• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నేపాల్ యువరాజు దీపేంద్ర రెండు చేతుల్లో తుపాకులు నిప్పులు కక్కినప్పుడు ఏం జరిగింది

By BBC News తెలుగు
|

కుటుంబంతో నేపాల్ రాజు బీరేంద్ర

అది 2001 జూన్ 1 సాయంత్రం. నేపాల్ రాజు నివాసం నారాయణహితి ప్యాలెస్‌లోని త్రిభువన్ సదన్‌లో ఒక పార్టీ జరగబోతోంది.

యువరాజు దీపేంద్ర దానికి ఆతిథ్యం ఇస్తున్నారు. ప్రతి నేపాలీ నెలలో మూడో శుక్రవారం జరిగే ఈ పార్టీ మొదట మహారాజు బీరేంద్ర 1972లో సింహాసనం అధిష్టించినప్పుడు మొదలైంది.

2001 మే నెలలో ఇదే పార్టీ మహేంద్ర నివాసంలో జరిగింది. అక్కడ మహారాజు బీరేంద్ర సవతి తల్లి, నేపాల్ మాజీ రాజు మహేంద్ర రెండో భార్య రత్నాదేవి ఉండేవారు.

షర్ట్, ప్యాంట్ వేసుకున్న యువరాజు దీపేంద్ర తన ఏడీసీ మేజర్ నరేంద్ర బోహరాతో సాయంత్రం 6.45కు బిలియర్డ్స్ రూమ్‌కు చేరుకున్నారు. ఆయనతో కలిసి దీపేంద్ర కాసేపు బిలియర్డ్స్ షాట్స్ ప్రాక్టీస్ చేశారు.

ఈ పార్టీకి మొదట మహారాజు బీరేంద్ర బావ, భారత్‌లోని సర్గుజా రాజకుమారుడు మహేశ్వర్ కుమార్ సింగ్ చేరుకున్నారు. ఆయన బిలియర్డ్స్ రూంలోకి రాగానే, యువరాజు దీపేంద్ర ఆయనకు స్వాగతం పలికారు. "మీరు ఏ డ్రింక్ తీసుకుంటారు" అని అడిగారు. మహేశ్వర్ "ఫేమస్ గ్రౌస్" అని చెప్పారు.

కాసేపటికి ఎర్ర చీరలో మహారాణి ఐశ్వర్య, మహారాజు బీరేంద్ర ముగ్గురు సోదరిలు రాజకుమారి శోభ, శాంతి, శారద అక్కడికి చేరుకున్నారు. దాదాపు 7.40కి దీపేంద్ర చిన్నాన్న కొడుకు పారస్ తన తల్లి, రాజకుమారి కోమల్, సోదరి ప్రేరణ, భార్య హిమానీతో అక్కడికి వచ్చారు.

మహారాజు బీరేంద్ర రావడం కాస్త ఆలస్యమైంది. ఆయన అప్పుడు, ఒక పత్రిక ఎడిటర్ మాధవ్ రిమాల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఈలోపు మహారాజు తల్లి తన మెర్సిడెస్‌లో అక్కడికి చేరుకున్నారు. ఆమె ఒక చేతిలో పర్స్, మరో చేతిలో చేత్తో విసురుకునే విసనకర్ర ఉంది.

ఆమె బిలియర్డ్స్ రూం పక్కనే ఉన్న ఒక చిన్న గదిలోకి వెళ్లి సోఫాలో కూర్చున్నారు.

కొన్ని నిమిషాలకే బిలియర్డ్స్ రూం తలుపు తెరుచుకుంది. మహారాజు బీరేంద్ర లోపలికి వచ్చారు. ఆయన కార్లో రాకుండా తన ఆఫీసు నుంచి నడుచుకుంటూ అక్కడికి వచ్చారు. రాజు ఏడీసీ సుందర్ ప్రతాప్ రాణా ఆయనతో గుమ్మం వరకూ వచ్చారు. ఎందుకంటే అది ఒక ప్రైవేట్ పార్టీ. బయటివారికి అక్కడ అనుమతి లేదు. మహారాజు నేరుగా తల్లి దగ్గరకు వెళ్లారు.

యువరాజు దీపేంద్ర

దీపేంద్రను తన పడకగదిలోకి తీసుకెళ్లారు

ఈలోపు మద్యం మత్తులో ఉన్న దీపేంద్ర హఠాత్తుగా అక్కడకు రావడం కొందరు చూశారు. ఆయన మాట తడబడుతోంది. అసలు సరిగా నిలబడలేకపోతున్నారు. నిమిషాల్లోనే కింద పడిపోయారు. అప్పుడు రాత్రి 8 అయింది. మామూలుగా దీపేంద్ర ఎక్కువ తాగినా మత్తులో ఉన్నట్లు కనిపించేవారు కాదు. తనను చాలా కంట్రోల్ చేసుకునేవారు.

మహారాజు బీరేంద్ర పక్కనున్న గదిలోంచి అప్పటికే బిలియర్డ్స్ రూంలోకి వచ్చారు. పారస్, రాజకుమారుడు నిరాజన్, డాక్టర్ రాజీవ్ షాహీ భారీగా ఉండే దీపేంద్ర చేతులు, కాళ్లు పట్టుకుని ఆయన పడక గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ నేలపై పరిచిన పరుపుపై పడుకోబెట్టారు. ఆ రూంలో లైట్లు ఆర్పేసి మళ్లీ పార్టీ దగ్గరికి వచ్చేశారు.

జొనాథన్ గ్రెగ్సన్ తన 'మాసేకర్ అట్ ద ప్యాలెస్‌' పుస్తకంలో ఆ రోజు జరిగిందంతా వివరంగా రాశారు.

గదిలో ఒంటరిగా వదిలిన తర్వాత, దీపేంద్ర లేచి బాత్రూంకు వెళ్లి వాంతి చేసుకున్నారు. తర్వాత సైనిక యూనిఫాం ధరించారు. ఒక జాకెట్, ఆర్మీ బూట్లు, నల్ల లెదర్ గ్లౌజ్ వేసుకున్నారు. ఆ తర్వాత తనకు ఇష్టమైన 9 ఎంఎం పిస్టల్, MP5K సబ్ మెషిన్ గన్, కోల్ట్ ఎం-16 రైఫిల్ తీసుకున్నారు. బిలియర్డ్స్ రూం వైపు కదిలారు.

తుపాకీ చూస్తున్న దీపేంద్ర

సైనిక దుస్తుల్లో బిలియర్డ్స్ గదిలోకి దీపేంద్ర

అప్పుడు, ఆ బిలియర్డ్స్ రూం మధ్యలో కొంతమంది మహిళలు ఉన్నారు. హఠాత్తుగా వాళ్ల కళ్లు ఆర్మీ యూనిఫాంలో ఉన్న యువరాజు దీపేంద్ర మీద పడ్డాయి. మహారాజు బీరేంద్ర కజిన్ కేతకి చెస్టర్ ఆ ఘటన గురించి బీబీసీతో మాట్లాడారు.

"దీపేంద్ర లోపలికి రాగానే, తన రెండు చేతుల్లో రెండు తుపాకీలు కనిపించాయి. పూర్తిగా ఆర్మీ యూనిఫాంలో ఉన్నాడు. నల్ల కళ్లజోడు కూడా పెట్టుకున్నాడు. నేను నా పక్కనున్న మహిళతో యువరాజు దీపేంద్ర తన ఆయుధాలతో షోఆఫ్ చేయడానికి వచ్చారు అన్నాను"

"అప్పటికే నేపాల్ రాజు బిలియర్డ్స్ రూంలోనే ఉన్నారు. డాక్టర్ మద్యం తాగకూడదని చెప్పడంతో ఆయన చేతిలో కోక్ గ్లాస్ ఉంది. దీపేంద్ర తన తండ్రి వైపు చూశాడు. అప్పుడు తన ముఖంలో అసలు ఎలాంటి భావాలూ కనిపించ లేదు. మరుక్షణమే ఆయన తన కుడి చేతిలోని జర్మన్ మేడ్ MP5-K ట్రిగ్గర్ నొక్కాడు. దాన్నుంచి దూసుకొచ్చిన చాలా బుల్లెట్లు పైకప్పుకు తగిలాయి. కొన్ని పెచ్చులు నేలమీద పడ్డాయి" అని చెప్పారు.

'ఎంతపని చేశాడు' అన్న నేపాల్ రాజు

దీపేంద్ర తర్వాత ఏం చేస్తాడోనని ఎక్కడున్న అతిథులు అక్కడే కొన్ని సెకన్ల పాటు నిలబడిపోయారు. దీపేంద్ర ఏదో ఆట ఆడుతున్నాడని, పొరపాటున తుపాకీ నుంచి బుల్లెట్లు వచ్చుంటాయని అనుకున్నారు.

"నేపాల్ రాజు మొదట బిలియర్డ్స్ టేబుల్ పక్కనే కదలకుండా నిలబడ్డారు. తర్వాత ఆయన దీపేంద్ర వైపు నడిచారు. దీపేంద్ర ఏం మాట్లాడకుండా బీరేంద్ర మీద మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆయన కాసేపు నిలబడే ఉన్నారు. మెల్లగా తన చేతిలోని గ్లాస్ టేబుల్ మీద కూడా పెట్టారు" అని జొనాథన్ తన పుస్తకంలో చెప్పారు.

ఆ తర్వాత దీపేంద్ర బిలియర్డ్స్ రూం నుంచి గార్డెన్ వైపు వెళ్లారు. మూడు సెకన్ల తర్వాత దీపేంద్ర కాల్చడంతో మహారాజు గొంతులో కుడివైపు బుల్లెట్ దిగిందనే విషయం అక్కడి వారికి తెలిసింది.

"మహారాజు షాక్‌లో ఉండడం మాకు కనిపిస్తోంది. ఆయన దాదాపు స్లో మోషన్‌లో కింద పడిపోయారు" అని కేతకీ చెస్టర్ చెప్పారు.

ఈలోపు నేపాల్ రాజు అల్లుడు కెప్టెన్ రాజీవ్ షాహీ తన గ్రే కలర్ కోటు తీసి మహారాజు గొంతు నుంచి వచ్చే రక్తంపై అదిమారు. దాన్ని ఆపాలని ప్రయత్నించారు. బీరేంద్ర అప్పటికీ తెలివిలో ఉన్నారు. ఆయన తనకు తగిలిన మరో బుల్లెట్ గాయం గురించి చెబుతూ "రాజీవ్ పొట్టలో కూడా" అన్నారు.

తల పైకి లేపడానికి ప్రయత్నించిన మహారాజు బీరేంద్ర నేపాలీలో "ఎంత పనిచేశాడు" అని గొణిగారు. ఆయన చివరి మాట అదే.

అప్పుడే దీపేంద్ర మళ్లీ ఆ గదిలోకి వచ్చారు. అప్పటికే ఆయన తన ఒక గన్ కింద పడేశాడు. ఇప్పుడు ఆయన చేతిలో ఎం-16 రైఫిల్ ఉంది.

అమ్మాయితో దీపేంద్ర చనువు రాజ దంపతులకు నచ్చలేదు

అయితే, దీపేంద్ర మహారాజు బీరేంద్ర మీద ఎందుకు కాల్పులు జరిపాడు. దీపేంద్ర అత్త కేతకీ చెస్టర్‌ను బీబీసీ అదే విషయం అడిగింది.

"దీపేంద్ర ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వాళ్ల నాన్నమ్మ, అమ్మకు అది ఇష్టం లేదు. ఖర్చులకు తను అడిగినంత డబ్బు కూడా అతడికి ఇవ్వడం లేదు. దాంతో తను అక్కడ ఏం చేస్తున్నానో కూడా తెలీనంతగా మారిపోయాడు" అని ఆమె తెలిపారు.

అవన్నీ దీపేంద్రలో నిరాశను పెంచాయి. తనమానసిక స్థితి అల్లకల్లోలంగా ఉంది. ఆ విషయం లండన్ వరకూ చేరింది.

2001 మే నెల మొదట్లో లండన్‌లో ఆయనకు సంరక్షకుడుగా పనిచేసిన లార్డ్ కెమాయెజ్, ఫ్యాక్స్ ద్వారా మహారాజు బీరేంద్రకు సమాచారం పంపి ఆయన్ను హెచ్చరించారు. నచ్చిన యువతిని పెళ్లి చేసుకోలేక యువరాజులో అసంతృప్తి చాలా పెరిగిందని చెప్పారు.

దీపేంద్ర తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా అడ్డుకోవడం చాలా కష్టమని మహారాణి ఐశ్వర్యకు అనిపించింది. తల్లిదండ్రుల మాట వినకపోతే నువ్వు యువరాజు పదవి కూడా వదులుకోవాల్సి ఉంటుందని ఆమె దీపేంద్రను హెచ్చరించారు.

ఇష్టపడే చిన్నాన్నపై కూడా కాల్పులు జరిపాడు

దీపేంద్ర కాల్పులు జరుపుతున్న సమయంలో ఆయనకు ఎంతో ఇష్టమైన చిన్నాన్న ధీరేంద్ర అతడిని ఆ ఘోరాన్ని ఆపడానికి ప్రయత్నించారు. కేతకీ చెస్టర్ ఆ విషయం చెప్పారు.

"మహారాజు బీరేంద్ర తమ్ముడు ధీరేంద్ర షా హఠాత్తుగా దీపేంద్రను అడ్డుకుంటూ బాబూ, జరిగింది చాలు, ఆ తుపాకులు ఇలా ఇచ్చెయ్ అన్నారు.

దీపేంద్ర ఆయనపై కూడా చాలా దగ్గర్నుంచి కాల్పులు జరిపాడు. దాంతో, ఆయన ఎగిరి వెనక్కు పడ్డారు. ఆ తర్వాత దీపేంద్ర పూర్తిగా కంట్రోల్ తప్పిపోయాడు. కనిపించిన ప్రతిఒక్కరి మీదా కాల్పులు జరపడం ప్రారంభించాడు. అందరూ సోఫాల వెనక దాక్కోండి అని రాజకుమార్ పారస్ గట్టిగా అరిచారు" అని చెప్పారు.

ఆ సమయంలో కేతకికి కూడా ఒక బుల్లెట్ తగిలింది. తల, జుట్టు అంతా రక్తంతో తడిచిపోవడంతో ఆమె కూడా చనిపోయిందని దీపేంద్ర అనుకున్నారు.

మహారాజు జ్ఞానేంద్ర భార్య, పారస్ తల్లికి కూడా ఒక బుల్లెట్ తగిలింది. అది ఆమె ఊపిరితిత్తుల్లోంచి దూసుకెళ్లింది. దీపేంద్ర తన తండ్రిపై మరోసారి కాల్పులు జరిపారు. ఈసారీ అవి మహారాజు బీరేంద్ర తలను చీల్చుకుంటూ వెళ్లాయి. రక్తంతో తడిచిన ఆయన టోపీ, కళ్లజోడు కింద పడ్డాయి. ఆయన బోర్లా పడిపోయారు.

అప్పుడు దీపేంద్ర తన తండ్రిని కాలితో తన్నిన దృశ్యాలను కేతకి ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు.

"ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్ల ముందు కనిపిస్తుంటుంది. దాదాపు ప్రాణం లేకుండా పడున్న తన తండ్రి బతికున్నాడా, లేదా అని తెలుసుకోడానికి దీపేంద్ర ఆయనను కాలితో తన్ని చూశారు. చనిపోయిన వారిని అన్ని సంస్కృతుల్లో గౌరవిస్తారు. అక్కడ కాల్పుల జరపడం కంటే ఎక్కువగా ఒక హిందువు తన తండ్రి శవాన్ని కాలితో తన్నిన ఆ దృశ్యం నాకు షాక్‌‌కి గురిచేసింది" అన్నారు.

నేపాల్ ప్రజలు

ఏడీసీ పాత్రపై ప్రశ్నలు

నారాయణహితి పాలెస్‌లోని త్రిభువన్ భవన్‌లో నేపాల్ రాజుతోపాటూ, ఆయన కుటుంబంలోని మరో 12 మంది చనిపోవడం, గాయపడడం జరిగింది.

ఆ కాల్పులు మూడు నాలుగు నిమిషాల్లోనే ముగిశాయి. నేపాల్‌ రాజు నివాసంలో కాల్పుల శబ్దం వినిపించిన తర్వాత కూడా క్రాక్ కమాండో శిక్షణ తీసుకున్న ఏడీసీలు ఎవరూ అక్కడికి వెంటనే చేరుకోలేదు.

వాళ్లు తమ గదిలోనే ఉన్నారు. వాళ్లున్నగది బిలియర్డ్స్ రూంకు కేవలం 150 గజాల దూరంలో ఉంది. అయితే, వాళ్లు అనుకుంటే పది సెకన్లలోపే అక్కడికి చేరుకోవచ్చు.

తర్వాత దర్యాప్తు కమిటీ నివేదికతో నలుగురు ఏడీసీలను సస్పెండ్ చేశారు.

మహారాణి ఐశ్వర్యకు వెనక నుంచి తగిలిన బుల్లెట్

బిలియర్డ్స్ రూం నుంచి బయటికెళ్లిన దీపేంద్ర గార్డెన్లోకి వెళ్లారు. మహారాణి ఐశ్వర్య ఆయన వెనకాలే పరిగెత్తారు. రాజకుమారుడు నిరాజన్ కూడా వాళ్ల వెనకే వెళ్లారు. కాసేపట్లోనే తుపాకీ రెండు సార్లు పేలిన శబ్దం వినిపించింది.

నీలేష్ మిశ్రా తన 'ఎండ్ ఆఫ్ ద లైన్' పుస్తకంలో అప్పుడు గార్డెన్లో ఏం జరిగిందో రాశారు.

ఆ సమయంలో వంటగదిలో ఉన్న శాంతాకుమార్ ఖడ్కా అనే ఒక నౌకరు మహారాణి ఐశ్వర్య జీవితంలో ఆ చివరి క్షణాలను చూశాడు. రాణి మెట్లెక్కి దీపేంద్ర బెడ్ రూం వైపు వెళ్లడానికి ప్రయత్నించారు. ఆమె నేపాలీలో గట్టిగట్టిగా అరుస్తూ వెళ్తున్నారు. కొన్ని మెట్లు ఎక్కగానే ఒక బుల్లెట్ ఆమె తల చీల్చుకుంటూ వెళ్లింది. ఆమె అలాగే మెట్లపై కుప్పకూలిపోయారు. ఆమెను వెనక నుంచి కాల్చారు. దీపేంద్ర చివరిగా కాల్పులు జరిపింది ఐశ్వర్య మీదే.

బహుశా కొడుకు తనపై కాల్పులు జరపడులే అని ఆమె అనుకున్నారు. కానీ ఆమె అంచనా తప్పని తేలింది.

దీపేంద్ర ఆ తర్వాత గార్డెన్‌లో ఒక చిన్న కొలనుపై ఉన్న ఒక వంతెన మీదకు వెళ్లారు. పిచ్చివాడిలా రెండు సార్లు గట్టిగా అరిచారు. తర్వాత చివరి బుల్లెట్ శబ్దం వినిపించింది. ఆయన వెల్లకిలా పడిపోయారు. ఒక బుల్లెట్ ఆయన తల్లోంచి వెళ్లింది. దీపేంద్ర ఎడమవైపు చెవి వెనక నుంచి ఒక సెంటీమీటర్ రంథ్రం చేసుకుని వెళ్లిన బుల్లెట్ కుడిచెవి పైనుంచి బయటికి వచ్చింది. ఆ రెండు గాయాల నుంచీ రక్తం పోతోంది. కానీ, దీపేంద్ర అప్పటికీ ప్రాణాలతోనే ఉన్నారు.

రాజు, రాణి ఫొటోలతో జనం

మహారాజును జాగ్వార్ కారులో ఆస్పత్రికి తరలించారు

ఇక, మహారాజు బీరేంద్ర కూడా అన్ని బుల్లెట్లు తగిలినా ప్రాణాలతోనే ఉన్నారు.

ఏడీసీ ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి జాగ్వార్ కార్ వెనక సీటులో పడుకోబెట్టారు. ఆయన రెండు చెవుల నుంచి రక్తం పోతోంది. బట్టలంతా రక్తసిక్తమయ్యాయి.

రాజు నాడి దాదాపు అందడం లేదు. కానీ, ఆయన చేతులు కాస్త కదులుతున్నాయి. రాజు బీరేంద్రకు కనీసం 8 బుల్లెట్లు తగిలాయి.

రాజ పరివారం అంత్యక్రియలు

ఆ కారు వెనక వస్తున్న టొయోటాలో మహారాణి ఐశ్వర్య ఉన్నారు. ఇద్దరినీ కార్లో ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి రాత్రి 8.45 అయింది. కాసేట్లోనే నేపాల్ బెస్ట్ సర్జన్లు, ప్లాస్టిక్ సర్జన్లు, కార్డియాలజిస్టులు అందరూ అక్కడికి చేరుకున్నారు.

కారు నుంచి దించే సమయంలోనే రాణి చనిపోయినట్లు ధ్రువీకరించారు. అప్పుడు ఆకుపచ్చ టొయోటా లాండ్‌క్రూజర్ ఆ ఆస్పత్రి వైపు వస్తోంది.

రాజ్‌కుమార్ పారస్ ముందు సీటులో కూర్చున్న ఆ కార్లో వెనుక దీపేంద్ర ఏడీసీ గజేంద్ర బొహరా, రాజు కార్కి ఇద్దరూ యువరాజు దీపేంద్ర, రాజకుమారుడు నిరాజన్‌లను పట్టుకుని ఉన్నారు. అది ఒక వింత పరిస్థితి. ఒకే కార్లో హంతకుడిని, అతడి బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఆర్యఘాట్‌లో అంత్యక్రియలు

ట్రామా సెంటర్‌లో పడకల కొరత

బాధితులు అందరినీ రాత్రి 9.15కు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడకు చేరుకున్న కొన్ని నిమిషాలకే నిరాజన్ చనిపోయినట్లు చెప్పారు. జొనాథన్ అక్కడి పరిస్థితిని వివరించారు.

"అక్కడ నేపాల్ ప్రముఖ న్యూరో సర్జన్ ఉపేంద్ర దేవ్‌కోటా ఒక ట్రాలీ దగ్గర ఆగారు. అక్కడ ఆర్మీ డాక్టర్ రక్తంతో తడిసిన దేశ సంప్రదాయ దుస్తుల్లో ఉన్న వ్యక్తిని బతికించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మెడలో సాయిబాబా ఫొటో ఉన్న ఒక లాకెట్ ఉంది. అయితే, ఆ గాయపడిన వ్యక్తి మహారాజు బీరేంద్ర అని ఆయన గుర్తించలేకపోయారు.

ఆరోజు యువరాజు దీపేంద్ర తన కుటుంబంలో ఉన్న ఎంత మందిపై కాల్పులు జరిపారంటే, ఆ ఆస్పత్రిలోని ట్రామా హాల్‌లో ఉన్న పడకలన్నీ బాధితులతో నిండిపోయాయి.

దీపేంద్రను స్ట్రెచర్‌లో లోపలికి తీసుకొచ్చిన సమయంలో ఆయనకు బెడ్ లేకుండా పోయింది. దీంతో నేలపై పరిచిన పరుపుపై పడుకోబెట్టారు. దీపేంద్ర తల్లోంచి రెండు వైపులా రక్తం వస్తోంది. ఆయన శ్వాస తీసుకుంటూ గట్టిగా అరుస్తున్నారు. దీపేంద్ర బీపీ అంత ఆందోళనకరంగా లేకపోయినా, ఆయన కళ్లు లైట్ వేస్తే స్పందించడం లేదు. దీంతో, వెంటనే ఆయన్ను ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లారు.

యువరాజు దీపేంద్ర

స్పృహలోలేని దీపేంద్ర నేపాల్ రాజు అయ్యాడు

తర్వాత రోజు పత్రికల్లో ఈ కాల్పుల ఘటన గురించి ఎలాంటి ప్రస్తావనా లేదు. కానీ ఆ వార్తను రహస్యంగా ఉంచాలనున్న ప్రయత్నాలు ఫలించలేదు.

ఈ ఘటనను కవర్ చేయడానికి నన్ను 2001 జూన్ 2న ఉదయం 10 గంటలకు దిల్లీ నుంచి కాఠ్‌మాండూ పంపించారు. అప్పటికి కూడా నేపాల్ ప్రజలకు దీని గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే నేపాల్ రేడియోలో మాత్రం, ఉదయం నుంచి విషాద సంగీతం వస్తోంది.

చివరికి, ఆ హత్యాకాండ జరిగిన 14 గంటల తర్వాత మధ్యాహ్నం 11 గంటలకు నిన్న రాత్రి 8.45కు మహారాజు బీరేంద్ర బీర్ విక్రమ్ షా తుదిశ్వాస విడిచారని చెప్పారు.

ఆయన స్థానంలో రాజు పెద్ద కొడుకు యువరాజు దీపేంద్ర రాజు అవుతారని ప్రకటించారు. ఆయన ప్రస్తుతం పాలించే స్థితిలో లేరు కాబట్టి ఆయన తరఫున రాజకుమార్ జ్ఞానేంద్ర రాజ ప్రతినిధిగా ఉంటారని చెప్పారు. కానీ మహారాజు బీరేంద్ర ఎలా చనిపోయారనే విషయం నేపాల్ ప్రజలకు చెప్పలేదు.

రాజ పరివారం అంత్యక్రియలు

శవయాత్రలో లక్షలాది జనం

2001 జూన్ 2న మధ్యాహ్నం 4 గంటలకు రాజ పరివారంలో మృతుల శవయాత్ర మొదలైంది, ఆ సమయంలో నేపాల్ జనాభా అంతా రోడ్లపైకి వచ్చింది. దేశంలో వేలాది ప్రజలు మహారాజుకు గౌరవంగా శిరోముండనం చేయించుకున్నారు.

దేశంలో క్షురకులు అందరికీ ఉచితంగానే శిరోముండనం చేశారు. సాయంత్రం చీకటిపడుతుండగా రాజ పరివార సభ్యుడు దీపక్ బిక్రమ్ ఆర్యఘాట్‌లో అన్ని చితులకూ నిప్పంటించారు.

రాజ పరివారం అంత్యక్రియలు

యువరాజు దీపేంద్రకు అప్పటికీ స్పృహ రాలేదు. 2001 జూన్ 4న ఉదయం 3.40కి ఆయన కూడా చనిపోయారు. తండ్రిని చంపాడనే ఆరోపణలు ఎదుర్కొంటూ స్పృహలో లేని ఒక వ్యక్తి దాదాపు 54 గంటలపాటు నేపాల్‌ను పాలించారు.

దీపేంద్ర మరణంతో నేపాల్ రాజు బీరేంద్ర తమ్ముడు జ్ఞానేంద్ర, మూడు రోజుల్లో నేపాల్‌కు మూడో రాజు అయ్యారు. కానీ నేపాల్ రాచరికం ఆ ఘటన నుంచి ఎప్పటికీ తేరుకోలేకపోయింది. 2008లో రాచరిక పాలనను వదిలిన నేపాల్ ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What happened when guns in both hands of Prince Dipendra of Nepal caught fire
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X