• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాకిస్తాన్‌లో ఏం జరుగుతోంది? ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూలుతుందా?

By BBC News తెలుగు
|

ఇమ్రాన్ ఖాన్ ఎన్నికలు రిగ్గింగ్ చేసి అధికారంలోకి వచ్చారన నిరసనకారులు ఆరోపిస్తున్నారు

పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రతిపక్ష పార్టీలు వరుస ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి.

సైన్యం మద్దతుతో 2018 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చారని ఆ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సభలు, సమావేశాలపై నిషేధం విధించినప్పటికీ ఆదివారం పెషావర్‌లో పెద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించాయి.

అయితే, తమపై ఉన్న అవినీతి కేసులను ఎత్తివేయించుకోవడం కోసం ప్రతిపక్ష నాయకులు ఈ ఆందోళన కార్యక్రమాల ద్వారా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు.

మరోవైపు తాము రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని, ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా ఉండలేదని పాకిస్తాన్ సైన్యం అంటోంది.

పాకిస్తాన్‌లో తదుపరి సార్వత్రిక ఎన్నికలు 2023లో జరగాల్సి ఉన్నాయి.

ప్రతిపక్షమైన పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ మద్దతుదారులు గత నెలలో క్వెట్టాలో చేపట్టిన నిరసన ప్రదర్శన

ఈ ఆందోళనల వెనుక ఎవరున్నారు?

అక్టోబర్ 16 నుంచి వరుసగా పాకిస్తాన్ డెమొక్రటిక్ మూమెంట్ (పీడీఎం) ఈ ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

మతతత్వ సంస్థల నుంచి లౌకక జాతీయవాదుల వరకూ రకరకాల పార్టీలు, సంస్థలు పీడీఎంలో భాగంగా ఉన్నాయి.

పాకిస్తాన్‌లోని నాలుగు ప్రావిన్సుల్లోనూ పీడీఎం భారీ సభలను నిర్వహించింది.

ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెస్తోందని, దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. 'ప్రజలకు ప్రాతినిథ్యం వహించని’ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని కూలదోస్తామని చెబుతున్నాయి.

దేశంలో 'నిజమైన’ ప్రజాస్వామ్యాన్ని పునఃస్థాపిస్తామని పీడీఎం అంటోంది.

అయితే, పాకిస్తాన్‌లో రాజకీయ పార్టీలకు, సైన్యానికి మధ్య ఘర్షణ ఇదేమీ కొత్త కాదు. పీడీఎం లాంటి కూటములు ఇదివరకు కూడా వచ్చాయి.

కానీ, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రజా రాజకీయాల్లోకి తిరిగి రావడంతో ఈ పరిణామానికి ప్రాధాన్యత ఏర్పడింది.

నేరుగా దేశ సైన్యాధిపతి జనరల్ ఖమర్ జావెద్ బజ్వా, ఐఎస్ఐ చీఫ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌లను లక్ష్యంగా చేసుకుని నవాజ్ షరీఫ్ మాట్లాడారు.

దేశం రాజకీయంగా, ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇక్కట్లకు వీళ్లే కారణమని వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్ డెమొక్రటిక్ మూవ్‌మెంట్ నిరసన ప్రదర్శన కోసం వేదిక సిద్ధం చేస్తున్న కార్యకర్తలు

ప్రభుత్వం అరెస్టులు, రోడ్లు బ్లాకులతో అడ్డంకులు సృష్టించినా... గుజ్రాన్వాలా, కరాచీ, క్వెట్టాల్లో ప్రతిపక్షాల సభలు జరిగాయి.

అక్టోబర్ 19న కరాచీలో సభ జరిగినప్పుడు ఆ రోజు ఉదయం నవాజ్ షరీఫ్ అల్లుడు సఫ్దార్ ఖాన్‌ను భద్రతాదళాలు ఆయన ఉంటున్న హోటల్ రూమ్‌కు వెళ్లి అరెస్టు చేశాయి.

సఫ్దార్ తన భార్యతో గదిలో నిద్రిస్తున్న సమయంలో భద్రతా సిబ్బంది బలవంతంగా గదిలోకి ప్రవేశించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. పాకిస్తాన్ ప్రభుత్వానికి, సైన్యానికి ఈ పరిణామం ఇబ్బందికరంగా మారింది.

ఈ దాడికి కొన్ని గంటల ముందు సింధ్ ప్రావిన్సు పోలీసు చీఫ్‌ను ఐఎస్ఐ, సైనిక అధికారులు బలవంతంగా ఓ నిఘా సంస్థ కార్యాలయానికి తీసుకువెళ్లి, సఫ్దార్ అరెస్టు వారెంటుపై సంతకం చేయించిన విషయం వెలుగుచూసింది.

దీంతో సింధ్ ప్రావిన్సులోని మొత్తం అధికారుల క్యాడర్ అంతా 'నిరసన సెలవుల’కు దరఖాస్తు చేసింది. అయితే, సైన్యాధిపతి ఈ వ్యవహారంపై అంతర్గత విచారణకు ఆదేశించడంతో అధికారులు తమ చర్యను వాయిదా వేసుకున్నారు.

బాధ్యులైన ఐఎస్ఐ, సైనిక అధికారులను విధుల నుంచి తొలగించాలని సైన్యాధిపతి ఆదేశించినప్పటికీ, ఇంకా వారిపై చర్యలు అమలు కాలేదు.

ఇటు ప్రతిపక్షాల సభల్లోని నాయకుల ప్రసంగాలను సెన్సార్ చేయమని కూడా ప్రభుత్వ వర్గాల నుంచి మీడియాకు ఒత్తిళ్లు వస్తున్నాయి.

నవాజ్ షరీఫ్ లండన్ నుంచి వీడియో లింక్ ద్వారా ప్రసంగిస్తున్నప్పుడు, మోసిన్ దవార్ లాంటి జాతీయవాద నాయకులు వేదికపైకి వచ్చినప్పుడు టీవీ ఛానెళ్లు ప్రసారం ఆపేసి, వేరే కార్యక్రమాలు చూపిస్తున్నాయి.

పాకిస్తాన్ సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని, కొందరిని మాయం చేస్తోందని పీడీఎం నాయకులు ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని సైన్యమే వెనుకుండి నడిపిస్తోందని అంటున్నారు.

పాకిస్తాన్ ప్రతిపక్షాల ర్యాలీ

ఎన్నికల్లో అక్రమాలు జరిగాయా?

నవాజ్ షరీఫ్ (పీఎంఎల్-ఎన్) ప్రభుత్వం, అంతకుముందు ఆసిఫ్ జర్దారీ (పీపీపీ) ప్రభుత్వం చేసిన అవినీతితో విసిగిపోయి ప్రజలు తమను గెలిపించారని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ అంటోంది.

పాకిస్తాన్ ఎన్నికల చరిత్రలోనే 2018 ఎన్నికలు అత్యంత లోపభూయిష్ఠంగా జరిగాయని స్వతంత్ర పరిశీలకులు అభిప్రాయపడ్డారు. పీఎంఎల్-ఎన్‌కు స్పష్టమైన ఆధిక్యం వస్తుందని ఎన్నికలకు ముందు జరిగిన సర్వేలు అంచనా వేశాయి. అయితే, స్వల్ప మెజార్టీతో పీటీఐ ఎన్నికల్లో గెలిచింది.

ఎన్నికలకు ముందు నవజ్ షరీఫ్‌ అవినీతి కేసుల్లో దోషిగా తేలి, జైలుపాలయ్యారు. అయితే, ఈ కేసులపై న్యాయపరంగా అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఆ తర్వాత వైద్య చికిత్సల కోసం బ్రిటన్‌కు వెళ్లేందుకు నవాజ్ షరీఫ్‌కు అనుమతి లభించింది.

సైన్యం రాజకీయాల్లో జోక్యం చేసుకుంటుందా?

ఎన్నికలు జరిగిన రోజే ఫలితాల సర్వీస్ పోర్టల్ క్రాష్ అయ్యింది. నియోజకవర్గాల నుంచి ఓట్ల కౌంటు ఆన్‌లైన్ విధానంలో వెళ్లే అవకాశం లేకుండా పోయింది.

ఇక ఓట్లను భౌతికంగా లెక్కించి తాము సమర్పించిన గణాంకాలకు, చివర్లో వెల్లడైన గణాంకాలకు తేడాలున్నాయని చాలా మంది పోలింగ్ ఏజెంట్లు ఆరోపించారు.

ఎన్నికలపై అనుమానాల మధ్యే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఏర్పడింది.

ఇమ్రాన్ పాలనలో ప్రభుత్వ సంస్థలు మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు పెరిగాయి. మీడియా సెన్సార్షిప్ కూడా ఎక్కువైంది.

సైన్యం గురించి ప్రతికూలంగా వార్తలు రాసే విలేఖరులకు బెదిరింపులు వస్తున్నాయి. కొందరు అపహరణకు కూడా గురయ్యారు.

హోటల్ గదిలో సఫ్దార్‌ అరెస్టు వీడియోను బయటపెట్టిన కరాచీకి చెందిన ఓ విలేఖరి అదృశ్యమవ్వడం ఈ అపహరణలకు తాజా ఉదాహరణ.

ఇమ్రాన్ ఖాన్

ఇకపై ఏం జరుగుతుంది?

ప్రతిపక్షాల ఆందోళనల ఎటు దారితీస్తాయో ప్రస్తుతానికైతే స్పష్టత లేదు.

ఇమ్రాన్ ఖాన్‌ను సైన్యం చేతిలో తోలుబొమ్మగానే ఆయన ప్రత్యర్థులు చూస్తున్నారు. రాజకీయ నాయకులకు, సైన్యానికి మధ్య ఘర్షణగానే ఇది మారింది.

ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం విశ్వసనీయతను ప్రశ్నించడంతోపాటు సైన్యం, ఐఎస్ఐ చీఫ్‌లకు కూడా ప్రతిపక్షాలు సవాలు విసురుతున్నాయి.

పాకిస్తాన్‌లో ఇదివరకు చాలా సార్లు తిరుగుబాట్లు వచ్చాయి. ప్రభుత్వాలు కూలిపోయాయి.

సైనిక ప్రభుత్వం నడిపిన జనరల్ పర్వేజ్ ముషారఫ్ 2008లో గద్దె దిగిపోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత దేశంలో సైన్యం 'నిగూఢమైన’ తిరుగుబాటు చేస్తూ వచ్చిందని, 2018లో ఓ 'హైబ్రీడ్ సైనిక ప్రభుత్వాన్ని’ ఏర్పాటు చేసిందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రతిపక్షాల తాజా ఆందోళనల వల్ల సైన్యం, ఐఎస్ఐ చీఫ్‌లు బలహీనంగా కనిపించడం మొదలైందని, అయితే సైన్యం బలహీనపడట్లేదని పాకిస్తాన్ సైనిక నిపుణురాలు ఆయేషా సిద్దిఖా అన్నారు.

''రాజ్యాంగ ఆధిపత్యాన్ని పరిరక్షించుకోవాలంటే... సైన్యం ఆధిపత్యాన్ని నిరోధించేందుకు, దానితో చర్చలు జరిపేందుకు అవసరమైన మౌలిక నైపుణ్యాలను ప్రతిపక్షాల కూటమి సమకూర్చుకోవాలి. ఎన్నికల విజయాలను దాటి, సామాజిక-రాజకీయ, సామాజిక ఆర్థిక సంబంధాలను కొత్తగా నిర్మించుకోవాలి’’ అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Imran Khan's govt on verge of collapsing
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X