• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌: ఇంటి నుంచి పనిచేస్తూ ఈజీగా ప్రమోషన్‌ కొట్టేయాలంటే ఏం చేయాలి?

By BBC News తెలుగు
|

వర్క్ ఫ్రమ్ హోమ్ లో రోజూ పని చేసి ఊరుకుంటే ప్రమోషన్ సంగతి ఎవరు చూస్తారు ?

కరోనా మహమ్మారి కారణంగా చాలామంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారు. మరి ఇలా ఇంటి నుంచి పని చేసుకుంటూ పోతుంటే ప్రమోషన్‌ సంగతెవరు చూస్తారు? మనం బాగా పని చేస్తున్నామని ఎలా తెలియాలి? అసలు ఆఫీసుకు వెళ్లకుండా ప్రమోషన్‌ పొందడం సాధ్యమేనా? మీ సహోద్యోగులకన్నా మిన్నగా మీ బాస్‌ను ఆకట్టుకోవడం ఎలా?

మీరు మీ బాస్‌కు పంపే ఈ-మెయిల్స్‌ చాలా కళాత్మకంగా, ఆకట్టుకునేలా ఉండాలని సూచిస్తున్నారు సేల్స్‌మన్‌గా పని చేస్తున్న జాన్‌.

“ఇంటి నుంచి మీ బాస్‌కు పంపే ఈ-మెయిల్స్‌లో కేవలం ఆఫీసుకు సంబంధించిన విషయం చెప్పి వదిలేయడం కాకుండా, మీకు చాలా తెలివి, నేర్పూ ఉన్నాయని నిరూపించుకునేందుకు ప్రయత్నించాలి ’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఉద్యోగి అన్నారు.

“అయితే మీరు షో చేస్తున్నారని బాస్‌కు అనిపించకుండా జాగ్రత్త పడాలి సుమా’’ అన్నారాయన.

“మీకు ఆఫీసు నుంచి ఏదైనా మెయిల్‌ వస్తే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. బాగా అర్ధం చేసుకోవాలి. జూమ్‌ కాల్స్‌ విషయంలో కూడా చాలా అలర్ట్‌గా ఉండాలి. మీరు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నా, ప్రమోషన్‌ కోసం పోరాడుతూనే ఉండాలి. ముఖ్యంగా మీ మిత్రులు కొందరు ఆఫీసుకు వెళుతున్నట్లయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి’’ అంటున్నారాయన.

జూమ్ మీటింగుల్లో మీ ప్రవర్తన మీద ఓ కన్నేసి ఉంచుతారు

బాస్‌ను ఆకట్టుకోవడం ఎలా?

టీనేజ్‌ పిల్లలు చదివే మేగజైన్లలో కనిపించే అమ్మాయిలను ఆకట్టుకోవడం ఎలా, బాయ్‌ఫ్రెండ్‌ను సంపాదించడం ఎలా అన్న కాలమ్స్‌లో చెప్పినట్లుగానే, మీరు కూడా బాస్‌ను ఆకట్టుకోవడం ఎలా అన్నదానిపై సాధన చేయాలి. మనకు అంతగా తెలియని చిరునవ్వు, మర్యాద పూర్వక ప్రవర్తన, పొగడ్తల్లాంటివి తెచ్చిపెట్టుకోవాలి.

ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మెల్లిగా బాస్‌ను కదిలించాలి. ప్రమోషన్‌ గురించి అడగాలి. అడగక తప్పదు. ఎందుకంటే అది లవ్‌ అయినా, ప్రమోషనైనా అడక్కపోతే ఏదీ దక్కదు మరి.

ఈ కరోనా మహమ్మారి సమయంలో ఇంటి నుంచి పని చేస్తూ ప్రమోషన్‌ కోసం అడగడం నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితే. కానీ తప్పదు.

ఇంటి నుంచే పని కదా అని ఏ వంటగది టేబుల్‌ మీదనో, స్టడీ టేబుల్‌ మీదో కూర్చోని మీ పని మీరు చేసుకుంటూ వెళ్లిపోతే కుదరదు. మీ బాస్‌కు టచ్‌లో ఉండాలి. ఆన్‌లైన్‌ మీటింగుల్లో కనిపిస్తుండాలి. అప్పుడప్పుడు ఆయనతో మాట్లాడుతుండాలి.

ఇక బాస్‌ కోణం నుంచి చూస్తే, ఆఫీసులో ఎవరు బాగా పని చేస్తున్నారో, ఎవరు చేయడంలో లేదో ఆయనకు ఎంతో కొంత తెలిసి ఉంటుంది.

ఆఫీసుకు వెళ్లి పని చేసేవారు ఉన్నప్పుడు మీ ప్రమోషన్ గురించి మరింత జాగ్రత్త పడాలంటున్నారు నిపుణులు

ఇంట్లో పని చేస్తున్నారా?

కానీ ఎక్కువమంది ఇంటి దగ్గరి నుంచి విధులు నిర్వర్తిస్తున్నప్పుడు అక్కడ వాళ్లు పని చేస్తున్నారా, కుక్కపిల్లతో ఆడుకుంటున్నారా, పిండి పిసుకుతున్నారా, చపాతీలు కాలుస్తున్నారా అన్నది చెప్పడం ఆయనకు కూడా కష్టమే

అందుకే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో భాగంగా ఇంటి దగ్గర కష్టపడి పని చేసేవారు నిత్యం బాస్‌కు టచ్‌లో ఉండటం మంచిదని వర్క్‌ఫౌండేషన్ అనే థింక్‌ట్యాంక్‌ సంస్థలో పని చేస్తున్న మెలానీ విల్కీస్‌ అంటారు.

“ఇంటి నుంచి పని చేసేవారిలో చాలామంది ఇప్పుడు ఒకేసారి అనేక బాధ్యతలు నిర్వహించగలుగుతున్నారు. ఇంతకు ముందు చాలామందికి ఇది తెలియదు’’ అన్నారామె.

నిరంతరం ఫీడ్‌బ్యాక్‌ పంపాలన్న హెచ్‌.ఆర్‌. పాలసీలు ఇంకాఅమలులో ఉన్నాయో లేవో కూడా తెలుసుకుని మెలగాలంటారు విల్కీస్‌.

“ఇంతకు ముందులాగే మీ బాస్‌తో రోజూ మీటింగుల్లో పాల్గొనాలి. అప్పుడే వ్యవస్థలో ఏం జరుగుతుందో మీ లైన్‌ మేనేజర్‌కు అవగాహన ఏర్పడుతుంది. అది మీ ప్రమోషన్‌కు బాటలు వేస్తుంది’’ అని చెప్పారు విల్కీస్‌.

మనం సాధించిన విజయాలను బైటికి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారు షరోన్‌ క్లార్క్‌. ఆమె అలయన్స్‌ మాంచెస్టర్‌ బిజినెస్ స్కూల్‌లో ఆర్గనైజేషనల్ సైకాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.

“పరిస్థితులకు అనుకూలంగా మారిపోవడం, కొత్తగా ఆలోచించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కీలకం. నిత్యం యాక్టివ్‌గా,క్రియేటివ్‌గా ఉండటం చాలా ముఖ్యం” అంటారామె.

ప్రమోషన్‌ పొందడానికి ఆరు సూత్రాలు

  • బాస్‌తో నిత్యం టచ్‌లో ఉండటం
  • మీరు ఏం చేస్తున్నారు, ఎంత చేస్తున్నారనేది బాస్‌కు తెలిసేలా చూడటం
  • మరిన్ని బాధ్యతలు ఇవ్వాలని కోరడం
  • కొత్త ఐడియాలను బాస్ ముందు పెట్టడం
  • మీ వార్షిక అసెస్‌మెంట్‌ ఎప్పుడో తెలుసుకుని ఉండటం
  • మీ సంస్థలో ఇంతకు ముందు అమల్లో ఉన్న హెచ్‌.ఆర్‌. విధానాలన్నీ అమలవుతున్నాయే లేదో గమనించండి

బాస్‌కు ఏమేం తెలిసుండాలి?

ఇలాంటివన్నీ పాటించడం వల్ల వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసే వారిలో ఎవరు ఏ మేరకు పని చేస్తున్నారన్నదానిపై బాస్‌కు అవగాహన ఏర్పడుతుంది.

“వాళ్లు ఇంటి దగ్గర కూర్చుని పని చేస్తుంటే, ఎవరు ఎలా చేస్తున్నారో ఉందో అంచనా వేయడం కష్టం” అన్నారు పిన్‌సెంట్ మాసన్స్ అనే 'లా’ కంపెనీలో పని చేస్తున్న అన్నే సమ్మన్‌.

“అందుకే బాస్‌లు డేటా సేకరిస్తుండాలి. అప్పుడే ఎవరేంటో తెలిసి పోతుంది’’ అన్నారామె.

ఆఫీసుకు వెళ్లే వారందరికీ ప్రమోషన్లు వచ్చి, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నవారిలో ఎవరికీ ప్రమోషన్‌ రాలేదనుకోండి, అప్పుడు వివక్ష ఆరోపణలు చేయడం చాలా సులభం.

ప్రొఫెసర్ అన్నే డేవిస్

ఇంటి దగ్గర్నుంచి పని చేస్తున్న వారు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో బాస్‌లు నిత్యం గమనించడం చాలా ముఖ్యమంటారు అన్నే డేవిస్‌. ఆమె ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని లా అండ్‌ పబ్లిక్‌ పాలసీ శాఖలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

“మీ కింద పని చేసేవారు ఇంటి నుంచి విధులు నిర్వహిస్తుంటే, వారిని ఓ కంట కనిపెట్టి ఉండటం ముఖ్యం. వారి పని తీరు ఎలా ఉందో గమనిస్తూ ఉండాలి’’ అన్నారామె.

“మీరు ఎవరినైనా ప్రమోట్‌ చేస్తే మిగిలిన వారు దాని ప్రశ్నించే అవకాశం ఉంది. అలాంటి సమయంలో నేను చేసింది సరైనదే అని నిరూపించుకునే సమర్ధత కలిగి ఉండాలి” అన్నారు అన్నే డేవిస్‌.

మంచి ఉద్యోగులను ప్రమోట్‌ చేయడం బాస్‌ల విధి అంటారు ప్రొఫెసర్ క్లార్క్‌. “ఎవరు బాగా పని చేస్తున్నారో కనుక్కోవడం, ముఖ్యంగా ఇంటి దగ్గర్నుంచి పని చేసేవారిని ప్రమోట్ చేయడం చాలా కష్టమైన పని’’ అన్నారామె.

“మీ బిజినెస్‌ వృద్ధి చెందాలంటే కష్టపడి పని చేసే వారిని గుర్తించి ప్రోత్సహించాలి’’ అన్నారు క్లార్క్‌.

వెస్ట్‌ మిడ్‌ల్యాండ్‌లో సేల్స్‌మన్‌గా పని చేస్తున్న జాన్‌కు రోజూ ఆందోళనగానే ఉంటోంది. ఆఫీసుకు వెళ్లి పని చేస్తున్నవారు ప్రమోషన్‌ విషయంలో తనకన్నా ఎక్కువ లాభపడతారేమోనన్నది ఆయన ఆందోళన.

“నాతో సమానంగా పని చేయగలిగిన వాళ్లు, నాలాగా కాకుండా, బాస్‌తో నవ్వుతూ మాట్లాడి, ఆయనను బుట్టలో వేసుకుని నాకన్నా ముందుగా ప్రమోషన్ కొట్టేస్తారు’’ అని జాన్‌ అన్నారు.

“మంచి జరిగితే అది నావల్లే అని చెప్పుకోవడమే కాదు, ఏదైనా పొరపాటు జరిగితే అది తనది కాదంటూ తప్పుకునే వాళ్లు కూడా ఉంటారు. ఏ పనైనా అందరూ కలిసి చేస్తేనే అవుతుంది. అవతలి వ్యక్తి బాస్‌ దగ్గర ఉన్నప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే, అది జాన్‌ చేసిన తప్పు అని సింపుల్ చెప్పేస్తారు’’ అని జాన్‌ వాపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Easy tips to get promotion while working from home
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X