• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టంగ్-టై అంటే ఏంటి? పిల్లల్లో పెరుగుతున్న ఈ కొత్త సమస్యను గుర్తించడం ఎలా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
టంగ్-టై

ఉమా పర్మార్‌కు 2011లో జానవ్ పుట్టాడు. బాబుకు పాలివ్వడానికి ప్రయత్నించిన ప్రతి సారి ఆమె తీవ్రమైన నొప్పికి గురయ్యేవారు. ఆమె చను మొనలు వాచిపోయి, రక్తస్రావం అయ్యేది.

"నాకు భరించలేనంత నొప్పి కలిగింది" అని పర్మార్ చెప్పారు. ఆమె ముంబయిలో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నారు.

నా బిడ్డకు పాలు కూడా ఇవ్వలేకపోతున్నానని చాలా బాధ కలిగేది.

ఆమె చుట్టూ ఉన్నవారంతా ఈ సమస్యను కొట్టిపడేశారు. కొత్తగా పాలిస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం సాధారణమే అని చెప్పారు. నొప్పి భరిస్తూ పాలివ్వడానికి ప్రయత్నించమని ఆమెకు డాక్టర్ సూచించారు.

కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఎక్కడో సమస్య ఉందని పర్మార్‌కు అర్ధమయింది.

పార్టీలకు వెళ్ళినప్పుడు కూడా ఆ బాబు మిగిలిన వారితో కలిసి ఆడుకోలేకపోయేవాడు. అందరి కంటే ఆఖరున తినేవాడు.

ఇంట్లో అన్నం తినిపించేటప్పుడు కూడా చాలా అలసట వచ్చేస్తూ ఉండేది. భోజనం పూర్తి చేయడానికి కనీసం 2-3 గంటలు తీసుకునేవాడు.

"మొదట్లో తనకి తిండి మీద ఆసక్తి లేదని అనుకున్నాను. నెమ్మదిగా, నిలకడ లేకుండా నడిచేవాడు. బైక్ మీద కూడా సరిగ్గా కూర్చోలేకపోయేవాడు. తనని తొందర పెట్టడం వల్ల మరింత ఒత్తిడికి గురయ్యేవాడు. చాలా రకాల ఆహార పదార్ధాలను నమలలేకపోవడంతో, ఆమె ఆహారాన్ని మెత్తగా చేసి ఇవ్వడం మొదలుపెట్టారు. భోజనం చేయడానికి కూడా అలిసిపోతూ ఉండేవాడు.

2019లో జానవ్‌కు 8 ఏళ్ళు ఉండగా బాబు ప్రవర్తన వెనుక ఉన్న రహస్యం వీడింది.

బాబుకు ఆంకిలోగ్లాసియా అనే సమస్య ఉన్నట్లు డాక్టర్లు తేల్చారు. దీనినే టంగ్-టై అని అంటారు. ఇదొక జన్యుపరమైన సమస్య.

టంగ్-టైతో పుట్టిన పిల్లలకు నాలుకను నోటితో అనుసంధానం చేసే పలుచని పొర బిగుతుగా ఉంటుంది. నోటిలో పైకి ఉండాల్సిన నాలుక కిందకు అంటిపెట్టుకుని కదలిక కష్టంగా ఉంటుంది. దీంతో, వారు తినడం చాలా కష్టంగా మారుతుంది.

జన్యుపరమైన ఈ సమస్య గురించి కొన్ని సంవత్సరాల కింద నుంచే తెలుసు కానీ, దీనికి చికిత్స చేయడం కష్టం.

అమెరికాలో ఏడాది లోపు పిల్లల్లో సుమారు 8% మాత్రం ఈ సమస్యతో బాధపడుతున్నట్లు 2020లో ప్రచురితమైన ఒక నివేదిక పేర్కొంది.

ఇటీవల ఈ సమస్య గురించి అవగాహన పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని దేశాల్లో చికిత్స చేసే కేసులు కూడా పదింతలు పెరిగాయని చెబుతున్నారు. అమెరికాలో టంగ్-టై పరీక్షలు, శస్త్ర చికిత్సలు కూడా పెరిగాయి.

టంగ్-టై

కానీ, పర్మార్ లాంటి చాలా కుటుంబాలు దీనికి చికిత్స లభించక కొన్ని సంవత్సరాల పాటు వేదనను, ఒత్తిడిని అనుభవిస్తున్నాయి. భారత్ లాంటి దేశాల్లో పిల్లల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఇన్ఫెక్షన్ల లాంటి వేరే సమస్యల పై దృష్టి పెడుతూ ఉంటారు. దీంతో, టంగ్-టై సమస్యకు కొన్నేళ్ల పాటు చికిత్స లభించదు. ఈ సమస్య గురించి ఎవరూ పట్టించుకోరు.

నార్త్ కరోలీనాలోని రాలేలో నివాసముంటున్న కేట్ కేనవాన్ కొన్నేళ్ల క్రితం తన కూతురు అనా మాటలు స్పష్టంగా రావడం లేదని గమనించారు.

అప్పటికి అనాకు రెండు సంవత్సరాలు. కేనవాన్ బిడ్డకు రొమ్ము పాలు ఇవ్వడంలో ఎటువంటి సమస్య రాలేదు. ఆమె డాక్టర్ కూడా అనా సమస్య గురించి ఆందోళన చెందొద్దని చెప్పారు. అనాకు నాలుగేళ్లు వచ్చిన తర్వాత మరో పిల్లల డాక్టర్ స్పీచ్ థెరపిస్ట్ దగ్గరకు తీసుకుని వెళ్ళమని సూచించారు.

"తనకి లిప్ & టంగ్ టై (పెదవులు, నాలుకతో సమస్య) ఉన్నట్లు స్పీచ్ థెరపిస్ట్ చెప్పారు. వీటికి వెంటనే చికిత్స చేయించకపోతే స్పీచ్ థెరపీ పని చేయదని చెప్పారు. ఆమె నోటి నిర్మాణ తీరు ఆమె మాట్లాడేందుకు నిరోధకంగా మారుతుందని అన్నారు" అని కేనవాన్ చెప్పారు. ఈ సమస్య వల్లే వాళ్ళ అమ్మాయి నోరు విప్పి స్పష్టంగా మాట్లాడలేకపోతోందని అర్ధమయింది.

టంగ్ టై ఉన్నట్లు తల్లి రొమ్ము పాలు ఇస్తున్నప్పుడు మొదట తెలుస్తుంది.

"టంగ్-టై ఉన్న పిల్లలు పెదవులను దాటి నాలుకను బయటకు తీయలేరు. దీంతో, చను మొనలను పట్టుకుని పాలు తాగేందుకు ఇబ్బంది పడతారు" అని ఆస్ట్రేలియాలోని రాండ్విక్‌లో రాయల్ హాస్పిటల్ ఫర్ విమెన్ లో నియో నటాలజిస్ట్ జూ-లీ ఓయీ అన్నారు.

నోట్లో ఉన్న నాలుకను బయటకు తెచ్చి చను మొనలను పట్టుకున్నప్పుడు గట్టిగా పీల్చడానికి ప్రయత్నించడం వల్ల తల్లికి చాలా కష్టంగా ఉంటుంది.

కేనవాన్ కూతురి లాంటి వారికి సమస్యలు తర్వాత స్థాయిలో తలెత్తవచ్చు.

టంగ్-టై

"టంగ్-టై ఉన్న చాలా మంది పిల్లలకు లక్షణాలు కనిపించవు" అని చెల్సీ పిల్లల ఆస్పత్రిలో పిల్లల వైద్య నిపుణులు అమూల్య కే సక్సేనా చెప్పారు.

"నాలుక అంటిపెట్టుకుని ఉందనే సమస్యను గుర్తించడమే పెద్ద సమస్య. నోటి వెనుక నుంచి లింగువల్ ఫ్రెనులం అనే పలచని పోర నాలుక మధ్య వరకు ఉంటుంది. ఈ టిష్యూ కదలిక సరిగ్గా ఉండకపోవడం వల్ల నాలుక చివరి భాగం పెదవులను దాటి బయటకు రాదు. ఇది స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. కొన్ని సార్లు నోటి లోపల భాగంలో కూడా కనిపించకుండా టంగ్ టై ఉంటుంది. దీనిని పరీక్ష చేసి వైద్య నిపుణులు గ్రహించగలరు" అని సక్సేనా చెప్పారు.

టంగ్-టై ఉన్న పిల్లలు నాలుకను సరిగ్గా కదపలేరు. దీని వల్ల పిల్లలకు చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి.

"టంగ్-టై వల్ల నోటిలో గాలి ఒత్తిడి సమతుల్యతపై ప్రభావం పడుతుంది. నిద్రకు కూడా ఆటంకం ఏర్పడుతుంది" అని ముంబయిలో టంగ్-టై అండ్ స్లీప్ ఇన్స్టిట్యూట్‌లో దంత వైద్య నిపుణులు అంకిత షా చెప్పారు.

ఆమె పర్మార్ కొడుకుకు చికిత్స చేశారు.

"ఈ సమస్య ఉన్న వారు నోరు తెరిచి శ్వాస తీసుకోవడం, గురక పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు" అని చెప్పారు.

ముక్కు పట్టినట్లుగా అయి, తరచుగా నిద్ర నుంచి లేస్తూ ఉంటారు. నిద్రలోనే పళ్ళు కొరుక్కోవడం, బిగపెట్టడం లాంటివి చేస్తారు.

వారికి మెడ, భుజాలు పట్టినట్లుగా అయి తలనొప్పి వస్తూ ఉంటుంది.

ఈ సమస్యల వల్ల వారు కూర్చునే తీరు, ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది.

"దంతాలు, నాలుక, దవడ ఉండాల్సిన రీతిలో ఉండకపోవడం వల్ల మొత్తం శరీరం పని చేసే తీరుపై ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని మనం గ్రహించం" అని షా అన్నారు.

పరిష్కారం ఏంటి?

"కొన్ని తేలికపాటి కేసుల్లో సమస్య దానంతట అదే పరిష్కారమవుతుంది" అని సక్సేనా చెప్పారు.

పిల్లలు నాలుక కదిపే కొద్దీ కొన్ని రోజులకు సాధారణంగా మారే అవకాశముంది. రొమ్ము పాలు ఇచ్చే తీరుపై సూచనలు, ఫ్రెనులం మసాజ్, నాలుకతో వ్యాయామం తేలికపాటి కేసుల్లో సమస్యను పరిష్కరిస్తాయి.

కానీ, ఇది పని చేయని పక్షంలో పసి పిల్లలకు రొమ్ము పాలు ఇవ్వడం చాలా కష్టంగా మారుతుంది. అలాంటప్పుడు నాలుక సులభంగా కదిలేందుకు వీలుగా చిన్నపాటి శస్త్ర చికిత్స చేయించాల్సి ఉంటుందని సూచించారు.

పాలు పట్టేందుకు. తిండి తినిపించేందుకు, శ్వాస తీసుకునేందుకు, నిద్రపోయేందుకు, మాట్లాడేందుకు కూడా సమస్యలు తలెత్తుతాయి.

భారత్ లాంటి దేశాల్లో టంగ్-టై కు సరిగా గుర్తించటం లేదు. కొన్ని దేశాల్లో డాక్టర్లు దీనికి చికిత్స ఎక్కువగా చేస్తున్నారు.

"మొదట్లో మా క్లినిక్‌కు నెలకు 10 కేసులు వస్తే, ప్రస్తుతం అవి వారానికి 10కి పెరిగాయి" అని జూ లీ ఓయీ చెప్పారు.

"2017లో ఈ కేసులు విపరీతంగా పెరిగినప్పుడు, వీటిని పరిశీలించాలని నిర్ణయించుకున్నాం.

ఆమె పని చేస్తున్న ఆస్పత్రిలో ప్రతి ఏటా సగటున 4500 జననాలు జరుగుతున్నట్లు చెప్పారు. "అంతకు ముందు వారికి నెలకు 10 శస్త్ర చికిత్సల కోసం మాత్రమే అభ్యర్ధనలు వస్తూ ఉండేవి" అని ఓయీ చెప్పారు.

ఇతర ఆస్పత్రుల్లో కూడా ఈ రకమైన కేసులు పెరిగాయి.

"పిల్లలకు రొమ్ము పాలు ఇచ్చే సమస్యను నివారించడానికి ఈ శస్త్ర చికిత్స తక్షణ పరిష్కారం అని గ్రహించాం. అలా అని నాలుక సులభంగా కదలడానికి ఫ్రెనులం కు గాటు పెట్టడం అన్ని సమస్యలను నివారించదు" అని అన్నారు.

2018లో ప్రచురితమయిన అంతర్జాతీయ అధ్యయనంలో టంగ్-టై సమస్యకు చేసే చికిత్సలు వివిధ దేశాల్లో పదింతలు పెరిగాయని పేర్కొంది. అయితే ఈ చికిత్సను క్రమబద్ధం చేయాల్సిన అవసరం ఉంది ఈ అధ్యయనం సూచించింది.

అప్పటి నుంచి ఆస్పత్రుల్లో నియమావళిలో మార్పులు చేసినట్లు ఓయీ చెప్పారు.

పాలు తాగడానికి ఇబ్బంది పడుతున్న చిన్నారులను బ్రెస్ట్ ఫీడింగ్ నిపుణులు పరీక్షించాలని, వారు సూచించిన మార్పుల తర్వాత కూడా చిన్నారులు పాలు తాగడానికి ఇబ్బంది పడుతుంటే, రెండు నుంచి నాలుగు వారాల తర్వాత మాత్రమే శస్త్ర చికిత్స చేయాలని కొత్త నిబంధలు పేర్కొంటున్నాయి.

పసిపిల్లలకు శస్త్ర చికిత్స చేయడం వల్ల అది ఎంత చిన్నదైనప్పటికీ, పిల్లలకు నొప్పి, ఒత్తిడి, దీర్ఘకాలిక నరాల సమస్యలను సృష్టిస్తుంది" అని ఓయీ అన్నారు.

టంగ్-టై

శస్త్ర చికిత్స, యోగా

ప్రస్తుతం చాలా మందికి ఈ సమస్య గురించి తెలుస్తోందని సక్సేనా అన్నారు.

రోగుల కోసం సపోర్ట్ గ్రూపులు, ప్రొఫెషనల్ సంస్థలు సోషల్ మీడియాలో కూడా సహకారం అందిస్తున్నాయి" అని ఆమె చెప్పారు.

భారతదేశంలో కూడా ఈ సమస్యకు డాక్టర్లను సంప్రదిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని చెప్పారు.

కానీ, ఈ సమస్యకు తొందరగా శస్త్ర చికిత్స చేయడమే మేలు అని ఆమె సూచించారు.

"నా దగ్గరకు చికిత్స కోసం వచ్చేవారిలో సగం మందికి మాత్రమే శస్త్ర చికిత్స అవసరమవుతుంది. అది కూడా టంగ్-టై తీవ్రతపై ఆధారపడి ఉంటుంది" అని షా చెప్పారు.

కాస్త పెద్ద వయసు ఉన్న పిల్లలకు సాధారణ అనస్థీషియా అవసరమైతే, చిన్న పిల్లలకు లోకల్ అనస్థీషియా ఇచ్చి శస్త్ర చికిత్స చేస్తారు" అని షా అన్నారు.

అప్పుడే పుట్టిన పిల్లలకు మత్తు ఇవ్వరని చెప్పారు. మత్తు ఇవ్వడం వల్ల శస్త్ర చికిత్స వల్ల కలిగే ప్రయోజనాల కంటే నష్టం ఎక్కువగా ఉంటుందని షా చెప్పారు.

"శస్త్ర చికిత్స చేయడం మాత్రమే దీనికి పరిష్కారం కాదు" అని లండన్‌కు చెందిన నర్స్, బ్రెస్ట్ ఫీడింగ్ కన్సల్టెంట్ కార్మెల్ జెంటిల్ చెప్పారు.

ఈ సమస్యను వ్యాయామం ద్వారా సరిచేసేందుకు చూడాలని అన్నారు.

"ఇదొక యోగాలా ఉంటుంది. నాలుకను కొత్తగా వాడేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తాం. మొదట్లో నాలుకను బయటకు తీయడం కష్టమవుతుంది. కానీ, సున్నితంగా సాధన చేయడం ద్వారా అది సాధ్యమవుతుంది" అని అన్నారు.

"నా కొడుకుకు ఉన్న సమస్య తెలియగానే ఏడుపు వచ్చేసింది. మేమెదుర్కొంటున్న సమస్యకు ఒక పేరు ఉందనే విషయం తెలిసింది" అని పర్మార్ అన్నారు. దీని గురించి అవగాహన ఉండటంతో పాటు, సరైన చికిత్స దొరికితే వారి జీవితమే మారిపోతుంది.

అనాకు కూడా శస్త్ర చికిత్స తర్వాత మాట స్పష్టంగా రావడం మొదలయింది.

పర్మార్ కొడుకు కూడా శస్త్ర చికిత్స తర్వాత రక రకాల ఆహార పదార్ధాలు తినడం మొదలుపెట్టాడు. "20 నిమిషాల్లో భోజనం తినేస్తున్నాడు. తను సొంతంగా సైకిల్ నడుపుతున్నాడు" అని పర్మార్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What is Tongue-Tie? How to recognize this new problem growing in children
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X