దక్షిణ చైనా సముద్రం వివాదం ఏంటి..? డ్రాగన్ కంట్రీపై అమెరికా ఆగ్రహం..వాట్ నెక్ట్స్ ?
దక్షిణ చైనా సముద్రంలో చైనా పెత్తనం సహించరానిదని అది పూర్తిగా అక్రమం అని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ చైనా సముద్ర జలాలపై చైనా ఆధిపత్యాన్ని ఆయన తప్పుబట్టారు. గత కొన్నేళ్లుగా కృత్రిమ ద్వీపాలను నిర్మించి అక్కడ మిలటరీ బేస్‌లను ఏర్పాటు చేస్తున్న చైనా... అమెరికా తమపై తప్పుడు ప్రచారం చేస్తూ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆరోపణలు చేసింది. ఇప్పటి వరకు దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కంట్రీ పాల్పడుతున్న అరాచకాలను వ్యతిరేకిస్తూ వస్తున్న అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు తొలిసారిగా అక్రమం అని గళం విప్పింది.

దక్షిణ చైనా సముద్రం చైనాకు చెందుతుందా..?
చైనాతో చాలా దేశాలు విబేధిస్తున్న నేపథ్యంలో మైక్ పాంపియో వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే చైనా పై ఎలాంటి చర్యలకు దిగుతుందో ఇంకా స్పష్టత రాలేదు. దక్షిణ చైనా సముద్రం తమకు చెందుతుందని బుకాయిస్తున్న చైనా వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి బ్రునే, మలేషియా, ఫిలిప్పీన్స్, తైవాన్ మరియు వియత్నాం దేశాలు. కొన్నేళ్లుగా చైనా వైఖరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ మధ్యకాలంలో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నైన్ డాష్ లైన్ అనే ప్రాంతం తమ భూభాగంలోకి వస్తుందని పేర్కొంటూ అక్కడ ద్వీపాలు నిర్మాణం చేయడం, గస్తీ నిర్వహించడం చేస్తోంది డ్రాగన్ కంట్రీ. అంతేకాదు అక్కడ మిలటరీని కూడా విస్తరిస్తోంది. బయటకు శాంతియుతంగానే అన్ని చేస్తున్నామని చెబుతున్నప్పటికీ.. లోపల మాత్రం చైనా తన కుటిల బుద్ధిని ప్రదర్శిస్తోంది.

సహజ సంపద కోసమే చైనా పాకులాడుతోందా..?
దక్షిణ చైనా సముద్రంలో అపారమైన సహజ సంపద ఉండటంతో చైనా దానిపై కన్నేసినట్లు సమాచారం. ఈ సంపద కోసమే చైనా దక్షిణ సముద్రం మొత్తాన్ని తన భూభాగంలోకి కలిపేసుకోవాలనే ప్రయత్నం చేస్తోంది. అందుకే పలు మార్లు అక్కడ నేవీ విన్యాసాలను కూడా నిర్వహించింది. దీనిపై జపాన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తూర్పు మరియు దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆక్రమణకు ప్లాన్ చేస్తోందని మండిపడింది జపాన్. సౌత్ చైనా సముద్రంను తమకిందకు తీసుకోవాలని చైనా ప్రయత్నిస్తే ప్రపంచదేశాలు చూస్తూ ఊరుకోవని మైక్ పాంపియో గట్టి వార్నింగ్ ఇచ్చారు. అయితే అమెరికా కావాలనే చైనాపై విషం కక్కుతోందని ఇది వాస్తవాలను వక్రీకరించడమే కాకుండా అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుందని అమెరికాలోని చైనా ఎంబసీ ట్వీట్ చేసింది.

అమెరికా ఇప్పుడెందుకు స్పందిస్తోంది..?
ఇదిలా ఉంటే దక్షిణ చైనా సముద్రంలో తన ఆధిపత్యం చెల్లదని హాగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు చెప్పిన నాలుగేళ్ల తర్వాత అమెరికా స్పందించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే అమెరికాకు చైనాకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న క్రమంలో డ్రాగన్ కంట్రీ ఇటు భారత్‌తో పాటు ఇతర పొరుగు దేశాలకు కూడా తలనొప్పిగా తయారైంది. దీన్నే అవకాశంగా మలుచుకుని ఈ పొరుగుదేశాలతో కలిసి చైనాపై ప్రతీకారం తీర్చుకోవాలని అమెరికా భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గత వారం చైనా అమెరికాలు వేర్వేరుగా నేవీ విన్యాసాలు కూడా నిర్వహించాయి. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ మధ్యకాలంలో ట్రంప్ ప్రభుత్వం చైనాపై దుమ్మెత్తి పోస్తోంది. కరోనావైరస్ వ్యాప్తి చెందడానికి కారణం చైనానే అని చెప్పడం, క్సింజియాంగ్‌లో ముస్లిం మైనార్టీలపై వ్యవహరించిన తీరు మానవహక్కుల ఉల్లంఘనే అని చెప్పడం, ఆపై హాంగ్‌కాంగ్ నిరసనలు ఇలా చాలావరకు చైనా తప్పులపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇక తాజాగా దక్షిణ చైనా సముద్రం వ్యవహారం కూడా ముదురుతుండటంతో రెండు దేశాల మధ్య ఏ క్షణమైనా యుద్ధ వాతావరణం కనిపించే అవకాశాలున్నాయని పలువురు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అసలు దక్షిణ చైనా సముద్రంలో వివాదమేంటి..?
చైనాకు ఇతర దేశాల మధ్య దక్షిణ చైనా సముద్రం వివాదాస్పద అంశంగా మారింది. అక్కడ ఉద్రిక్తత వాతావరణంకు తెరలేసింది. సముద్రంలోని జనావాసాలు లేని రెండు అతిపెద్ద ద్వీపాలు తమకు చెందుతాయని దానిపై ఆధిపత్యం తమదేనంటూ డ్రాగన్ కంట్రీ చెప్పుకొస్తోంది. కొన్ని శతాబ్ధాల క్రితమే ఇది చైనాలో కలిసిపోయాయనే వాదనలు వినిపిస్తోంది. 2018లో అమెరికా మిలటరీకి చెందిన విమానాలు ఆ వివాదాస్పద ప్రాంతంలోని గగనతలంలో ఎగురగా... వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలనే సంకేతాలు పైలట్లకు అందాయి. అంతకు కొన్ని నెలల ముందు చైనా ఆ వివాదాస్పద భాగంలో బాంబర్లను ల్యాండ్ చేసింది. అక్కడే మిలటరీ డ్రిల్స్ నిర్వహిస్తోంది. అంతేకాదు తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ అమెరికా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తోందని చైనా ఆరోపణలు చేసింది.
ఇప్పటికే భారత్ చైనాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే చైనాను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయాలనే ఉద్దేశంతో అమెరికా కూడా తన మిత్రదేశాలతో కలిసి పావులు కదుపుతోంది. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కంట్రీ ఆటలను ఆధిపత్యానికి బ్రేకులు వేయాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ ప్రయత్నంలో అమెరికా ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచిచూడాలి..