వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన రోజు ఏం చేశారు... ఎలా ఉన్నారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గోల్ఫ్ ఆడి వైట‌్‌హౌస్‌కు తిరిగి వస్తున్న ట్రంప్

నేను గత నాలుగేళ్ళుగా డోనల్డ్ ట్రంప్‌ను చాలా దగ్గరగా చూస్తూ వచ్చాను. మంచి - చెడు కాలాల్లో ఆయనతోనే ఉన్నాను. కానీ, నవంబర్ 7న ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన రోజు లాంటిది నేను అంతకు ముందెప్పుడూ చూడలేదు.

బ్లాక్ జాకెట్, డార్క్ ట్రౌజర్, తెల్ల 'మాగా' (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) టోపీ ధరించిన అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఉదయం 10 గంటల కంటే కొన్ని నిమిషాల ముందు వైట్ హౌస్ నుంచి బయటికొచ్చారు. అంతకు ముందు వరకూ ఆయన 'ఎన్నికల్లో మోసాలు జరిగాయని' ట్వీట్లు చేస్తూనే గడిపారు.

ఇప్పుడు, ఆయన గాలి నెడుతున్నట్టుగా కాస్త ముందుకు వాలి నడుస్తున్నారు. ఒక నల్లటి కారులో ఎక్కిన ట్రంప్ వర్జీనియా, స్టెర్లింగ్‌లోని ట్రంప్ నేషనల్‌లో తన గోల్ఫ్ క్లబ్‌కు బయల్దేరారు. అది వైట్‌హౌస్ నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ సమయంలో గాలి తనకు అనుకూలంగా ఉంటుందని ఆయన అంచనా వేశారు. అదొక అందమైన రోజు, గోల్ఫ్ ఆడ్డానికి చక్కటి రోజు. ఈ రోజును ఆయన క్లబ్‌లో గడపబోతున్నారు.

కానీ, ఆయన కోసం పనిచేసేవారు కాస్త అంటీముట్టనట్లు ఉండడం కనిపించింది. జూనియర్ సిబ్బందిలో ఒకరిని నేను 'ఎలా ఉన్నారు' అని అడిగాను. ఆమె 'బాగున్నా' అన్నారు. చిన్నగా నవ్వి, చూపులు తిప్పుకున్నారు. తన పోన్ చూసుకుంటున్నారు.

ట్రంప్

ఎన్నికల గాయం

ఎన్నికల తర్వాత నుంచి వైట్‌హౌస్ కాస్త దిగాలుగా ఉంది. అవి మంగళవారం జరిగినా, ఎప్పుడో జీవితకాలం క్రితం జరిగినట్లు అనిపిస్తోంది.

శనివారం ఉదయం నేను భవనంలో నడుస్తున్నప్పుడు, వెస్ట్ వింగ్‌లో చాలా డెస్కులు ఖాళీగా కనిపించాయి. సిబ్బందిలో చాలామందికి కరోనా వచ్చింది. వాళ్లంతా ఆఫీసుకు రావడం లేదు. మిగతావారు క్వారంటైన్లో ఉన్నారు.

తర్వాత, దాదాపు 11.30 గంటలకు అధ్యక్షుడు గోల్ఫ్ క్లబ్‌లో ఉన్న సమయంలో బీబీసీ, మిగతా అమెరికా చానళ్లు జో బైడెన్ ఎన్నికల్లో గెలిచారని చెప్పడం ప్రారంభించాయి.

నేను క్లబ్‌కు దాదాపు మైలు దూరంలో ఉన్న ఒక ఇటాలియన్ రెస్టారెంట్‌లో కూర్చుని న్యూస్ వింటున్నాను. వైట్ హౌస్ ప్రెస్ పూల్‌లో నేను సభ్యుడిని. అది అధ్యక్షుడితో కలిసి ప్రయాణించే ఒక చిన్న జర్నలిస్టుల గ్రూప్. మేమంతా ఆయన క్లబ్ నుంచి ఎప్పుడెప్పుడు బయటికొస్తారా అని వేచిచూస్తున్నాం.

రెస్టారెంట్ బయట ఒక మహిళ ఆయన 'చాలా విషపూరితం' అన్నారు. డెమొక్రాట్లకు మొగ్గున్న ఈ ప్రాంతంలో ఉన్న మిగతా అందరిలాగే ఆమె కూడా ట్రంప్‌ ప్రత్యర్థికి ఓటు వేశారు.

అధ్యక్షుడు క్లబ్ నుంచి ఎప్పుడు బయటికి వస్తారా, మళ్లీ వైట్‌హౌస్ ఎప్పుడు వెళ్తారా అని మిగతా అందరూ ఎదురు చూస్తున్నారు. నిమిషాలు, తర్వాత గంటలు గడిచిపోయాయి.

'ఆయన కాస్త టైం తీసుకుంటున్నారు' అని ఒక పోలీసు అధికారి తన కొలీగ్‌తో చిన్నగా అన్నాడు.

అధ్యక్షుడు తిరిగి వెళ్లడానికి ఏమాత్రం తొందరపడడం లేదు. ఆయన చుట్టూ స్నేహితులు ఉన్నారు. బయట గేట్ల దగ్గర ట్రంప్ మద్దతుదారులు నన్ను, మిగతా రిపోర్టర్లను చూసి "మీడియాకు నిధులు ఆపేయండి" అని అరుస్తున్నారు.

ఒక మహిళ 'దొంగతనం ఆపు' అని రాసిన బోర్డు పట్టుకుని కనిపించారు.

క్లబ్ ముందు రోడ్డు మీద ఒక వ్యక్తి చాలా జెండాలు కట్టిన ఒక ట్రక్ నడుపుతున్నాడు. ఆ జెండాల్లో ట్రంప్ "నేను ప్రపంచానికే కమాండర్" అన్నట్టు ఒక ట్యాంక్ మీద ఎక్కి నిలబడింది కూడా ఉంది. గత నాలుగేళ్లుగా ట్రంప్ తనను ఎలా అనుకుంటున్నారో, మద్దతుదారులు ఆయన్ను ఎలా చూస్తున్నారో ఆ జెండా చెబుతుంది.

చివరికి, క్లబ్ నుంచి బయటికి వచ్చిన ట్రంప్ ఇంటికి బయల్దేరారు. ఆయన కోసం విమర్శకులు వేలల్లో వేచిచూస్తున్నారు.

ట్రంప్

మీరు ఓడారు, మేమంతా గెలిచాం

అధ్యక్షుడి కాన్వాయ్ వర్జీనియా లోంచి దూసుకెళ్తోంది. మేం కాన్వాయ్‌లో ఒక వ్యాన్‌లో ఉన్నాం. ఫెయిర్ ఫాక్స్ కంట్రీ పార్క్ వే దగ్గర దానికి తృటిలో ప్రమాద తప్పింది. సైరెన్లు గోలచేశాయి.

మేం వైట్‌హౌస్‌కు దగ్గరయ్యే కొద్దీ, రోడ్ల మీద కనిపించే జనం ఎక్కువ అవుతున్నారు. ట్రంప్ ఓటమిని సెలబ్రేట్ చేసుకోడానికి వారంతా బయటికి వచ్చారు. వారిలో ఒకరు "నువ్వు ఓడావు, మేమంతా గెలిచాం" అనే బోర్డు పట్టుకుని ఉండడం కనిపించింది.

తర్వాత మేం మళ్లీ వైట్‌హౌస్ దగ్గరికి చేరుకున్నాం. ట్రంప్ ఒక సైడ్ డోర్ నుంచి లోపలికి వెళ్లారు. ఆ దారిని ఆయన అరుదుగా ఉపయోగిస్తారు. ఆయన భుజాలు జారిపోయి ఉన్నాయి, తల కిందికి వాలిపోయి ఉంది.

ప్రెస్ పూల్‌లో ఉన్న నన్ను, మిగతా వారిని చూసిన ఆయన తన బొటన వేలు పైకెత్తి చూపారు. అందులో అసలు ఉత్సాహం కనిపించలేదు. ఎప్పటిలా తన స్టయిల్లో ఆయన తన చేతిని పైకెత్తలేదు, పిడికిలి బిగించి గాల్లో ఊపలేదు..

వైట్‌హౌస్‌లో, గోల్ఫ్ క్లబ్‌లో అధ్యక్షుడు అంత బలహీనంగా ఎప్పుడూ కనిపించలేదు.

ఆయన ఎన్నికల్లో అవకతవకల గురించి నిరాధార ఆరోపణలు చేస్తారు. వాటిని నిరూపిస్తానని కూడా అంటారు.

https://twitter.com/realDonaldTrump/status/1325194709443080192

'చట్టవిరుద్ధంగా పోలయిన ఓట్ల' గురించి ఉదయం ట్వీట్ చేస్తే, మధ్యాహ్నం తర్వాత మొత్తం కాపిటల్ లెటర్స్ తో 'నేను కచ్చితంగా ఎన్నికల్లో గెలిచాన'ని ప్రకటిస్తారు.

కానీ, అదంతా చేసేది ట్విటర్‌లోని డోనల్డ్ ట్రంప్. నేను చూసిన మనిషి నాకు మరో అభిప్రాయాన్ని మిగిల్చారు.

సాయంత్రం, ఆయన వైట్‌హౌస్ దొడ్డి దారి గుండా లోపలికి దూరుతున్నప్పుడే, ఆయన ఆడంబరానికి తెరపడినట్లు నాకు అనిపించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What did Donald Trump do on the day he lost the US presidential election
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X