• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా వ్యాక్సీన్ కోసం చైనాను నమ్ముకున్న పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది?

By BBC News తెలుగు
|

పాకిస్తాన్, కరోనావైరస్, వ్యాక్సీన్, వ్యాక్సీనేషన్

భారత్‌లో కరోనావైరస్ వ్యాక్సీనేషన్‌కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 16న ఈ కార్యక్రమం మొదలవుతోంది. అయితే, దక్షిణ ఆసియాలోని కొన్ని దేశాలు వ్యాక్సీన్ కోసం ఇంకా వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రధానంగా పాకిస్తాన్ ఈ పరిస్థితిని ఎదుర్కొంటోంది.

తమ దేశానికి వ్యాక్సీన్ తొలి షిప్‌మెంట్ ఫిబ్రవరి మధ్యలో రావొచ్చని పాకిస్తాన్ ప్రభుత్వం అంటోంది. ఆ షిప్‌మెంట్ చైనా సంస్థ సినోఫార్మా నుంచి రావాలి.

ఇప్పటివరకూ సినోఫార్మా తయారుచేసిన వ్యాక్సీన్‌కు మూడు దశల ట్రయల్స్ పూర్తయ్యాయని పాకిస్తాన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు కైసర్ సజ్జద్ బీబీసీతో చెప్పారు.

వ్యాక్సీన్ కోసం రష్యాతోనూ చర్చలు జరుపుతున్నామని, చర్చలు ఓ కొలిక్కివచ్చే దశలో ఉన్నాయని ఆయన చెప్పారు. త్వరలోనే రష్యా వ్యాక్సీన్ వచ్చేందుకు కూడా మార్గం సుగమం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

''మూడు దశల ట్రయల్స్ డిసెంబర్ 31వరకూ నడిచాయి. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన 18 వేల మందికి వ్యాక్సీన్ ఇచ్చాం. వ్యాక్సీన్ పనితీరు విషయంలో పూర్తి విశ్వాసంతో ఉన్నాం. అయితే, దేశవ్యాప్తంగా వ్యాక్సీనేషన్ చేయడం ఓ పెద్ద సవాలే’’ అని సజ్జద్ అన్నారు.

పాకిస్తాన్‌కు వ్యాక్సీన్ రాగానే మొదటగా ఆరోగ్య సిబ్బందికి, 'ఫ్రంట్‌లైన్ వర్కర్క్’కు, వృద్ధులకు ఇస్తామని ఆ దేశ అధ్యక్షుడి సలహాదారు, ఆపద్ధర్మ ఆరోగ్యశాఖ మంత్రి ఫైసల్ సుల్తాన్ చెప్పారు.

మొదటి దఫాలో ఐదు లక్షల మందికి వ్యాక్సీన్ ఇచ్చేందుకు 10 లక్షల డోసులు తెప్పిస్తున్నామని, తమ దేశంలో కరోనావైరస్ సోకినవారి సంఖ్య కూడా దాదాపు ఐదు లక్షలు ఉందని ఆయన అన్నారు.

పాకిస్తాన్, కరోనావైరస్, వ్యాక్సీన్, వ్యాక్సీనేషన్

ఇతర వ్యాక్సీన్లు

రష్యా, చైనా వ్యాక్సీన్ల కోసమే కాకుండా... బయోఎన్‌టెక్, ఫైజర్, మోడర్నా సంస్థల వ్యాక్సీన్లను తెప్పించేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని పాకిస్తాన్ మెడికల్ అసోసియేషన్ అంటోంది.

వ్యాక్సీన్ కొనుగోలు కోసం పాకిస్తాన్‌ మొదటగా సుమారు 150 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు వెయ్యి కోట్ల రూపాయలు) కేటాయించిందని, ఈ మొత్తంతో పది లక్షలకుపైగా డోసులు వస్తాయని పాకిస్తాన్ పబ్లిక్ సర్వీస్ మాజీ అధికారి, 'పబ్లిక్ పాలసీ’ నిపుణుడు హసన్ ఖ్వార్ చెప్పారు.

''ఒకవేళ ఈ షిప్‌మెంట్ వచ్చినా, పాకిస్తాన్ జనాభాలో 0.2 శాతం మందికే సరిపోతుంది. మొత్తం జనాభాకు వ్యాక్సీనేషన్ చేయాలంటే భారీ కేటాయింపులు అవసరం’’ అని ఆయన అన్నారు.

పాకిస్తాన్, కరోనావైరస్, వ్యాక్సీన్, వ్యాక్సీనేషన్

అతిపెద్ద సవాలు

వ్యాక్సీన్ కొరత పాకిస్తాన్ ముందున్న అతిపెద్ద సవాలు అని హసన్ ఖ్వార్ అంటున్నారు. వ్యాక్సీన్ తయారీదారులకు ఈ ఏడాదికి సరిపోయేంత ఆర్డర్లు ఉన్నాయని ఆయన అన్నారు.

పాశ్చాత్య దేశాల నుంచి ఈ ఏడాది వ్యాక్సీన్లు పాకిస్తాన్‌కు వచ్చే అవకాశాలు కనపడటం లేదని ఖ్వార్ చెప్పారు. రష్యా, చైనాల్లోని సంస్థలకు కూడా సరైన సమయంలో ఆర్డర్లు ఇవ్వకపోతే వ్యాక్సీన్లు రావడం చాలా కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు.

పాకిస్తాన్ ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని, లేకపోతే వ్యాక్సీన్ రేసులో వెనుకబడిపోతామని ఆయన అన్నారు.

''వ్యాక్సీన్ కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలు మిగతా దేశాలతో పోటీ పడటం సాధ్యం కాదు. వ్యాక్సీన్లకు ఇప్పటివరకూ ఆర్డర్లు ఇచ్చిన దేశాల్లో 72 శాతం అభివృద్ధి చెందిన దేశాలే. మిగతావి మధ్య ఆదాయ, వెనుకబడ్డ దేశాలు. ఇక నిరుపేద దేశాలైతే వ్యాక్సీన్లకు ఆర్డర్లే చేయలేకపోయాయి’’ అని ఖ్వార్ చెప్పారు.

వ్యాక్సీన్ కోసం పాకిస్తాన్ ప్రభుత్వం కొన్ని ప్రైవేటు సంస్థల సాయం తీసుకుంటోందని పాకిస్తాన్ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి నౌషీన్ హమీద్ అన్నారు.

ప్రస్తుతం దేశంలో పోలియో వ్యాక్సీనేషన్ పనులు జోరుగా జరుగుతున్నాయని, కరోనా వ్యాక్సీనేషన్‌కు కూడా దీని వల్ల ప్రయోజనం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

పాకిస్తాన్, కరోనావైరస్, వ్యాక్సీన్, వ్యాక్సీనేషన్

వ్యాక్సీనేషన్‌పై వ్యతిరేకత

ఖైబర్ ఫఖ్తుంక్వా ప్రాంతంలో పోలియో వ్యాక్సీనేషన్‌ కోసం పనిచేస్తున్న ఓ ఆరోగ్య కార్యకర్త ఇటీవల హత్యకు గురయ్యారు.

చాలా దేశాల్లోలాగే పాకిస్తాన్‌లోనూ వ్యాక్సీనేషన్‌కు వ్యతిరేకంగా కొన్ని వర్గాలు పనిచేస్తున్నాయని, అయితే దీని వల్ల వచ్చే తేడా ఏమీ ఉండదని పాకిస్తాన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు కైసర్ సజ్జద్ అన్నారు.

వ్యాక్సీనేషన్‌తోపాటు కరోనావైరస్ గురించి కూడా వదంతులు వ్యాపిస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు. కరోనా లేదని వాదించేరు కూడా చాలా మంది ఉన్నారని చెప్పారు.

''పోలియో వ్యాక్సీనేషన్ కన్నా కరోనావైరస్ వ్యాక్సీనేషన్ భిన్నంగా ఉండబోతోంది. పోలియో కోసం ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతారు. కరోనా విషయంలో అలా కాదు. కరోనావైరస్ వ్యాక్సీన్ కేంద్రాలు ఏర్పాటవుతాయి. ఇష్టం ఉన్నవారు వచ్చి వేయించుకోవచ్చు. ఇందులో బలవంతమేమీ ఉండదు. తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నవారికి, వృద్ధులకు ముందుగా వ్యాక్సీన్ ఇవ్వడం లక్ష్యం’’ అని సజ్జద్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
situation of Pakistan where it is dependent on China for corona vaccine
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X