ఆ ప్రాంతాల్లో గాలిద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న డబ్ల్యూహెచ్ఓ .. కాపాడుకోవటం ఎలా ?
మానవాళి మనుగడకు పెద్ద ప్రమాదంగా పరిణమించిన కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుంది అనే విషయాన్ని పరిశీలించాలని కోరుతూ దాదాపు 200 మందికి పైగా శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇక దీనిపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ గాలి ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని అంగీకరించింది.

గాలి ద్వారా కరోనా .. కొంత కాలంగా భిన్న వాదనలు
గత కొంతకాలంగా కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందని వాదన ఉన్నప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ తోసిపుచ్చుతూ నే ఉంది. కేవలం అత్యవసర పరిస్థితుల్లో రోగులను వెంటిలేటర్ పై ఉంచిన సందర్భంలోనే వైరస్ అలా వ్యాపిస్తుంది అని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. అయితే జాతీయ, అంతర్జాతీయ నిపుణులు,శాస్త్రవేత్తలు , అధికారులు, కరోనా వైరస్ సోకిన వ్యక్తులు మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు తుంపరలతో గాలిలో కొంత శాతం కరోనా వైరస్ ఉండిపోతుందని, అది వేరే వ్యక్తులకు సోకే అవకాశం ఉందని వాదిస్తున్నారు.

డబ్ల్యూహెచ్ఓ కు గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందని 200 మంది శాస్త్రవేత్తల లేఖ
అమెరికా, ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుంది అన్న విషయాన్ని మొదటి నుండి బల్లగుద్ది చెప్తున్నారు.ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కు లేఖ రాసిన శాస్త్రవేత్తలు డబ్ల్యూహెచ్వో ఇప్పటివరకు ఇచ్చిన కరోనాకు సంబంధించిన మార్గదర్శకాలను సవరించాలని కోరారు. శాస్త్రవేత్తల విజ్ఞప్తి మేరకు దీన్ని పరిశీలించిన అనంతరం ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశం ఉందని నిర్ధారించింది. శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలతో ఏకీభవించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని పరిస్థితుల్లో, కొన్ని ప్రదేశాలలో మాత్రమే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేసింది.

రెస్టారెంట్లు , జిమ్ లు వంటి ఇండోర్ ప్రదేశాల్లో గాలిలో వైరస్
ముఖ్యంగా రెస్టారెంట్లు, వ్యాయామ తరగతులు నిర్వహిస్తే జిమ్ లు ,గుంపులుగా జనాలు కలిసే ప్రదేశాలు వంటి చోట్ల గాలి లో వైరస్ వ్యాపించే అవకాశాలను అధ్యయనాలు సూచిస్తున్నాయి అని పేర్కొన్నారు . రద్దీ ఎక్కువగా ఉండే ఇండోర్ ప్రదేశాలు, అలాగే ఎక్కువ వెంటిలేషన్ లేని ప్రాంతాల్లో వైరస్ సోకిన వ్యక్తి నుంచి మరింత మందికి కరోనా వైరస్ వ్యాపించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

లక్షణాలు లేని వారి నుండి వైరస్ వ్యాప్తికి తక్కువ ఛాన్స్
కరోనా వైరస్ సోకిన వ్యక్తులు తిరిగిన ప్రదేశాలు,లేదా ఇండోర్ ప్రదేశాలలో ప్రజలు అత్యంత సన్నిహితంగా మెలగడం వల్ల అక్కడ ఒకవేళ కరోనా బాధితులు ఉంటే గాలి ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. అంతే కాకుండా లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ బారినపడిన వారి నుండి, కరోనా వ్యాప్తి జరుగుతుందా అన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదని, వైరస్ ని వ్యాప్తి చేయగల సామర్థ్యం ఎలాంటి లక్షణాలు లేని కరోనా పాజిటివ్ వ్యక్తులలో ఉన్నప్పటికీ అది చాలా అరుదుగా ఉంటుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

గాలి ద్వారా వ్యాప్తిపై పునఃపరీశీలన తర్వాతే డబ్ల్యూహెచ్ఓ స్పష్టత
కరోనా లక్షణాలు లేని కరోనా బాధితుల నుండి వైరస్ సంక్రమణ ఏ స్థాయిలో ఉందో నిజంగా ఇప్పటివరకు తెలియదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఎక్కువ శాతం వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వారి తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. మొత్తానికి శాస్త్రవేత్తలు గాలి ద్వారా వ్యాపిస్తుంది అని చెప్పిన విషయాన్ని పునః పరిశీలించిన డబ్ల్యూహెచ్ఓ గాలి ద్వారా కరోనా ఎక్కడ వ్యాపిస్తుందో.. ఎలా వ్యాపిస్తుందో వెల్లడించింది. ఇక గాలితోనూ కరోనా వ్యాప్తి అంటే కాపాడుకోవటం ఎలా అన్న భయం ప్రజలకు పట్టుకుంది .