాలించారు.

ధైర్యం చేశారు, దారుణ కష్టాలు అనుభవించారు

కొన్ని వింత కారణాలతో ఐరిష్, బ్రిటిష్ సంస్థలు వైలెట్ గిబ్సన్ లాంటి మహిళను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని ఆ తీర్మానం ప్రవేశపెట్టిన డబ్లిన్ నగర కౌన్సిలర్ మనిక్స్ ఫ్లిన్ చెప్పారు.

"అసాధారణ సాహసాలు చేసిన చాలామందిని, ముఖ్యంగా మహిళలను ఎప్పుడూ వెనక్కి నెట్టేస్తూనే ఉంటారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల విషయానికే వస్తే, వాటిలో పురుషులతోపాటూ మహిళలు కూడా పాల్గొన్నారు. మనం వాళ్లకు దక్కాల్సిన గౌరవం పెద్దగా ఇవ్వడం లేదు. కానీ, ఇది చాలా అరుదైన విషయం" అన్నారు.

"కొన్ని వింత కారణాల వల్ల వైలెట్ గిబ్సన్‌ను తమకు అవమానంగా భావించారు. ఆమెను దూరం పెట్టారు. ఆ అవమానం భరించలేకే ఆమె పిచ్చిదైందని చెప్పాలని వాళ్లు ప్రయత్నించారు" అని చెప్పారు.

శిలాఫలకం ఏర్పాటు చేయడానికి గిబ్సన్ కుటుంబం అంగీకరించిందని, కొన్ని వారాల్లో తమ ప్రతిపాదన తర్వాత దశకు చేరుకుంటుందని అనుకుంటున్నట్లు ఫ్లిన్ చెప్పారు.

డబ్లిన్‌లోని మెరియన్ స్క్వేర్‌లో ఆమె చిన్నప్పుడు గడిపిన భవనం దగ్గర ఆ శిలాఫలకం ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. అది ఆ భవనం యజమాని అనుమతి ఇవ్వడంపై ఆధారపడుతుందని తెలిపారు.

విన్‌స్టన్ చర్చిల్‌కు గిబ్సన్ లేఖలు

2014లో ఆర్టీఈ ప్రసారం చేసిన ఒక రేడియో డాక్యుమెంటరీ ద్వారా గిబ్సన్ కథ చాలామందికి తెలిసింది.

ఫ్రాన్సిస్ స్టోనర్ శాండర్స్ రాసిన 'ది వుమెన్ హూ షాట్ ముస్సోలిని' అనే పుస్తకం ఆధారంగా సియోబన్ లినమ్ ఆ డాక్యుమెంటరీ రూపొందించారు.

ఆ తర్వాత లినమ్ భర్త బారీ డౌడాల్ డైరెక్షన్‌లో 'వైలెట్ గిబ్సన్-ది ఐరిష్ వుమెన్ హూ షాట్ ముస్సోలిని" అనే సినిమా కూడా తీశారు. దీనిని ప్రస్తుతం అంతర్జాతీయ చలనచిత్ర ప్రదర్శనల్లో ప్రదర్శిస్తున్నారు.

"ముస్సోలినీని చంపడానికి ఎంతోమంది, ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక మహిళ, అది కూడా 50 ఏళ్ల మహిళ ఆయనపై పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరిపారు" అని లినమ్ చెప్పారు.

"సెయింట్ ఆండ్రూస్ హాస్పిటల్‌ నుంచి తనను విడుదల చేయాలని, యువరాణి ఎలిజెబెత్‌, ప్రస్తుత రాణి, విన్‌స్టన్ చర్చిల్, ఇంకా చాలామంది ప్రముఖులకు గిబ్సన్ రాసిన ఎన్నో ఉత్తరాలు మా కథకు కీలకం అయ్యాయి" అని డౌడాల్ తెలిపారు.

గిబ్సన్ ఐర్లాండ్ లార్డ్ చాన్సలర్ కుమార్తె కాబట్టి, ఆమె చిన్నతనంలో ఐర్లాండ్‌లో ఉన్నప్పుడు, వీళ్ల అందరితోనూ సమయం గడిపి ఉంటారని భావిస్తున్నారు.

ప్రస్తుతం నార్తంప్టన్‌లో ఉన్న గిబ్సన్ లేఖలను లినమ్, డౌడాల్ చదివారు. కానీ గిబ్సన్ ఆ లేఖలు ఎవరికోసం రాశారో వారి వరకూ అవి చేరనేలేదు.

జీవితాంతం ఆస్పత్రి లోపలే ఉంచేయాలనే షరతుతో గిబ్సన్‌ను విడుదల (ఇటలీ నుంచి) చేశారని లినమ్ చెప్పారు.

తమ పరిశోధనలో భాగంగా భార్యాభర్తలు ఇద్దరూ ఇటలీలో భద్రపరిచిన కొన్ని పత్రాలను పరిశీలించారు. ముస్సోలినీపై హత్యాయత్నం చేసిన అందరికంటే, గిబ్సన్ గురించే ఎక్కువ సమాచారం సేకరించినట్లు గుర్తించారు.

"అదే పని ఒక మగాడు చేసుంటే, బహుశా అతడికి ఒక విగ్రహమో, ఇంకేదో పెట్టుండేవారు. మహిళ కాబట్టి ఆమెను బంధించి ఉంచారు. ఆమె కథను చెప్పగలిగినందుకు, దాన్ని అందరి దగ్గరకూ తీసుకెళ్లినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది" అంటారు డౌడాల్.

గిబ్సన్‌కు ఒక గుర్తింపు రావాలంటే, శిలాఫలకం ఏర్పాటు చేయడం మంచిదే, అది ఆమె కథను ఇంకా చాలామందికి తెలిసేలా చేస్తుంది. తను చేసే పనిని గిబ్సన్ చాలా ధైర్యంగా చేశారు. ఆమె చేసినదానిని, ముస్సోలినీ చేసిన పనులన్నీ గమనిస్తే ఎవరికి పిచ్చో మనకు తెలుస్తుంది" అన్నారు.

ముక్కుపై బుల్లెట్ గాయంతో ముస్సోలినీ

బెనిటో ముస్సోలినీ ఎవరు

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 'బ్లాక్‌ షర్ట్స్' సాయుధ దళాల మద్దతుతో ముస్సోలినీ నేషనల్ ఫాసిస్ట్ పార్టీ ఇటలీలో అధికారంలోకి వచ్చింది.

1920ల్లో ప్రారంభంలో ఫాసిస్టులు అధికారం చేజిక్కించుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కూల్చివేశారు. 1925లో ముస్సోలినీ ఇటలీ నియంత అయ్యారు.

స్యిట్జర్లాండ్ అంతర్యుద్ధంలో జనరల్ ఫ్రాన్సిస్కో ఫ్రాంకోకు మద్దతిచ్చిన ముస్సోలినీ, రెండో ప్రపంచ యుద్ధంలో అడాల్ఫ్ హిట్లర్‌కు అండగా నిలిచారు.

ముస్సోలినీ కొన్ని హిట్లర్ విధానాలను కూడా అవలంబించారు. ముఖ్యంగా 1938 యూదు వ్యతిరేక చట్టాలు ఇటలీలోని యూదులకు పౌర హక్కులను దూరం చేశాయి. మారణహోమంలో ఇటలీలో 7,500 మందికి పైగా యూదులు చనిపోయారు.

1945లో మిత్రదళాలకు చిక్కకుండా పారిపోతున్న ముస్సోలినీని పట్టుకున్న ఇటలీ సమర్థకులు ఆయన్ను కాల్చి చంపారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Violet Gibson: Irish woman fires at Berito Mussolini at Point Blank range
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X