పర్యాటక కేంద్రంలో అగ్నిపర్వతం భారీ విస్పోటనం... ఐదుగురు మృతి
న్యూజిలాండ్: న్యూజిలాండ్‌లో అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో నిండిపోయాయి. కొన్ని వేల అడుగుల ఎత్తుకు పొగ వ్యాపించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా చాలామంది గాయపడ్డారు. ఈ ఘటనలో 23 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. అయితే సహాయకచర్యలకు అక్కడ పరిస్థితులు అనుకూలించడం లేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులకు న్యూజిలాండ్ మిలటరీ సహాయం చేస్తోంది. ఈ ఘటన వైట్ ఐలాండ్ అనే ఈ అగ్నిపర్వతం యాక్టివ్‌గా ఉన్న అగ్నిపర్వతాల్లో ఒకటి.

పర్యాటక ప్రాంతంలో అగ్నిపర్వతం పేలుడు
ఈ అగ్నిపర్వతం ఉన్న ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా విరాజిల్లుతోంది. ఇక్కడకు పర్యాటకులు తరచూ వస్తుంటారు. ఈ దీవి ప్రైవేట్ వ్యక్తుల సొంతం. అగ్నిపర్వతం భారీ శబ్దంతో పేలడంతో అక్కడ పరిస్థితులు సహాయకచర్యలకు అడ్డంకిగా మారాయని డిప్యూటీ పోలీస్ కమిషనర్ జాన్ టిమ్స్ చెప్పారు. ఇంకా ఎంతమంది అక్కడే చిక్కుకుపోయారనే దానిపై స్పష్టత రాలేదని చెప్పారు. న్యూజిలాండ్‌తో పాటు ఓవర్సీస్ పర్యాటకులు కూడా అక్కడ ఉన్నట్లు సమాచారం ఉందని డీసీపీ జాన్ టిమ్స్ చెప్పారు. అయితే 50 మంది వరకు దీవిలో చిక్కుకుని ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు. ఇక కాపాడిన ఐదు మంది మృతి చెందడం బాధాకరమని చెప్పారు.
కెమెరాలో రికార్డు చేసిన పర్యాటకుడు
అగ్నిపర్వతం విస్ఫోటనం న్యూజిలాండ్ స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 11 నిమిషాలకు జరిగింది. ఉదయం దీవి దగ్గరకు వెళ్లిన ఓ పర్యాటకుడు అగ్ని విస్ఫోటనం తర్వాత చెలరేగిన మంటలను దట్టమైన పొగను తన కెమెరాతో బంధించారు. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందక అరగంట ముందు తాను అదే ప్రాంతంలో ఉన్నట్లు ఈ పర్యాటకుడు చెప్పాడు. బోట్లోకి ఎక్కి కొంత దూరం రాగానే అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం చూసి షాక్‌కు గురయ్యామని చెప్పారు. ఘటన చోటుచేసుకోగానే బోట్‌ను వెనక్కు తిప్పి కొతమందిని కాపాడగలిగామని చెప్పారు.

ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చిన ప్రధాని జేసిండా
ఇదిలా ఉంటే అగ్నిపర్వతం విస్ఫోటనం చెందే సమయానికి దీవిపై చాలామంది పర్యాటకులు ఉన్నారని వెల్లడించారు. వీరంతా న్యూజిలాండ్‌తో పాటు ఇతర దేశాల పర్యాటకులు కూడా ఉన్నారని వెల్లడించారు. దీవిలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు పోలీసులు తమ శాయశక్తుల ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అందరూ ధైర్యంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. అయితే అగ్నిపర్వతం నుంచి బూడిద ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని ఆమె చెప్పారు.

డిసెంబర్ 3న హెచ్చరిక
ఇదిలా ఉంటే అగ్నిపర్వతం ఏ క్షణమైనా విస్ఫోటనం చెందే అవకాశం ఉందని డిసెంబర్ 3వ తేదీన జియోనెట్ అనే వెబ్సైట్ హెచ్చరించింది. అగ్నిపర్వతం యాక్టివ్ స్టేజ్ నుంచి విస్ఫోటనం చెందే స్టేజ్‌కు వచ్చిందని హెచ్చరించింది. అయితే ప్రస్తుత విస్ఫోటనం ప్రజలకు హానిచేయదని వెబ్సైట్ స్పష్టం చేసింది. ప్రస్తుతం దీవిలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. అగ్నిపర్వతం కింద పలు వాయువులు పీడనం పేర్కొని ఒత్తిడికి గురై విస్ఫోటనం చెందిందని పలువురు ప్రొఫెసర్లు చెబుతున్నారు.