• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బిట్ కాయిన్ ట్రేడింగ్ నైజీరియాలో జోరుగా సాగడానికి కారణమేంటి?

By BBC News తెలుగు
|
బిట్ కాయిన్ ఒక దశలో 17 వేల డాలర్ల ను అధిగమించింది.

టోలా ఫడుగ్బాగ్బే నగర జీవితం తనకు మంచి భవిష్యత్తునిస్తుందనే నమ్మకంతో పదేళ్ల క్రితం తన ఊరిని విడిచిపెట్టి లాగోస్ కి వెళ్లారు.

కానీ, ఆయన చేసిన ఉద్యోగం నుంచి వచ్చే జీతం బ్రతకడానికే సరిపోయేది కాదు. ఇదే కథ మరెంతో మంది నైజీరియా ప్రజలది కూడా.

2016లో బిట్ కాయిన్ గురించి ఆన్‌లైన్‌లో వచ్చిన ప్రకటనలు ఆయనను ఆకర్షించాయి. బిట్ కాయిన్‌‌తో ఆయన ప్రయాణం అప్పటి నుంచి మొదలయింది.

"ఈ విషయంపై తీవ్రమైన పరిశోధన చేసాను. రోజులో చాలా గంటలు బిట్ కాయిన్ గురించి తెలుసుకునేందుకు యూట్యూబ్ వీడియోలు చూడటం, వ్యాసాలు చదవటం చేసేవాడిని. నా దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోవడంతో నేను ముందు 100 - 200 డాలర్లతో మొదలుపెట్టాను" అని ఆయన బీబీసీ కి చెప్పారు. ఆ నిర్ణయం ఆయన జీవితాన్నే మార్చేసింది.

ఫడుగ్బాగ్బే ప్రస్తుతం బిట్ కాయిన్ లో పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయడం మాత్రమే కాకుండా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి శిక్షణ కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన దగ్గర 200,000 డాలర్ల క్రిప్టో కరెన్సీ ఉందని చెప్పారు.

"నేను త్వరలోనే నేను కట్టుకుంటున్న సొంత ఇంటికి వెళ్ళిపోతాను. నాకిప్పుడు పొలం కూడా ఉంది. ఇదంతా క్రిప్టో కరెన్సీ వల్లే సాధ్యమయింది" అని అంటూ ఆయన నవ్వారు.

ఈ పెట్టుబడులు ఏదైనా ఒక రోజు కుప్ప కూలిపోవచ్చు అనే భయాలను ఆయన పట్టించుకోవడం లేదు.

ఫడుగ్బాగ్బే లాంటి వారు సాధించిన విజయం లక్షలాది మందిని ఈ బిట్ కాయిన్ లో పెట్టుబడి పెట్టడానికి ఆకర్షితులను చేసింది.

స్టాటిస్టా అనే డేటా సంస్థ నిర్వహించిన ఒక ఆన్ లైన్ సర్వే లో పాల్గొన్న వారిలో 32 శాతం మంది క్రిప్టో కరెన్సీలను వాడుతున్నట్లు తెలిపారు. ఇది ప్రపంచంలో ఎక్కడా లేనంత ఎక్కువ శాతం అని చెప్పవచ్చు.

2020 సంవత్సరంలో క్రిప్టోకరెన్సీలో ట్రేడింగ్ చేస్తున్న దేశాలలో అమెరికా, రష్యాల తర్వాత నైజీరియా మూడవ స్థానంలో ఉంది. ఈ ట్రేడింగ్ ద్వారా 400 మిలియన్ డాలర్ల లావాదేవీలు జరుగుతున్నట్లు అంచనాలు ఉన్నాయి.

నైజీరియాలో ఆర్ధిక వాతావరణం సవాళ్లతోనే కూడుకుని ఉన్నప్పటికీ , ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు, కరెన్సీలు మాత్రం ఆకర్షణీయంగా ఉన్నాయి.

నైజీరియాల నైరా నోట్లు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నైజీరియా గత సంవత్సరం తమ దేశ కరెన్సీ నైరా విలువను 24 శాతం తగ్గించేసింది.

ఇది ఈ ఏడాది మరో 10 శాతం తగ్గుతుందనే భయం కూడా ఉంది.

మరో వైపు దేశంలో ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఆహార ద్రవ్యోల్బణం జులై 2008 నుంచి చూస్తే తీవ్ర స్థాయికి వెళ్ళింది.

లాగోస్ లో మీడియా సంస్థ అధిపతి మైకేల్ ఉగ్వు 2018లో తన స్థలాన్ని అమ్మినప్పుడు ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టడానికి కొత్త రంగాలను వెతుక్కోవాలని అనుకున్నారు.

నైరా లెక్కల్లో ఆయన దగ్గర డబ్బు బాగానే ఉన్నప్పటికీ డాలర్ తో పోల్చి చూసినప్పుడు దాని విలువ తగ్గిపోయింది.

"నేను డాలర్లను కోల్పోయాను. అప్పుడే మనం తిరోగమనం వైపు వెళుతున్నామని అర్ధమయింది. అప్పుడే నా దృష్టి బిట్ కాయిన్ వైపు మళ్లింది" అని చెప్పారు.

"డిజిటల్ కరెన్సీలో పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇచ్చాయి".

"కొన్ని సార్లు నేను పెట్టుబడి పెట్టిన సొమ్ము కంటే 50 రెట్లు లాభాలు సంపాదించగలిగాను. గత సంవత్సరం బిట్ కాయిన్లో పెట్టిన పెట్టుబడులు పదింతలు పెరిగాయి" అని చెప్పారు.

ఆయన గతంలో బ్యాంకర్ గా ఉండేవారు. క్రిప్టో కరెన్సీ ఆర్ధిక రంగం పరిణామం చెందుతుందనడానికి నిదర్శనమని, దానిని ఫైనాన్స్ 2. 0 అనవచ్చని ఆయన అంటారు.

ఈ కరెన్సీలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఉగ్వు దీనిని జీవితంలో బ్రతకడానికి కావల్సిన ముప్పును తగ్గించుకోవడానికి ఒక విలువైన సాధనంగా భావిస్తారు.

ఎండ్‌సార్స్ నిరసనల నిర్వాహుకుల బ్యాంకు అకౌంట్లను స్తంభింపచేయడంతో వారు క్రిప్టో‌కరెన్సీకి మళ్లారు.

మెరుగైన బ్యాంకింగ్ అనుభవం

నైజీరియా అకౌంట్ల నుంచి బ్రిటిష్ అకౌంట్లకు సొమ్మును బదిలీ చేసేటప్పుడు వసూలు చేస్తున్న కమిషన్ చార్జీలను చూసినప్పుడు ఉగ్వు భార్య ఒనేక కూడా ఈ బిట్ కాయిన్ కరెన్సీలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నారు.

"నా వరకు అదొక బ్యాంకింగ్ విధానం" అని ఆమె అన్నారు.

"ఇందులో డబ్బు గడించడం ముఖ్యం కాదు. మెరుగైన బ్యాంకింగ్ అనుభవం కలగడం ఎలా అనేది ముఖ్యం. ఈ విధానం మన డబ్బు విలువ తగ్గకుండా డబ్బును కాపాడుతోంది" అని ఆమె అన్నారు.

కానీ, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు చాలా ఎక్కువ ముప్పుతో కూడుకుని ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక వేత్తలు అందరూ చెబుతున్నారు.

విపరీతంగా పెరిగిపోతున్న బిట్ కాయిన్ విలువ కేవలం ఊహాత్మక పందెంగా మారి ఏదైనా ఒక రోజు ఇందులో పెట్టుబడులు పెట్టిన వారిని వినాశనం చేయవచ్చనే భయాలు కూడా న్యాయమైనవే.

"బిట్ కాయిన్ వలన రెగ్యులేటరీ ముప్పు చాలా ఉంటుంది" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అంతర్జాతీయ బ్యాంకర్ అన్నారు.

"సాంకేతిక పరంగా ఇందులో ఉన్న భద్రత నూటికి నూరు శాతం సురక్షితమని నేను కచ్చితంగా చెప్పలేను. ఇందులో కూడా కొన్ని సాంకేతిక అనిశ్చితితో కూడుకుని ఉంటాయి" అని అన్నారు.

మార్కెట్ ని నియంత్రించే ప్రయత్నంలో భాగంగా నైజీరియా సెంట్రల్ బ్యాంకు 2017 నుంచి క్రిప్టోకరెన్సీ లో జరిగే లావా దేవీలను నిషేధించింది. కానీ, ఈ నిషేధాలను కచ్చితంగా అమలు చేయడం లేదు.

బిట్ కాయిన్

క్రిప్టో కరెన్సీ నిషేధం

కానీ, ఈ ఏడాది సెంట్రల్ బ్యాంకు నిషేధాన్ని కాస్త గట్టిగా అమలు చేసేందుకు చూస్తోంది.

అనైతిక కార్యకలాపాలు చేయడానికి అవకాశం ఉన్న అపరిచిత, నియంత్రణ లేని సంస్థల నుంచి పొంచి ఉన్న ముప్పు నుంచి సాధారణ ప్రజలకు భద్రత కల్పించి దేశాన్ని రక్షించే అవసరం ఉందని ఫిబ్రవరి 07న విడుదల చేసిన ప్రకటనలో బ్యాంకు పేర్కొంది.

అప్పటి నుంచి , క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు జరిపిన అకౌంట్లను బ్యాంకు నిలిపివేసిందంటూ చాలా మంది ఫిర్యాదు చేసారు.

ఫడుగ్బాగ్బే అకౌంటు కూడా మూసేస్తామని చెబుతూ ఆయన బ్యాంకు మేనేజర్ నుంచి కాల్ వచ్చింది. ఆయన డబ్బులు బదిలీ చేసుకోవడానికి ఆయనకు ఒక రోజు సమయం ఇచ్చారు. కానీ, అందరికీ ఆ అదృష్టం దక్కలేదు.

కొన్ని వేల నైరాలు ఉన్న బ్యాంకు అకౌంటును బ్యాంకు అధికారులు నిలిపేసినట్లు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చెప్పారు.

అయితే, అందుకు కారణాలను బ్యాంకు వెల్లడించలేదని చెప్పారు.

క్రిప్టోకరెన్సీలో లావాదేవీలు నిర్వహిస్తున్నందుకు ఆయనను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆయన అనుమానిస్తున్నారు.

"క్రిప్టోకరెన్సీ వాడి చట్టం చేతిలో ఇబ్బందులు పడకుండా దానిని వాడవద్దని మేము గట్టిగా సూచిస్తున్నాం" అంటూ ఒక బ్యాంకు తన వినియోగదారుడికి రాసిన లేఖను బీబీసీ చూసింది.

అయితే, విదేశాలలో ఉన్న అకౌంట్ల ద్వారా క్రిప్టోకరెన్సీ ద్వారా వ్యాపారం చేస్తామని కొందరు పెట్టుబడిదారులు చెబుతున్నారు.

దీని వలన ఆర్ధిక సంస్థ ప్రమేయం లేకుండా ఒకరి నుంచి ఒకరికి నేరుగా గాని, మధ్యవర్తి ద్వారా కానీ డబ్బులను బదిలీ చేసుకోవచ్చని వారు భావిస్తున్నారు.

నైజీరియాలో క్రిప్టోకరెన్సీ మార్కెట్ లేనప్పుడు ఇదే విధానాన్ని అవలంబించేవారు. చాలా మంది క్రిప్టోకరెన్సీకి అనువుగా ఉన్న రువాండా , ఘనా, సియర్రా లియోన్ లాంటి దేశాలకు తమ వ్యాపారాలను తరలిస్తున్నట్లు ఉగ్వు గమనించారు. .

క్రిప్టో కరెన్సీలను వాడి అనైతిక కార్యకలాపాలకు పాలాడుతున్నట్లు వస్తున్న వార్తలు నిజమే కానీ, ఈ కరెన్సీ విషయంలో ప్రభుత్వం కాస్త కఠిన వైఖరినే అవలంబిస్తోందని కొంత మంది భావిస్తున్నారు.

ఈ విధానాన్ని పూర్తిగా నిలిపి వేసే కంటే దీంతో ఉన్న ముప్పును ఎలా అదుపు చేయాలో చూస్తే బాగుంటుందని సెంట్రల్ బ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నర్ కింగ్స్‌లే మోఘాలు భావిస్తున్నారు. క్షీణావస్థలో ఉన్న ఆర్ధిక రంగంలో ఇది కొంత మందికి జీవనోపాధిని కల్పించవచ్చని ఆయన అన్నారు.

ఇది చేజార్చుకున్న అవకాశమేనేమో అని లాగోస్ కి చెందిన బ్రోకరేజ్ సంస్థ ఇజిఎం గ్రూప్ అధిపతి బైట్ ఒడునే అన్నారు.

"క్రిప్టో కరెన్సీలో జరుగుతున్న వాణిజ్యం పరిమాణంలో నైజీరియా ప్రపంచంలోనే అత్యుత్తమ స్థానంలో ఉంది" అని ఆయన వివరించారు.

"ఇప్పుడు దీంతో ఉన్న లాభాలను ఉపయోగించుకోలేకపోతే మరొకరు దీనిని వాడుకుంటారు. దీని చుట్టూ ఒక వాతావరణాన్ని సృష్టించుకోగలగాలి. దీనికి అవసరమైన నిబంధనలు, నియంత్రణలు అమలు చేయాలి" అని ఆయన అన్నారు.

షేర్ల కంటే క్రిప్టో కరెన్సీ పైనే నమ్మకం ఎక్కువ

నైజీరియాలో ప్రజలు విదేశీ మారకం పై ఉన్న నియంత్రణలను అధిగమించడానికి క్రిప్టో కరెన్సీని ఒక సాధనంగా చూస్తారు.

"విదేశీ మారకంతో చాలా నియంత్రణలు ఉంటాయి. అని నేనా న్వాచుకు వివరించారు.

"క్రిప్టో కరెన్సీని పెట్టుబడిగా వాడటానికి నైజీరియాలో ప్రజలు చాలా సులభమైన సాధనంగా చూస్తారు" అని ఆమె చెప్పారు.

పోలీసుల జులుం ప్రదర్శనకు వ్యతిరేకంగా అక్టోబరు 2020 లో జరిగిన #ఎండ్ సార్స్ ప్రొటెస్ట్స్ సమయంలో తమ సంస్థ అందించే వాణిజ్య సేవల గురించి అవగాహన పెరుగుతున్న విషయాన్ని ఆమె గమనించారు.

ఈ నిరసనకారుల అకౌంట్లను నిలిపివేయాలనే ప్రయత్నాలు చేసినప్పుడు డిజిటల్ కరెన్సీల వాడకం పెరిగిందని, అప్పుడే ట్విటర్ లో బిట్ కాయిన్ ట్రెండ్ కనిపించిందని చెప్పారు.

దీంతో క్రిప్టో కరెన్సీలో కొత్త పెట్టుబడులు పెరిగాయి అని ఆమె చెప్పారు.

అయితే, కేంద్ర ఆర్ధిక సంస్థలకు వీటి పై ఉన్న అపనమ్మకం, ఆర్ధిక నియంత్రణ కూడా మరో వైపు ఉన్నాయి.

నైజీరియా ఆర్ధిక వ్యవస్థ క్షీణించడం, ప్రభుత్వ విధానాలు చాలా మందికి విసుగు తెప్పిస్తున్నాయని చాలా మంది అంటారు.

చాలా సంవత్సరాలు కనీస జీతానికి బానిసగా ఉండిపోయానని ఫడుగ్బాగ్బే అంటారు.

"నేను షేర్లు, ప్రభుత్వ బాండులలో పెట్టుబడులు పెట్టను. అవన్నీ మోసాలు. నేను క్రిప్టో కరెన్సీనే ఎక్కువగా నమ్ముతాను" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Bitcoin trading to flourish in Nigeria
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X