పక్కా ప్లాన్‌తోనే కేపిటల్ భవనంపై దాడి..? ఎగదోసి.. వినోదం చూసిన ట్రంప్... వీడియో లీక్..
అమెరికాలో ట్రంప్ మద్దతుదారుల అరాచకానికి పరాకాష్ఠగా నిలిచిన కేపిటల్ భవనంపై దాడి ఘటన యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. అగ్రరాజ్యం అమెరికాలో ప్రజాస్వామ్యం గాడి తప్పుతుందా అన్న సందేహాలకు బీజం వేసింది. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించకుండా ట్రంప్ తన మద్దతుదారులను ఎగదోసి కల్లోల పరిస్థితులను సృష్టించడంపై ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రంప్‌కు మాత్రం అధికారంపై ఉన్న కాంక్ష మిగతా ఏ విషయాల పట్ల లేదు. కేపిటల్ భవనంపై దాడికి ముందు ట్రంప్ సహా ఆయన ఫ్యామిలీ పార్టీ మూడ్‌లో కనిపించింది. 'సేవ్ అమెరికా' ర్యాలీని టీవీల్లో వీక్షిస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు.
ఆ వీడియో తీసింది ట్రంప్ జూనియర్...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,ఆయన కుమారులు ట్రంప్ జూనియర్,ఎరిక్,కుమార్తె ఇవాంకా ట్రంప్,ట్రంప్ జూనియర్ గర్ల్‌ఫ్రెండ్ తదితరులు వైట్ హౌస్‌లో పార్టీ మూడ్‌లో ఉన్న ఓ వీడియో బయటకు లీకైంది. ఈ వీడియో తీసింది ట్రంప్ జూనియర్ కాగా.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్యాక్‌గ్రౌండ్‌లో పాప్ సాంగ్ వినిపిస్తుండగా... ట్రంప్ కుటుంబ సభ్యులంతా టీవీల ముందు నిలుచుని సేవ్ అమెరికా ర్యాలీని వీక్షిస్తున్నారు. వాళ్లను దేశభక్తులంటూ ట్రంప్ జూనియర్ ప్రశంసిస్తుండటం ఆ వీడియోలో వినిపిస్తోంది.
జూ.ట్రంప్ గర్ల్‌ఫ్రెండ్... పాప్ సాంగ్‌కి స్టెప్పులు...
డొనాల్డ్ ట్రంప్ అడ్వైజర్,ట్రంప్ జూనియర్ గర్ల్‌ఫ్రెండ్ అయిన కింబర్లీ గిల్‌ఫోయల్ మెలికలు తిరుగుతూ స్టెప్పులు వేయడం ఆ వీడియోలో కనిపిస్తోంది. అంతేకాదు 'తగిన శాస్తి చేయండి.. పోరాడండి..' అంటూ ట్రంప్ మద్దతుదారులను ఉద్దేశించి ఆమె పేర్కొనడం గమనార్హం. మరోవైపు డొనాల్డ్ ట్రంప్,ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మీడౌస్తో ఏదో ముచ్చటిస్తూ కనిపిస్తున్నారు.సేవ్ అమెరికా ర్యాలీ మాత్రమే కాదు... ఆ తర్వాత జరిగిన కేపిటల్ భవనంపై దాడి ఘటనను కూడా ట్రంప్ ఫ్యామిలీ టీవీల్లో వీక్షిస్తూ సంబరాలు చేసుకోవచ్చునన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పక్కా ప్లాన్‌తోనే దాడి...?
సామాజిక కార్యకర్త,రచయిత ఎమీ సిస్కింద్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్టు చేయడంతో ట్రంప్ ఫ్యామిలీ పార్టీ విషయం వెలుగుచూసింది. ఈ వీడియోను చూస్తుంటే... కేపిటల్ భవనంపై దాడి పక్కా ప్లాన్‌తోనే జరిగి ఉంటుందని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. తాము అనుకునట్లే జరుగుతుందా లేదా అని ట్రంప్ ఫ్యామిలీ టీవీల ముందు నిలుచుని దాన్ని వీక్షించి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు,వెంటనే ట్రంప్ ఫ్యామిలీని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మౌనంగా ఉండేది లేదన్న ట్రంప్...
కేపిటల్ భవనంపై దాడికి ముందు ట్రంప్ వరుస ట్వీట్లతో తన మద్దతుదారులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ మద్దతుదారులు సృష్టించిన అల్లర్లలో మొత్తం ఐదుగురు మృతి చెందారు. ఇంత దారుణం జరిగాక గానీ ట్రంప్ అధికార మార్పిడికి అంగీకరించలేదు. పైగా ఇప్పటికీ ఆయన మాటల్లో పెద్దగా తేడా ఏమీ కనిపించట్లేదు. ట్విట్టర్ ట్రంప్ వ్యక్తిగత ఖాతాపై నిషేధం విధించినప్పటికీ.. అధికారిక ఖాతా ద్వారా మళ్లీ ట్వీట్లు చేశారు. తాను మౌనంగా ఉండేది లేదని తేల్చి చెప్పారు. ట్విటర్ తనను నిషేధించడంతో ప్రత్యామ్నాయంపై దృష్టి సారించినట్లు చెప్పారు. ట్రంప్ చేసిన ఈ ట్వీట్లను కూడా ట్విట్టర్ వెంటనే తొలగించడం గమనార్హం.