• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వ్లాదిమిర్ పుతిన్: సోవియట్ యూనియన్ పతనం తరువాత 30 ఏళ్లలో రష్యాను సూపర్ పవర్‌గా ఎలా మార్చగలిగారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
జోసెఫ్ స్టాలిన్ తరువాత రష్యాకు సుదీర్ఘకాలం పాటు అధ్యక్షుడిగా కొనసాగారు వ్లాదిమర్ పుతిన్

సుమారు 30 సంవత్సరాల క్రితం, 1991 డిసెంబర్ 25న అప్పటి సోవియట్ యూనియన్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్ తన పదవికి రాజీనామా చేశారు. రష్యన్ ఫెడరేషన్ నుంచి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బోరిస్ యెల్ట్సిన్‌కు అధికారాలను అప్పగించారు.

ఆ రాత్రి సుత్తి, కొడవలి చిహ్నాలతో ఉన్న ఎరుపు రంగు సోవియట్ జెండా క్రెమ్లిన్ నుంచి కిందకు దిగింది. దాని స్థానంలో రష్యన్ త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.

మరుసటి రోజు, సుప్రీం సోవియట్ అధికారికంగా యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ (యూఎస్ఎస్ఆర్)ను రద్దు చేసింది. సోవియట్ రిపబ్లిక్‌ స్వాతంత్య్రాన్ని అంగీకరించింది.

ప్రపంచవ్యాప్తంగా తన భౌగోళిక రాజకీయ ప్రభావాన్ని విస్తరించిన ఒక పెద్ద సామ్రాజ్యం, 70 సంవత్సరాల పాటు వివిధ మిత్రరాజ్యాల రాష్ట్రాలను నియంత్రించిన విశాలమైన సామ్రాజ్యం అకస్మాత్తుగా విచ్ఛిన్నం కావడం అనేది యావత్ ప్రపంచాన్నీ కుదిపేసిన సంఘటన.

దాంతో, అప్పుడే ఉనికిలోకి వచ్చిన రష్యన్ ఫెడరేషన్ గుర్తింపు విషయంలో సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.

"పశ్చిమ దేశాలలో రష్యా ఎల్లప్పుడూ ఒక సామ్రాజ్యంగానే గుర్తింపు పొందింది. దాన్ని ఎప్పుడూ ఒక దేశంగా పరిగణించలేదు. జాతీయ రాజ్యంగా గుర్తించలేదు" అని ఎల్కానో రాయల్ ఇన్‌స్టిట్యూట్‌లో రష్యా, యురేషియాలపై నిపుణురాలు మీరా మిలోసెవిచ్ అన్నారు.

"సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత, రష్యా తనకంటూ ఒక రష్యన్ జాతీయ గుర్తింపును సృష్టించడానికి ప్రయత్నించింది. అయితే, ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఎందుకంటే రష్యా బహుళ జాతి దేశం. గొప్ప సంప్రదాయాలు, ఘనమైన సామ్రాజ్య చరిత్ర ఉన్న దేశం."

1990వ దశకంలో రష్యా ఆ జాతీయ గుర్తింపును సృషించడంతో పాటు పశ్చిమ దేశాలతో దాని సంబంధాన్ని పునర్నిర్వచించడానికి ప్రయత్నించింది.

అయితే, ప్రచ్ఛన్న యుద్ధానంతర కాలంలో యూఎస్ఎస్ఆర్ పతనం తరువాత అమెరికా సహా పాశ్చాత్య దేశాలు రష్యాను ప్రపంచంలోని "గొప్ప శక్తి"గా పరిగణించడం మానేశాయి.

అంతర్జాతీయ స్థాయిలో రష్యా హోదా క్షీణిస్తోందన్న దానికి ప్రతీకగా తూర్పు ఐరోపాలో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) విస్తరణ ఊపందుకుంది.

1999లో బోరిస్ యెల్ట్సిన్ రాజీనామాతో పుతిన్ రష్యా తాత్కాలిక అధ్యక్షుడయ్యారు.

పుతిన్ రాక

సోవియట్ యూనియన్ పతనం "20వ శతాబ్దంలో ప్రపంచ రాజకీయాలలో అత్యంత ఘోరమైన విషాదం"గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభివర్ణించారు.

"సోవియట్ యూనియన్ పేరుతో చారిత్రక రష్యా విచ్ఛిన్నం అయింది. ఇప్పుడు అది ఒక సరికొత్త దేశంగా అవతరించింది. గత 1,000 సంవత్సరాలలో నిర్మించుకున్నవన్నీ మేం కోల్పోయాం" అని ఆయన అన్నారు.

అందుకే 2000లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రష్యాను ప్రపంచ శక్తిగా పునర్నిర్మించే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. అమెరికా, దాని నాటో మిత్రదేశాల చేతిలో అవమానాలను ఎదుర్కొన్న రష్యాకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టాలనే కృతనిశ్చయంతో ఉన్నట్టు పుతిన్ స్పష్టం చేశారు.

అన్నట్లుగానే, రష్యాను సూపర్ పవర్‌గా మార్చడంలో పుతిన్ విజయం సాధించారని మీరా మిలోసెవిచ్ అభిప్రాయపడ్డారు.

"పుతిన్ తనను తాను రష్యా రక్షకుడిగా భావిస్తారు. 1990లలో విఫలమైన ప్రజాస్వామ్య ప్రక్రియ, తరువాత రష్యా పతనం, దివాలా తీసిన కాలంలో పుతిన్ రష్యాను రక్షించారు. అంతర్జాతీయ రాజకీయాలలో దాని వ్యూహాత్మక పాత్రకు తిరిగి తీసుకొచ్చారు."

1990లను రష్యా "కోల్పోయిన దశాబ్దం"గా భావిస్తారు. అలాంటి దేశాన్ని మళ్లీ ప్రపంచపటంపై సముచిత స్థానంలో నిలబెట్టారు పుతిన్.

16 సంవత్సరాల పాటు కేజీబీ గూఢచారిగా వ్యవహరించారు పుతిన్

కేజీబీ గూఢచర్యం నుంచి దేశాధ్యక్షుడిగా ప్రస్థానం

1991లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించడానికి ముందు 16 సంవత్సరాల పాటు కేజీబీ గూఢచారిగా వ్యవహరించారు పుతిన్.

1999లో యెల్ట్సిన్ రాజీనామా చేసిన తరువాత, పుతిన్‌ను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నాలుగు నెలల తరువాత జరిగిన ఎన్నికలలో పుతిన్ పూర్తికాల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

1953లో మరణించిన సోవియట్ నాయకుడు జోసెఫ్ స్టాలిన్ తరువాత సుదీర్ఘకాలం పాటు రష్యాకు అధ్యక్షుడిగా కొనసాగిన ఘనత పుతిన్‌కే దక్కింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజ్యాంగ సంస్కరణలపై జరిగిన వివాదాస్పద జాతీయ ఓటు కారణంగా 2024లో తన నాల్గవ పదవీకాలం ముగిసిన తరువాత కూడా పుతిన్ అధికారంలో కొనసాగగలరు. 69 ఏళ్ల పుతిన్ 2036 వరకు క్రెమ్లిన్‌లో కొనసాగవచ్చు.

సోవియట్ యూనియన్ కాలంలో తనను తాను తీర్చిదిద్దుకున్న విధానమే ప్రపంచం పట్ల తన దృక్పథాన్ని రూపొందించిందని పుతిన్ విమర్శకులు అంటారు.

"రష్యా అంతర్జాతీయ చర్చల్లోకి తిరిగి వచ్చిందన్నది స్పష్టం. కానీ సానుకూల కారణాల వల్ల కాదు" అని లండన్‌ కింగ్స్ కాలేజీలోని వార్ స్టడీస్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ నటాషా కుహర్ట్ అన్నారు.

"రష్యా తనను తాను ఆకర్షణీయంగా మార్చుకోవాలని, సాఫ్ట్ పవర్ ఉపయోగించాలని పదేళ్ల క్రితం వరకు రష్యన్లు భావించేవారు. కానీ, ఇప్పుడు వాళ్లు మారిపోయారు. తమను తాము ఆకర్షణీయంగా మలచుకోవాలని ఇప్పుడు మాస్కోలో ఎవరూ చెప్పడంలేదు. ప్రస్తుతం వారు రష్యాను ప్రపంచ వేదికపై ఒక పాత్రగా చూడాలనుకుంటున్నారు. రష్యాను ప్రపంచం అంగీకరించాలని, వినాలని కోరుకుంటున్నారు. పుతిన్ కోరుకున్నది అదే అయితే, వ్యూహాత్మక కోణం నుంచి ఆయన అది సాధించారని చెప్పవచ్చు" అని కుహర్ట్ అన్నారు.

ఇది 2017 నవంబర్‌లో తీసిన ఫొటో. రష్యా జార్ నికోలస్ 2 తండ్రి జార్ అలగ్జాండర్ 3 విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న పుతిన్

రష్యా సూపర్ పవర్

  • 1.7 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతిపెద్ద దేశం రష్యా.
  • రోజుకు 1.027 కోట్ల బ్యారెల్స్‌ ఉత్పత్తి చేస్తూ, అమెరికా తరువాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా నిలిచింది.
  • అమెరికా తరువాత రష్యాలో అత్యధిక సంఖ్యలో అణు వార్‌హెడ్‌లు ఉన్నాయి. మొత్తం 6,375 అణు వార్‌హెడ్‌లు.
  • రక్షణ రంగంలో అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాల జాబితాలో రష్యా నాలుగో స్థానంలో ఉంది. 2020 సంవత్సరంలో, ఇది రక్షణ రంగంలో 66,840 మిలియన్ డాలర్లను (సుమారు రూ.501 కోట్లు) ఖర్చు చేసింది.
  • వీటో అధికారంతో ఐక్యరాజ్య సమితి (యూఎన్) భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా ఉంది.

మూలం - బీపీ వరల్డ్ ఎనర్జీ స్టాటిస్టిక్స్, ఎస్ఐపీఆర్ఐ

పుతిన్ ప్రాధాన్యాలు

సోవియట్ యూనియన్ రద్దు తరువాత రష్యా అంతర్జాతీయ హోదా క్షీణిస్తున్న నేపథ్యంలో, సోవియట్ యూనియన్‌కు చెందిన ప్రాంతాలలో విదేశీ శక్తుల ప్రభావం పెరగకుండా నిరోధించడమే పుతిన్‌కు మొదటి ప్రాధాన్యమని నిపుణులు అభిప్రాయపడ్డారు.

2008లో, రష్యా రక్షణలో ఉన్న దక్షిణ ఒస్సేటియాలోని వేర్పాటువాద జార్జియన్ భూభాగాన్ని పాశ్చాత్య దేశాల మద్దతుతో జార్జియన్ అధ్యక్షుడు మిఖైల్ సాకాష్విలి తిరిగి స్వాధీనం చేసుకోకుండా నిరోధించడానికి రష్యా దళాలు జార్జియాపై దాడి చేశాయి.

జార్జియాను నాటోలో చేర్చేందుకు అనుకూలంగా మలచడమే సాకాష్విలి లక్ష్యం. విచ్ఛిన్నమైన తన దేశాన్ని తిరిగి ఏకం చేయగలిగితే ఈ లక్ష్యానికి చేరువ కాగలిగేవారు. కానీ, సాకాష్విలి వ్యూహాలను రష్యా తిప్పికొట్టింది.

అలాగే, 2014లో ఉక్రెయిన్‌లో రష్యా మిత్రపక్షం అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్‌ను పాశ్చాత్య దేశాల మద్దతుతో పడగొట్టారు. ఆ తరువాత రష్యా సైనికపరంగా జోక్యం చేసుకుంది. మొదట క్రిమియన్ ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకుంది.

అయితే, ఇవన్నీ సోవియట్ యూనియన్‌ పునరుద్ధరణకు పుతిన్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగం కాదని, "రష్యన్ జాతీయ భద్రతకు సంబంధించిన చారిత్రక సూత్రమని" మీరా మిలోసెవిచ్ అన్నారు.

"జాతీయ భద్రత, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకే రష్యా ప్రాధాన్యమిస్తుంది. అందులో భాగంగా పైన చెప్పిన ప్రాంతాలను రక్షించడం, శత్రువులు కాగలవారిని దూరం పెట్టడం మొదలైనవన్నీ చేసింది, రష్యా జాతీయ భద్రతకు నాటోను అతి పెద్దముప్పుగా వారు పరిగణిస్తారు. తమ భూభాగం పరిధిలో నాటో విస్తరించకూడదని రష్యా కోరుకుంటుంది."

రష్యా ఆయుధ శక్తి

రష్యా ఆయుధ శక్తి

సోవియట్ యూనియన్ పతనం తరువాత, విస్తారమైన అణ్వాయుధాగారాన్ని వారసత్వంగా పొందింది రష్యా. తరువాత, తన అణు నిల్వలను గణనీయంగా తగ్గించుకుంది. కానీ, ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలు ఉన్న దేశాల జాబితాలో రష్యా రెండవ స్థానంలో ఉంది.

2018లో జాతీయ స్థాయి వార్షిక ప్రసంగంలో పుతిన్ శక్తివంతమైన కొత్త అణ్వాయుధాల గురించి మాట్లాడారు. తన పదవీ కాలాన్ని ఆరేళ్లకు పెంచిన ఎన్నికల ముందు రోజు సీనియర్ అధికారులు, ఎంపీలకు ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించారు. రష్యాను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ పాశ్చాత్య దేశాలకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.

రష్యా కొత్త భారీ ఐసీబీఎం (ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్)ను పరీక్షించిందని, దీనిని సర్మత్ అని పిలుస్తున్నారని పుతిన్ చెప్పారు.

అంతే కాకుండా, 2002లో అమెరికా యాంటీ బాలిస్టిక్ క్షిపణి (ఏబీఎం) ఒప్పందం నుంచి వైదొలగినందున, అప్పటి అవసరాలకు అనుగుణంగా రష్యా తన అణ్వాయుధాలను సిద్ధం చేసుకోవలసి వచ్చిందని ఆయన వాదించారు.

తాము ఇలాంటి నిర్ణయం తీసుకుంటామని 2004లో పశ్చిమ దేశాలకు హెచ్చరించినప్పటికీ, ఆ దేశాలు రష్యాతో చర్చలు జరపడానికి మొగ్గు చూపలేదని పుతిన్ అన్నారు.

"అప్పుడు ఎవరూ మాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. అప్పుడు ఎవరూ మా మాట వినలేదు. కాబట్టి ఇప్పుడు మా మాట వినండి" అంటూ పుతిన్ తన టీవీ ప్రసంగంలో అన్నారు.

అప్పటి నుంచి రష్యా తన అణ్వాయుధాలను ఆధునీకరించే పనిలో నిమగ్నమై ఉంది.

స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్ఐపీఆర్ఐ) నివేదిక ప్రకారం, 2021లో రష్యా వద్ద గత ఏడాది కన్నా అదనంగా 50 అణ్వాయుధాలు ఉన్నాయి.

తన మొత్తం అణ్వాయుధాలకు 180 న్యూక్లియర్ వార్‌హెడ్‌లను జోడించింది. వీటిలో ప్రధానంగా బహుళ వార్‌హెడ్‌లతో కూడిన భూ ఆధారిత ఐసీబీఎంలు, సముద్రంలో ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి.

అందువల్ల, నేడు ప్రపంచం రష్యా మాట వినడమే కాదు, దాన్ని చూసి భయపడుతోంది కూడా.

రష్యా జార్ నికోలస్ 2 చిత్రం వద్ద వ్లాదిమిర్ పుతిన్

అంతర్జాతీయ సంబంధాలు

రష్యాను సూపర్ పవర్‌గా మార్చే దిశలో, వ్యూహాత్మకమైన లాటిన్ అమెరికాతో తమ సంబంధాలను బలోపేతం చేయడం ప్రారంభించింది.

"అంతర్జాతీయ సంస్థలలో, దౌత్య రంగంలో ఒకప్పడు సోవియట్ యూనియన్ పోషించిన పాత్రే రష్యా పోషిస్తోంది. దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి సంప్రదాయ సంబంధాలను సద్వినియోగం చేసుకుంటుందనడంలో సందేహం లేదు. లాటిన్ అమెరికా అందుకు ఒక ఉదాహరణ" అని మీరా మిలోసెవిచ్ చెప్పారు.

లాటిన్ అమెరికాలో రష్యా ఉనికిని పెంపొందించడం దాని అంతర్జాతీయ వ్యూహంలో భాగమేనని నిపుణులు భావిస్తున్నారు. ఈ వ్యూహం లక్ష్యాలు.. ఆ ప్రాంతంలో అమెరికా నాయకత్వాన్ని బలహీనపరచడం, వేగంగా అభివృద్ధి చెందుతున్న చైనాతో పోటీపడడం.

"పుతిన్ గొప్ప వ్యూహకర్త. అమెరికా కంటే తక్కువ ఆర్థిక, సైనిక, రాజకీయ శక్తితో మధ్యప్రాచ్యంలో రష్యాను పునర్నిర్మించగలిగారు" అని మీరా అన్నారు.

రష్యా బలహీనతలు

పుతిన్ దౌత్య, సైనిక, వ్యూహాత్మక విజయాలు రష్యా ప్రధాన అంతర్గత బలహీనతలను దాచిపెట్టడంలో విఫలమయ్యాయని నిపుణులు అంటున్నారు. ఈ బలహీనతలు ఆయుధాల ఎగుమతులపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ నుంచి సామాజిక, రాజకీయ అసంతృప్తుల వరకు విస్తరించి ఉన్నాయి.

కొంతమేర, అమెరికా, యూరోపియన్ యూనియన్‌లపై వ్యతిరేకత కేంద్రంగా పుతిన్ విదేశాంగ విధానాలు రూపొందినట్లు చెప్పవచ్చని నటాషా కుహర్ట్ అభిప్రాయపడ్డారు.

అందుకే, అసాధారణ ప్రభుత్వాలకు మద్దతు ఇస్తూ, అడిగినవారందరికీ రష్యా ఆయుధాలను విక్రయిస్తోంది.

సోవియట్ యూనియన్ లాగా రష్యా కూడా ఐదేళ్ల వాయిదా పద్ధతిలో ఆఫ్రికన్ దేశాలకు విమానాలను విక్రయించింది. దానర్థం, ఆ దేశాలు నమ్మకమైన మిత్రదేశాలుగా మారతాయని కాదు. రష్యా చైనాలాగ పనిచేయడం లేదు. ఆఫ్రికాలో పెట్టుబడి పెట్టడం ద్వారా చైనా దీర్ఘకాలిక ప్రతిఫలలాను ఆశిస్తోంది. రష్యాకు అలాంటి ఉద్దేశాలు లేవు.

రష్యా సైన్యం

కొత్త ఆందోళనలు

ప్రస్తుతం పశ్చిమ దేశాలకు, రష్యాకు మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఉక్రెయిన్ సమీపంలో రష్యా భారీ సైన్యాన్ని మోహరించిందని ఆ దేశాలు ఆరోపిస్తున్నాయి.

ఉక్రెయిన్‌పై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జీ-7 దేశాలు రష్యాను హెచ్చరించాయి.

అయితే, ఉక్రెయిన్‌పై దాడి చేసే ఉద్దేశం లేదని రష్యా స్పష్టం చేసింది. మీడియాలో వస్తున్న నకిలీ వార్తలను నమ్మి పశ్చిమ దేశాలు తమను అనుమానిస్తున్నాయని ఆరోపించింది.

పాశ్చాత్య దేశాలకు, రష్యాకు మధ్య దూరం ఇప్పట్లో తగ్గేలా లేదు.

రష్యాకు పూర్వ వైభవాన్ని తీసుకురావడంలో, సూపర్ పవర్‌గా మార్చడంలో పుతిన్ ఇప్పటికే సఫలమై ఉండొచ్చుగాక. కానీ, ప్రపంచవేదికపై రష్యాకు సమానమైన, స్థిరమైన స్థానాన్ని పుతిన్ సంపాదించి పెట్టలేకపోవచ్చని కుహర్ట్ అభిప్రాయపడ్డారు.

"రష్యా ఇప్పటికీ తన స్థానాన్ని సుస్థిరపరుచుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ చైనా ఎదుగుదలతో అది అంత సులభం కాకపోవచ్చు. అయితే, రష్యాకు ఆ స్థానం కల్పించడంలో తాను సమర్థుడనని పుతిన్ భావించవచ్చు. దానర్థం, ఆయన విజయం సాధిస్తారని కాదు" అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Vladimir Putin: How did Russia become a superpower 30 years after the collapse of the Soviet Union
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X